ప్రేమను పంచి.. సేవలతో విస్తరించి..!
కడప కల్చరల్ : క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహ ఉల్లాస భరితంగా నిర్వహిస్తారు. జిల్లాలో కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సేవలే ప్రధానంగా జిల్లాలో క్రైస్తవం విస్తరించింది. క్రిస్మస్ సందర్భంగా ఆ వివరాలు..
మన జిల్లాలో క్రైస్తవులు దాదాపు 17 నుంచి 20 శాతం వరకు ఉన్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఖాజీపేట, బద్వేలు, కలసపాడు, పోరుమామిళ్ల, కమలాపురం తదితర ప్రాంతాలలో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉంది. 1800 సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో క్రైస్తవం బాగా విస్తరించింది. జిల్లాలోని ఉరుటూరులో తొలి చర్చి నిర్మించారు. కడప నగరంలో పాత రిమ్స్ వద్దగల కాంగ్రిగేషనల్ చర్చి నగరంలో తొలి చర్చిగా రికార్డుల్లో ఉంది. జమ్మలమడుగులోని క్యాంబెల్ చర్చి, కలసపాడు, పోరుమామిళ్ల, పులివెందుల తదితర ప్రాంతాలలో చర్చిలను ఎంతో ఘనంగా నిర్మించారు. ప్రేమ, అహింస, దయ, కరుణకు మారుపేరుగా నిలిచిన ఏసుక్రీస్తును ఆరాధించే వారి సంఖ్య జిల్లాలో బాగా పెరిగింది. కడప నగరంలో కెథడ్రిల్ చర్చి, సీఎస్‌ఐ సెంట్రల్ చర్చి, ఆరోగ్యమాత చర్చి, అత్యాధునిక వసతుల సౌకర్యాలతో ప్రశాంత నిలయాలుగా పేరుగాంచాయి. కార్పొరేషన్ కార్యాలయం వద్దగల క్రైస్ట్ చర్చి నాటి తరం పటిష్ట నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలిచి ఉంది.
విద్యను అందిస్తూ..
జిల్లాలో క్రైస్తవాన్ని ప్రజలు ఆదరించారు. కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన నాటి క్రైస్తవ గురువులు, ప్రచారకులు ఒకవైపు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ మరోవైపు విద్యాలయాలు, వైద్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కేవలం కడప నగరంలోనే సీఎస్‌ఐ, మరియాపురం హైస్కూళ్ల ద్వారా ఇప్పటికి వేలాది మంది బడుగు, బలహీన, పేద, అణగారిన వర్గాల వారి పిల్లలకు ఉచితంగా విద్యాబోధన చేస్తున్నారు. నిర్మల కాన్వెంట్ ద్వారా ఆధునిక విద్యను అందించి ‘మిషనరీ స్కూళ్లు క్రమశిక్షణకు మారుపేరు’ అనిపించుకున్నాయి. అలాగే జిల్లాలో అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 50కి పైగా పాఠశాలలు క్రైస్తవ సంస్థల యాజమాన్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి.
వైద్యంతో ప్రాణాలు నిలుపుతూ..
కడప నగరంలో క్రైస్తవులు ఏర్పాటు చేసిన నిర్మల ఆస్పత్రి అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఉండి ఉత్తమ వైద్యం అందిస్తుందని పేరు తెచ్చుకుంది. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలను ఎదుర్కొనే వారు ఈ ఆస్పత్రికి వచ్చి చూపించుకునే వారు. ఇందులో శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించేవారు. జమ్మలమడుగులో అప్పట్లో నిర్మించిన క్యాంప్‌బెల్ ఆస్పత్రి నేటికీ వైద్య సేవలు అందిస్తోంది. క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించడం, మొండివ్యాధులను సైతం నయం చేయడంలో మంచి పేరు సాధించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ఆస్పత్రి నుంచే వైద్యుడిగా సేవలు ప్రారంభించారు.
పేదలకు అండగా నిలిచి..
చర్చిల నిర్మాణంతోపాటు క్రైస్తవ సంస్థలు జిల్లాలో అనాథలు, వృద్ధులు, రోగులు, వికలాంగులకు ప్రత్యేకంగా శరణాలయాలు ఏర్పాటు చేసి సేవలు అందించాయి. దాదాపు ప్రతి మండలంలోనూ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. కడప నగరంలోని సంధ్య సర్కిల్‌లో ఆంథోని ఇండస్ట్రీస్‌లో డాన్‌బాస్కో ఐటీఐ ఏర్పాటు చేసి యువతకు సాంకేతిక విద్యను కూడా అందుబాటులోకి తెచ్చారు. వేలాది మందిని నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇలా విద్య, వైద్య, సాంకేతిక సంస్థల ద్వారా మానవతా గుణాన్ని చాటుకుంటూ క్రైస్తవం మన ప్రాంతంలో విశేషంగా ఆదరణ పొందింది.
జిల్లాలో సేవా మార్గంతో ప్రజలకు చేరువైన క్రైస్తవం
క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కథనం
Comments
Please login to add a commentAdd a comment