రేపు ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు
కడప స్పోర్ట్స్: జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలు శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. అరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న ఓబులవారపల్లె మండలం ముక్కవారిపల్లె ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో త్రోబాల్ అండర్–14, అండర్–17 బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 22న పెద్దచెప్పలి జెడ్పీ హైస్కూల్‌లో బీచ్ వాలీబాల్ అండర్–14, అండర్–17 బాలబాలికల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్రోబాల్ ఎంపికలకు ఫిజికల్ డైరెక్టర్ ప్రదీప్‌ను 7981472484 నెంబర్‌లో, బీచ్ వాలీబాల్ ఎంపికలకు ఎల్.ఎ. సునీల్‌ను 98497 20930 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
23న కబడ్డీ జిల్లాస్థాయి
ఎంపికలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో ఈనెల 23న జిల్లాస్థాయి కబడ్డీ సీనియర్ విభాగం ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఓ. రవీంద్రారెడ్డి, ఆర్. వెంకటసుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. శ్రీవాణి తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 63043 09294, 9949304160 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
24న రాష్ట్రస్థాయి ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్‌హాల్‌లో ఈనెల 24వ తేదీ రాష్ట్రస్థాయి ఓపన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి బి. అనీస్‌దర్బారీ తెలిపారు. టోర్నీ విజేతలకు రూ.53 వేల మేర నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం, సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటర్లుగా ఎం.గోపీనాథ్, రామ్‌లు హాజరవుతారని తెలిపారు. వీరితో పాటు రాష్ట్రంలోని చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 83412 55151 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి
కృషి చేస్తాం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఉండే మండల విద్యాశాఖాధికారులు –1 సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంఈఓ–1 నూతన అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దిద్దకుంట గంగిరెడ్డి, పద్మలత పేర్కొన్నారు. బుధవారం కడపలో జరిగిన ఎంఈఓ–1 జిల్లా సమావేశం సందర్భంగా జిల్లా ఎంఈఓ–1 అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందు లో ఎంఈఓ–1 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి గా దిద్దకుంట గంగిరెడ్డి(కడప ఎంఈఓ–1) ప్రధాన కార్యదర్శిగా పద్మలత(మైదుకూరు), గౌరవాధ్యక్షుడిగా విలియమ్స్‌రాజ్ (అట్లూరు) ట్రెజరర్‌గా జీఎల్‌వీఎస్ శివప్రసాద్ (ఎర్రగుంట్ల)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రిమ్స్ సూపరింటెండెంట్ రాజకీయ బదిలీ
కడప సెవెన్‌రోడ్స్: కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ (ఎఫ్‌ఏసీ)గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.సురేశ్వర్‌రెడ్డిపై రాజకీయ బదిలీ వేటు పడింది. ఆయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ బుధవారం జీఓ ఆర్‌టీ నెంబరు 701 విడుదల చేసింది. ఆయనను పాడేరు జీఎంసీలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రతిపాదనల మేరకు బదిలీ చేసినట్లు ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిమ్స్ డెంటల్ కళాశాలలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి హాజరయ్యారు. అక్కడ అధికారులు తమకు ప్రోటోకాల్ పాటించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డితోపాటు ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో సురేశ్వర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. నిజానికి ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని ఆయనను రాజ కీయ కక్షతో బదిలీ చేశారనే విమర్శలు వినబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment