పేదలకు ఇళ్ల స్థలాల కోసం 27న చలో కలెక్టరేట్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని విముక్తి చేసి అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ ఈనెల 27న చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర తెలిపారు. బుధవారం కడప నగరంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు ఎన్నికల ముందు ఇంటి స్థలం కేటాయిస్తాం, ఇళ్లు నిర్మిస్తామంటూ మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి రాగానే హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి రూ.4 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తానని ప్రకటించారన్నారు. తన ఎన్నికల వాగ్దానాన్ని తక్షణంఅమలు చేయాలని, ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.5లక్షలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, పి.చంద్రశేఖర్, ఎంవీ సుబ్బారెడ్డి, ఎన్. విజయలక్ష్మి, జి.వేణుగోపాల్, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment