కిశోర బాలికలు ఆరోగ్యంగా ఉండాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: కిశోర బాలికలు మానసికంగా, శారీరకంగా పరిపూర్ణ మహిళగా ఎదిగితేనే అన్ని రకాలుగా ఆరోగ్యకరమైన భావితరాన్ని, సమాజాన్ని అందివ్వగలుగుతారని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిశోరీ వికాసం‘పై జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ విలువలను పెంపొందించేలా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. టీనేజ్ బాలికలపై వారి చుట్టూ ఉన్న వారి ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ వయస్సు బాలికలకు శారీరక, మానసిక స్థితిపై ఖచ్చితంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం గ్రామస్థాయిలో మనకు చేరువలో ఉన్న మహిళా పోలీసు, ఐసీడీఎస్ శాఖకు సంబంధించిన కౌన్సిలర్లు ఆ ప్రాంతంలోని కిశోరి బాలికలతో ఒక గ్రూపు తయారుచేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో వాట్సా ప్ గ్రూపును క్రియేట్ చేయాలన్నారు. వారితో స్నేహ పూర్వకంగా ఉంటూనే వారి శారీరక, మానసిక స్థితిగతులపై ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఇంటి పరిధిలో అందిబాటులో ఉన్న 23,000 మంది కిశోరి బాలికలను గుర్తించామన్నారు వీరికి అవగాహన కల్పించే క్రమంలో కిశోరీ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. మహిళలపై, చిన్నపిల్లలపై వేధింపులు, బాల్య వివాహాలు, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలను అరికట్టే దిశగా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మహిళలూ, చిన్నారులపై లైంగిక దాడులు, నేరాలు, అఘాయిత్యాలు సంబంధిత కేసుల నమోదు శాతాన్ని ‘0‘ స్థాయికి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీ కిశోర బాలికల వికాసంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, ఐసీడీఎస్ ఆర్జేడీ రోహిణి, డీఆర్డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డి, డీఈవో మీనాక్షి, సోషల్ వేల్ఫేర్ డీడీ సరస్వతీ, సఖి సిబ్బంది, ఎన్జీవో ప్రతినిధులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసికూటర్లు, సఖి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment