TS Special
-
బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు
సాక్షి, హైదరాబాద్: బహు జన సమాజ్ పార్టీ అభ్య ర్థులు రాష్ట్రంలోని 119 ని యోజకవర్గాల్లో నామినేష న్లు దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో బీఎస్పీ తొలిసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య పటాన్చెరు స్థానం నుంచి నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మధు బీఎస్పీలో చేరారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం: ప్రవీణ్‌కుమార్: తెలంగాణలో అవినీతి, కు టుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ప్రవీణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బహుజనుల రాజ్యాధికార కల సాకారం అ య్యే రోజు దగ్గర్లోనే ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను జనం నమ్మడం లేదని అన్నారు. -
భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు
ఒకచోట భార్యాభర్తలు. మరోచోట బావా మరదళ్లు. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్. మరో దగ్గరేమో తండ్రీకూతుళ్లు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలకు వేదికవుతోంది. పలు స్థానాల్లో బంధువుల మధ్య జరుగుతున్న ఈ పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి...! రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల పరస్పర పోట్లాటలు రాజస్తాన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి స్థానాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. దాంతారాంగఢ్: భార్యాభర్తల పోరు ఈ స్థానం రాష్ట్రవ్యాప్త ఆసక్తికి కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున వీరేంద్ర సింగ్ బరిలో ఉన్నారు. ఆయనపై ఏకంగా భార్య రీటా పోటీ చేస్తున్నారు. జన్ నాయక్ జనతా పార్టీ తరఫున ఆమె బరిలో ఉన్నారు. వీరేంద్ర తండ్రి నారాయణ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత కావడం విశేషం. 2018లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమారుడికి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. అయితే వీరేంద్రకు కొంతకాలంగా భార్యతో గొడవలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిగా వారు విడిగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించగానే రీటా ఏకంగా భర్తపైనే బరిలో దిగారు! ధోల్పూర్: గోదాలో బావామరదళ్లు ఇక్కడ బీజేపీ తరఫున శివచరణ్ కుష్వహా పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏకంగా ఆయన మరదలు శోభారాణీకి టికెటిచ్చి బరిలో దించింది. చదవండి: ఎన్నికల బరిలో వారసులు ఆళ్వార్ (గ్రామీణ): తండ్రీ కూతుళ్ల సవాల్ ఇక్కడ బీజేపీ జయరామ్ జాటవ్‌కు టికెటిచ్చింది. ఆయనతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మీనాకుమారి ఏకంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తండ్రినే సవాలు చేస్తున్నారు! ఇద్దరు పరస్పరం జోరుగా విమర్శల వర్షం కురిపించుకుంటూ ఓటర్లకు యథాశక్తి వినోదం పంచుతున్నారు. బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్ భాద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి సంజీవ్ బెనీవాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయన అన్న కుమారుడు అజిత్ బెనీవాల్ బరిలో దిగి బాబాయ్‌ని సవాలు చేస్తున్నారు. ఖెత్డీ అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మనీషా గుజ్జర్ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్ ధర్మపాల్ బరిలో దిగారు. నాగౌర్‌లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తరఫున ఆమెకు బాబాయ్ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. సోజత్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన బంధువు శోభా చౌహాన్ పోటీలో దిగారు. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ బస్సీ అసెంబ్లీ స్థానంలో మరో రకం పోటీ నెలకొంది. మాజీ ఐఏఎస్ చంద్రమోహన్ మీనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయనపై పోటీ చేస్తున్న లక్ష్మణ్ మీనా మాజీ ఐపీఎస్ అధికారి కావడం విశేషం. పైగా వీరిద్దరూ బంధువులే. నా కుమారుడికి ఓటు వేయొద్దు! ఖండార్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున అశోక్ బైర్వా బరిలో ఉన్నారు. తండ్రి డాల్‌చంద్‌తో ఆయనకు చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నా కొడుక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి’ అంటూ డాల్చంద్ జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. దాంతో ఏమీ చేయలేక అశోక్ తలపట్టుకుంటున్నారు. -
బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తుది జాబితా విడుదల
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం ఉదయం బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ తెలంగాణ చివరి జాబితాలో అభ్యర్థులు వీరే.. మల్కాజ్గిరి - రామచంద్రరావు శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్ పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ బెల్లంపల్లి - ఎమాజీ సంగారెడ్డి - దేశ్‌పాండే రాజేశ్వరరావు మేడ్చల్ - సుదర్శన్ రెడ్డి చాంద్రాయణ గుట్ట- మహేందర్ కంటోన్మెంట్ - గణేష్ నారాయణ్ దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి వనపర్తి - అనుఘ్నారెడ్డి అలంపూర్ - మేరమ్మ నర్సంపేట - కే. పుల్లారావు మధిర - విజయరాజు నాంపల్లి-రాహుల్ చంద్ర -
కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఆయనకు టికెట్.. రమేష్ రెడ్డి ఫైర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకే టికెట్ వస్తుందని ఆశించిన నేతలు.. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో ఫైరవుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో తాజాగా పటేల్ రమేష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. నాకే టికెట్ ఇస్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నాను. చివరకి నాకు అన్యాయం చేశారు. సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి కేటాయించడం కుట్రలో భాగమే. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే ఇదంతా చేశారు. బీఆర్ఎస్తో ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. కార్యకర్తలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని సూర్యాపేటలో బ్రతికించేలా నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీలో కోల్డ్‌వార్ ప్రారంభమైంది. ఇది కూడా చదవండి: హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే.. -
హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు.. పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చింది. మరోవైపు, తనకు సీటు ఇవ్వకపోవడంపై దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. పటాన్చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు జరిగింది. దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకున్నారు. తన అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. దీంతో, రాజనర్సింహ శాంతించారు. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తుల అంశంలో కాంగ్రెస్-సీపీఎం మధ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి రోజు వరకు మిర్యాలగూడ టికెట్‌ను సీపీఎం కోసం కాంగ్రెస్ పార్టీ ఆపింది. చర్చలు ఫలించకపోవడంతో అభ్యర్థిని ప్రకటించింది. కాగా, సీపీఎం పొత్తు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. "పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను. రేపు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కు నేను హాజరవుతాను & పార్టీని గెలిపించడానికి కృషి చేస్తా." : అద్దంకి దయాకర్ గారు. pic.twitter.com/unPMA83qHt — Telangana Congress (@INCTelangana) November 9, 2023 -
వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి
మధిర/సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మధిర అభ్యర్థి గా గురువారం ఆయన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశదిశ నిర్దేశించేదిగా ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక పరిశ్రమలు జిల్లాకు సాధించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి అవకాశం జిల్లాకు రానున్నందున అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా అవకాశం లభించగా, మళ్లీ ప్రజల ఆశీస్సులతో తాను ఆ పదవి చేపట్టానని చెప్పారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీదారుడు, దుర్మార్గుడైన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు మెరుగైన భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో ప్రజల అసంతృప్తి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వంద మంది కౌరవుల మాదిరి, శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో.. పాండువుల్లా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోరాడానని భట్టి తెలపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అవినాశ్ వజహర్ ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెప్తుంటే బీజేపీ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల ఇళ్లపై ఐటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరైంది కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ చెపుతుంటే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని, ఐటీ దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టాలని చూడటం అవివేకమేనని భట్టి అభిప్రాయపడ్డారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్‌ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్‌రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
కేసీఆర్ గొంతు నొక్కే కుట్ర
సిరిసిల్ల/ కొడంగల్: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గొంతు నొక్కేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆరోపించారు. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నేతలు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తర్వాత కొడంగల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు చోట్లా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కులమతాలకు అతీతంగా, అవినీతి రహితంగా అందించాం. ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ గత 55 ఏళ్లలో ఏం చేసింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి? నిరంతర కరెంట్, సాగునీరు, తాగునీరు, రైతుబీమా, రైతుబంధు, నేతన్నబంధు వంటి పథకాలపై ఆలోచన కూడా చేయని ఆ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి? అన్ని రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. ప్రలోభాలకు లొంగిపోతే మోసపోతాం, గోసపడతాం. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజలు లొంగిపోవద్దు. ఢిల్లీకి దాసులైన నేతల మాటలు నమ్మొద్దు. కేసీఆర్ సీఎం కావడం ఖాయం సీఎం కేసీఆర్ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఆయన ముచ్చటగా మూడో సారి సీఎం కావడం ఖాయం. బీఆర్ఎస్ ఏనాడూ కులం పేరుతో కుంపట్లు, మతం పేరుతో మంటలు పెట్టలేదు. మోసం చేసే దొంగలు ఢిల్లీ నుంచి వస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్‌ను గెలిపిస్తే అమ్మేసుకుంటారు టీపీసీసీ చీఫ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి భూముల వ్యాపారం చేసే బ్రోకర్ అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. కొడంగల్‌ను ప్లాట్లుగా చేసి అమ్మేసుకుంటారని ఆరోపించారు. అదే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు పట్టుకొని అయినా ఆయనకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పారు. ‘‘ఓటుకు నోటు దొంగ జైలుకు పోవడం ఖాయం. కొడంగల్‌ను ఏనాడూ పట్టించుకోని రేవంత్‌రెడ్డి కావాలా?.. ఎల్లప్పుడూ జనం మధ్య ఉండే నరేందర్‌రెడ్డి కావాలా మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కారు గుర్తుకు ఓటేయండి..’’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ దంపతుల ఆస్తి రూ.51.26 కోట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. దాని ప్రకారం.. కేటీఆర్ మొత్తం ఆస్తులు రూ.17.34 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.6.92 కోట్లు, స్థిరాస్తులు రూ.10.41 కోట్లు. అప్పులు రూ.67.20 లక్షల మేర ఉన్నాయి. కేటీఆర్ భార్య శైలిమ పేరిట రూ.26.49 కోట్ల చరాస్తులు, రూ.7.42 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తంగా రూ.33.92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.27 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. కేటీఆర్ దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.51.26 కోట్లు. -
సారుకు కారు లేదు!
