ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని ఈశ్వరీదేవి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారి ఆరాధన గురుపూజోత్సవాల సందర్భంగా నూతన శోభ సంతరించుకుంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. ఆరాధనోత్సవాల్లో రెండో రోజైన సోమవారం వేడుకలు కమనీయంగా నిర్వహించారు. ఈశ్వరీదేవికి ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిమఠం రెసిడెన్షియల్ స్కూల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో చేపట్టిన చెక్క భజన భక్తులను అలరించింది. కందిమల్లాయపల్లెలోని వీరనారాయణపురం వారి గోవిందమాంబ కోలాటం బృందం చేసిన కోలాటం ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఉత్సాహ భరితంగా అశ్వవాహనోత్సవం జరిగింది. అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంగీత విభావరి ప్రదర్శించారు. రాత్రి హంస వాహనోత్సవం కనుల పండువగా జరిగింది. ఉభయ దాతలుగా బద్వేలు మండలం కుమ్మరకొట్టాలుకు చెందిన గోవిందిన్నె సుబ్బరాయుడు ఆచారి, విజయలక్ష్మి, విజయవాడకు చెందిన గుంటముక్కల ఉమామహేశ్వరరావు, నిర్మల, బ్రహ్మంగారిమఠం మండలం బొగ్గులవారిపల్లెకు చెందిన బొగ్గుల ఈశ్వర నారాయణరెడ్డి, శారదాంబ, గోవిందరెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వంక వేణుగోపాల్, సుగుణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సునీత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ వారు అల్పాహారం పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో శ్రీ ఈశ్వరీమాత సేవా సమితి ట్రస్టు చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, న్యాయ సలహా కమిటీ చైర్మన్ గురుప్రసాద్, షరాబు చంద్రమౌళి ఆచార్యులు, రాష్ట్ర మహిళా కమిటీ గౌరవాధ్యక్షురాలు వాసవి, అధ్యక్షురాలు అంగల కుదుటి సుశీల, ఉపాధ్యక్షురాలు షరాబు రమాదేవి, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రధాన వేడుక
ఈశ్వరీదేవి 1789లో మార్గశిర బహుళ నవమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది బహుళ నవమి మంగళవారం ప్రధాన వేడుక నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పిస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతి దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం జగన్మాతకు దీక్షా బంధన అలంకరణ ఉంటుంది. రాత్రి సింహవాహన గ్రామోత్సవం, తులాభారం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి.
వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు
భారీగా తరలి వస్తున్న భక్తులు
ఘనంగా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment