●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక | - | Sakshi
Sakshi News home page

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

Published Sat, Nov 2 2024 1:43 AM | Last Updated on Sat, Nov 2 2024 1:43 AM

●గ్రౌ

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

కడప సెవెన్‌రోడ్స్‌: ఖరీఫ్‌లో పదహారణాల పంటల దిగుబడి వస్తుందంటూ గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట అఽధికారులు అంచనాలు రూపొందించి నివేదించిన ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో జిల్లాకు చోటు దక్కకుండా పోయింది. దీంతో కరువు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలోని అంశాలను వెల్లడిస్తే తాము సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌ ‘సాక్షి’తో అనడం దీనికి బలాన్నిస్తోంది. పాత్రికేయులకు వివరాలు ఇవ్వాలంటూ స్వయాన ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌ ఆదేశించినా కలెక్టరేట్‌ డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ జీవన్‌ చంద్రశేఖర్‌ బేఖాతరు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అధికారుల వైఖరి పట్ల రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. నవంబరు 5వ తేదీ జరగనున్న డీఆర్‌సీ సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది.

● జిల్లాలో ఈ యేడు ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్‌ మాసంలో ఎక్సెస్‌ రెయిన్‌ఫాల్‌ నమోదైంది. జులైలో 98.5 మి.మీ. సాధారణ వర్షపాతానికిగాను 55 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే ఈ నెలలో 44.2 శాతం లోటు ఏర్పడింది. ఆగస్టులో 120 మి.మీ. సాధారణ వర్షపాతానికిగాను 92 మి.మీ. వర్షపాతం నమోదై 23.3 శాతం లోటు నెలకొంది. సెప్టెంబరులో 74.7 మి.మీ.కిగాను 28.3 మి.మీ. నమోదైంది. ఇలా మొత్తం 14.1 శాతం వర్షపాత లోటు ఏర్పడింది.

నివేదిక దాస్తున్న అఽధికారులు

కరువు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలు వెల్లడించకుండా కలెక్టరేట్‌ అధికారులు తొక్కి పెడుతున్నారు. ఇది వెల్లడైతే రాజకీయపరంగా తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించడమే కారణంగా తెలుస్తోంది. నివేదికలోని వివరాలు తెలపాలంటూ వారం రోజులుగా ‘సాక్షి’ అడుగుతున్నప్పటికీ నేనెరుగ...నేనెరుగ..అంటూ తప్పించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించి, వివరాలు ఇవ్వాలంటూ డి–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ జీవన్‌ చంద్రశేఖర్‌కు ఆదేశాలు పంపారు. ఆయన ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేశారు. డీఆర్వో చెబితే ఇస్తామంటూ మెలిక పెట్టారు. ఆయన అలా వ్యవహరించడంలో ఉద్దేశ్యం ఏమిటో తెలియడం లేదు.

అధికారుల తీరుతో రైతుకు అన్యాయం

ఖరీఫ్‌లో సాగుచేసిన మినుము వర్షం లేక పూర్తిగా ఎండిపోయింది. అధికారులు పంటల దిగుబడి బాగా ఉందంటూ ప్రభుత్వానికి గుడ్డిగా ఎలా నివేదించారో అర్థం కావడం లేదు. కరువు మండలాల ప్రకటన జరిగి ఉంటే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, బీమా, రుణాల రీ షెడ్యూల్‌ వంటి లబ్ధి రైతులకు లభించి ఉండేది. రైతులకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ఆదినారాయణరెడ్డి,

రైతు, కోనాయపల్లె, పెండ్లిమర్రి మండలం

కరువు జాబితాలో జిల్లాకు దక్కని చోటు

ఖరీఫ్‌లో దిగుబడి బాగా వస్తుందట

గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట అధికారుల తప్పుడు నివేదికలు

నివేదిక వెల్లడిస్తే సమస్యలువస్తాయన్న డీఆర్వో

ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

కరువు మండలాలు

ప్రకటించాలి

జిల్లాలో సాగునీటి పారుదల ఉన్న కేసీ కెనాల్‌ మినహా మిగతా మండలాలైనా కరువు కింద ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ శుక్ర వారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అధికారులను బాధ్యులను చేయాలి

జిల్లాలో రైతులు సాగు చేసిన వేరుశనగ, మినుము తదితర పంటలు నిలువునా ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోయారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇలా ఉండగా, ఖరీఫ్‌ పంటల దిగుబడి భేషుగ్గా ఉందంటూ అధికారులు నివేదికలు పంపిన ఫలితంగానే జిల్లాకు కరువు మండలాల జాబితాలో చోటు లభించలేదు. ప్రభు త్వం ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలి. – ఎంవీ సుబ్బారెడ్డి, రైతు, ఎర్రగుంట్ల

ఒక మండలంలో పంటల దిగుబడి అంచనా 33 శాతం కంటే లోపు ఉంటే ప్రభుత్వం ఆ మండలాన్ని కరువు కింద ప్రకటిస్తుంది. జిల్లాలో వరి, పత్తి, జొన్న, మినుము, కంది లాంటి వాటితోపాటు ఖరీఫ్‌లో మొత్తం 18 రకాల పంటల సాధారణ సాగు విీస్తీర్ణం 1,23,535 హెక్టార్లు ఉంది. జూన్‌లో 3,028 హెక్టార్లు, జులైలో 18,904 హెక్టార్లు, ఆగస్టులో 32,036 హెక్టార్లు కలిపి మొత్తం 53,968 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే తీవ్ర వర్షపాత లోటు, డ్రై స్పెల్స్‌ కారణంగా పంటల సాగు భారీగా పడిపోవడంతోపాటు సాగైన పంటలు ఎండిపోయాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇలా ఉండగా, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఖరీఫ్‌లో పదహారణాల పంట దిగుబడి వస్తుందంటూ నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతోనే జిల్లాలో ఒక్క మండలం కూడా కరువు కింద ప్రభుత్వం ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక 1
1/4

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక 2
2/4

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక 3
3/4

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక 4
4/4

●గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పేరిట తప్పుడు నివేదిక

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement