ఛైర్మెన్, ఈఓలను వెంటనే తప్పించాలి
కడప కార్పొరేషన్ : తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందిన ఘటనపై టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, టీటీడీ మాజీ సభ్యులు ఎస్.యానాదయ్య డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలకమండలి చేతగాని నిర్ణయాలతోనే ఈ ఘోరం జరిగిందని, అన్యాయంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా గాయపడ్డారన్నారు. ఐదేళ్లుగా తిరుమలకు రాలేదని అహంకారపూరితంగా మాట్లాడిన బీఆర్.నాయుడు వంటి వ్యక్తి ఛైర్మెన్‌గా ఉండటంతోనే ఇలా జరిగిందన్నారు. వెంటనే ఛైర్మెన్ బీఆర్.నాయుడు, ఈఓ శ్యామలరావు, ఏఈఓ వెంకయ్య చౌదరిలు భక్తులకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. సర్వ దర్శనానికి వచ్చేవారికి టోకెన్లు ఇవ్వడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా టోకెన్ తీసుకుంటేనే పైన దర్శనం అనే దుర్మార్గపు ఆలోచనతోనే ఈ ఘటన జరిగిందన్నారు. డీఎస్పీ, జేఈఓలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని, చిత్తశుద్ధి ఉంటే అసమర్థుడైన ఛైర్మెన్, ఈఓ, ఏఈఓలతో రాజీనామా చేయించాలన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు ఒప్పుకున్నారని, ఆయన మాట్లాడిన మాటకు కట్టుబడి చావులకు కారణమైన ఛైర్మెన్, ఈఓ, ఏఈఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోవడం చేతగానితనమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి మునిశేఖర్‌రెడ్డి, 30వ డివిజన్ కార్పొరేటర్ ఎస్‌ఎండీ షఫీ, రామ్మోహన్‌రెడ్డి, గోపాలక్రిష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment