ముంచుకొస్తున్న ముంపు గండం | - | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముంపు గండం

Published Sat, Nov 2 2024 1:43 AM | Last Updated on Sat, Nov 2 2024 1:43 AM

ముంచు

ముంచుకొస్తున్న ముంపు గండం

అట్లూరు మండలం సగిలేరు నదిపై ఉన్న లో లెవెల్‌ వంతెనకు ముంపు గండం ముంచుకొస్తోంది. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమశిల బ్యాక్‌వాటర్‌ వంతెనపై ఒక అడుగు మేర పారుతోంది. వంతెనపై ఈ ప్రవాహం ఇంతకంటే ఎక్కువగా కొనసాగితే ఆరు పంచాయతీల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీంతో ఆయా గ్రామాల వాసులు ఆందోళనలో ఉన్నారు.

అట్లూరు: పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమశిల జలాశయంలో రోజు రోజుకూ నీరు పెరుగుతోంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని వేమలూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్‌ వంతెనపైకి సోమశిల వెనుక జలాలు చేరుతున్నాయి. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం శుక్రవారానికి 69 టీఎంసీలకు చేరుకున్నాయి. పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమశిల జలాశయంలోకి 22,258 కూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 10 వేల పైచిలుకు క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతోంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగి అధికారులు ఇలాగే నీటిని నిల్వ చేస్తే మరో వారం రోజుల లోపే పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుతుంది. శుక్రవారానికి లోలెవల్‌ వంతెనపై అడుగు మేర నీరు పారుతోంది. ఇలా రెండు లేదా మూడు రోజులకు వేమలూరు వద్ద ఉన్న లోలెవల్‌ వంతెనపై నీటి ప్రవాహం పెరిగితే రాక పోకలు పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉంది.

ఆరు పంచాయితీల ప్రజలకు అవస్థలు..

అట్లూరు మండల పరిధిలో 12 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. సగిలేరు నదికి తూర్పున ఆరు, పడమర దిక్కున ఆరు పంచాయితీలు ఉన్నాయి. లోలెవల్‌ వంతెన పై నీరు మూడు అడుగుల మేర చేరితే వాహన రాక పోకలు పూర్తిగా నిలిచి పోతాయి.

మా అవస్థలు ఇంతేనా?

ప్రతి సంవత్సరం సోమశిల ప్రాజెక్టుకు నీరు వచ్చినప్పుడల్లా సగిలేరు నదిపై ఉన్న వంతెన మునగడం.. మాకు రాక పోకలు నిలిచి పోవడం మామూలైంది. మా ఆరు పంచాయితీ గ్రామాల ప్రజలు అవస్థలు అధికారులకు పట్టడం లేదు. – సగిలి ఈశ్వరరెడ్డి,

కోనరాజుపల్లి, అట్లూరు మండలం

టెండర్లకు ఎవరూ రాలేదు...

ఆరు పంచాయితీల గ్రామాల ప్రజల అవస్థలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టరు సుధా రెండేళ్ల క్రితం ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లి రూ.20 కోట్లు నిధులు కేటాయించేలా కృషి చేశారు. సర్వేకూడా చేయించారు. అయితే ఎక్కువ రోజులు నీరు ఉంటుందని.. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఇబ్బంది కరంగా ఉంటుందని టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. – ముడమాల ప్రభాకర్‌రెడ్డి,

వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌, అట్లూరు మండలం

హై లెవల్‌ వంతెన నిర్మించాలి..

సోమశిల జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో నిల్వ చేసిన ప్రతి సారి మాకు అవస్థలు తప్పడంలేదు. ఎక్కడెక్కడో కోట్లు వృధాగా ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. మా ఆరు పంచాయితీల ప్రజల అవస్థలు ప్రభుత్వాలకు కనిపించడంలేదు. ఇక నైనా సగిలేరు నదిపై హైలెవల్‌ వంతెన నిర్మించాలి.

– చిన్న మునిరెడ్డి, పెద్ద కామ సముద్రం, అట్లూరు మండలం

40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి

సగిలేరు లోలెవెల్‌ వంతెనపై నీరు చేరి రాక పోకలు నిలిచి పోతే అట్లూరులో ఉన్న తహశీల్దారు, ఎంపీడీఓ, వెలుగు, తదితర మండల కార్యాలయాలతో పాటు పోలీస్‌స్టేషన్‌, బ్యాంకులకు వెళ్లాలంటే సగిలేరు నదికి తూర్పు భాగాన ఉన్న ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మణ్యవారిపల్లి, కమలకూరు ఈ ఆరు పంచాయితీల పరిధిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న మండల కార్యాలయాలకు బద్వేలు మీదుగా 40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ముంచుకొస్తున్న ముంపు గండం 1
1/3

ముంచుకొస్తున్న ముంపు గండం

ముంచుకొస్తున్న ముంపు గండం 2
2/3

ముంచుకొస్తున్న ముంపు గండం

ముంచుకొస్తున్న ముంపు గండం 3
3/3

ముంచుకొస్తున్న ముంపు గండం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement