![మూడో](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bng01-604900_mr-1739217765-0.jpg.webp?itok=q1dMqpDU)
మూడో విడత ‘రైతుభరోసా’ విడుదల
భువనగిరిటౌన్ : రైతుభరోసా మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రెండు ఎకరాల లోపు ఉన్న 9,151 మంది రైతుల ఖాతాల్లో రూ.7,18,36,017 నగదు జమ అయ్యాయి. గత నెల 26న మొదటి విడత, ఈనెల 5వ తేదీన రెండో విడత నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో 32,946 మంది రైతులకు రూ.53.64 కోట్ల పెట్టుబడి సాయం అందజేసింది.
శివకేశవులకు సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొండపైన కొలువైన శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, ముఖ మండపంలో అష్టోత్తరం తదితర పూజలు చేపట్టారు.
యాదగిరి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావ్య అనుమతి లేకుండా కొద్ది రోజులుగా విధులకు రావడం లేదు. అదే విధంగా కొండపైకి వెళ్లే వాహనాల నుంచి వసూలు చేసిన రుసుమును రికార్డు అసిస్టెంట్ నర్సింగరావు ఆలయానికి చెల్లించడం లేదు. దీంతో ఇద్దరిని దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ బీసీల ద్రోహి
సాక్షి, యాదాద్రి : కులగణన పేరుతో బీసీలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి ద్రోహిగా మిగిలిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. సోమవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా 2024 నాటికి పెరగాలే కాని ఎలా తగ్గిందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం చట్టబద్ధత ఎందుకు కల్పించలేదన్నారు. బీసీ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని, సరి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లడాన్ని బీఆర్‌ఎస్ అంగీకరించబోదన్నారు. బీసీ కులగణన తప్పని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ప్రతులను తగులబెట్టిన విషయాన్ని భిక్షమయ్యగౌడ్ గుర్తు చేశారు. బీసీలకు చేస్తున్న అన్యాయాలపై గ్రామ సభలు పెట్టి చైతన్యం చేస్తామన్నారు. బీసీలకు కేసీఆర్ ఎంతో చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ 50 శాతం టికెట్లు బీసీలకు కేటాయిస్తుందన్నారు. విలేకర్ల సమావేశంలో మాజీ గ్రఽంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎనబోయిన అంజనేయులు, వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీలు బీరుమల్లయ్య, బొట్ల పరమేశ్వర్,మొగుళ్ల శ్రీనివాస్, తోటకూర అనురాధ, నాయకులు కర్రె వెంకటయ్య, బబ్బూరి రవీంద్రనాఽథ్‌గౌడ్, కొలుపుల హరినాధ్, నీల ఓం ప్రకాశ్‌గౌడ్, గడ్డమీది రవీందర్‌గౌడ్, పెంటనర్సింహ, అబ్బగాని వెంకట్ పాల్గొన్నారు.
మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు
భువనగిరిటౌన్ : రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామసభలతో పాటు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరాల శాఖ సూచన మేరకు మీసేవ పోర్టల్‌లో ఆహార భద్రత (రేషన్)కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే అర్హులన్నారు.
![మూడో విడత ‘రైతుభరోసా’ విడుదల 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10alr204-230014_mr-1739217765-1.jpg)
మూడో విడత ‘రైతుభరోసా’ విడుదల
Comments
Please login to add a commentAdd a comment