కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. వేలకోట్లు దండుకుంటున్న కూటమి సర్కార్‌పై నిరసన స్వరం వినిపించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఈనెల 27వ తేది అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజల తరుపున నిరసన తెలిపి, కరెంటు చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచార సభల్లో బాబు ష్యూరిటీ..భవిష్యత్తు గ్యారెంటీ అన్నారని, ఆరునెలల్లోనే రెండుసార్లు కరెంటు చార్జీలు పెంచి ‘బాబు ష్యూరిటీ వీరబాదుడుకు గ్యారెంటీ’గా మార్చారన్నారు. ఈ చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. చంద్రబాబు ప్రజలను ఎలా మోసం చేస్తాడు అనే దానికి ఇదే నిదర్శనమన్నారు. ట్రూ యాప్ చార్జీలు ఎత్తివేస్తానని, చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నిస్సిగ్గుగా చార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ఈనెల 27వ తేది నిర్వహించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, దాసరి శివప్రసాద్, శ్రీరంజన్‌రెడ్డి, జి. శ్రీనివాసులరెడ్డి, షఫీ, కార్పొరేటర్లు కె. బాబు, షఫీ తదితరులు పాల్గొన్నారు.
27న విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన
పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment