No Headline
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 (రాయలసీమ జిల్లాలు) పరిధిలో గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిగాయి. దీంతో వందలాది మంది అర్హులైన నిరుద్యోగులు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌లుగా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుత టీడీపీ పాలనలో అర్హులైన వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వంలో ‘ఆర్డీ’పరిధిలోనే
1,550పైగా నియామకాలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ అత్యంత బలోపేతంగా మారింది.వెల్లువలా వివిధ కేడర్‌లకు సంబంధించిన నియామకాలు జరిగాయి. ప్రధానంగా స్టాఫ్ నర్స్ నియామకాలు పెద్ద ఎత్తున జరిగాయి. 2021–2022లో నాటి ప్రభుత్వం మొదటి విడతగా కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు రాయలసీమ జిల్లాల నుంచి అర్హులైన అభ్యర్ధులు కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయానికి దాదాపు 11, 500కు పైగా దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన, ఏడాది పొడవునా ఐదు విడతలుగా నియామకాల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక్కో కౌన్సెలింగ్‌కు 100–150 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. మొత్తం 800 మందికి పైగా అర్హులు స్టాఫ్ నర్స్‌లుగా ఉద్యోగాలు పొందారు. అనంతరం 2023 నవంబర్ నెలలో నాటి ప్రభుత్వం మరోమారు రెండోవిడతగా స్టాఫ్ నర్స్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల ఆధారంగా నిబంధనలు, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జాబితాను తయారు చేశారు. విడతలవారీగా కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 5 విడతలుగా జరిగిన కౌన్సెలింగ్‌కు ఒక్కో విడతలో 100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి. రెండో విడతలో దాదాపు 750 మందికి పైగా నిరుద్యోగులు స్టాఫ్ నర్స్‌లుగా ఉద్యోగాలు పొందారు. మొత్తం మీద కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో రామలసీమ జిల్లాల నుంచి కేవలం స్టాఫ్ నర్స్‌ల నియామకాలు రెండు నోటిఫికేషన్లకు దాదాపు 1,550 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. రెండో విడత నోటిఫిషన్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌కు దాదాపు 50 మంది హజరు కాలేదు. వాస్తవానికి మెరిట్ జాబితాలో వరస క్రమంలో తరువాతి స్ధానాల్లో ఉన్న వారితో 50 ఖాళీలను భర్తీ చేయాలి. అంతలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో వైద్య రంగానికి ‘చంద్ర’గ్రహణం పట్టింది. మిగిలిన 50 పోస్టులను భర్తీ చేయడం సంగతి అటుంచితే ఏకంగా ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆరోగ్య శాఖలో వెల్లువలా జరిగే ఉద్యోగ నియామకాలకు అడ్డుకట్ట పడినట్లయింది.
జోన్–4 పరిధిలో 600 ‘స్టాఫ్ నర్స్’ఖాళీలు
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జోన్–4 పరిధిలోని రాయలసీమ ప్రాంత జిల్లాల పరిధిలో దాదాపు 600 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు గుర్తించారు. అయితే ఇంత వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యవసర విభాగమైన వైద్య రంగంలో నియామకాల ఊసే ఎత్తలేదు. వాస్తవానికి కీలకమైన ఈ శాఖలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడమేగాక, ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రస్తావనే ఎక్కడా వినిపించడం లేదు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం
నడుచుకుంటాం
నేను ఇటీవలనే బాధ్యతలు స్వీకరించాను. స్టాఫ్ నర్స్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తాం.
– డాక్టర్ రామగిడ్డయ్య, రీజనల్ డైరెక్టర్,
వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం
వైద్య శాఖలో నిలిచిన నియామకాలు
నోటిఫికేషన్ ఊసే ఎత్తని పాలకులు
స్టాఫ్ నర్స్‌లకు తప్పని నిరీక్షణ
Comments
Please login to add a commentAdd a comment