ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
ప్రొద్దుటూరు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుని దర్శనం కోసం టికెట్లు తీసుకునేందుకు వెళ్లిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృతిచెందడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. మండలంలోని దొరసానిపల్లెలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగి అమాయకులే ప్రాణాలు కోల్పోయారన్నారు. 45 మంది గాయపడడం తనను ఎంతో కలిచి వేసిందని, కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు విలువలేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ సంఘటనకు టీటీడీ పాలకమండలితోపాటు ప్రధాన అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. గోదావరి పుష్కరాలు, కందుకూరు సంఘటనలు, ఇపుడు తిరుమల ఘటనల్లోనూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొన్నారన్నారు. లక్షల మంది టోకెన్ల కోసం గుమికూడితే భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందని, లైన్‌కు ఇద్దరు పోలీసులను ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు జరిగిన సంఘటనలకు చింతించడం తప్ప ఏమి చేస్తామనడం శోచనీయమన్నారు. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇచ్చి, వారి కుటుంబీకులకు టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమోటోగా కేసులు స్వీకరించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా విచారం వ్యక్తం చేస్తుంటే హోంమంత్రి మాత్రం ఇది కుట్ర అని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ జేష్టాది శారద, మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, గుర్రం లావణ్య, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment