పెన్నా పరవళ్లు!
జమ్మలమడుగు: పెన్నానదిలో ఈ ఏడాదిలో అత్యధికంగా 14.9 టీఎంసీల నీరు ప్రవహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయంలోకి నీటి విడుదల చేస్తూ వచ్చారు. నిజానికి జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు పడకున్నా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గాలేరు–నగరి వరద కాలువ ద్వారా భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో మైలవరం ప్రాజెక్టు నుంచి పెన్నానదిలోనికి భారీగా నీరు విడుదల చేశారు. రెండు నెలల్లో దాదాపు 15 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
నాలుగేళ్లలో 112టీఎంసీల ప్రవాహం..
మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి రికార్డు స్థాయిలో వరద నీరు ప్రవహించింది. 2020 నుంచి 2024 వరకు 112 టీఎంసీల నీరు పెన్నానదిలోనికి విడుదల చేశారు. 2021 నవంబర్ నెలలో ఏకంగా లక్షా 55వేల క్యూసెక్కుల నీరు పెన్నానదిలో ప్రవహించి రికార్డుగా నిలిచింది. ఇక అత్యల్పంగా 2023లో ఏడు టీఎంసీల నీరు ప్రవహించింది. 2020లో 31 టీఎంసీలు, 22లో 16టీఎంసీలు, 24నవంబర్ వరకు దాదాపు 15టీఎంసీల నీరు ప్రవహించింది. ప్రస్తుతం నీటి ప్రవాహం వల్ల పెన్నానదిలో బోర్లు రీచార్జ్ అవ్వడంతోపాటు, వ్యవసాయ బోర్లకు నీరు లభ్యత పెరిగింది. పెన్నానది పరీవాహక ప్రజలకు తాగునీటి సమస్య కొంత వరకు తగ్గిపోయింది.
మైలవరంలో ఆరు టీఎంసీల నీరు నిల్వ...
మైలవరం జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 6.5టీఎంసీ కాగా ప్రస్తుతం జలాశయంలో ఆరు టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. గత సెప్టెంబర్ మొదటి వారం వరకు మైలవరం జలాశయం డెడ్‌స్టోరేజి వచ్చే పరిస్థితి ఉండది. వరద నీటితో ఇప్పుడు పూర్తిస్థాయి నీటి మట్టం వరకు వచ్చింది. మైలవరం జలాశయం కింద సాగుచేసే పంటలకు రబీసీజన్‌లో నీటి సమస్య తలెత్తినప్పుడు పంటలకు నీరు అందించటానికి కూడా ఆస్కారం వచ్చింది.
ఈ రెండు నెలల్లోనే 14.9 టీఎంసీల నీటి ప్రవాహం
2021లో నీటి ప్రవాహం ఇప్పటికీ రికార్డే
14.9 టీఎంసీల నీరు విడుదల చేశాం
మైలవరం జలాశయం నుంచి రెండు నెలల కాలంలో పెన్నానదికి 14.9టీఎంసీల నీరు విడుదల చేశాం. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.1టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు పడి జలాశయంలోనికి నీరు వస్తే మళ్లీ పెన్నాలోనికి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
– మూర్తి, డీఈఈ, మైలవరం జలాశయం
Comments
Please login to add a commentAdd a comment