రేపు డయల్ యువర్ ఆర్‌ఎం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలే పరిష్కారంగా నిర్వహిస్తున్న డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రయాణికులు 99592 25848 నెంబరుకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ లో తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
25న నిరసన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న కలెక్టరేట్ ఎదుట ‘థాలి బజావో’ పేరిట ప్లేటు, స్పూన్లు చేతబట్టి పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపేలా ‘‘సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్’’ నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు విజయ జ్యోతి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అప్జల్‌ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాలైన ఎన్.ఎస్.యు.ఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ విభాగాల నాయకులు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నేడు బాధ్యతలను
స్వీకరించనున్న నూతన ఎస్పీ
కడప అర్బన్: వైఎస్‌ఆర్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన ఈ.జి అశోక్‌కుమార్ ఈనెల 24న జిల్లాకు విచ్చేసి ఎస్పీగా బాధ్యతలను చేపట్టనున్నారు. జిల్లా పోలీసుకార్యాలయంలో శుక్రవారం మధ్యా హ్నం 1 గంటకు బాధ్యతలను స్వీకరించిన తరువాత మీడియాతో మాట్లాడాతారు.
● అనంతపురం జిల్లా నార్పలకు చెందిన ఈ.జి అశోక్‌కుమార్ విద్యాభ్యాసం ముగియగానే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 2010లో డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకుని నాగర్ కర్నూలులో 2011–12, చింతపల్లిలో 2013–2014, కడప డీఎస్పీగా 2014 నుంచి 2017 వరకు విధులు నిర్వహించారు. 2017 నుంచి 2018 వరకు ఇంటిలిజెన్స్‌లో పనిచేశారు. 2018లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు. ఇటీవల అదనపు ఎస్పీ నుంచి ఎస్పీలుగా పదోన్నతి పొందారు. పదేళ్ల తరువాత మళ్లీ ఎస్పీ హోదాలో జిల్లాకు విచ్చేసి పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.
మద్దతు ధరతో
కంది కొనుగోలు
కడప సెవెన్‌రోడ్స్: ఈ– క్రాప్ చేయించుకున్న రైతుల నుంచి ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో కంది కొనుగోలు ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలు రూ.7,550తో కందులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల్లో ఇంకా పేర్లు నమోదు చేయించుకోని రైతులు వెంటనే నమోదు చేయించుకోవాలని కోరారు. తేమ 12 శాతంలోపే ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంట ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓఎన్‌ఓఎస్ పథకం..
విద్యార్థులకు వరం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయం వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ఒ.ఎన్.ఒ.ఎస్) పథకం సభ్యత్వాన్ని పొందిందని తద్వారా వేలాది ఆన్లైన్ గ్రంథాలు విద్యార్థులు చదువుకునేందుకు యాక్సెస్ లభించిందని వీసీ కె. కృష్ణారెడ్డి అన్నారు. వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఈ–జర్నల్స్ యాక్సెస్ పత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి, ప్రధాన ఆచార్యులు ఎస్.రఘునాథ్ రెడ్డి, కులసచివులు ఆచార్య పి. పద్మ లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ డి. ప్రసాద్ రావు, ఆర్. విజయ కుమార్ అందజేశారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు స్కాలర్లు, పరిశోధకుల పరిశోధనా వ్యాసాలు, జర్నల్‌లను శోధించవచ్చన్నారు. అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులందరూ తమ విద్యా, వత్తిపరమైన కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విలువైన వనరును ఉపయోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment