సాక్షి, టాస్క్‌ఫోర్స్: తమ కింది స్థాయి మహిళా అధికారులపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మెసేజ్‌ల ద్వారా వేధించడం లాంటి వెకిలి, వికృత చేష్టలకు అక్కడి మహిళా అధికారులు, ఉద్యోగులు విసిగి వేసారిపోయారు. నోరు మెదిపితే తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుందని, ఆ అధికారి వేధింపులను పంటిబిగువున అదిమిపెట్టుకున్నారు. ఈ వేధింపుల పర్వం కాస్త మరింత ఎక్కువైంది. సదరు మహిళా అధికారి, ఉద్యోగి ఇళ్లను వెతుక్కుంటూ వెళ్లడం, పదేపదే వారిని వేధించడం పరాకాష్టకు చేరుకుంది. ఎట్టకేలకు బాధిత మహిళా అధికారి తన భర్తకు విషయం తెలియజేసింది. ఆయన గురువారం జిల్లా కార్యాలయంలోకి నేరుగా వచ్చి అధికారితో మొదట వాగ్వాదానికి దిగి నిలదీశారు. తరువాత భర్త చేతిలో ఆ అధికారి దెబ్బలు కూడా తిన్నారు. ఈ హఠాత్ పరిణామానికి సహచర అధికారులు, సిబ్బంది అధికారి భర్తకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు తాను మహిళా అధికారి జోలికి వెళ్లనని, మహిళా ఉద్యోగుల పట్ల మర్యాదగా మసలుకుంటానని కాళ్లబేరానికి రావడంతో అప్పుడు బాధిత అధికారి భర్త శాంతించారు. మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టమని హెచ్చరించి వెళ్లారు. ఈ జిల్లా కార్యాలయం కడప– రాయచోటి ప్రధాన రహదారిలో కడప నగరానికి కూతవేటు దూరంలో ఉంది. ఇంకా ఇక్కడి ఉద్యోగులు ఒక్కొక్కరే తమ అధికారి వేధింపులను వెళ్లబోసుకుంటున్నారు. అయితే ఈ సంఘటన బయటకు పొక్కకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం కొసమెరుపు.
తన కింది స్థాయి మహిళా అధికారి, ఉద్యోగులకు తప్పని కష్టాలు
నోరు మెదిపితే ‘పరువు’ పోతుందనిలోలోపల కుమిలిపోతున్న వైనం
ఎట్టకేలకు మహిళా అధికారి భర్త చేతిలో దెబ్బలు తిన్న జిల్లా అధికారి
కాళ్లబేరానికి రావడం,సహచర అధికారుల బుజ్జగింపుతో సద్దుమణిగిన వ్యవహారం
Comments
Please login to add a commentAdd a comment