ఘనంగా జులూస్
కడప కల్చరల్: ఐదు రోజులపాటు జరిగిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ బుధవారం రాత్రి నగరోత్సవాన్ని కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయం ఫకీర్లు, ఇతర శిష్య గణాలతో కలిసి పీఠాధిపతి పెద్దదర్గా నుంచి పెన్నానది అటువైపు తీరాన గల గండి వాటర్ వర్క్స్ కొండ గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతెహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్ మస్తాన్‌స్వామి స్మారకంగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు, ప్రముఖులు ఆయన వెంట వాహనాలలో ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్ మై అల్లా దర్గా షరీఫ్ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు, సంఘ ప్రతినిధులతో కనుల పండువగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై నగరంలో ఊరేగింపుగా బయలుదేరారు. ముస్లిమేతరులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగడుగునా యువకుల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు పొందారు. ఆయనను దర్శించుకునేందుకు భక్తులు వెల్లువెత్తారు. నగరంలోని పలు ముఖ్య కూడళ్ల ద్వారా సాగిన ఈ ఊరేగింపులో అడుగడుగునా యువత బ్యాండు మేళాల సంగీతానికి యువకులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు. ఊరేగింపు తెల్లవారుజామున తిరిగి దర్గాకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment