సాగు భూమి పంచే వరకూ పోరాటం
ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
కడప కోటిరెడ్డిసర్కిల్ : కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని తీసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసే వరకూ పోరాడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. గాలి చంద్ర మాట్లాడుతూ పాలకప్రభుత్వాలు ఎన్నికల ముందు రేషన్ కార్డు అందజేయడంతోపాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, 24 గంటలపాటు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే హామీలకు తిలోదకాలివ్వడం తగదన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి రూ.4 లక్షలతో నిర్మాణం పూర్తి చేయిస్తానని చెప్పిమాట నిలబెట్టుకోవాలన్నారు. భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అమ్ముకునే డీకేటి మాఫియాకు కొమ్ము కాయడం మంచిది కాదన్నారు. ఆరు మాసాల పాలనలో మొదటి రెండు చట్టాలను పునరుద్ధరించి పేదల భూములు అడ్డగోలుగా ఆక్రమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. పేదవాడు జానెడు జాగాలో గుడిసె వేసుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోసం కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధనం తప్పదని వారు హెచ్చరించారు. ఆందోళన అనంతరం తహసీల్దారు నారాయణరెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట్ శివ, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎన్.విజయలక్ష్మి, సహాయ కార్యదర్శి బాదుల్లా, గంగా సురేష్, జి మద్దిలేటి, సావంత్ సుధాకర్, మునెయ్య, శంకర్‌నాయక్, టి మనోహర్‌రెడ్డి, పి.మల్లికార్జున, వి భాగ్యలక్ష్మి, దస్తగిరి, లింగన్న, బ్రహ్మం, నరసింహారావు, నాగరాజు, సుబ్బరాయుడు, శివశంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment