వైవీయూలో నియామకాలు
వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో పలు విభాగాలకు నూతన కోఆర్డినేటర్లను, నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తూ వైస్–ఛాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం వీసీ చాంబర్‌లో వీసీ, రిజిస్ట్రార్‌లు అధ్యాపకులకు నియామకపు పత్రాలను అందజేశారు.
వైవీయూ డెవలప్‌మెంట్ సెక్షన్ కోఆర్డినేటర్‌గా బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. రియాజున్నీసా నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇదివరకు పనిచేస్తున్న జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉస్మాన్ బాషా బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. వైవీయూ ఫైనాన్స్ విభాగం కోఆర్డినేటర్‌గా కామర్స్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. హరనాథ్‌ను నియమించారు. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన వాణిజ్య విభాగం శాఖ ఆచార్యులు జి. విజయ భారతి పదవీ కాలం పూర్తి కావడంతో ఈ నూతన నియామకం చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’స్వయం ప్లస్ (ఆన్‌న్‌లైన్ కోర్సులు)’ అమలుకు నోడల్ ఆఫీసర్‌గా విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.పి.వెంకటరమణను నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి. సరిత పాల్గొన్నారు.
రూ.60 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రాలకు కిట్లు
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన 60 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.60 లక్షలతో పిల్లల ఆట వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మి తెలిపారు. వైఎస్సార్ జిల్లాకు సంబంధించి చౌటపల్లె, నరసింహాపురం అంగన్‌వాడీ కేంద్రాలకు సోమవారం ప్లే మెటీరియల్, జారుడు బండ, 8.2 లీటర్ల రైస్ కుక్కర్, ఐరన్ ర్యాక్, వేయింగ్ స్కేల్, 32 ఇంచ్‌ల టీవీతోపాటు మొత్తం 30 రకాల వస్తువులను అందించారు.
విద్యార్థి కాలిపై బ్లేడ్‌తో కోసిన ప్రిన్సిపల్
రాయచోటి : కళాశాలలో స్టడీ అవర్‌కు రావడం లేదని కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ ఇంటర్ విద్యార్థి కార్తీక్ కాలుపై బ్లేడుతో కోశాడు. పెట్టాడు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో భాగమైన ఇంటర్మీడియట్ కళాశాలలో కార్తీక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొద్ది రోజులుగా సాయంత్రం వేళ కళాశాలలో జరుగుతున్న స్టడీ అవర్‌కు కార్తీక్ రాకపోవడం పట్ల ప్రిన్సిపల్ మందలించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం స్టడీ అవర్‌కు వచ్చిన కార్తీక్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బ్లేడుతో కాలిపై కోసినట్లు విద్యార్థి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment