TS Special
-
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. సర్కార్‌పై ఫైర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బజార్‌ఘాట్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్ చేశారు. కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
నాంపల్లి భారీ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు
Updates.. ఘటనపై పోలీస్ కేసు నమోదు బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది. క్రైమ్ నెంబర్ 347/23 us 304పార్ట్ ఐపీసీ సెక్షన్లు 285, 286(పేలుడు పదార్థాలతో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం) ప్రకారం.. అలాగే.. ఇండియన్ ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ సెక్షన్ 9 క్లాజ్ బి ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. వరుస ప్రమాదాలు.. అయినా నిర్లక్ష్యమే!: అజారుద్దీన్ వరుస ప్రమాదాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వీడడం లేదని కాంగ్రెస్ నేత అజారుద్దీన్ అన్నారు. నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నివాస ప్రాంతాల్లో గోదాములు ఉన్నాయని తెలిసినా చర్యలు తీసుకో లేదు. డెక్కన్‌మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదాల తర్వాత కూడా అలర్ట్ కాలేదు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగానే జీహెచ్ఎంసీ వ్యవహరిస్తోంది అని మండిపడ్డారాయన. రూ.5 లక్షలా?.. ఏమైనా భిక్షం వేస్తున్నారా?: సీపీఐ నారాయణ నాంపల్లి ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీపీఐ నారాయణ.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ కేవలం ఐదు లలక్షల మాత్రమే ప్రకటించారు. బాధితులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా?’’ అని నారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమూ ఇప్పించాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ‘రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ డబ్బాల ఉంచితే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి?.. కాబట్టి నాంపల్లి ప్రమాద ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని అన్నారాయన. నాంపల్లి ఘటన.. జనసేన చీఫ్ పవన్ స్పందన నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఘటన దిగ్భ్రాంతి కలిగించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కెమికల్స్ వల్లే ప్రమాదం జరిగిందని తెలిసిందని, నివాస ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ అధికారుల్ని కోరారాయన. నాంపల్లి అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/lb8SkVP5ix — JanaSena Party (@JanaSenaParty) November 13, 2023 ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి: సీపీఐ తమ్మినేని నాంపల్లి కెమికల్ గోడౌన్ అగ్ని ప్రమాదంపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పేరు మీద ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది పార్టీ. ‘‘తొమ్మిది మంది కార్మికుల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. మృతి చెందినవారికి సంతాపాన్ని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రు.20 లక్షలు అందించాలని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ..హైదరాబాదులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో కెమికల్ గోడౌన్లను ఉంచకుండా శివారు ప్రాంతాలకు తరలించి ప్రమాదాలను అరికట్టాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నది’’. అగ్ని ప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం బాధాకరం. ►మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి. ►అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి ►మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ►అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి ►ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన ఫిరోజ్ ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాను. ►మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి ►నాంపల్లి అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. ►అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు కేటీఆర్ ఆదేశం. ►షార్ట్ సర్య్కూట్ లేదా టపాసుల వల్ల మంటలు వ్యాప్తించాయి. ►ఒక్కో మృతుడి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా. ►బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిస్తాం. ►అపార్ట్మెంట్లో కెమికల్స్ వాడటం ప్రమాదకరం. ►కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్. ►రెండో అంతస్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. ►అగ్ని ప్రమాదంలో తన వారిని కోల్పోయి కన్నీరు పెట్టుకున్న బాధితుడు. నాంపల్లిలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్ ►ఘటనా స్థలంలో ఫిరోజ్ ఖాన్‌ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు ►వీరి మధ్య వాగ్వాదం ►పోలీసులు వారించినా పట్టించుకోని నేతలు ►పోలీసుల స్వల్ప లాఠీఛార్జ్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫిరోజ్ ఖాన్ ►నాంపల్లిలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ►ఈ క్రమంలో ఆయనను స్థానిక నేతలు అడ్డుకున్నారు. ►దీంతో, ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక ఎంఐఎం నేతలపై ఫిరోజ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ►మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ►తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ►తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ► నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి యాజమాని రమేష్ జైశ్వాల్‌గా గుర్తించారు. రమేష్ జైశ్వాల్‌కు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు గుర్తింపు. రమేష్ కోసం గాలిస్తున్న పోలీసులు. 30 కెమికల్ డబ్బాలు గుర్తింపు, కాలిపోకుండా ఉన్నవి మరో 100 డబ్బాలను గుర్తించారు. నాంపల్లి ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి.. ►నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ►అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. ►హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ►అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. ►అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. ►రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. ►ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ►ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. ►వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. అగ్ని ప్రమాద స్థలికి కిషన్ రెడ్డి.. ►ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే.. తూభ(5) తరూభ(12) మహ్మాద్ ఆజమ్ (54), రెహమాన్, రెహానా సుల్తానా(50) డాక్టర్ తహుర ఫర్హీన్(38), ఫైజా సమీన్(25) సెలవుల కారణంగా పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన డాక్టర్ ఫరీన్. మూడవ అంతస్తులో : (1) జకీర్ హుస్సేన్ (2) నిక్కత్ సుల్తానా ►హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ►వివరాల ప్రకారం.. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికి ఏడుగురు మృతిచెందినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంకా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. ►ఇక, అపార్ట్మెంట్లో కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం. రెస్య్కూ సిబ్బంది ఇప్పటికి 21 మందిని కాపాడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ►ఈ ప్రమాద ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి మంటలు వ్యాపించాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ సెల్లార్లో మెకానిక్ షెడ్ ఉంది. కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్ డ్రమ్స్ పేలడంతో మంటలు వ్యాపించాయి. -
బాబుది గ్రాఫిక్స్ ప్రపంచం.. రేవంత్‌ది భ్రమల లోకం
ఆయన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన గురువు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. గురువు అమరావతి పేరుతో ఐదేళ్ళ పాటు గ్రాఫిక్స్ ప్రపంచాన్ని సృష్టించి ఏపీ ప్రజల్ని భ్రమల్లో ముంచారు. అమరావతి పేరుతో చేసిన అవినీతి భాగోతాలు బయటకి వచ్చి కేసుల మీద కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోని ఆయన శిష్యుడు కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తానని చెబుతున్నారు. శిష్యుడు సృష్టించబోయే మాయా ప్రపంచం ఏంటో..ఆయన కథేంటో చూద్దాం. అవినీతి కేసులో అరెస్టయి...బెయిల్ రాకపోవడంతో...కంటి వైద్యం కోసం తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గురించి అందరికీ తెలుసు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేయని నేరాలు, ఘోరాలు లేవు. అందరూ వద్దని చెప్పిన చోట అమరావతి పేరుతో 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేసి రాజధాని నిర్మించేందుకు పూనుకున్నారు. అయితే ఐదేళ్ళ పాటు అమరావతి పేరుతో దేశ దేశాలు పర్యటించి గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించి, 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఐదేళ్ళ కాలంలో వెయ్యి కోట్ల ఖర్చుతో అమరావతిలో ఆయన రెండు తాత్కాలిక భవనాలు భవనాలు మాత్రమే నిర్మించారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ జపాన్ నుంచి..సింగపూర్ వరకు..లండన్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఎన్నో దేశాల రాజధానుల తరహాలో అమరావతి నిర్మిస్తామని ప్రజల్ని ఊరించారు. చంద్రబాబు అవినీతిని సహించలేక జపాన్ కంపెనీ వాళ్ళు నీ ప్రాజెక్టు వద్దు..నువ్వు వద్దని ఆయన అవినీతి గురించి ఓపెన్‌గా చెప్పి వెళ్ళిపోయారు. ఇక సింగపూర్ కన్సార్షియం వాళ్ళు 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత వారంతట వారే అమరావతి గ్రాఫిక్స్ ప్రపంచం నుంచి తప్పుకున్నారు. సింగపూర్ కన్సార్షియంలో ప్రధాన భాగస్వామి అయిన అక్కడి మంత్రి ఈశ్వరన్ కొంతకాలం క్రితమే అవినీతి కేసులో మంత్రి పదవి పోగొట్టుకుని అరెస్టయ్యారు. మన చంద్రబాబుతో ఇలా ఉంటుంది మరి.. అమరావతి భూ సమీకరణ, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం..అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో పబ్లిక్ ప్రయివేటు పార్టిసిపేషన్ కింద ఇచ్చిన కాంట్రాక్టులు అన్నీ కూడా పెద్ద కుంభకోణాల కింద తేలాయి. వాటి మీద ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ఆరేళ్ళ క్రితం టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు. తర్వాత పీసీసీ చీఫ్ పదవి కూడా పొందాడు. రేవంత్ పాతిక కోట్లకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నాడని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే బహిరంగంగా ఆరోపించారు. ఇదంతా ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే దేశంలో పేరున్న ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి అక్కడ చెప్పిన మాటలు వింటుంటే..గురువునే మించిపోయాడని అర్థమవుతోంది. ఎంతైనా గురువు చంద్రబాబు కోసం... ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నాయకుడు కదా..? హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహించే మూసీ నది దుర్గంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము అధికారంలోకి రాగానే...హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ నదిని జీవనదిలా మార్చి...వెనిస్ నగరంలో మాదిరిగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీలో అమరావతి నగరం మాదిరిగా పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్ కింద మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్ది..దాన్నొక టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తామని చెప్పారు. అమరావతిలా చేస్తే ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చుండదని...గ్లోబల్ టెండర్స్ ద్వారా మూసీలో వెనిస్ నగరాన్ని సృష్టిస్తామని చెప్పారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం..ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రేవంత్ ఇండియా టుడే వేదిక మీద చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు అమరావతి పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని గ్రాఫిక్స్‌లో సృష్టిస్తే...శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో మరో అమరావతి లాగా...మూసీ నది ప్రాజెక్టు పేరుతో ఇంకో భ్రమల ప్రపంచాన్ని సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏతా వాతా తేలేదేమంటే...రేవంత్ గురువును మించిన శిష్యుడిగా ఎదిగిపోయారు. తనను కాంగ్రెస్‌లోకి పంపించి...ఇప్పుడు ఎన్నికల్లో తన కోసమే టీడీపీ అంతా పనిచేసేలా సహాయం చేస్తున్నందుకు గురువుకు కృతజ్ఞతగా ఆయనకు గురు దక్షిణ ఇచ్చేందుకు.. నమూనా మాయా ప్రపంచాన్ని తయారు చేయడానికి అవసరమైన అధికారం కోసం రేవంత్ ఎదురు చూస్తున్నారు. -
ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు. ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీల తరపున ఆ ముగ్గురే పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరు తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నాయకులు ఎవరు?' అసెంబ్లీ ఎన్నికల కాలంలో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ.. శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. నిన్న మిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారి ఉండొచ్చు. ప్రత్యర్ధులు ఏకతాటిపైకి వచ్చి ఉండొచ్చు. ఇప్పటి తరం నాయకులు ఒకే పార్టీని పట్టుకుని వేలాడటంలేదు. పొద్దున టిక్కెట్ రాలేదంటే సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు. సాయంత్రం టికెట్ ఇస్తానంటే ఉదయానికి పార్టీ మార్చేస్తున్నారు. జెండాలు, రంగులు మార్చేయడం చాలా ఈజీగా మారిపోయింది. రాజకీయ కమిట్మెంట్, కేడర్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా అధికారం, పదవి ముఖ్యం అన్నట్లుగా పార్టీలు మార్చేస్తున్నారు. గులాబీ పార్టీలో కొనసాగి.. ఇప్పుడు చెరోదారి! హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో ఉన్నారు. 2014లో ఈ ముగ్గురు నాయకులు గులాబీ పార్టీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున వరంగల్ నగరంలో కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపునేని నరేందర్‌ను మేయర్ పదవి వరించింది. గత ఎన్నికల్లో నరేందర్ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. కారు దిగి కమలం గూటికి.. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సాధన సమితిలో సాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా కొండా సురేఖ, కార్పొరేటర్ గా నరేందర్ ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు సహకారం అందించారు. 2018లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రదీప్ రావును ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ ఆయన ఆశలపై గులాబీ పార్టీ అధిష్టానం నీళ్ళు చల్లింది. నన్నపునేని నరేందర్‌కు టికెట్ ఇవ్వడంతో ప్రదీప్‌రావు నిరుత్సాహం చెందారు. నీకు మంచి గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో అప్పుడు ఎన్నికల్లో తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీలో గుర్తింపు లేకపోవడం, ఎలాంటి పదవులు రాకపోవడంతో.. కొన్ని నెలల క్రితం కారు దిగి కమలం గూటికి చేరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖ, బీజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల వరకు వీరంతా ఒకే పార్టీలో పనిచేసి.. ఒకే స్టేజి పైన కూర్చున్నారు. ఇప్పుడు నన్నపునేని గులాబీ నీడనే ఉండగా.. కొండా సురేఖ, ప్రదీప్‌రావు జెండాలు మార్చారు. ఒకే నియోజకవర్గంలో ముగ్గురూ ప్రత్యర్థులుగా మారి పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు. మరి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఇవి చదవండి: 'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం! -
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్‌తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్‌లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్‌లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరిక అత్యంత న్యాయమైనదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేస్తున్న ఉద్యమం సరైనదని, త్వరలో మాదిగల ఆకాంక్షను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదిగ ఉప కులాల ఉద్యమానికి బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు కొనసాగించనున్నట్లు తెలిపారు. తెలుగు కవి గుర్రం జాషువా కవితల ప్రేరణతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, వన్ లైఫ్.. వన్ మిషన్లా చేస్తున్న ఈ ఉద్యమం స్పూర్తినిచ్చిందని తెలిపారు. తెలంగాణలో దళితులకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటిరోజే దళిత ముఖ్యమంత్రి హామీని తొక్కేశారని, సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని అన్నారు. దళితబంధు అంటూ వేలకోట్ల రూపాయలను వారి పార్టీ నేతల విధేయులు, కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఎన్నోరకాలుగా అవమానపర్చిందని, అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ వేధించిందన్నారు. మా ఆకాంక్షలు నెరవేర్చేది మోదీయే: మంద కృష్ణ దళితుల ఆకాంక్షలు నెరవేర్చేది ప్రధాని మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరని మండిపడ్డారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరించాలని మోదీని కోరుతున్నానంటూ మంద కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ మంద కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. -
విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్‌టాప్‌లిస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి. ప్రజాకర్షకంగా రూపకల్పన.. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. ఇక, విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్‌తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్డ్ కెనాల్స్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది. -
పరీక్షలపై పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణపై అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2024 మార్చి, ఏప్రిల్‌లలో ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఏప్రిల్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అనేక కారణాల వల్ల టెన్త్, ఇంటర్ సిలబస్ అనుకున్న మేర పూర్తి కాలేదు. గత మూడు వారాలుగా ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలపై దృష్టి పెట్టింది. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ అధికారులకు శిక్షణ అందించింది. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. నవంబర్ నెలాఖరు వరకూ పోలింగ్ విధుల్లోనే అధికారులు ఉండనున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సైతం ఇదే పనిలో నిమగ్నం కానున్నారు. దీంతో డిసెంబర్ మొదటి వారం వరకు విద్యాసంస్థల్లో బోధన పూర్తిస్థాయిలో సాగే అవకాశం కనిపించట్లేదని ఇంటర్ బోర్డు, టెన్త్ పరీక్షల విభాగం భావించాయి. సిలబస్ కాకుండా టెన్త్ పరీక్షలెలా? టెన్త్ పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు 40 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. పుస్తకాల సరఫరాలో జాప్యం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం కొంతకాలం కొనసాగడం వల్ల బోధనకు ఆటంకం ఏర్పడింది. దీనికితోడు దసరా తర్వాత నుంచి ఎన్నికల కోలాహలమే నెలకొంది. వాస్తవానికి జనవరి నాటికి టెన్త్ సిలబస్ పూర్తవ్వాలి. జనవరి రెండో వారంలో పునశ్చరణ చేపట్టాలి. కానీ ప్రస్తుతం డిసెంబర్ మధ్య వరకు బోధనే కొనసాగకపోతే సిలబస్ ఎలా పూర్తవుతుందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు పెడితే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలను మరో నెలపాటు వాయిదా వేసే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇంటర్‌లోనూ అదే జాప్యం... ఇంటర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ మొదటి వారం వరకు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఆలస్యంగా చేరిన వారికి ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. చాలా చోట్ల ఒక్కో సబ్జెక్టులో కనీసం ఒక్క చాప్టర్ కూడా బోధించలేదని అధ్యాపకులు అంటున్నారు. ఈ ఏడాది ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించాలని భావించారు. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియపై అధ్యాపకులకే శిక్షణ నిర్వహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తే ప్రైవేటు కాలేజీల విద్యార్థులతో పోటీ పడలేరని ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు అంటున్నారు. ఈ అంశాలపై ఇంటర్ బోర్డు అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. పరీక్షల తేదీలను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రశ్నపత్రాల తయారీలోనూ ఆలస్యం... అక్టోబర్, నవంబర్‌లలోనే ప్రశ్నపత్రాల కూర్పుపై ఇంటర్, టెన్త్ పరీక్షల విభాగాలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి 12 మంది నిపుణులను ఎంపిక చేసుకొని గోప్యంగా ప్రశ్నపత్రాలు తయారు చేయించి వాటిల్లోంచి మూడు సెట్లను ఉన్నతాధికారులు ఎంపిక చేస్తే ఆ తర్వాత అవి ప్రింటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి మార్కుల క్రోడీకరణకు సాంకేతిక ఏర్పాట్లు కూడా డిసెంబర్ నాటికి చేపట్టాలి. కానీ ప్రస్తుతం సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండడంతో ప్రశ్నపత్రాలపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదని అధికార వర్గాలు అంటున్నాయి. -
హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్‌కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు. ఆధునిక సమాజంలోని చెడులపై విజయం సాధించి, శాంతి, మతసామరస్యం, సోదరభావంతో కూడిన సమాజనిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నారు.ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇక్కడి ఉత్పత్తిదారులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ధరణి కంటే మంచి పోర్టల్ తెస్తాం: రేవంత్‌రెడ్డి
సాక్షి, బెల్లంపల్లి: తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి .. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరతామని అన్నారు. బెల్లంపల్లిలో శనివారం జరిగిన కాంగ్రస్ విజయభేరి ఎన్నికల ప్రచార సభలో ఆయన బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘‘దేశంలో గాంధీ కుటుంబంలా.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మేడిగడ్డకు తీసుకెళ్లారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వాన వస్తేనే కుంగిపోయింది. అంత పెద్ద ప్రాజెక్టును ఇసుక మీద ఎవరైనా కడతారా?. అదేమైనా పేక మేడనా?.. ఇసుకపై బ్యారేజీ కడితే అది కుంగిపోయింది. మేడిగడ్డ అణా పైసాకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు. .. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు... దేశమంతా తెలుసు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..?, సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా?. అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది’’ అని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్‌లను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతాం. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు?, ధరణికంటే మెరుగైన సాంకేతికతతో పోర్టల్ తీసుకొస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తాం. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియా. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారు.’’ అని రేవంత్ వివరించారు. సింగరేణి కార్మికుల్ని కేసీఆర్ మోసం చేశారు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారని.. కానీ, వాళ్లను కూడా కేసీఆర్ మోసం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. రామగుండం కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్దీకరించలేదు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎందుకు బంద్ కాలేదు?. సింగరేణి సొంతింటి కల నెరవేరిందా?. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అన్నారాయన. -
‘రేవంత్.. మేము కూడా నీలా మాట్లాడగలం’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్ మండిపడ్డారు. రేవంత్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నోటికి వచ్చినట్లు రేవంత్ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. -
మళ్లీ వచ్చేది మేమే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో 24 గంటలు మంచినీళ్లు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గిస్తామన్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘నగరంలో ట్రాఫిక్ సమస్యను రాబోయే రోజుల్లో తగ్గిస్తాం. మీరు చెప్పిన సమస్యలన్నీ డిసెంబర్ 3 తర్వత పరిష్కరిస్తాం. డిసెంబర్ 3న మళ్ళీ మేమే వస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. హైదరాబాద్‌లో తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటాపంచలు చేశాం. రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తాం. ట్రాఫిక్ తగ్గాలంటే మెట్రో సేవలు మరింత పెరగాలి. జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు ,మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చూడండి..జంగ్ తెలంగాణ -
Assembly Elections: వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో..
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ కష్టం రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలే ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఓ యువనేత చాలా కష్టాలు పడుతున్నారట. తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఆ అభ్యర్థి కోసం ప్రయోగిస్తున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆ యువనేత ఎవరు? తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్‌కు పక్కనే ఉన్న నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కల్వకుంట్ల తారకరాముడు నానా కష్టాలు పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు టిక్కెట్ నిరాకరించిన గులాబీ పార్టీ బాస్ చల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించారు. టిక్కెట్ వచ్చినప్పటినుంచే చల్మెడకు కష్టాలు మొదలయ్యాయి. తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌బాబు పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉధృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తన పక్క నియోజకవర్గమే కావడంతో ఇప్పుడు వేములవాడ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేములవాడలో చల్మెడకు విజయం చేకూర్చండి...నేనే దత్తత తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చల్మెడను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా.. చల్మెడను కాదు.. కేసీఆర్‌ను చూసి గెలిపించండి..అంటూ వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. స్వయంగా ఆయనే వేములవాడలో పోటీ చేస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ చేసిన ప్రసంగం విన్నవారు...అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆయనే బయటపెట్టారా అనే చర్చ ప్రారంభించారు. చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు సహాయ నిరాకరణ..పార్టీ అభ్యర్థి చల్మెడ తీరు.. ప్రజలతో కలిసే విషయంలోనూ.. ముఖ్యంగా క్యాడర్ ను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా వెనుకబడి పోవడంతో.. చల్మెడ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నాల్గుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నేత ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆది శ్రీనివాస్ మీద సానుభూతి పవనాలు వీయడంతో పాటు.. కాంగ్రెస్ వేవ్ కొంత కనిపిస్తుండటం.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మరింత కష్టిస్తేగానీ.. కనీసం ఫైట్‌లో ఉండే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనతలు.. మరోవైపు స్థానిక నేతలు జీర్ణించుకోలేని స్థాయిలో ఆయన వైఖరి.. కేటీఆర్ మీటింగ్ అయిపోయిందో, లేదో.. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరగణం కావడం విశేషం. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పెద్దగా ప్రభావితం చేయగల నేత కాకపోవడంతో పాటు.. ఆయన వైఖరి నచ్చక చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అందుకే తన పక్క నియోజకవర్గమైన వేములవాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తారకరాముడికి తలబొప్పి కట్టినంత పనవుతోంది. అయితే యువసమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసాయి. చల్మెడను గెలిపించకపోతే వేములవాడ రానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ అభ్యర్థి చల్మెడ నిస్సహాయతను తెలియచేస్తోందని అంటున్నారు. మరి చివరకు వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో చూడాలి.. -
పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సంబంధిత వార్త: నేడు తెలంగాణకు మోదీ ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, తివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. ►సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లాలి ►బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లిస్తారు ►బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ►కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్-ఉప్కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు. ►ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బీహెచ్- స్వీకార్-ఉప్కార్ వైపు అనుమతిలేదు. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు. ►ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ టివోలి వద్ద స్వీకార్-ఉప్కార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. ►జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపిస్తారు. -
అప్పుడే మొదలైన కుర్చీలాట.. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే కుర్చీ ఆట మొదలైంది. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకమో, లేక ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కుర్చినీ చూపిస్తున్నారో కాని మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి తనదంటే తనదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని సర్వేలలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందన్ని సమాచారంతో సీఎం పదవి కుర్చీపై కూడా కొందరు ఖర్చీఫ్ వేసుకుంటున్నట్లుగా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ శాసనసభ స్థానానికి నామినేషన్ వేసిన సందర్భంగా కుర్చీ పేరుతో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించాయి. పార్టీలో కొందరికి కాస్త అసహనం కూడా ఏర్పడింది. నాకే సీఎం పదవి: రేవంత్ రేవంత్ చాలా స్పష్టంగా తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుందని కొడంగల్ ప్రజలకు చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. ఇందులో రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తానే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నానని పార్టీలో పోటీ పడేవారికి సంకేతం ఇవ్వడం, తాను ముఖ్యమంత్రి అవుతాను కనుక తనను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం. నిజానికి ఇది ఒకరకంగా సాహసం అని చెప్పాలి. వర్గాలతో నిండి ఉండే కాంగ్రెస్‌లో ఇలా చెప్పడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే. అయినా ఆ పని చేయడానికే ముందుకు వెళ్లారు. దానికి కారణం సెంటిమెంట్‌ను ప్రయోగించడమే. ఉమ్మడి మహబూబ్‌నగర్‌నుంచి ఒక్కరే ఈ సందర్భంగా గతంలో బూర్గుల రామకృష్ణారావు ఒక్కరే ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు తనకు అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. మరో విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆఆర్ పోటీ చేసే కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ వేశారు. అక్కడ గెలిచే అవకాశం సహజంగానే తక్కువ. ఒకవేళ అక్కడ గెలిస్తే, కాంగ్రెస్ అధికారంలో వచ్చే పక్షంలో ఆయనే సీఎం అవుతారని చెప్పవచ్చు. మరో పాయింట్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లారు. అది నెగిటివ్ మార్క్ అయినా, ఆ విషయం తెలిసి కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు కనుక అది పెద్ద అభ్యంతరం కాకపోవచ్చు. కాంగ్రెస్‌లో అతి వేగంగా పీసీసీ అధ్యక్షుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే అర్హత బాగానే ఉంటుంది. అందులోను రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి అతి వేగంగా పీసీసీ అధ్యక్ష స్థాయికి చేరారు. కాని అన్నిసార్లు అలా జరగాలని లేదు. గతంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఆయన ఆ రెండుసార్లు సీఎం కూడా అయ్యారు. కాని రెండేళ్లలోపే పదవిని వదలుకోవల్సి వచ్చిన సంగతి కూడా గుర్తుచుకోవాలి. కానీ ఆ తర్వాత కాలంలో అలాంటి అవకాశంఎవరికి రాలేదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ, వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వానికి జనామోదం ఉండడంతో ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. లైన్లో కోమటిరెడ్డి కూడా.. తాజాగా కర్నాటకలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కాదని, సిద్దరామయ్యను సీఎంగా చేశారు. సిద్దరామయ్య అంతకు ముందు కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉపయోగపడింది. వీరిద్దరి పోటీ అక్కడ వర్గ కలహాలకు ప్రాతిపదికగా మారింది. కాంగ్రెస్ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు తామూ సీఎం అభ్యర్దులమేనని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకున్నారు. రేవంత్ రెడ్డి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని నినాదాలు చేసి ఉత్సహాపడ్డారో, అదే మాదిరి మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ ఘట్టం సందర్భంగా జరిగిన సభలో కూడా ఆయనను సీఎం, సీఎం అని అనుచరులు నినాదాలు చేశారు. దానిపై ఆయన స్పందించారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ లో తనకు సీనియారిటీ ఉందన్నది ఆయన భావన. ఆయనతో పాటు నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తనకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించవచ్చు. అందరికన్నా సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి ఈసారి పోటీ చేయకపోయినా, ఆయా ప్రచార సభలలో తనకు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పి మనసులో మాట బయటపెట్టారు. మరో నేత జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతానని అంటున్నారు. పైగా సీఎం పదవిని అధిష్టానం నిర్ణయిస్తుందని పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన జవాబు ఇచ్చారు. భట్టికి చాన్? మరో నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. దళితవర్గానికి చెందినవారికి సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయనకు చాన్స్ రావచ్చు. మరోవైపు బీజేపీ బీసీ కార్డు ప్రయోగిస్తున్నందున, ఆ వర్గాలకు చెందినవారు కూడా తాము రేసులో ఉంటామని ప్రకటించవచ్చు. బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారని ఈటెల రాజేందర్ కూడా ప్రచారం ఆరంభించారు. ఆయన లక్ష్యం కూడా ఆ సెంటిమెంట్ ద్వారా తొలుత శాసనసభ్యుడిగా ఎన్నికవడమే అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇదంతా ఎన్నికల ముందు జరుగుతున్న చర్చ. అసలు ఎన్నికలలో గెలవడం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు వీరంతా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎవరికి వారు తొలుత ఎమ్మెల్యే అవడం కోసం వ్యూహాత్మకంగా సీఎంపదవిని ఒక ఆకర్షణగా తమ నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటున్నారని అనుకోవచ్చు. ఇంతకీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
Oath To Vote: ఓటుతో దుమ్ము రేపుదాం
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసలు "ఓత్ టు వోట్" (OATH TO VOTE) నినాదం ఏమిటంటే.. 'ఓటు హక్కు కలిగిన ఓటరు ఈ వెబ్ సైట్ https://o2v.sakshi.com/?utm_source=sakshio2v కు లాగిన్ అయి తమ ఓటు హక్కును 2023 ఎన్నికలలో తప్పకుండా వినియోగించుకుంటామని "ఓత్ టు వోట్" (OATH TO VOTE) ద్వారా ప్రమాణం చేయాలి. అంతేకాదు ఆ ప్రమాణానికి సంబంధించి ప్రమాణపత్రం కూడా ఇమెయిల్ రూపంలో వెంటనే పొందవచ్చు.' ఎన్నికల్లో ప్రతిసారి ఎవరో ఒకరు తమ విలువైన ఓటు హక్కును వాడుకోక పోవడం వల్ల ఆ ఓటు కాస్త మురిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాలతోపాటు మన జీవితాలూ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ‘‘ఏం ఓటు మీ హక్కు కాదా? మీకు తగిన అభ్యర్థిని మీరు ఎన్నుకోలేరా?’’ ఒక్కసారి ఆలోచించండి. గెలిచేది వారైతే గెలిపించేది మనమని అర్థం చేసుకోండి. వారు గెలిచి చేసే పాలన కన్నా మనం గెలిపించుకుని చేయించుకునే పాలనే మిన్న అని గుర్తించండి. ఓటు హక్కును వాడుకునే అవకాశాలు మున్ముందూ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మనముందున్న ఎన్నికలు మనకొచ్చిన తాజా అవకాశం. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరనుకున్న రేపటి భవిష్యత్తు మారిపోతుందన్న నమ్మకంతో ముందుకు కదలండి. ‘ఓత్ టు వోట్’ ద్వారా మీరేంటో నిరూపించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి.. -
కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు
సిర్పూర్(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. బీఆర్ఎస్లోని పలువురు అభ్యర్థులను ఓడించేది కూడా కేసీఆరేనని అని తీవ్ర ఆరోపణలు చేశారు. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబుకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలిస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫాంహౌస్‌లో చేసింది రాజశ్యామల యాగం కాదని.. వశీకరణ పూజలు చేశారని ఆరోపించారు. బీసీని సీఎం చేస్తామంటే ఓర్వలేకపోతున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని బండి సంజయ్ అన్నారు. కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ బీసీలను అవమానిస్తున్నడని.. వాళ్లు సీఎం పదవికి పనికిరారా.. అని ప్రశ్నించారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణీరుద్రమ శుక్రవారం నామినేషన్ వేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్రంలో లేదని అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని.. కానీ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి అవకాశమిస్తే ఎలాంటి మచ్చ లేని పేద బీసీ నాయకుడు సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
సాధికార నినాదానికి జన నీరాజనం
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలు విజయ యాత్ర చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో ఎలా అభ్యున్నతి చెంది, సాధికారత సాధించాయో రాష్ట్రమంతా చాటి చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రమంతా విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిస్తూ, కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ సింహభాగం పదవులివ్వడం ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయం ఆ వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని రగల్చింది. సామాజిక సాధికార యాత్రలు జగన్నినాదమై ప్రతిధ్వనిస్తున్నాయి. సామాజిక సాధికార యాత్ర శుక్రవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె, పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గాల్లో జరిగింది. మూడు నియోజకవర్గాల్లో యాత్రకు జనం నీరాజనాలు పలికారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు ప్రజలు కడలిలా తరలివచ్చారు. నేతల ప్రసంగాల్లో సీఎం వైఎస్ జగన్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ‘మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
సంక్షేమం కావాలా..? సంక్షోభం కావాలా?
హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. సంక్షోభం సృష్టించే పార్టీలు కావాలో ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాందీచౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సర్వేలన్నీ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి గెలుస్తారని చెబుతున్నాయని అన్నారు. ఇక హుజూరాబాద్‌లో జీ హుజూర్ రాజకీయాలు నడవయని పేర్కొన్నారు. గత ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఈటల రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పారని, దళితబంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో 100 శాతం దళితబంధు అమలుచేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి ఒరిగేదేంలేదన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు రూ.3 వేలు, అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400కు అందిస్తామని వివరించారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదే అని మంత్రి హామీ ఇచ్చారు. ఈటల మాటలు వింటే పదేళ్లు వెనక్కి హుజూరాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనకబడిపోతారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గెలిచాక హుజూరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లారని విమర్శించారు. ఈసారి హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ నాయకులను హుజూరాబాద్‌కు తీసుకొస్తున్న ఈటల.. వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రకటిస్తున్న డిక్లరేష న్లన్నీ చిత్తు కాగితాలేనని, డిక్లరేషన్ల పేరిట ఆ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజలను మోసగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్ పేరిట రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మైనార్టీలు, బీసీల జనగణన చేసి ‘ఫెయిర్ రిజర్వేషన్’ ఇస్తామనడంలో కాంగ్రెస్ కుట్ర దాగి ఉందని విమర్శించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం హోం మంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ఇంతియాజ్ ఇషాక్ అలీ, సలీమ్, సోహైల్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ భావజాలానికి అనుగుణంగా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు తదితరులను గతంలోనే రాజ్యాంగం మతపరమైన మైనార్టీలుగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మైనార్టీ డిక్లరేషన్ పేరిట మైనార్టీలు, బీసీల నడుమ విద్వేషాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ తరహా ప్రతిపాదనలతో అటు మైనార్టీలు, ఇటు బీసీలు నష్టపోతారని చెప్పారు. మైనార్టీలు బీసీలుగా గుర్తింపు పొందితే వారికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, బడ్జెట్ కేటాయింపులు, మైనార్టీ సంక్షేమ, ఫైనాన్స్ కార్పొరేషన్ల రద్దు తదితర ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. బీజేపీ భావజాలానికి అనుగుణంగా, బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ తయారైందని, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం వల్లే ఈ తరహా ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో అతి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు మైనార్టీ సంక్షేమం విషయంలో దేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పదేళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే, తాము తొమ్మిదేళ్ల కాలంలోనే అంతకు 11 రెట్లు వెచ్చించామని చెప్పారు. తెలంగాణలో మైనార్టీ సంక్షేమానికి కేటాయింపులు రాబోయే రోజుల్లో రూ.5 వేల కోట్లకు చేరనుండగా, కాంగ్రెస్ డిక్లరేషన్‌లో రూ.4 వేల కోట్టే ఇస్తామనడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఇమామ్‌లు, మౌజంలకు రాబోయే రోజుల్లో రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, గోషా మహల్, హుజూరాబాద్‌లో గెలిచి తీరుతామని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ వంద సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఆర్థిక తీవ్రవాదం కాంగ్రెస్ పార్టీలో ఆరాచక రాజకీయం, ఆర్థిక తీవ్ర వాదం నడుస్తోందని, టికెట్లు అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత సంగిశెట్టి జగదీశ్ బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే జరి గిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత నక్క రవీందర్, నకిరేకల్ నాయకులు ప్రసన్నతోపాటు ముషీరాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్య క్రమంలో మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠాగో పాల్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
అమలు గ్యారంటీ
సాక్షి, కామారెడ్డి: కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని, తెలంగాణలో ఏం అమలు చేస్తుందంటూ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. హామీలు అమలవుతున్నాయో లేదో వచ్చి చూడాలని కేసీఆర్‌ను ఆహా్వనిస్తే ముఖం చాటేశారని.. పైగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో తాము ఇచ్చిన ‘గ్యారంటీ’ హామీలను అమల్లోకి తెచ్చామని.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ తరఫున బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మిత్రపక్షాలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నేత చాడ వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. సభలో సిద్ధరామయ్య ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కర్ణాటకలో మేం ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో 4 గ్యారంటీలు 2 నెలలుగా అమలవుతూనే ఉన్నాయి. యువనిధి పథకాన్ని జనవరిలో మొదలు పెడుతున్నాం. మేం ప్రజలకు ఇచ్చిన హామీల మేర కు అన్ని పథకాలను అమలు చేస్తుంటే ఇక్కడి సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మేం అమలు చేస్తున్న పథకాలు నిజమో కాదో తెలుసుకునేందుకు రమ్మని పిలిస్తే ముఖం చాటేస్తున్నారు. కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు తెలంగాణలో కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీలేదు. బీసీలకు 34శాతంగా ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. సీఎం కేసీఆర్‌కు అవినీతి డబ్బులతో ఎన్నికలకు వెళ్లడం అలవాటు. ఈసారి ఆయన ప్రయత్నాలు ఫలించవు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని తేలిపోతోంది. ప్రజలు 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఓడింది తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కు వ. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 రోడ్‌షోలు, సభల్లో పాల్గొన్నారు. ఆయన సభలు జరిపిన చోటల్లా కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీతో గెలిచింది. మోదీకి అక్కడి ఓటర్లు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోదీకి ఇక్కడి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీంగా పనిచేస్తోంది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కచి్చతంగా అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలి..’’అని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ద్రోహులను పక్కన పెట్టుకుని నీతులా?: రేవంత్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్ మాట్లాడటమంటే వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్సార్‌తోపాటు మరెందరో సీఎంలు రోజూ ప్రజల సమస్యలు వినేందుకు దర్బార్ నిర్వహించేవారని, సీఎం కేసీఆర్ పదేళ్లలో ఒక్కనాడూ ప్రజల కష్టాలు విన్నపాపాన పోలేదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ఎమ్మెల్యేను యాభై లక్షలకు కొంటూ రేవంత్ దొరి కిండని అంటున్న కేసీఆరే తెలంగాణను కొనుగోళ్లు, అమ్మకాలకు కేంద్రంగా మార్చారు. 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వందలాది మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిండు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధ మా? సిద్ధమైతే 24 గంటల్లో సీబీఐకి లేఖ రాయాలి. అమ్మ పుట్టిన ప్రాంతమని గుర్తుకు రాలేదా? కామారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య 2017లో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచి్చ, సీఎం అవకాశం ఇవ్వలేదన్న ఆవేదనతో సెక్రటేరియట్ ఎదురుగా ఉరివేసుకుని చనిపోయినపుడు.. ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు.. సీఎం కేసీఆర్‌కు కామారెడ్డి తన తల్లి పుట్టిన ప్రాంతమని గుర్తుకురాలేదా? ఇప్పుడు గజ్వేల్ ప్రజలు నమ్మే స్థితిలో లేక కామారెడ్డికి వచ్చి పోటీ చేçస్తున్నప్పుడు గుర్తుకువచ్చిందా? కామారెడ్డి ప్రజలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. మీ తీర్పు కోసం దేశ, విదేశాల్లో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే నేను కామారెడ్డి వచ్చా. భూములు కొల్లగొట్టేందుకు వస్తున్నారు కామారెడ్డిని బంగారు తునక జేస్తనంటున్న కేసీఆర్ గజ్వేల్‌కు ఏం చేశారు. అక్కడి ప్రజలను ముంచి, రోడ్డున పడేసి ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేశారు. ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కుట్ర చేశారు. రైతులు తిరగబడటంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు ఆయన కొడుకు కేటీఆర్ చెప్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రూ.2 లక్షల దాకా రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ఆరు గ్యారంటీలను, బీసీ డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేస్తాం.’’ అని రేవంత్ ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ గాలిని జూసి సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రేవంత్‌కు ‘కోనాపూర్’నామినేషన్ డబ్బులు కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న రేవంత్‌రెడ్డి నామినేషన్ కోసం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ వాసులు డబ్బును అందజేశారు. కేసీఆర్‌కు పదేళ్లుగా కోనాపూర్ గుర్తుకురాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ ఊరి పేరు వాడుకుంటున్నారని వారు విమర్శించారు. కాగా సభలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య కన్నడ భాషలో ప్రసంగించగా.. కాంగ్రెస్ నేతలు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది చాలా నిదానంగా సాగడంతో సభకు హాజరైనవారిలో నిరాశ కనిపించింది. సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ నేతలు పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, సుదర్శన్‌రెడ్డి, మదన్మోహన్, ఆది శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు: నారాయణ తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసగించిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులను చంకనెత్తుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్ ప్రజల సమస్య లు వినేందుకు రోజూ ప్రజా దర్బార్ నిర్వహించేవారని.. ఈ పదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలు సీఎంను కలిసే అవకాశం దొరకలేదని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేశారు: కోదండరాం ఎన్నెన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేదని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. ఈ అన్యాయాలు చూస్తుంటే గుండెలు మండుతున్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు ఓటుతో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్ -
కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేద్దాం
కోదాడ: పదేళ్లుగా సచివాలయానికి రాకుండా ఫాంహౌస్ నుంచే పాలన సాగించిన సీఎం కె.చంద్రశేఖర్‌రావును డిసెంబర్ తరువాత శాశ్వతంగా ఫాంహౌస్‌కే పరిమితం చేద్దామని కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన రోడ్ షో, రంగా థియేటర్ సెంటర్లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరున్న కేసీఆర్ సర్కారును ఇంటికి పంపడానికి ప్రజలు నవంబర్ 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ‘డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇ చ్చిన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం. ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమెకు పుట్టినరోజు కానుకగా ఇవ్వబోతున్నాం’అని పేర్కొన్నారు. 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదని, సాగర్ ఆయకట్టు ప్రాంతంగా ఉన్న కోదాడకు రావడం, ఇక్కడ రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను టీఆర్ఎస్ నాయకులు వచ్చి చూడాలని సూచించారు. రూ.లక్షన్నర కోట్ల అప్పులు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ మూడేళ్లకే కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయలు దోచుకున్నారని శివకుమార్ ఆరోపించారు. జాతీయస్థాయిలో పేరున్న ఉత్తమ్‌ను హుజూర్‌నగర్‌లో, ఆయన సతీమణి పద్మావతిని కోదాడలో గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, రుద్రరాజు, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పాల్గొన్నారు.