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం, వ్యవసాయ భూమి వంటివేవీ లేవని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తనతోపాటు సతీమణి ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. కేసీఆర్, సతీమణి శోభమ్మకు కలిపి మొత్తం ఆస్తులు రూ.58,93,31,800 కాగా.. ఇందులో చరాస్తులు రూ.35,43,31,800, స్థిరాస్తులు రూ.23.50 కోట్లు ఉన్నాయి. మొత్తం అప్పులు రూ.24,51,13,631 ఉన్నాయి. ఇందులో ఇద్దరి పేరిట విడివిడిగా ఉన్న ఆస్తులు కొన్ని, ఉమ్మడిగా మరికొన్ని ఉన్నాయి. విడిగా పరిశీలిస్తే.. కేసీఆర్ చరాస్తులు రూ.17,83,87,492. ఇందులో 95 గ్రాముల బంగారం (రూ. 17.40 లక్షలు విలువ), చేతిలో నగదు రూ 2,96,605 ఉన్నాయి. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ రూ.8.5 కోట్లు. రూ.17,27,61,818 అప్పులు ఉన్నాయి. కేసీఆర్ సతీమణి శోభమ్మ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ.7,78,24,488 ఉండగా అందులో 2.841 కిలోల బంగారు అభరణాలు, 45 కేజీల వెండి వస్తువులు (రూ.1,49,16,084 విలువ), అప్పులు ఏమీ లేవు. కేసీఆర్, శోభమ్మ ఉమ్మడి ఆస్తులు రూ.24,81,19,820 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి చరాస్తుల విలువ రూ.9,81,19,820. (దీనిలో రూ.1,16,72,256 విలువైన 14 వాహనాలు ఉన్నాయి), ఉమ్మడి స్థిరాస్తుల విలువ రూ.15 కోట్లు. ఉమ్మడి అప్పులు రూ.7,23,51,813. కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 2010 సంవత్సరం నుంచీ ఉమ్మడి ఆస్తులుగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.1,35,00,116 విలువైన 53.30 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. అలాగే 9.365 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉందని, దానికి నాలా పన్నును సైతం చెల్లించామని వివరించారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా వచ్చే వేతనం/అలవెన్సులతోపాటు వ్యవసాయ ఆదాయం.. సతీమణి శోభమ్మకు బ్యాంకులోని డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీని ఆదాయంగా చూపించారు. కేసీఆర్‌పై తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన 9 కేసులు ఉన్నట్టు తెలిపారు. -
పేదలకు కోట్ల ఇళ్లు కట్టించాను..
ఛత్తర్పూర్/సత్నా/నీముచ్(మధ్యప్రదేశ్): దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచి్చందని, తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌ని ఒక్కో ఓటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు, కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి బలాన్నిచ్చేందుకు, అవినీతి కాంగ్రెస్‌ను మరో 100 ఏళ్లపాటు అధికారానికి దూరం ఉంచేందుకు ఉపయోగపడే ‘త్రిశక్తి’ వంటిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిని వెనక్కి నడిపించడంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అందుకే, అవినీతి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్, సత్నా, నీముచ్లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘మా ప్రభుత్వం దేశంలోని పేదలకు నాలుగు కోట్ల పక్కా గృహాలను నిర్మించి ఇచి్చంది. కానీ, నేను ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను’అని ఆయన చెప్పారు. ‘వాహనం మనల్ని రివర్స్‌గేర్‌లో వెనక్కి తీసుకెళ్లినట్టుగానే కాంగ్రెస్ పారీ్టకి సుపరిపాలనను రివర్స్‌గేర్‌లో దుష్పరిపాలనగా మార్చడంలో నైపుణ్యం ఉంది. 100 ఏళ్ల క్రితమే గొప్ప నీటి వనరులున్న బుందేల్‌ఖండ్‌లో నీటి సమస్యలను తీర్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. దీంతో, ఇక్కడి ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. అందుకే, ఆ పారీ్టకి కనీసం 100 ఏళ్లపాటు అధికారం ఇవ్వరాదు. అప్పుడే అభివృద్ధి సాధ్యం’అని ప్రజలను కోరారు. బానిస మనస్తత్వంతో కూడిన కాంగ్రెస్ దేశ అభివృద్ధిని పట్టించుకోలేదు, దేశ వారసత్వంతోనూ ఆ పారీ్టకి సంబంధం లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్‌కు ఒక పంజా ఉంది. పేదల వద్ద ఉన్న వాటిని గుంజుకోవడానికే దానిని వాడుతుంది. అలాంటి కాంగ్రెస్ పంజా బారి నుంచి మధ్యప్రదేశ్‌ను మనం కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అంటూ ఆ పార్టీ ఎన్నికల గుర్తు హస్తంను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నకిలీలను తొలగించాం ప్రభుత్వ పథకాల ద్వారా పేదల ధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని విమర్శించారు.కాంగ్రెస్ జమానాలో డబ్బంతా ఎక్కడికి చేరుతుందో ప్రజలకు అర్థమయ్యేది కాదు. 2జీ, కోల్, కామన్వెల్త్, హెలికాప్టర్ల కుంభకోణాల రూపంలో లక్షల కోట్లు దారి మళ్లాయి. వీటన్నిటినీ మోదీ ప్రభుత్వం ఆపు చేసింది. అప్పట్లో దళారులదే రాజ్యంగా ఉండేది. మోదీ ప్రభుత్వం వారి దుకాణాలను మూసివేయించింది. అధికారంలోకి వచి్చన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు సృష్టించిన దేశంలోని ప్రభుత్వ పథకాల 10 కోట్ల నకిలీ లబి్ధదారులను తొలగించి ప్రజాధనాన్ని కాపాడామన్నారు. పదేళ్ల కాలంలో రూ.33 లక్షల కోట్లను నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్లు వివరించారు. ఇందులో ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో పేదల పిల్లలు ఆకలితో అలమటించకుండా చేయగలగడం కేవలం మోదీ వల్ల కాదు, మీ అందరివల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ఓటుతో ప్రజలిచి్చన అధికారం వల్లనే పేదల ఆకలి తీర్చగలిగినట్లు చెప్పారు. -
కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
అంతా జనంలోనే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే 20రోజుల పాటు పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ప్రజాక్షేత్రంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలతోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో రోడ్‌షోలు, సభల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ప్రచార గడువు ముగిసేవరకు కూడా పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జులు, ఇతర ముఖ్య నేతలెవరూ తమకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన చోటి నుంచి కదలవద్దని పార్టీ అధినేత ఆదేశించారు. పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సెగ్మెంట్లతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్నచోట ఇప్పటికే సుమారు 60కి మందికిపైగా నాయకులకు ఇన్చార్జులుగా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కీలక నియోజకవర్గాల్లో స్థానికంగా పార్టీ యంత్రాంగాన్ని కదిలించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మండల స్థాయిలోనూ ఇన్చార్జులను నియమిస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో సొంత నియోజకవర్గం వదిలి ఇతర నియోజకవర్గాలకు వెళ్లేందుకు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న నేతలను గుర్తించి వారికి ఇతర నియోజకవర్గాల్లో మండల స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనితో ఇటు ఆయా సెగ్మెంట్లలో పారీ్టకి నష్టం జరగకుండా చూసుకోవడంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో బాధ్యతల అప్పగింత ద్వారా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నామనే భరోసా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. దీపావళి తర్వాత మళ్లీ కేసీఆర్ సభలు అభ్యర్థుల ఎంపిక, బీఫారాల జారీతోపాటు బహిరంగ సభల నిర్వహణలోనూ బీఆర్ఎస్ విపక్షాలతో పోలిస్తే దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 15న బీఫారాల జారీని ప్రారంభించడంతోపాటు హుస్నాబాద్‌లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. గత నెల 15 నుంచి ఈ నెల 9 వరకు 17 రోజుల వ్యవధిలో 43 చోట్ల కేసీఆర్ సభలు నిర్వహించారు. దీపావళి పండుగ నేపథ్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 97 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీచేస్తున్న జనగామలో ఇప్పటికే ఒక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గంలోని చేర్యాలలో ఈ నెల 18న రోడ్‌షో నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారంలో ఇదొక్కటి మాత్రమే రోడ్‌షో. మిగతావన్నీ సభలే. ఈ నెల 28న గజ్వేల్‌లో ప్రచారంతో కేసీఆర్ పర్యటనలు ముగుస్తాయి. ఇక తొలి విడతలో సీఎం కేసీఆర్ సభలు జరిగిన నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్‌రావుల రోడ్‌షోలు, బహిరంగ సభలు ఉండే అవకాశముంది. మరోవైపు 38 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లతో కూడిన జాబితాను బీఆర్ఎస్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచినట్టు తెలిసింది. అఫిడవిట్లను జల్లెడ పడుతున్న లీగల్ సెల్ నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారం ముగుస్తుండగా పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను బీఆర్ఎస్ లీగల్ సెల్ జల్లెడ పడుతోంది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లపై న్యాయపరమైన చిక్కులు తలెత్తిన నేపథ్యంలో.. వీలైనంత మేర నామినేషన్ల పత్రాల్లో లోపాలు దొర్లకుండా లోతుగా పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. వార్‌రూమ్‌లతో సమన్వయం నియోజకవర్గాల స్థాయిలో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. వాటిని హైదరాబాద్‌లోని సెంట్రల్ వార్‌రూమ్‌తో అనుసంధానం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావుల దిశానిర్దేశం మేరకు సెంట్రల్ వార్ రూమ్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వార్‌రూమ్‌లతో సమన్వయం చేసుకుంటోంది. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచార తీరుతెన్నులు తదితరాలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు పంపుతోంది. వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా కూడా పార్టీ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వే నివేదికలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థులు, ప్రచార తీరుతెన్నులను బీఆర్ఎస్ పెద్దలు మదింపు చేస్తూ.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. -
అధికారంలోకొస్తే ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీడబ్ల్యూసీ సభ్యులు నాసిర్, షకీల్ ఆహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్ తదితరులు మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ మెప్పు కోసం క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడించేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత తీసుకున్నాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో పోటీ చేయని మజ్లిస్ ఈసారి అజహరుద్దీన్‌పై ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపడం వెనుక మైనారిటీ ఓట్లు చీల్చే కుట్ర కనిపిస్తోందని దుయ్యబట్టారు. అలాగే మైనారిటీ పక్షపాతినని చెప్పుకొనే సీఎం కేసీఆర్ తమ పార్టీ నేత షబ్బీర్ అలీ పోటీ చేసే కామారెడ్డి స్థానం నుంచి కూడా పోటీ చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే గోషామహల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై గెలవాలని రేవంత్ సవాల్ చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మైనారిటీ డిక్లరేషన్‌లోని హమీల అమలు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు జాఫర్ జవీద్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీతారావ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌లోని హామీలు... ► మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 4,000 కోట్లకు పెంచడంతోపాటు నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి ఏటా రూ.1,000 కోట్ల కేటాయింపు. ► 6 నెలల్లోగా కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీలు సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చర్యలు. ► అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ఎంఫిల్ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం. పీహెచ్డీ, అదనంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి రూ. లక్ష, గ్రాడ్యుయేష¯న్కు రూ. 25,000, ఇంటర్‌కు రూ.15,000, 10వ తరగతి పాసైన వారికి రూ. 10,000 ఆర్థిక చేయూత. ► తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ► మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ. ► మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చి పాస్టర్లులకు నెలకు రూ. 10,000 నుంచి 12,000 వరకు గౌరవ వేతనం. ► వక్ఫ్ బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వాదీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్. ► ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటికల కోసం భూకేటాయిపు. ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు. ► కొత్తగా పెళ్లయిన ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ జంటలకు రూ. 1,60,000 ఆర్థిక చేయూత. ► కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సెట్విన్‌ల బలోపేతం. -
Telangana: ఒక్కరోజే 1,129 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో భారీసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చి నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గురువారం రికార్డు సంఖ్యలో 1,129 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్లు వేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి బుధవారం వరకు 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1,188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం నాటికి దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రెండురోజుల తర్వాత (13వ తేదీన) నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండే అభ్యర్థులెవరో తేలిపోతుంది. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. -
చురక పెట్టాలె..!
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి 50 ఏళ్లు గోసపడేలా చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు.. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా గోసపెడుతున్న బీజేపీ వాళ్లు మరోవైపు ఓట్ల కోసం వస్తున్నారని.. వారికి ఓటుతో చురక (వాత) పెట్టాలని పేర్కొన్నారు. ఏ అభ్యర్థి ఏమిటో, వారి గుణగణాలు, మంచీచెడ్డతోపాటు వారి వెనుక ఉన్న పార్టీని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహాత్ముడు తనపై పోటీకి వస్తున్నారని, ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం గజ్వేల్, కామారెడ్డిలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్లు వేసిన సీఎం కేసీఆర్.. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. తమాషాకు వేయొద్దు. విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓటేయాలి. ప్రతీ విషయం మీద చర్చ జరగాలన్నదే నా అభిమతం. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు. ప్రజలే గెలవాలి. ఎన్నికలు రాగానే అబద్ధాలు, అభాండాలు, గోల్మాల్ తిప్పుడు, గోలగాళ్లు తయారవుతున్నరు. అట్లా కాకుండా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలి. బీడీ కార్మికులందరికీ జీవన భృతి యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలి. 1956కు ముందు మనం మనంగానే ఉంటే, మనను తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. మనోళ్లు అప్పుడు నెత్తీనోరు కొట్టుకున్నరు. సిటీ కాలేజీ విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తే.. ఏడుగురు పిల్లల్ని కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణ సాధించుకున్న సమయంలో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండె.. ఇప్పుడు ఎట్లా ఉన్నయో ఆలోచించాలి. నేను కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. అందులో బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. కటాఫ్ డేట్ తొలగించి అందరికీ జీవనభృతి ఇస్తాం. అందరికీ పింఛన్ సొమ్మును రూ. 2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతాం. కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి రాష్ట్రం వచ్చాక ఎన్నో విజయాలు సాధించినం. 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టినం. రైతులకు పెట్టుబడి కోసం రైతుబంధు ఇచ్చి అండగా నిలిచినం. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నం. రాబోయే రోజుల్లో రూ.16 వేలకు పెంచుకుంటం. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదు. ఎక్కడా రైతుబంధు లేదు. ఏదైనా పరిస్థితుల్లో రైతు చనిపోతే రైతుబీమాతో రూ.5లక్షలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. కరెంటు మీద, రైతుబంధు మీద కాంగ్రెస్ లీడర్లు ఏమేమో మాట్లాడుతున్నరు. ఎద్దు ఎవుసం తెలువని రాహుల్‌గాంధీ ధరణిని తీసేస్తనంటడు. ధరణి పోతే మళ్ల వీఆర్వో, గిర్దావర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో.. ఇట్లా అందరి చేతుల్లోకి భూమి పోయి, రికార్డులన్నీ తారుమారై జనం ఆగం కావలన్నదే వాళ్ల ఉద్దేశం. ధరణి వచ్చినంక రైతుఖాతాలోనే భూమి ఉంటోంది, తను వేలిముద్ర వేస్తేగానీ వేరే వారికి మారే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. బీజేపీ నేతలను నిలదీయాలి.. ప్రధాని మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తే మేం పెట్టబోమని స్పష్టం చేసిన. అందుకు రూ.25వేల కోట్లు లాస్ చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా కేంద్రం తరఫున 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన మోదీ తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాల్సి ఉన్నా ఒక్కటీ ఇవ్వలేదు. అలాంటి బీజేపీకి ఒక్క ఓటూ వెయ్యకుండా చురుకు (వాత) పెట్టాలి. బీజేపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలి...’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే సింధే, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత గజ్వేల్‌లో.. తర్వాత కామారెడ్డిలో.. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్లో గజ్వేల్‌కు చేరుకున్నారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆ పత్రాలను పరిశీలించి, స్వీకరించిన అధికారులు కేసీఆర్‌తో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్ హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. -
ఐటీ దాడులకు బీజేపీకి సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ పాలన తడిబట్టలతో గొంతుకోసేలా తయారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ప్రజలపై కంటే మాఫియాపైనే ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ దున్నపోతులను తినే రకం అయితే... కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఏనుగులను తినే రకం అని విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో బీజేపీ తరపున పోటీచేసే లంకల దీపక్‌రెడ్డి (జూబ్లీహిల్స్), నవీన్‌కుమార్ (వికారాబాద్), శ్రీకాంత్‌రెడ్డి (సిద్దిపేట), మొగిలయ్య (నకిరేకల్), పూస రాజు (ముషీరాబాద్)కు బీ–ఫారాలను అందచేసిన సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. దీపావళి తర్వాత ఈనెల 13వ తేదీ నుంచి బీజేపీ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తామని చెప్పారు. ఐటీ దాడులు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయని, వారున్నదే దాడులు చేయడానికని వ్యాఖ్యానించారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని సమాచారం వచ్చిన వారిపై దాడులు చేస్తారని, ఆ దాడులకు బీజేపీకి, కేంద్రానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ముందే ఎలా తెలుసని నిలదీశారు. జనంలోకి వెళ్లకుండా, మాట్లాడకుండా కొన్ని సంస్థలు సెల్‌ఫోన్, కంప్యూటర్ల ముందు కూర్చుని సర్వే నివేదికలు ఇస్తున్నాయని, అవన్నీ దొంగ సర్వేలని కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ సర్వేలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 11న మోదీ.. : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈనెల 11న రాష్ట్రానికి వస్తున్నారని, ఆ తరువాత మరో రెండు మూడు సభల్లో పాల్గొంటారని కిషన్‌రెడ్డి తెలిపారు. -
బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాట తప్పారు.. గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. వై.ఎస్. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో ముందుకు... సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్ఎస్ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. -
చాంద్రాయణగుట్టకు 45 ఏళ్లుగా ఇద్దరే..
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఇప్పటివరకు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అలా అని అదేం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమేమీ కాదు.. ఏకంగా పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు వరుసగా అయిదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అదెక్కడో కాదు..పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో. ఒకరేమో అమానుల్లాఖాన్ కాగా మరొకరు అక్బరుద్దీన్ ఒవైసీ. అమానుల్లాఖాన్ ప్రస్థానం ఇలా ♦ 1978 ఎన్నికలకు ముందు చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమానుల్లాఖాన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలయ్యపై 1,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ 1983లో ఎ.నరేంద్ర(బీజేపీ)పై 3,581 ఓట్లతో, 1985లో 3,009 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ 1989 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 28,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦1994 ఎన్నికల నాటికి సలావుద్దీన్ ఒవైసీతో విభేదించి మజ్లిస్‌కు పోటీగా అమానుల్లాఖాన్ ఎంబీటీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ తరఫున పోటీచేసి ఎంఐఎం అభ్యర్థిపై 35,210 ఓట్లతో గెలిచారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎంట్రీతో... ♦ అమానుల్లాఖాన్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసేలా సలావుద్దీన్ ఒవైసీ తన చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీని 1999 ఎన్నికల్లో పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో 11,920 ఓట్ల మెజారిటీతో అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ♦ 2004 ఎన్నికల్లో 11,949 ఓట్ల మెజా రిటీతో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 15,177 ఓట్లతో, 2014లో 59,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోగించారు. 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ భాజపా అభ్యర్థి షెహాజాదీ సయ్యద్‌పై 80,264 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా అయిదు సార్లు గెలిచి అమానుల్లాఖాన్ రికార్డును సమం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అక్బర్ చాంద్రాయణగుట్ల నుంచే పోటీ చేస్తున్నారు. -
బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
‘‘అధికార బీఆర్ఎస్పై ప్రజల ఆగ్రహ జ్వాలల అగ్నిపర్వతం నవంబర్ 30న బద్దలవుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చాలాచోట్ల డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. తెలంగాణలోని యువత మొత్తం భారతీయ జనతాపార్టీ వైపే ఉంది.’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల రాజకీయ పరిణామాలపై అంచనా వేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా విధ్వంసానికి గురికాగా.. ఒకవేళ కాంగ్రెస్ వస్తే రాజకీయ అస్థిరత ఏర్పడి ఉద్యోగులకు జీతాలివ్వలేక తిరుగుబాటు చేసే పరిస్థితులు వస్తాయి. అందుకే బీసీ సీఎం నినాదంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు మేమంటే మేము అధికారంలోకి వస్తామంటున్నాయి కదా ? ఎన్నికల్లో మాకు, బీఆర్ఎస్కే ప్రధాన పోటీ. కొన్నిచోట్ల మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అనేక నియోజకవర్గాల్లో అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదు. గ్యారంటీల పేరుతో హైప్ సృష్టించే ప్రయత్నంతోపాటు బీజేపీపై బురదచల్లి తప్పుడు ప్రచారంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక అధికార బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు అగ్నిపర్వతం బద్ధలవుతుందో తెలియదన్నట్టుగా పరిస్థితి ఉంది. వారు ఎంత ప్రచారం చేస్తే ఏమి లాభం, ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి, నేతల బలాన్ని చూసి ఇప్పుడు బయటకు చెప్పకపోవచ్చు. కానీ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే హ్యాట్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ బింకాలు పోతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పడితే అక్కడకు వెళ్లాలని కేసీఆర్ కలలు కంటున్నారు. ఆయన కుమారుడు కేటీఆర్ అప్పుడే సీఎం అయిపోయినట్టుగా ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. మంత్రులను నియమించుకుంటున్నట్టు కేటీఆర్ వ్యవహరిస్తున్నాడు. కేవలం భ్రమల్లో బీఆర్ఎస్ నేతలు బతుకుతున్నారు. ఇక మా పార్టీకి ఊహించని విధంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. ఇది మామూలు పరిస్థితుల్లో రాదు. మాది యూత్‌ఫుల్ పార్టీ. ఎక్కడి చూసిన యువతే పార్టీని నడిపిస్తోంది. ప్రచారాన్ని ఎప్పుడు ముమ్మరం చేస్తారు ? నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నాలుగైదు రోజుల్లో అన్ని పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చాక.. మొత్తంగా దీపావళి తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయబోతున్నాం. బీజేపీకి పోలింగ్‌బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. సంస్థాగత నిర్మాణం ఉంది. ఎవరు అభ్యర్థులు ఐనా ఒరిజినల్‌గా ఉన్న ఆర్గనైజేషన్ నెట్వర్క్ అనేది పనిచేస్తుంది. అభ్యర్థుల ఖరారులో ఆలస్యం వల్ల ప్రచారానికి ఇబ్బంది కాదా ? బీజేపీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థుల ఖరారులో కొంత ఒత్తిడి ఏర్పడింది. అయితే ఆయా స్థానాలకు ఖరారు చేసిన వారు ఇప్పటికే మూడు, నాలుగేళ్లుగా పనిచేస్తున్న వాళ్లే. ప్రజలకు బాగా తెలిసినవారే. అందువల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. రాబోయే ఇరవై రోజుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. ఇలా హేమాహేమీల ప్రచారంతో హోరెత్తిస్తాం. పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తాం. పాత వారికి కాకుండా కొత్త వారికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టున్నారు ? మాది పెరుగుతున్న పార్టీ. బలపడుతున్న పార్టీ. అందువల్ల మిక్స్‌డ్‌గా ఆలోచించాలి. పాత–కొత్త కలయికగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్‌తో ప్రజల మద్దతు పొందాల్సి ఉంటుంది. పాత వారికే ఇస్తామని మడికట్టుకు ఉండలేం. పూర్తిగా కొత్తవారికీ ఇవ్వలేం. ఆ దిశలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేసి మంచి ఫలితాలు సాధించాం. అదే ఎక్స్పర్మెంట్తో ఇప్పుడూ మంచి ఫలితాలు సాధిస్తాం. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ వస్తే పెనం నుంచి పొయ్యిలో పడుతుందని మీరు పదే పదే అంటున్నారు ? ఎందువల్ల ? కాంగ్రెస్ చరిత్ర ఏమిటి? పుట్టుక ఏమిటి? అవినీతి చరిత్ర ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది ? అని వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడి దుస్థితి ఏమిటి? తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటకలో ఎలక్షన్ ట్యాక్స్ వేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అవినీతి పాలన గురించి ప్రజలకు వివరిస్తూనే...కాంగ్రెస్ తనకు తాను అధికారంలోకి వస్తామన్నట్టుగా అబద్ధపు ప్రచారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ పార్టీల చరిత్రను వివరించి, అవి ఏరకంగానూ తెలంగాణను ఆదుకోలేవనే విషయాన్ని ఉదా«హరణలతో చెప్పి ప్రజలను చైతన్యపరుస్తున్నాం. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దని చెబుతున్నాం. ఇక్కడా యూపీ తరహా పాలన అంటున్నారు ? కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం వంతపాడుతూ వస్తోంది. పాతబస్తీలో మజ్లీస్ దౌర్జన్యమే నడుస్తోంది. కరెంట్ బిల్లు, ఇంటి పన్నులు వసూలు చేయలేకపోతున్నారు. 90 శాతం ఇళ్లు మున్సిపల్ అనుమతులు లేకుండానే కడతారు. అందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండగా నిలవడమే కారణం. యూపీలో యోగి ఆదిత్యనాధ్ పాలనలో బుల్డోజర్ ప్రభుత్వంతో ఆ రాష్ల్ర ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణలోనూ అలాంటి బుల్డోజర్ ప్రభుత్వం తెస్తాం. మాఫియాపై, అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం. మజ్లిస్ పార్టీ కాదు వారి జేజమ్మలు వచ్చినా ఏమీ చేయలేరు. అక్రమాలు, దాడులకు, నేరాలకు పాల్పడే మజ్లిస్ నేతలు ఉండాల్సింది పాతబస్తీలో కాదు చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లల్లో.. .. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ పక్కన కూర్చుని చర్చలు జరుపుతున్నారు. -
ఎన్నికల బరిలో వారసులు
రాజకీయాల్లో వారసత్వమేమీ కొత్త విషయం కాదు. కొందరు వారసులు తమవంతు కోసం ఎదురుచూసి రాజకీయాల్లోకి వస్తే.. మరికొందరు ఇష్టం లేకపోయినా.. అనివార్యంగా రావాల్సి వస్తుంది. వారసులను రంగంలోకి దించేందుకు అనేక కారణాలు ఉంటాయి. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన తల్లీ/తండ్రీ/మామ/బంధువులు ఎవరైనా ఆకస్మికంగా మరణించినా లేక అనారోగ్య సమస్యలు తలెత్తినా.. వారి వారసులు తెరమీదకు రావాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోన్న వారసుల్లో అన్ని రకాల కారణాలతో వచ్చిన వారు ఉన్నారు. వారి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం! లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న ఆకస్మిక మరణంతో ఆయన కుమార్తె లాస్య నందిత రాజకీయ అరంగేట్రం చేశారు. నగరంలోని సీనియర్ ఎమ్మెల్యేలలో ఒకరైన సాయన్నకు మంచి కేడర్ ఉంది. ఆ కేడర్‌ను కాపాడుకునేందుకు, తిరిగి బీఆర్ఎస్ విజయపతాక ఎగరేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సాయన్న కూతురుకు టికెట్ ఇచ్చారు. ఈమె గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. వెన్నెల ప్రజాయుద్ధనౌకగా పేరొందిన సామాజిక ఉద్యమకారుడు గద్దర్ కుమార్తె వెన్నెల ఈ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. పాట ద్వారా సామాజిక స్పృహ పెంచి హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన శక్తిగా గద్దర్ ఎంతో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కుమార్తె వెన్నెల కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంబీఏ, పీహెచ్డీ పూర్తి చేసిన ఈమెకు గద్దర్ పోరాటాలు వెంటనిలుస్తాయని ఆమె అనుచరులు ధీమాగా ఉన్నారు. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విద్యాసాగరరావు నాలుగుసార్లు కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వయోభారం వల్ల ఆయన తప్పుకుని ఈసారి కుమారుడు సంజయ్‌కి అవకాశం కల్పించారు. ఆమరణ దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించిన డాక్టర్‌గా మంచి అనుబంధం ఉంది. దీనికితోడు తండ్రి వయోభారంతో రాజకీయ వారసత్వాన్ని అంగీకరించి తొలిసారి బరిలో నిలిచారు. ఈయన కేటీఆర్‌కు బంధువు, క్లాస్మేట్ కావడం గమనార్హం. కుందూరు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. ఘనమైన రాజకీయ నేపథ్యం, తండ్రికి ఉన్న బలమైన అనుచరబలం, అర్ధబలం ఇతని వెంటరావడం కలిసి వచ్చే విషయాలు. 2008లోనే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన జయవీర్.. తండ్రి తరహాలోనే కాంగ్రెస్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయారెడ్డి మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్న ఈమెకు తన తండ్రికి నగరంలో ఉన్న జనాదరణ కారణంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నగరంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరొందిన పీజేఆర్ చేసిన పనులు తన విజయానికి సోపానాలు అవుతా యని ధీమాగా ఉంది. కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్య ర్థిగా కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయునిగా రాజేశ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. దంత వైద్యుడైన ఆయన తెలంగాణ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మిథున్‌రెడ్డి మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. తన తండ్రి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి రాజకీయ వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో మంచి పేరు ఉంది. వారసత్వం, తండ్రి కేడర్ ఈయనకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. తన కుమారుడు టికెట్ కోసం అధికార పార్టీతో విభేదించిన మైనంపల్లి వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. అనుకున్నటు్లగానే తనకు మల్కాజిగిరి, తన కుమారుడికి మెదక్ టికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -భాషబోయిన అనిల్‌కుమార్ -
ఇందూరుకు ఇవి కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరంలో 4,70,152 మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,86,766 మంది ఓటర్లు ఉన్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదన్న వాదనలున్నాయి. ఇక్కడ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల డిమాండ్లు ఇలా ఉన్నాయి. బస్తీ దవాఖానాల సేవలు అంతంతే.. నిజామాబాద్‌లో బస్తీ దవాఖానాలు సేవలు నామమాత్రమే. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నప్పటికీ సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సేవలను మెరుగుపరచాలి. భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇటీవల పనులు పూర్తయినా, మురుగునీరు ఇళ్ల నుంచి వెళ్లడానికి కనెక్షన్లు ఇవ్వలేదు. నగరం విస్తరించిన నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇతర ప్రాంతాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘నుడా’ పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద లేదా జానకంపేట రైల్వేస్టేషన్ వద్ద 50 ఎకరాల్లో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఛాంబర్ ఆప్ కామర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకానమీ సైతం పెరుగుతుందంటున్నారు. ముంపు సమస్య నివారించాలి నగరం మధ్యలో ప్రవహిస్తున్న పులాంగ్ వాగు ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. రామర్తి చెరువు 70 శాతం ఆక్రమణకు గురైంది. దీంతో బోధన్ రోడ్డుకు ఇరువైపులా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు. న్యాల్కల్ రోడ్డు లోని రోటరీనగర్ ముంపునకు గురవుతోంది. నగరం విస్తరించిన నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం.. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లున్నాయి. ఒక్క సర్కారీ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక నగరానికి సమీపంలో తెలంగాణ వర్సిటీ ఉన్నా, దీని పరిధిలోనూ ఇంజనీరింగ్ కళాశాల లేదు. తెలంగాణ వర్సిటీలో కోర్సులు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. -
పొలిటికల్ గేమ్.. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత పొంగులేటికి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు. ఇక, త్వరలోనే తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని పొంగులేటి బుధవారం మీడియాలో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు, నేడు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. -
బీఆర్ఎస్ సర్కారుతోనే పారిశ్రామిక అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు 10 ఎకరాలకు లక్ష రూపాయలు వస్తుంది. నాకు వస్తున్న 20వేల మీద సంతోషం లేదు. పక్కాయనకు వచ్చే లక్ష రూపాయల మీద దృష్టి ఉంది. పొలం ఎంత ఉంటే అంత వస్తుంది. అయినా డబ్బులున్న వాళ్లకు ఎందుకు ఇస్తున్నారన్న ప్రజల బాధను నేను అర్థం చేసుకోగలను. దీన్ని సరిదిద్దే అవకాశాన్ని పరిశీలిస్తాం. నాలుగు లేదా ఐదు ఎకరాలకు తగ్గించే విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా సరిదిద్దుతాం’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని, లక్ష కోట్లు నష్టమని చెబుతూ.. ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని.. 147 టీఎంసీల నీరు లభ్యతగా ఉండేలా ప్లాన్ చేశామని చెప్పారు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించడం శోచనీయమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఖర్చు రూ.1,839 కోట్లు అని.. అందులో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు మునిగినట్టు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు ఇంజనీరింగ్ సమస్యలు సాధారణమేనని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వంతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధించిన ప్రగతి దీనికి నిదర్శన మని కేటీఆర్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని.. ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బతినేది పరిశ్రమలేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసే పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులను తెచ్చామన్నారు. హైదరాబాద్ శివార్లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ముందుకు వచ్చాయని వివరించారు. తాను పూర్తి రాజకీయ నాయకుడిగా పారిశ్రామికవేత్తల మద్దతు కోసం ఈ సమావేశానికి వచ్చామన్నారు. రాష్ట్రంలో వేరేవాళ్లు అధికారంలోకి వస్తే వారు ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి పర్మిషన్ తీసుకోవాలని, అన్ని రకాలుగా మెప్పించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నాడు విద్యుత్ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అందరికీ తెలుసని, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కరెంట్ పోతే తట్టుకోలేని స్థితికి వచ్చామని చెప్పారు. 2014కు ముందు హైదరాబాద్ శివార్లలో 14 రోజులకోసారి మంచినీళ్లు ఇచ్చేవారని.. ఇప్పుడు రోజూ వస్తున్నాయని తెలిపారు. రోజుకు 24 గంటలు నీళ్లు ఇవ్వాలనేది తమ ఆలోచన అని వివరించారు. ఈ సమావేశంలో సు«దీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.