ప్రొద్దుటూరు నగర వనానికి ఏమైంది.?
ప్రొద్దుటూరు క్రైం : పచ్చని చెట్ల మధ్య పచ్చిక భూముల్లో సేదతీరడం అనేది అద్భుతమైన అనుభూతి. సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి ప్రదేశాల్లో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం సంపన్నులు సుదూర ప్రాంతాలకు వెళ్తే..పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం తమ చుట్టుపక్కల ఉన్న పార్కులు, ఇతర టూరిజం ప్రదేశాలకు వెళ్తుంటారు. పండుగలు, సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడపడానికి పట్టణాల్లో సరైన సందర్శన ప్రాంతాలు లేవనే చెప్పవచ్చు. పురపాలక పార్కులు ఉన్నా అందులో సరైన వసతులు లేని కారణంగా ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ఉత్సాహం చూపరు. ఆర్థిక భారం కారణంగా మధ్య తరగతి వర్గాలు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. పట్టణ శివారులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న అటవీ భూమిలో 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. సుమారు 239 హెక్టార్లలో పార్కును అభివృద్ధి చేశారు. పట్టణ వాసులు, పరిసర గ్రామాల ప్రజలు పండుగలు, వారాంతపు రోజుల్లో పట్టణంలోని మున్సిపల్ పార్కుతో పాటు రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కుకు వెళ్లి అక్కడ సాయంత్రం వరకు గడిపి వస్తారు. అయితే ప్రజలకు మరింత ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు 2022లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నగరవనాల పేరుతో కొత్త పార్కులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రొద్దుటూరుతో పాటు జమ్మలమడుగు, బద్వేల్ ప్రాంతాల్లో నగరవనం పార్కులు మంజూరయ్యాయి. ఇందుకోసం ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల రోడ్డులో ఉన్న రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు ఎదురుగా 30 హెక్టార్లకు పైగా ఉన్న రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో నగరవనం ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అటవీ, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే నిర్వహించి నగరవనం నిర్మాణ స్థల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఫారెస్ట్ స్థలంలోని జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా పూర్తి చేశారు. కొంత కాలం తర్వాత ఈ స్థలంపై అభ్యంతరాలు వస్తున్నాయంటూ అటవీశాఖ అధికారులు పనులను ఆపేశారు. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరవనం ప్రాజెక్టును నేషనల్ పార్కులోకి మార్చారు. ఇక్కడి నేషనల్ పార్కులో పనులను ప్రారంభించి సుమారు రూ. 9 లక్షలు మేర ఖర్చు చేశారు. తర్వాత ఏం జరిగిందో గానీ.. నేషనల్ పార్కులో నగరవనం ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కులో సుమారు 47.7 హెక్టార్లలో నగరవనం ఏర్పాటు చేయనున్నారు. అటవీ నిబంధనల ప్రకారం నేషనల్ పార్కులో సందర్శకులకు అనుమతి లేదు. ఈ కారణం చేత ఇక్కడ నగరవనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అభ్యంతరం చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు పూర్తి విస్తీర్ణం 239 హెక్టార్లు. ఇందులో కేవలం 47.7 హెక్టార్ల మేర ఉన్న టూరిజం జోన్‌లో మాత్రమే నగరవనం ఏర్పాటు చేస్తున్నామని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకున్నారు. పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 1.20 కోట్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించేందుకు రూ. 84 లక్షలు నిధులు కూడా విడుదల చేసింది. ఫెన్సింగ్, తదితర పనుల కోసం రూ. 9 లక్షలు ఖర్చు కాగా రూ. 73 లక్షలు సంబంధిత అధికారి అకౌంట్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులను ప్రారంభిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జమ్మలమడుగు సమీపంలోని పొన్నతోట, బద్వేల్‌లో నగరవనం పార్కుల పనులు 60 శాతంపైగా పూర్తయ్యాయి. ప్రొద్దుటూరులో మాత్రం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సహకార సంస్థలు, ఔత్సాహికుల సహకారంతో నగరవనం పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో చిల్డ్రన్‌పార్కు, ఓపెన్ జిమ్, టాయిలెట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, క్యాంటీన్ అభివృద్ధి, గార్డెనింగ్ తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు. కాగా ఇటీవల కమలాపురానికి కొత్తగా నగరవనం ప్రాజెక్టు మంజూరు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కమలాపురంలోని చెప్పలిరోడ్డులో నగరవనం పార్కు ఏర్పాటు చేయనున్నారు. స్థల పరిశీలన, హద్దుల గుర్తింపు అనంతరం పనులను ప్రారంభిస్తారు.
నేషనల్ పార్కులో నగరవనం ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం
ప్రొద్దుటూరులో ఆగిన నగర వనం
పార్కు పనులు
జిల్లాలోని జమ్మలమడుగు,
బద్వేల్‌లో 60 శాతం వరకు పూర్తి
నేషనల్ పార్కులోని 47 హెక్టార్ల టూరిజం జోన్‌లో నగరవనం ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరిన అటవీ అధికారులు
ప్రభుత్వ అనుమతి రాగానే పనులను ప్రారంభిస్తాం
రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కులో నగరవనం ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఫైల్ పంపించాం. అనుమతి రాగానే పనులను ప్రారంభిస్తాం. నేషనల్ పార్కులోని 47 హెక్టార్ల టూరిజం జోన్‌లో నగరవనం పార్కు ఏర్పాటు చేయనున్నాం. నేషనల్ పార్కు ఎదురుగా ఉన్న అటవీ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేస్తాం.
– హేమాంజలి, ఎఫ్‌ఆర్‌ఓ, ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment