600 మంది బాధితుల పేర్లను చేర్చాలి
– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు: గండికోట ప్రాజెక్టు మొదటి విడత గ్రామాలైన 14 గ్రామాలలో 600 మంది బాధితుల పేర్లు గెజిట్‌లో రాలేదని, అధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శాసనమండలిలో సోమవారం ఆయన గండికోట బాధితుల పరిహారం విషయమై ప్రభుత్వాని ప్రశ్నించారు. 14గ్రామాలలో అధికారులు నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వేలో ముంపుబాధితులకు సంబంధించిన 600 మంది బాధితుల పేర్లు లేవని, నిజమైన లబ్ధిదారులైన వీరికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు సోషియో ఎకనామిక్ సర్వే జరిపి ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలను ఇచ్చారని, ప్రభుత్వం బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి వర్తింపజేయాలని కోరారు.
పరిహారం జాబితాలో పేరు లేదని ఆందోళన
కొండాపురం : గండికోట జలాశయంలో అంతర్భాగమైన గండికోట ఎత్తిపోతల పథకంలోని ఎస్.తిమ్మాపురం చెరువు పరిధిలో ముంపునకు గురైన చిన్నపల్లె గ్రామం సోషియల్ ఎకనామిక్ సర్వే జాబితాలో తన పేరు లేదని అశ్వర్థరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. సోమవారం మండల తహసీల్దార్ గుర్రప్ప రెవెన్యూ సిబ్బందితో చిన్నపల్లె గ్రామంలో నిర్వాసితులతో అక్వడెన్స్‌లో సంతకాలు సేకరించేందుకు వెళ్లారు. పరిహారం జాబితాలో తన పేరు లేదని అధికారులను నిర్వాసితుడు అశ్వర్థరెడ్డి అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా అతని భార్య పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొండాపురం ఎస్‌ఐ విద్యాసాగర్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment