హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌

Published Sat, Apr 20 2024 2:00 AM | Last Updated on Sat, Apr 20 2024 2:00 AM

కోనసముద్రం చెరువులో పసుపు, కుంకుమ, గుమ్మడికాయలు వేసిన దృశ్యం 
 - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలోబిగారి వీధిలో మారం సురేష్‌, చిన్న వెంకటేష్‌లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన బొమ్మలమణి, సయ్యద్‌ రుక్సానాలను శుక్రవారం అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు వన్‌టౌన్‌ సీఐ శ్రీకాంత్‌ తెలిపారు.

కడపలో ఇద్దరు అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప నగరంలోని ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జివిఆర్‌ టవర్స్‌ సమీపంలో సుజిత్‌ అలియాస్‌ బిన్ని, అభినవ్‌ అలియాస్‌ సోనులపై హత్యాయత్నంకు పాల్పడిన సంజయ్‌ రాహుల్‌, ఖాదర్‌వలీ అలియాస్‌ హాజీలను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు సీఐ సి. భాస్కర్‌రెడ్డి తెలియజేశారు. మరోవైపు సంజయ్‌ రాహుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజిత్‌ అలియాస్‌ బిన్ని, అభినవ్‌ అలియాస్‌ సోనులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు.

‘చెడ్డీ గ్యాంగ్‌’ కదలికలపై

పోలీసుల నిఘా

కడప అర్బన్‌ : జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎక్కడికై నా ఊర్లకు వెళ్లేటపుడు ఇంటిలో విలువైన బంగారు, వెండి ఆభరణాలనుగానీ, నగదును గానీ జాగ్రత్తపరచుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఊరి బయట గృహాలున్న వారు ఇంకా అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

చెడ్డీ గ్యాంగ్‌తో జాగ్రత్త

ఎర్రగుంట్ల : జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ అనే దొంగల ముఠా తిరుగుతోందని, ప్రజలందరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట్ల పట్టణ సీఐ ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి వెంటనే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. కలమల్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కలమల్ల ఎస్‌ఐ సంజీవరెడ్డి సూచించారు.

532 ఫిర్యాదులు పరిష్కారం

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై మొత్తం 535 ఫిర్యాదులు అందగా 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వేర్వేరు ఫిర్యాదు వేదికల ద్వారా అందిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ ఫిర్యాదుల పరిష్కార నివేదికను విడుదల చేసిందన్నారు

● సీ–విజిల్‌ ద్వారా మొత్తం 336 కేసులు నమోదయ్యాయి. అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవిగా గుర్తించడమైందన్నారు.

● ఎఫ్‌ఎస్‌టీ., ఎస్‌ఎస్‌టీ, పోలీసు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ ద్వారా చేపట్టిన సీజర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.3,69, 35,295 ల మేర నగదు, రూ.7,29,25,368 ల విలువైన లిక్కర్‌, ఇతర వస్తువులను సీజ్‌ చేయడం జరిగింది. అలాగే 1,011 ఎఫ్‌ఐఆర్‌. కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

క్షుద్రపూజల కలకలం

బద్వేలు అర్బన్‌ : టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచం ముందుకు సాగుతున్నా మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. మండలంలోని కోనసముద్రం పంచాయతీలోని కోనసముద్రం గ్రామ చెరువులో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే... కోనసముద్రం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమతో ముగ్గులు వేయడంతో పాటు గుమ్మడికాయలు కోసి ఉండటంతో క్షుద్రపూజల కోసమే ఇలా చేసి ఉంటారని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో గ్రామస్తులు బద్వేలు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌ సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలు ఏమిటో గుర్తిస్తామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

తమ్ముడిని కాల్చిన అన్న అరెస్ట్‌

గుర్రంకొండ : ఆస్తి పంపకం వివాదంలో తమ్ముడ్ని నాటు తుపాకీతో కాల్చిన అన్న జయప్ప (56)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఒక నాటు తుపాకీతో పాటు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ ఎగువహరిజనవాడ గ్రామానికి చెందిన బాలపోగు జయప్ప, బాలపోగు విశ్వనాథ్‌లు అన్నదమ్ములు. వీరికి గ్రామానికి సమీపంలోనే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలం ఉంది. ఈ ఆస్తి పంపకం విషయంతో గొడవ పడిన నేపథ్యంలో ఈనెల 16న కోపంతో తమ్ముడిని అన్న నాటు తుపాకీతో కాల్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడు జయప్పను శుక్రవారం మండలంలోని ఉదారివాండ్లపల్లె క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు వాల్మీకిపురం సీఐ పులిశేఖర్‌, గుర్రంకొండ ఎస్‌ఐ నాగార్జునరెడ్డిలు తెలిపారు.

న్యాయవాదిపై దాడి

కడప అర్బన్‌: కడప నగరంలోని ఎర్రముక్కపల్లి సమీపంలో పూసల వీధిలో పి. శివ సుధాకర్‌ అనే న్యాయవాది తనపై శుక్రవారం సాయంత్రం కొందరు దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారించి చర్యలు తీసుకోనున్నట్లు కడప ఒన్‌టౌన్‌ సీఐ సి. భాస్కర్‌రెడ్డి తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement