TS Special
-
అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం: రేవంత్‌రెడ్డి
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం అవుతుందని, దుకాణం బంద్ అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తుందని,6గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్వహించిన విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ఆ రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు? ‘ప్రజలకు ఏమీ చేయని బీఆర్ఎస్కు ఓటెందుకు వేయాలి? తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు.. నిధులు అందలేదు.. నియామకాలు జరగలే దు. సీఎం అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ధరణి రాకముందు రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు? వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదా? పైగా ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో కొత్త మెరుగైన సాంకేతికతను తీసుకొస్తాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే మేము నామినేషన్లు కూడా వేయం. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది కాంగ్రెస్సే. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి..’అని రేవంత్ సవాల్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే.. ‘బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కు వేసినట్టే. ఈ రెండు పారీ్టలు ఒకటే. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోదీ.. నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్‌ను చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు? కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తెలంగాణకు వచ్చి మోదీ తొండను కూడా పట్టలేకపోయారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది.. సుందిళ్ల త్వరలో పోతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్..’అని ఆరోపించారు. గుజరాత్లో బీసీని సీఎం చేయాలి.. ‘బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒక్క రాష్ట్రంలోనే బీసీని సీఎం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముగ్గురు బీసీలను ముఖ్యమంత్రుల్ని చేసింది. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ.. ముందు గుజరాత్లో బీసీని సీఎం చేయాలి. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్‌లో కోట్లు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తారని బీఆర్ఎస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కనిపించడం లేదా?..’అని రేవంత్ ప్రశ్నించారు. ఆదివాసీ, లంబాడాల పంచాయితీ తెంచేస్తాం ‘దళిత, గిరిజనులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ ఇంకెవరికీ లేదు. లంబాడాలు, ఆదివాసీలు నాకు రెండు కళ్ల లాంటివారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీరి మధ్య ఉన్న పంచాయతీ తెంచుతాం. పోడు భూములకు పట్టాలిచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత మాది. గిరిజనేతరుల భూములకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే పదేళ్లయినా ఈ ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ ధన దాహానికి ప్రాణహిత–చేవెళ్ల బలైపోయింది. కడెం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కడితే.. ఈ ప్రభుత్వం దాని నిర్వహణ చూసుకోలేకపోతోంది..’అని విమర్శించారు. టికెట్ రానివారికి సముచిత స్థానం ‘కాంగ్రెస్ టికెట్ రాని వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షణికావేశానికి గురికావద్దు.. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ఓటర్లు తేల్చుకోవాలి. కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలి..’అని రేవంత్ అన్నారు. ఖానాపూర్ అభ్యర్థి వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొదరిల్లు చేసుకున్నం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఏమీ లేకుండేదని.. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పొదరిల్లుగా మార్చుకున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆం్ర«ధాలో కలపడం వల్ల 50ఏళ్లకుపైగా గోసపడ్డామన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ గోస మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అందరూ ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని, లేకపోతే మోసపోయి గోస పడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కుము రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌తోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్రం వచ్చినప్పుడు ఏమీ లేకుండే. సాగు, తాగునీరు లేదు. రైతులు, చేనేత కార్మీకుల ఆత్మహత్యలు జరిగేవి. అన్నింటా దళారీ వ్యవస్థ ఉండేది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక్కొక్కటీ సర్దుకుంటూ పోతున్నాం. రాష్ట్రం ఓ పొదరిల్లుగా మారింది. అవినీతి లేని పాలన అందిస్తున్నాం. భూముల ధరలు పెరిగాయి. రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు అందుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నాం. వైద్య, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించాం. ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 15 నుంచి 20ర్యాంకులో ఉండేది. ఇప్పుడు నంబర్ వన్‌గా మారింది. ఇదంతా మంత్రమో, మాయ చేస్తేనో అయితదా? పట్టుదలతో పనిచేస్తున్నాం. నిజాం స్థాపించిన సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉంది. వంద శాతం రాష్ట్ర వాటా ఉండాల్సిన కంపెనీలో కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి 49శాతం వాటా ఇచ్చింది. వాళ్లు ఉన్నన్ని రోజులు కంపెనీకి లాభాలు రాలేదు. ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. కార్మికులకు బోనస్‌లు పెంచాం. రాష్ట్రాన్ని జాప్యం చేసి గోస పెట్టింది బీఆర్ఎస్ 24 ఏళ్ల కింద పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించకున్నాం. అంతకుముందు 50ఏళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాలకులు బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలిపారు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. గోస పడ్డాం. ఉప్పెనలా ఉధృతంగా ఉద్యమం చేస్తే 2004లో ఎన్నికల ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు కాగానే మాట తప్పింది. మళ్లీ గోస పెట్టింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు పోరాడితే.. చివరికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ధరణి తీసేస్తే దళారుల రాజ్యమే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ ఎందుకని.. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు వేస్ట్ పథకమని అంటున్నారు. భూవివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు ఎలాంటి లంచం ఇవ్వకుండానే అరగంటలో అయిపోతున్నాయి. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అలా అంటున్నవారినే బంగాళాఖాతంలో వేయాలి. ధరణి తీసేస్తే రైతులకు భూములపై ఉన్న హక్కులు పోతాయి. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తుంది. రైతుబంధు, ఉచిత విద్యుత్ ఉండాలంటే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తేనే సాధ్యం. వారికి అధికారమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నారని గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలే రోజూ లొల్లి చేస్తున్నారు. అలాంటి వారికి అధికారమిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారు. అందుకే ప్రజల కోసం పనిచేసే వారిని, కష్టపడే పార్టీని ఎన్నుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైటు వెలుగుతుంది. కానీ మాకు తెలంగాణ ప్రజలే బాసులు. గిరిజనేతరులకూ పట్టాలిస్తాం పారిశ్రామికంగా సిర్పూర్ కాగజ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ తెచ్చుకోబట్టే ఆసిఫాబాద్ జిల్లా అయ్యింది. గతంలో వానాకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అని పత్రికల్లో వచ్చేది. ఇప్పుడు ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ, వంద పడకలతో ఆస్పత్రి వచ్చాయి. ఆసిఫాబాద్‌లో 47వేలు, సిర్పూరులో 16 వేల మంది గిరిజనులకు పోడు పట్టాలిచ్చాం. గిరిజనేతరులకూ త్వరలో పట్టాలు ఇస్తాం. ఈ విషయంలో కేంద్రం అడ్డంకిగా మారింది. ఆలోచించి ఓటు వేయండి ఓటు వేసే ముందు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచించాలి. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలను, వాటి నడవడికను విచారించి ఓటు వేయాలి. మీరు వేసే ఓటు వచ్చే ఐదేళ్లు మీ తలరాతను నిర్ణయిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం, మతం లేదు. అందరినీ కలుపుకొని పోతున్నాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. బీఆర్ఎస్ కంటే ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన చేసింది. ముస్లింల కోసం వాళ్లు రూ.900 కోట్లు ఖర్చు పెడితే.. మేం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. అన్నీ ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..’’ అని సీఎం కేసీఆర్ కోరారు. ఈ సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు దండే విఠల్, రఘోత్తంరెడ్డి, ఎంపీ వెంకటేశ్‌నేత, తదితరులు పాల్గొన్నారు. ïసీఎం సమక్షంలో పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. మరోసారి మొరాయించిన హెలికాప్టర్ సీఎం కేసీఆర్ పర్యటనల కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ మరోసారి మొరాయించింది. మూడు రోజుల కింద బీఆర్ఎస్ సభల కోసం బయలుదేరిన ఆయన హెలికాప్టర్లో సమస్య వల్ల ఫామ్‌హౌజ్‌కు వెనుదిరిగి.. మరో హెలికాప్టర్ తెప్పించుకుని వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం కాగజ్‌నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభకు హెలికాప్టర్లో వెళ్లిన సీఎం.. అది ముగిశాక ఆసిఫాబాద్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ హెలికాప్టర్లో సాంకేతికలోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ సభ ముగిసేలోపు పైలట్ హెలికాప్టర్లో సాంకేతికలోపాన్ని సవరించి ఆసిఫాబాద్‌కు తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్ హెలికాప్టర్లో బెల్లంపల్లి సభకు హాజరై, తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. -
ప్రభుత్వాల చెలగాటం...‘న్యాక్’కు నిధుల సంకటం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరమైన అంశాల్లో నెలకొన్న వివాదాలు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌కు అడ్డంకిగా మారాయి. ఈ వివాదం వల్ల న్యాక్‌కు నిధులు రావటం నిలిచిపోవటంతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ ఇబ్బందిలో పడింది. ఏడాదిగా నిధుల కోసం నానాతిప్పలు పడుతున్న నాక్ యంత్రాంగం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద బడా సంస్థల వద్దకు వెళ్లి నిధులు సమీకరించుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు కార్పొరేట్ సంస్థలతో పాటు, నాబార్డ్ చేసిన ఆర్థిక సాయంతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సాయం చేస్తే, కొత్త బ్యాచ్‌లను ఏర్పాటు చేసి మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వాలని యత్నిస్తున్నారు. గతంలో విదేశీ యువతకు కూడా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందిన న్యాక్‌కు.. ప్రభుత్వ విభాగాలు ఆర్థిక క్రమశిక్షణ తప్పటంతో నిధుల కోసం రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించింది. నిధుల వ్యయంపై అభిప్రాయభేదాలు.. న్యాక్ కోర్సులకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇది 70:30 దామాషాగా విడుదలవుతున్నాయి. తాను ఇస్తున్న నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సరి్టఫికెట్లు సరిగా దాఖలు కావటం లేదని, కొన్ని నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని కేంద్రం సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. అవి రానురాను పెద్దవి కావటంతో ఏడాది క్రితం కేంద్రం నిధుల విడుదలను ఆపేసినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా నిలిచిపోయి, న్యాక్‌కు నిధుల సమస్య ఉత్పన్నమైంది. మూడు నెలల కోర్సులను బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్న న్యాక్ వద్ద పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పోగయ్యాయి. ఈ తరుణంలో చేతిలో నిధులు లేకుండా పోయాయి. దీంతో న్యాక్ ఉన్నతాధికారులు కార్పొరేట్ కంపెనీలను సంప్రదించటం ప్రారంభించారు. అలా తొలుత తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్ సంస్థలు 350 మంది శిక్షణకు కావాల్సిన నిధులు అందించాయి. ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష వరకు ఫీజు ఉండే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి పీజీ కోర్సులు కూడా వాటితో నిర్వహిస్తుండటం విశేషం. ఇక మరో 200 మంది అభ్యర్థులతో కూడిన బ్యాచ్‌ల శిక్షణకు కావాల్సిన నిధులను నాబార్డు సమకూర్చింది. వీటితో ఇప్పటి వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. మరిన్ని సంస్థలు ముందుకొస్తే విస్తరిస్తాం... ‘‘సీఎస్ఆర్ నిధులతో శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని నిర్ణయించాం. ఇప్పటికి తాన్లా ప్లాట్‌ఫామ్స్, జీఐపీఎల్, నాబార్డు నిధులు అందించాయి. ఈ డిసెంబరులో కేంద్ర ప్రభుత్వ నిధులు కొన్ని రాబోతున్నాయి. వాటికి అదనంగా సీఎస్ఆర్ కింద కార్పొరేట్ కంపెనీలు సాయం అందిస్తే న్యాక్ మరింత ఉన్నతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది’అని న్యాక్ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి న్యాక్ శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటున్నందున కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని న్యాక్ ప్లేస్మెంట్ డైరక్టర్ శాంతిశ్రీ కోరారు. ఇదీ పరిస్థితి.. ఉన్నత విద్య చదువుకోలేని పరిస్థితిలో చదువు మానేసిన ఎంతోమంది యువతీయువకులకు భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో న్యాక్ శిక్షణ ఇస్తోంది. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఫాల్స్ సీలింగ్, భవన నిర్మాణ సూపర్వైజింగ్, వెల్డింగ్, కన్స్ట్రక్షన్ సర్వే అంశాల్లో తర్పి దు పొందుతున్న అభ్యర్థులకు దేశవిదేశాల్లోని నిర్మాణ సంస్థల్లో ఉపాధి దొరుకుతోంది. గతంలో కేవలం భవన నిర్మాణంలోని వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చిన న్యాక్.. ఆ తర్వాత పీజీ కోర్సులను కూడా ప్రారంభించింది. బీటెక్ సివిల్ అభ్యర్థులు, ఇంజినీర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు, క్వాంటిటీ సర్వే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో నిధుల సమస్య ఉత్పన్నమై న్యాక్‌ను గందరగోళంలో పడేసింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజ్..బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి..కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ కోసం బాల్‌రాజ్ విశ్వప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం బాన్సు వాడలో తన ఇంట్లో కార్యకర్తలతో సమావేశం ఏర్పా టు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014 నుంచి పార్టీని నమ్ముకుని కార్యకర్తలను కా పాడుకుంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చివరకు తనను కాదని, వేరే ప్రాంతం వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏమిటంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆమరణ దీక్షకు దిగి ఇంతలోనే.. కాంగ్రెస్ అధిష్టానం మరోమారు టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరుతూ బుధవారం ఉదయం బాల్‌రాజ్ తన ఇంటి ముందు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో తనతో పాటు దీక్షలో కుర్చున్న కార్యకర్తలను భోజనం చేయండంటూ ఇంట్లోకి పంపించారు. తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చారు. వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభించడంతో కార్యకర్తలు కంగారు పడిపోయారు. కొందరు బాత్రూం లోపలకి వెళ్లి చూశారు. మోనో–65 పురుగుల మందు డబ్బా కనిపించడంతో బాల్‌రాజ్‌ను హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీజేపీ బాన్సువాడ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆస్పత్రికి చేరుకుని బాల్‌రాజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
కాంగ్రెస్‌లో తేలని పటాన్చెరు పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు టికెట్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదు. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండడంతో బీఫారం తీసుకునేందుకు నీలం మధు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఏఐసీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని, స్పష్టత వచ్చిన తర్వాత బీఫారం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో మధు అనుచరులు కొంతసేపు గాంధీభవన్‌లో హడావుడి చేశారు. టికెట్ ప్రకటించి బీఫాం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళన నిర్వహించారు. ఈ టికెట్ విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గట్టి పట్టు పడుతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా మధుకు కాకుండా తన సన్నిహితుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీలో మకాం వేశా రు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన నామినేషన్ వేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. తనకు జ్వరం వచ్చినందున బుధ, గురువారాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నానని, ఈనెల 10న తాను నామినేషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. అయి తే, మధుకు బీఫాం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారని, ఈ కోణంలోనే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంగిశెట్టి, సలీం రాజీనామా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ టికెట్ ఆశించిన సంగిశెట్టి జగదీశ్వర్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో బీసీలకు అన్యాయం చేసినందున తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మైనార్టీ నేత సలీం కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాం«దీభవన్‌కు వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు బోసురాజు, గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నవీన్ భార్యకు తుంగతుర్తి టికెట్ కేటాయించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు బుధవారం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. -
తప్పులుంటే చెప్పండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్లలో తప్పులుంటే అభ్యర్థులకు తెలియజేసి సరిదిద్దేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్‌రాజ్ బుధవారం తన కార్యాలయంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. 43లక్షల మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని, మరో 7లక్షల కార్డుల పంపిణీ చేయాల్సి ఉందని సీఈఓ తెలిపినట్టు వెల్లడించారు. అనుబంధ ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తామని సీఈఓ తెలిపారన్నారు. ఆ అధికారులను తప్పించాలి: కాంగ్రెస్ నాగర్‌కర్నూల్‌జిల్లా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, అక్కడి డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, మల్లు రవి తెలిపారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలను నింపడంలో అభ్యర్థులకు సహకరించాలని కోరామన్నారు. సీఈఓ కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి అధికారులు ఫోన్ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల పరిశీలకుల వివరాలను సీఈఓ కార్యాలయ వెబ్సైట్లో పొందుపర్చాలని సూచించారు. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ అభ్యర్థుల బీ–ఫారాలను చాలా యాంత్రికంగా తిరస్కరిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ నేత సోమా భారత్ తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తప్పుబట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మహిళల ముందే బూతులు మాట్లాడారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్‌కి భాష తెలియకపోతే తన భార్య, పిల్లల వద్ద నేర్చుకోవాలన్నారు. చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు ఆపండి: బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, వాళ్లపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ లీగల్‌సెల్ నేత ఆంథోని రెడ్డి అన్నారు. చర్యలు తీసుకోకుంటే ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు అభ్యంతరకర భాషలో మాట్లాడకుండా నియంత్రించాలని కోరామన్నారు. పరిశీలనకు నలుగురికి అనుమతి నామినేషన్ల పరిశీలనలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ఏజెంట్, ప్రపోజర్, మరో వ్యక్తితో కలసి పరిశీలన ప్రక్రియలో పాల్గొనేందుకు గాను అభ్యర్థి ముందుగా రాతపూర్వకంగా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అవగాహన కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా గాని, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి స్వయంగా రాని పక్షంలో, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ ఎన్నికల ఏజెంట్‌కి అధికారం ఇస్తున్నట్టు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 9 రోజుల్లోగా 40 మందికి మించకుండా స్టార్ క్యాంపైనర్ల జాబితాను రాజకీయ పార్టీలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రచార అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ను వినియోగించాలన్నారు. సగానికి పైగా ఫిర్యాదులు వాస్తవమే: ఈ నెల 10 నుంచి బీఎల్ఓల ద్వారా ఓటరుఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనలపై సీ–విజిల్ యాప్ ద్వారా 3205 ఫిర్యాదులు అందగా, 1961 ఫిర్యాదులు వాస్తవమేనని తేలిందన్నారు. -
సీపీఎస్ రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని చెప్పనుంది. ఈ మేరకు తన ఎన్నికల ప్రణాళికలో చేర్చనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టో కోసం మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ దాదాపు గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కమిటీ మొత్తం 36 అంశాలతో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దినట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి కూడా గాంధీభవన్‌లో కమిటీ సమావేశమైంది. ఒకట్రెండు అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ పెద్దలను సంప్రదించిన తర్వాత ఆ అంశాలను పొందుపరిచి నాలుగైదు రోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. కొత్త స్కీములు..కౌంటర్ పథకాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామని, ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కేలండర్‌ను విడుదల చేయడంతో పాటు ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాన్ని 25 శాతం పెంచుతామనే హామీని కూడా మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారు. బాలింతలకు ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్‌కు కౌంటర్‌గా మరో పథకాన్ని ప్రకటిస్తారని, కిట్‌లోని వస్తువులతో పాటు ఆర్థిక సాయం పెంచుతారని సమాచారం. అదే విధంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం పథకాన్ని కూడా ప్రకటించనున్నారు. చదువుకుంటున్న విద్యార్థినులందరికీ స్కూటీలు ఇస్తామని గతంలో ప్రకటించినప్పటికీ, తాజాగా వాటి స్థానంలో ల్యాప్‌టాప్‌లిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరి సంక్షేమమే లక్ష్యం..! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజా మేనిఫెస్టో పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమ, అమరవీరుల సంక్షేమ, వ్యవసాయం–రైతు సంక్షేమం, నీటి పారుదల, యువత–ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలు, గృహ నిర్మాణం, భూపరిపాలన, పౌరసరఫరాలు, ని త్యావసరాల పంపిణీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ రంగం, టీఎస్ఆర్టీసీ సంక్షేమం, మద్య విధానం, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, సింగరేణి కార్మికులు, కార్మికులు, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, గల్ఫ్ ఎన్నారైలు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, క్రీడారంగం, పోలీస్–శాంతి భద్రతల వ్యవస్థ, పర్యాటక రంగం, జానపద, సినిమా–సాంస్కృతిక రంగం, ధార్మిక రంగం, పర్యావరణం, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ నేతలు రూపకల్పన చేస్తుండడం గమనార్హం. -
కోర్ సిటీలో కొట్లాటే !
రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పాతనగరం పరిధిలో ఏడు, కొత్త నగరపరిధిలోకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి. ఈ రెండు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనాతీరు భిన్నంగా ఉంటాయి. పాతబస్తీలో రాజకీయాల ఒరవడే వేరుగా ఉంటుంది. మేనిఫెస్టోలు, ప్రచార ఆర్భాటాలు నడవవు. బలమైన ముస్లిం, హిందూత్వ సామాజిక ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. నిజాం కాలంలో పురుడుపోసుకున్న మజ్లిస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి నేటి వరకు పాతబస్తీలో రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తోంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం ఒకవైపే మొగ్గు చూపుతోంది. బీజేపీ హిందూ ఎజెండాతో మజ్లిస్ కంచుకోటను ఢీకొట్టేందుకు ప్రతి ఎన్నికల్లో ప్రయత్నిస్తూనే ఉంది. మజ్లిస్ నుంచి చీలిన ఎంబీటీ కూడా మజ్లిస్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఉనికి కోసం బీఆర్ఎస్ పోటీ పడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అధికార బీఆర్ఎస్ ఇక్కడి నుంచి ఖాతా తెరవలేదు. ఇక కొత్త నగరంలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మత రాజకీయాలు పనిచేయవు. ఆర్థిక బలం. అభివృద్ధి, సంక్షేమం, అభ్యర్ధుల బలాలు, బలహీనతలు, రాజకీయ పార్టీల ప్రాధాన్యతను బట్టి ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు. ఆశలపల్లకీలోబీజేపీ బీజేపీ గతంలో చేజారిన స్థానాలతో పాటు కొత్తగా మరికొన్నింటిలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే విజయం సాధించిన బీజేపీ అంబర్పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. మరోవైపు పాతబస్తీలో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ సైతం ఎత్తేసి తిరిగి బరిలోకి దింపింది. గతంలో అంబర్‌పేట, ముషీరాబాద్ స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు సీనియర్ నేతలు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఖైరతాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బరిలో దిగగా, అంబర్‌పేటలో ఇటీవల పార్టీలో చేరిన మరో మాజీ సీనియర్ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చారు. పాతబస్తీ దాటి పాగా వేసేనా..? మజ్లిస్ పార్టీ పాతనగరం దాటి మరో రెండు స్థానాల్లో పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఈసారి ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎప్పుడూ పాతబస్తీకి మాత్రమే పరిమితమయ్యే మజ్లిస్ ఈసారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో కూడా బరిలోకి దిగింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ దాని చెంతన చేరుతోందన్నది బహిరంగ రహస్యమే. పదేళ్ల క్రితం వరకు వరకు కాంగ్రెస్‌తో కొనసాగించిన దోస్తానాకు కటీఫ్ చెప్పి..ఆ తర్వాత అధికార బీఆర్ఎస్కు మిత్రపక్షమైంది. అధికార పార్టీలు కూడా ప్రతి ఎన్నికలప్పుడు మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో మొక్కుబడిగా అభ్యర్థులను దింపి పరోక్షంగా సహకరించడం ఆనవాయితీగా మారింది. మజ్లిస్ కూడా సిట్టింగ్ స్థానాలను చేజారకుండా పదిలపర్చుకుంటూ వస్తోంది. సిట్టింగులతోనే...బీఆర్ఎస్ కోర్ సిటీలో అధికార బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు పదిలపర్చుకునేందుకు సంక్షేమం, అభివృద్ధి మంత్రం కలిసి వస్తుందని భావిస్తోంది. సిట్టింగ్‌లకు మరోమారు అవకాశం కల్పించి రంగంలోకి దింపింది. ఒక మంత్రి, ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక దివంగత ఎమ్మెల్యే కుమార్తె ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ వహిస్తున్న గోషామహల్ స్థానం కూడా ఈసారి తమ ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో పాగావేసిన అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు ఈసారి బీజేపీకి చిక్కకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లలో గత పర్యాయం మాత్రమే పార్టీ పరంగా విజయం సాధించింది. అంతకు ముందు టీడీపీ గుర్తుపై గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకొని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. సికింద్రాబాద్ స్థానంలో ఇప్పటికి మూడు పర్యాయాలు టీఆర్ఎస్ గెలుపొందింది. పూర్వ వైభవానికి కాంగ్రెస్ కసరత్తు కాంగ్రెస్ పూర్వవైభవానికి పడరాని పాట్లు పడుతోంది. ఆరు గ్యారంటీ స్కీంలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేళ్ల వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. గతంలో చేజారిన స్థానాలతోపాటు మరి కొన్నింటిలో ఖాతా తెరిచేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇద్దరు మాజీ ఎంపీలను జూబ్లీహిల్స్, ముషీరాబాద్‌లలో, సెంటిమెంట్ సానుభూతిని అనుకూలంగా మరల్చుకునేందుకు దివంగత నేత పి జనార్దన్‌రెడ్డి, దివంగత గద్దర్ కుమార్తెలను ఖైరతాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో, గోషామహల్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని ఎన్నికల బరిలోకి దింపింది. నాంపల్లి నియోజకవర్గంలో మూడు పర్యాయాలు స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన అభ్యర్థినే తిరిగి ఈసారి కూడా ఎన్నికల బరిలోకి దింపి సానుభూతి కలిసి వస్తోందని భావిస్తోంది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, కంటోన్మెంట్, నాంపల్లి స్థానాలపై ఆశలు పెంచుకుంది. సనత్‌నగర్, అంబర్‌పేట ,సికింద్రాబాద్ స్థానాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు అవసరమైన బలాన్ని పెంచుకుంటోంది. -మహ్మద్ హమీద్ ఖాన్ -
Revanth Reddy Interview: నేడు ఇక్కడ..రేపు ఢిల్లీలో..
నిన్న కర్ణాటకలో గెలిచాం..ఇప్పుడు తెలంగాణలో గెలుస్తాం... రేపు ఢిల్లీలోనూ గెలిచి తీరుతాం అని అంటున్నారు టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75–80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. బీఆర్ఎస్కు 25, బీజేపీ, ఎంఐఎంలకు కలిపి 10 స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఐదు రోజుల రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరిన సందర్భంగా రేవంత్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలకాంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కామారెడ్డిలో సీఎంపై పోటీ ఎందుకు చేస్తున్నారు? రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలున్నా కేసీఆర్ కామారెడ్డికి వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉంది. అసదుద్దీన్ ఒవైసీ, కేసీఆర్ కలిసి మా పార్టీలోని సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్‌అలీని ఓడించేందుకు కుట్ర చేశారు. ఆయన స్థానంలో నేను అక్కడ పోటీ చేస్తే పదేళ్ల కేసీఆర్ వైఫల్యాలు, తప్పులను ప్రజలకు చేరవేయడం సులభమవుతుంది. కేసీఆర్ పాలనా వైఫల్యాలపై జాతీయస్థాయిలో చర్చ జరగడంతో పాటు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గట్టిగా పోరాడుతుందనే సంకేతాన్ని పంపాలనేది మా అధిష్టానం ఉద్దేశం. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేస్తున్నారు? అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఢిల్లీ నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించారు. కిందిస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ అవసరాలను కూడా అంచనా వేసి అధిష్టానం ఒకట్రెండు మార్పులు చేసింది. మీ పార్టీలో ఉన్న నేతలు బలంగా లేరనే వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని తీసుకుని టికెట్లు ఇస్తున్నారా? లేదంటే కాంగ్రెస్ బలహీనంగా ఉందా? పార్టీ వేరు, నాయకులు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీలోని బలమైన 160 మంది నేతలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చిన వారిలో చాలా మంది పాత కాంగ్రెస్ వాళ్లే. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్‌రెడ్డి లాంటి వారు బయటకు వెళ్లి కేసీఆర్‌ను ఓడించాలనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని మళ్లీ పార్టీలోకి వచ్చారు. కొన్ని సందర్భాల్లో వారు మమ్మల్ని సంప్రదిస్తే మరికొన్ని సార్లు మేమే వాళ్లను సంప్రదించి టికెట్లు ఆఫర్ చేశాం. టికెట్ల కేటాయింపులో రేవంత్ వర్గానికే ప్రాధాన్యం ఉందా? 119 మంది కూడా నా వర్గమే. సోనియా, ఖర్గే వర్గమే. రేవంత్ ఒక్కడే టికెట్లు నిర్ణయించడు. సీఈసీ నిర్ణయిస్తుంది. ఆ సీఈసీలో 16 మంది ఉద్ధండులుంటారు. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలో కూడా భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అది పార్టీ సమష్టి నిర్ణయం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి సహజంగానే జరుగుతున్న పరిణామాలన్నీ నాకు ఆపాదిస్తారు. కాళేశ్వరం వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారా? రాహుల్‌గాంధీ, నేను, భట్టి విక్రమార్క వెళ్లి ప్రాజెక్టును చూసి ప్రపంచానికి నిజం చెప్పాం. అన్ని స్థాయిల్లో చర్చలు పెట్టాం. ఎన్నికల నేపథ్యంలో మీడియా అంతా ఎన్నికల వివాదాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అందుకే చర్చ జరగడం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుందని, కోహ్లీలాగా మళ్లీ సెంచరీ కొడతామని మంత్రి కేటీఆర్ అంటున్నారు కదా? కృష్ణానగర్ పోతే ఇలాంటి మాటలు చెప్పేటోళ్లు చాలా మంది ఉంటారు. అవన్నీ ఉద్దెర మాటలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏదో లేఖ రాశారని అబద్ధం చెప్పి కేటీఆర్ ఇరుక్కున్నాడు. తర్వాత ఫేక్ అని ఒప్పుకున్నాడు. సైలెంట్ అయిపోయాడు. ఒక్కరోజు వార్తతో లబ్ధి పొందాలని చూశాడు. సైబర్ క్రైమ్‌లో కేసు అయ్యింది. కర్ణాటక çపోలీసులు వచ్చి గుంజుకుని పోయి జైల్లో వేస్తే కానీ కేటీఆర్‌కు అర్థం కాదు. ఢిల్లీ దొరల మధ్య తెలంగాణ ప్రజల మధ్య పోటీ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా? సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడడంలో పోటీ పెడితే కేసీఆర్ కుటుంబమే ఫస్ట్ వస్తుంది. ఢిల్లీకి పోయి నా కొడుకుని సీఎం చేస్తానని మోదీని అడిగింది మేమా? కేసీఆరా? అడుక్కున్నది కేసీఆర్. ఢిల్లీకి బానిసలై ఇక్కడ గులాబీలమని చెప్పే వారికి ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసే హక్కు లేదు. కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ నాశనమైందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీరేమంటారు? కేసీఆర్ విశ్వాసం కోల్పోయిన నాయకుడు. అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌సిటీ, ఓఆర్ఆర్, మెట్రో, ఫ్లైఓవర్లు నిర్మించి రూ. 60వేల కోట్ల ఆదాయం ఇక్కడి నుంచి వచ్చేలా చేసింది కాంగ్రెస్ కాదా..? అభివృద్ధి చేస్తే నాశనం చేసినట్టా..? నాగార్జునసాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీరాంసాగర్, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టినందుకు తెలంగాణ నాశనమైందా? టికెట్లు అమ్ముకున్నారని మీ పార్టీలో టికెట్లు రాని వారంటున్నారు... ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు మీ పేరు మార్చి పిలుస్తున్నారు కదా? టికెట్లు అమ్ముకున్నారనడంలో వాస్తవం లేదు. టికెట్ల నిర్ణయంలో రేవంత్‌రెడ్డి ఒక్కడికే ఆ అధికారం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరువయ్యారని బిల్లా అంటుంటే... కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారని రంగా అంటున్నాడు. బిల్లా రంగాల మధ్యనే ఈ విషయంలో వైరుధ్యం ఉంది. కాంగ్రెస్ టికెట్లు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయని అంటే ఓట్ల విషయంలో బాహుబలి కలెక్షన్లు వచ్చినట్టే కదా? వాళ్లు నోట్ల రూపంలో చూస్తే నేను ఓట్ల రూపంలో చూస్తున్నా. వచ్చే ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు? కాంగ్రెస్ పార్టీకి 75–80 స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్కు 25 కంటే ఎక్కువ రావు. బీజేపీకి 4 మించవు. ఎంఐఎంకు 5–6 మాత్రమే వస్తాయి. తెలంగాణపై మీ పార్టీ అధిష్టానం ఎందుకు అధిక ఫోకస్ పెట్టింది? నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీ... తెలంగాణలో గెలుపు ద్వారా ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు మార్గం ఏర్పడుతుంది. అందుకే అధిష్టానం ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదా..? టీడీపీ నుంచి పోయినోళ్లు 90 శాతం మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులే. తలసాని, నిరంజన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో సహా కేసీఆర్ కూడా తెలుగుదేశం వాళ్లే కదా? మరి, టీడీపీ పోటీ పెట్టకపోతే వారికి లాభం వస్తుందని అనుకోవచ్చు కదా? తెలుగుదేశం సానుభూతిపరులందరూ నాకే ఓటు వేస్తే మంచిదే కదా? వారు వస్తే ఆహ్వానించదగ్గ విషయమే కదా? తప్పేముంది అందులో? -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
ఎన్నికలల పార్టీలు!
చట్టసభలకు జరిగే ఎన్నికల్లో జయాపజయాలు ప్రధానంగా రాజకీయ పార్టీల వ్యవహార శైలిపైనే ఆధారపడతాయి. ప్రజల్లో ఆయా పార్టీల పట్ల ఉన్న విశ్వసనీయతకుతోడు పోటీ చేస్తున్న అభ్యర్థుల వైఖరితో గెలుపోటములను ఓటర్లు నిర్ధారిస్తారు. అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రజల్లో ఊపును తీసుకొచ్చేందుకు కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటాయి. గత రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకురాగా మెజారిటీ పార్టీలు కాలగమనంలో కలసిపోయాయి. కానీ ఒకట్రెండు మాత్రం నిలదొక్కుకొని రాజ్యాధికారం దిశగా దూసుకువెళ్లాయి. ఉద్ధండులు... కొత్త పార్టీలు రాజకీయ పార్టీని స్థాపించడం..నిర్వహించడం ఆషామాషీ కాదు. పార్టీని స్థాపించే వ్యక్తికి ప్రజాక్షేత్రంలో చరిష్మా అత్యంత కీలకం. మాటలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయగలిగే సత్తా ఉండాలి. ప్రజలు వాటిని విశ్వసించేలా వ్యవహరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో విస్తృత ప్రజాదరణ చూరగొన్న పలువురు నేతలు తమ రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా సొంత పార్టీలను స్థాపించారు. ముఖ్యంగా తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2001లోనే ఆలె నరేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ సాధన సమితి పుట్టుకొచ్చింది. 2005లో ప్రముఖ నటి విజయశాంతి సైతం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2006 అక్టోబర్‌లో జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో లోక్‌సత్తా పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలక నేతగా వెలుగొందిన తూళ్ల దేవేందర్‌గౌడ్ సారథ్యంలో 2008లో నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ) ఏర్పాటైంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి 2008 ఆగస్టులో ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్పీ)ని స్థాపించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది. ప్రముఖనటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో 2014 మార్చిలో జనసేన ఆవిర్భవించింది. ఆ తర్వాత 2018 ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఏర్పాటైంది. విలీనాలతో తెరమరుగు.. ఒకే లక్ష్యం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆలె నరేంద్రకు చెందిన తెలంగాణ సాధన సమితి 2002లో, విజయశాంతికి చెందిన తల్లి తెలంగాణ పార్టీ 2009లో అప్పటి టీఆర్ఎస్లో విలీనమయ్యాయి. లోక్‌సత్తా పార్టీ తరఫున 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఒక దఫా ఎమ్మెల్యేగా గెలుపొందగా... ఆ తర్వాత ఆ పార్టీ అభ్యర్థులెవరూ విజయం సాధించలేదు. దేవేందర్‌గౌడ్ తన నవ తెలంగాణ పార్టీని 2009 ఫిబ్రవరిలో ప్రజారాజ్యంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్పీ 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో విలీనమైంది. మరోవైపు తెలంగాణ జన సమితి ప్రధాన పార్టీలకు ఇప్పటివరకు ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేదు. ఇక చిన్నాచితకా పార్టీలు ఎప్పటికప్పుడు అలా వచ్చి పోటీ చేయడం తప్ప విజయం సాధించి నిలదొక్కుకున్న దాఖలాలు లేవు. బరిలో బోలెడు రిజిస్టర్డ్ పార్టీలు.. 1999 అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీలు 27 మాత్రమే. ఇందులో 6 జాతీయ పార్టీలుండగా..ప్రాంతీయ పార్టీ ఒకటి మాత్రమే ఉండేది. అలాగే 12 రిజిస్టర్డ్ పార్టీలు ఉండగా పొరుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు 8 ఉండేవి. ఆ తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర పార్టీల సంఖ్య పెద్దగా మారనప్పటికీ కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు మాత్రం భారీగా పెరిగాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 93 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఇందులో పోటీ చేసిన రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఏకంగా 77. రెండున్నర దశాబ్దాల్లో రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య ఆరు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. అధికారంలోకి రెండే పార్టీలు.. కొత్త పార్టీల్లో కేవలం టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు మాత్రమే ఎగిసిన కెరటంలా ఎదిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్ 2014 నుంచి వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పార్టీ బీఆర్ఎస్గా అవతరించింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో మొదలైన ఈ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మరోవైపు ఏపీలో వైఎస్సార్సీపీ 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -చిలుకూరి అయ్యప్ప -
ప్రచారాస్త్రం.. ‘నిజాం షుగర్స్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరకు రైతుల అంశం ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయనుంది. పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీల పరిధిలోని చెరకు రైతుల విషయం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రమైంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాన్ని శాసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో చెరకు పంట విస్తీర్ణం పెంపు అంశం కీలకం కానుంది. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంనగర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ వాడకం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారీకి ఆయా పరిశ్రమల ఏర్పాటుపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారా్రస్తాలుగా చేసుకుంటున్నాయి. 2002లో చంద్రబాబు విక్రయం.. నిజాం షుగర్స్ యూనిట్లను 2002లో డెల్టా పేపర్ మిల్స్ అనే ప్రైవేటు కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం విక్రయించింది. 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ నిజాం షుగర్స్‌ను ప్రభుత్వపరం చేస్తామన్నారు. అయితే 2015 డిసెంబర్ 23న ఫ్యాక్టరీ మూడు యూనిట్లు లేఆఫ్ ప్రకటించాయి. అయితే 2005–06లో చెరకు 35 వేల టన్నుల దిగుబడి ఉన్నప్పటికీ నడిపిన ఈ కర్మాగారాలను 2015లో లక్ష టన్నుల చెరకు దిగుబడి ఉన్నప్పటికీ మూసేయడం గమనార్హం. దీంతో రైతులు వరి వైపు మళ్లారు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు పండించే 12 నియోజకవర్గాల్లో గతంలో సుమారు 1.22 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. చెరకు రైతులే ప్రధానాంశంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. -
సీఎం మీద గెలిస్తే జెయింట్ కిల్లరే!
సీఎం కేసీఆర్.. ఈ సార్‌తో ఎన్నికల్లో పోటీ అంటే.. అస్స లు మామూలు విషయం కాదు.. ఎప్పుడో నలభై ఏళ్ల కిందట ఒకే ఒక్కసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఈయన ఆ తర్వాత.. ఇన్ని దశాబ్దాలుగా ఎంపీగా పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలుపు గుర్రంపై స్వారీ చేస్తూనే ఉన్నారు. రికార్డు మెజారిటీలు సాధిస్తూనే ఉన్నారు. అలాంటి కేసీఆర్‌పై తొలిసారి ఈ దఫా సీరియస్‌గా పోటీకి దిగుతున్నాయి ప్రతిపక్షాలు. ఓ రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలోనే గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుంటే... కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరికిద్దరూ కేసీఆర్‌ను ఓడిస్తామనే చెబుతున్నారు. ఒకవేళ ఓడిపోయినా.. పోయేదేం లేదు... సీఎం మీద పోటీ చేశాడు అనే పేరొస్తది. కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు తరహాలో గెలిస్తే... జెయింట్ కిల్లర్ అనే ట్యాగ్‌లైన్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. గజ్వేల్, కామారెడ్డిల్లో సీఎంపై గెలిచి.. ఒకవేళ ఆ గెలిచిన వాళ్ల పార్టీనే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కూడా ముందు వరుసలో ఉండొచ్చనే దూరాలోచన కూడా పోటీకి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సారి చరిత్ర చూస్తే తెలంగాణలో ముఖ్యమంత్రిపై పోటీ చేసి గెలిచి జెయింట్ కిల్లర్‌గా పేరు పొందిన చరిత్ర మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్ దాస్‌కు ఉంది. 1989 సాధారణ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుడివాడ, హిందూపురంతో పాటు తెలంగాణలోని కల్వకుర్తి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాగా ఎన్టీ రామారావుపై గెలిచిన చిత్త రంజన్‌దాస్ ముఖ్యమంత్రి కాకపోయినా... కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డిల పరిస్థితి ఏంటో డిసెంబర్ 3న తేలుతుంది. -
వారెవరు గెలిచినా మళ్లీ ఎన్నికలే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో బీఆర్ఎస్సో, కాంగ్రెస్సో అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కొట్లాటలు తప్పవని, తద్వారా కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని, అప్పుడు ఆ పారీ్టలో చీలికలొచ్చి ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రం సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ వ్యక్తిని సీఎంను చేసి తీరుతామన్నారు. నారాయణపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.రతంగ్‌పాండురెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ బండి మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవు అని కేటీఆర్‌ను బండి దుయ్యబట్టారు. ‘‘అమెరికాలో చిప్పలు కడుక్కునే వాడివి...2004లో నెలకు జీతం రూ.4 లక్షలు అన్నావు...ఇప్పుడేమో కోటి అంటావు...నెలకు కోటి లెక్క చేసిన ఐదేళ్లకు దాదాపు వంద కోట్లు అనుకో...మరి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినవ్ కదా..ముందు ఆ లక్ష కోట్ల సంగతి తేల్చు’’అని సవాల్ విసిరారు. హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి బండి బండి సంజయ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి సభల్లో పాల్గొనేందుకు ఆయనకు హెలికాప్టర్‌ను కేటాయించింది. దీంతో బుధవారం కరీంనగర్ నుంచి నారాయణపేట జిల్లాకు సభలో పాల్గొనేందుకు సంజయ్ హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. రెండోరోజు బుధవారం పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌లోని 6, 29, 30 పాతబజార్ శివాలయం నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ @ 16.7
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతోనే చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యం కావడం... వాతావరణంలో నెలకొన్న మార్పులతో కొంత కాలంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి. మధ్యలో రెండు మూడురోజులు చలి పెరిగినా తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్షీణించడం ప్రారంభించాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోంది. మరో మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 34 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌తో పాటు మెదక్, నల్లగొండల్లో చలి పెరిగింది. రానున్న మూడురోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత మరింత తగ్గుతాయని చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
‘గాందీ’లో అందుబాటులో ఫ్రీజర్స్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఫ్రీజర్‌బాక్సులు అందుబాటులో లేవన్న సమస్యే ఉత్పన్నం కాదని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నందున సాంకేతిక సమస్యలు కూడా తలెత్తవని ప్రస్తుతం ఆస్పత్రిలో 62 ఫ్రీజర్ బాక్సులున్నాయని ఆస్పత్రి సూపరింటిండెంట్ హైకోర్టుకు అఫిడవిట్ సమరి్పంచారు. గాంధీ ఆస్పత్రిలో కోల్డ్ స్టోరేజీ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్నాయని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ఈ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా...‘గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 62 ఫ్రీజర్ బాక్సులున్నాయి. రోజుకు 15 నుంచి 20 మృతదేహాలు ఆస్పత్రికి వస్తాయి. ఇందులో 3 నుంచి 4 గుర్తుతెలియనివి ఉంటాయి. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకున్న తర్వాత గుర్తించిన మృతదేహాలను బంధువులకు అందజేస్తారు. గుర్తు తెలియని వాటిని 72 గంటల పాటు ఫ్రీజర్‌లో భద్రపరిచి ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించి.. మున్సిపాలిటీ అధికారులకు అందజేస్తారు. వారు నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనూ అవసరమైతే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పలు కారణాల రీత్యా వ్యక్తి మృతిచెందిన రోజే పోస్టుమార్టం సాధ్యం కాదు. 60 బాక్సులకు 25 మాత్రమే పని చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనం అవాస్తవం’అని ఆస్పత్రి సూపరింటిండెంట్ ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటిండెంట్ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం..ఫ్రీజర్స్ అందుబాటులో ఉన్నందున విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. -
Telangana: బీజేపీ నాలుగవ జాబితా విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన నాలుగవ జాబితాను విడుదల చేసింది. 12 మందితో కూడిన జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ నాల్గో జాబితా అభ్యర్థుల వివరాలు.. చెన్నూరు-దుర్గం అశోక్ ఎల్లారెడ్డి సుభాష్‌రెడ్డి వేములవాడ-తుల ఉమ హుస్నాబాద్-శ్రీరామ్ చక్రవర్తి సిద్ధిపేట-దూది శ్రీకాంత్‌రెడ్డి వికారాబాద్-నవీన్ కుమార్ కొడంగల్-బంటు రమేష్ కుమార్ గద్వాల్-బోయా శివ మిర్యాలగూడు సాదినేని శ్రీనివాస్ మునుగోడు-చలమల కృష్ణారెడ్డి నకిరేకల్ - మొగులయ్య ములుగు - అజ్మీర ప్రహ్లాద్ నాయక్ -
ఇక ఆపండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. తెలంగాణలో కరెంట్‌పై కట్టుకథలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్రంలో కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానుకోండి కిషన్ రెడ్డి. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని కిషన్ రెడ్డికి సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. Telangana’s peak demand is 15500 MWs, this NTPC plant gives 680 MWs to Telangana. Essentially that accounts to only 4% of power that Telangana utilises. @kishanreddybjp Anna … kindly stop spreading lies about how uninterrupted power is given by Central Government. It is the… https://t.co/M4kP42JVOy — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 7, 2023 ఇక, అంతకుముందు కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా..పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోదీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు కవిత కౌంటిరిచ్చారు. -
ఆ గోస మళ్లీ కావాల్నా?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రజల 50 ఏళ్ల గోసకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని.. సమైక్య పాలకులు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మన ప్రాజెక్టులను రద్దు చేశారని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. నదులు పారే పాలమూరు జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించినది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని.. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాలు చేస్తే, వందలాది మంది పిల్లలు చనిపోతే తప్పని పరిస్థితిలో తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు, నీళ్ల సమస్యలు, దోపిడీ, కమీషన్ల రాజ్యం వస్తుందని.. అలాంటి పాలన మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. అభ్యర్థులతోపాటు వారి వెనుక ఉన్న పార్టీలు, వాటి చరిత్రను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరులోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పిడికెడు మందితో తెలంగాణ అంతా తిరిగి అందరినీ చైతన్యవంతం చేశాం. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నాని్చవేత ధోరణితో టీఆర్ఎస్ను ముంచేందుకు ప్రయత్నించింది. మొండి పట్టుదలతో 14 ఏళ్లు పోరాటాల తర్వాత.. నేను ఆమరణ దీక్ష చేస్తే తట్టుకోలేక దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనుకకు పోవడంతో వందలాది మంది పిల్లలు చనిపోయారు. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణకు ఈ దుస్థితి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పచ్చబడింది. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మరోసారి ఖతం పట్టించాలని కుట్రలు చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పం.. చెప్పే అవసరం మాకు లేదు. కాంగ్రెస్ వాళ్లు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు ఒకప్పుడు పాలమూరు జిల్లా పాలుగారిన జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లాకు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు. పాలమూరును సర్వ నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను రద్దు చేశారు. ఒక్క ప్రాజెక్టు కావాలని ఏ కాంగ్రెస్ నాయకుడూ నోరు తెరిచి అడగలేదు. బచావత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే.. పాలమూరుకు నీళ్ల గురించి ఏ నాయకుడూ అడగలేదు. ఈ ప్రాంతం ఏపీలో కలవకపోయి ఉంటే బాగుపడేదని బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లోనే రాసి ఉంది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ గమనించి అప్పట్లో జూరాలకు 17 టీఎంసీలు మంజూరు చేసింది. ఎవరూ పట్టించుకోకపోతే.. తెలంగాణ ప్రాంతవాసి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారు. అయినా కర్ణాటకకు నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. 2001లో గులాబీ జెండా ఎగిరాకే అడుగు ముందుకుపడింది. నాటి ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకున్నామంటూ పునాది రాళ్లు వేసిపోయారే తప్ప ఎవరూ కశికెడు నీళ్లు తెచ్చివ్వలేదు. కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంట పారే జిల్లాకు గంజి కేంద్రాల గతి పట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పాలమూరు ఎలా అయిందో ప్రజలు గమనించాలి. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టి నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించారు. కోయిల్‌సాగర్ లిఫ్ట్నూ పూర్తి చేసుకున్నాం. అధికారంలోకి రాగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలను పూర్తిచేసి చెరువుల్లో నీళ్లు నింపుతాం. మరో ఉద్యమం వస్తదేమో.. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని నాలుగు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం స్పందిస్తలేదు. మరో ఉద్యమం వస్తదేమో. సమైక్య రాష్ట్రంలో మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి బోయలను ఆంధ్ర ప్రాంతంలో ఎస్టీల్లో పెట్టి, ఇక్కడ బీసీల్లో పెట్టింది నిజం కాదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? ఆనాటి మంత్రి రఘువీరారెడ్డి పాలమూరుకు వస్తే.. మంగళహారతులు పట్టి మరీ నీళ్లు తీసుకుపొమ్మని ఎవరు చెప్పారో అందరికీ తెలుసు. బాగా ఆలోచించి ఓటేయాలి నేను కూడ రైతునే, వారికష్టాలు నాకు తెలుసు. అందుకే వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. గతంలో రాత్రిళ్లు ఇచ్చే అరకొర కరెంటుతో పాములు కుట్టి, కరెంటు షాక్ తగిలి వేల మంది రైతులు మృత్యువాత పడ్డారు. రైతు బంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అంటే.. మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రైతులపై విషం చిమ్ముతున్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజల దగ్గర ఓటు అనే వజ్రాయుద్ధం ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి, సమాజానికి ఎవరుంటే మేలు జరుగుతుందో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలి. గద్వాలలో తడబడిన కేసీఆర్ కేసీఆర్ గద్వాలలో తన ప్రసంగం సందర్భంగా తడబడ్డారు. ‘‘ఎన్నికలు వస్తాయి, పోతాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు ఉంటారు. అభ్యర్థుల గుణం చూడాలి. ముఖ్యంగా వారి వెనుక ఉన్న పార్టీలను చూడాలి. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెనుక బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటది’’అని చెప్తూ.. ‘బీజేపీ వెనుక బీఆర్ఎస్ ఉంటది’అన్నారు. వెంటనే సవరించుకుని ‘బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’అంటూ ప్రసంగం కొనసాగించారు. నారాయణపేటలో ఉర్దూలో ప్రసంగం సీఎం కేసీఆర్ నారాయణపేట సభలో ప్రసంగించిన సందర్భంగా చివరిలో ముస్లింలను ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో ఒక్క కర్ఫ్యూ లేదు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది’’అని చెప్పారు. హెలికాప్టర్లో సమస్యతో సభలు ఆలస్యం మర్కూక్ (గజ్వేల్): సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య తలెత్తినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే వెనక్కి తిప్పి వ్యవసాయ క్షేత్రంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రచార సభలకు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు మరో హెలికాప్టర్‌ను తెప్పించారు. కేసీఆర్ అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు.. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ దేవరకద్ర సభకు రావాల్సి ఉండగా.. హెలికాప్టర్ సమస్య వల్ల 3.35 గంటలకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి 12 నిమిషాలు ప్రసంగించారు. అక్కడి నుంచి గద్వాలకు చేరుకుని 15 నిమిషాలు, మక్తల్‌లో ఎనిమిది నిమిషాలు ప్రసంగించారు. చివరగా నారాయణపేటలో 29 నిమిషాలు మాట్లాడారు. సాయంత్రం 6.45 గంటల సమయంలో ప్రత్యేక బస్సులో బయల్దేరి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. -
కోహ్లీలా కేసీఆర్ సెంచరీ!
సిరిసిల్ల: క్రికెట్లో విరాట్ కోహ్లీ లాగా రాష్ట్రంలో కేసీఆర్ సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఊరుకోడు.. మహారాష్ట్రలో అడుగు పెడతాడు, కర్ణాటకలో అడుగు పెడతాడు.. తర్వాత ఢిల్లీలో గులాబీ జెండా పాతాలని చూస్తాడని రాహుల్‌గాందీ, నరేంద్రమోదీ భయపడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ వాళ్లిద్దరికీ కొరకరాని కొయ్యలా అయ్యాడని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకొస్తే తమ కొంప మునుగుతుందని ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లుగా 24 గంటల కరెంట్ దేశమంతా ఇవ్వాలని, దేశమంతా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేయాలని, జిల్లాకో మెడికల్ కాలేజీ, నాణ్యమైన విద్యనందించే గురుకులాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని వివరించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ఎల్లారెడ్డిపేటల్లో జరిగిన యువ సమ్మేళనం సభల్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సినిమాకు అన్నీ కేసీఆరే తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీలకు లోకల్ లీడర్లు లేక.. కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్.. అన్నీ కేసీఆరేనని, మన సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ‘అదే ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్’అని అన్నారు. ఆ రెండు పారీ్టలు ఢిల్లీలో ఉస్కో అంటే.. ఇక్కడ డిస్కో అంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. 11సార్లు చాన్సిస్తే ఏం చేశారు? ఢిల్లీ నాయకులు తెలంగాణ విషయంలో ఏనాడూ మర్యాదగా ప్రవర్తించలేదని మంత్రి అన్నారు. పోరాటాలు, త్యాగాలు, కేసీఆర్ ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్ పారీ్టకి 11 సార్లు అవకాశం ఇస్తే.. ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఎందుకు ఇయ్యలేదని నిలదీశారు. ఆ పుర్రెలేని రాహుల్‌గాం«దీకి మేడిగడ్డ ప్రాజెక్టుపై వచ్చిన పర్రె (పగులు) కూడా తెలియదని విమర్శించారు. తాము రాజకీయ హిందువులం కాదని, నిజమైన హిందువులమని స్పష్టం చేశారు. స్టెప్పులేసి జోష్ పెంచిన కేటీఆర్ ఎల్లారెడ్డిపేట యువ సమ్మేళనం వేదికపై కేటీఆర్ స్టెప్పులేశారు. ఎన్నికల పాట ‘దేఖ్లేంగే..’కు యువ నాయకులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహం నింపారు. సభికులు కేరింతలు కొడుతూ వారు కూడా స్టెప్పులేయడంతో ఆ ప్రాంతం మార్మోగింది. స్థానిక నాయకులను పేరుపేరునా పిలిచిన మంత్రి వారిలో జోష్ నింపారు. వేములవాడ సభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. జాబ్ కేలండర్ ప్రకటించే బాధ్యత నాది రాబోయే రోజుల్లో యువతతో మమేకమవుతామని, జాబ్ కేలండర్‌ను ప్రకటించే బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. జి ల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం, నియోజకవర్గానికో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తానని, స్వయం ఉపాధిని పెంచుతానని అన్నారు. తెలంగాణను దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దని, ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటుందో ఆలోచించాలని కోరారు. -
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుద లైంది. 16 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థు లను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ, ఐదు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కామారెడ్డి నుంచీ సీఎం కేసీఆర్‌పై బరిలో దింపారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన జి.వివేకానందకు చెన్నూ రు టికెట్ ఇచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సు వాడ నుంచి, షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ నారాయణ్‌ఖేడ్ నుంచి, నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో 14 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించగా, మరో రెండు స్థానాలకు గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. గతంలో బోథ్ నియోజకవర్గానికి వన్నెల అశోక్ పేరును ప్రకటించగా, తాజాగా ఆ యన స్థానంలో ఆదె గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే వనపర్తికి గతంలో జిల్లెల చిన్నారెడ్డి పేరు ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. అనేక కసరత్తుల తర్వాత ఆయన స్థానంలో తుడి మేఘారెడ్డిని బరిలోకి దింపుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి మొత్తం 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐకి కొత్తగూడెం కేటాయించగా.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను పెండింగ్‌లో ఉంచింది. ఒకవేళ సీపీఎంతో చర్చలు సఫలం అయితే వారికి మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కొత్తగూడెం సీటు.. రెండు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వడంతోపాటు, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నాయకత్వాలను సంప్రదించిన తర్వాత ఈ మేరకు ఒప్పందానికి వచ్చామని చెప్పారు. రేవంత్ సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షీ, కార్యదర్శి విష్ణుదాస్ ఆయన వెంట ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులతో పొత్తుపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తమపై ఉన్న రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామా లు, పరిస్థితులను సీపీఐ నేతలకు వివరించామని రేవంత్ తెలిపారు. పేదల తరఫున నిలబడేందుకు, పెద్ద మనసుతో ముందుకు రావాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తికి సీపీఐ అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, సీపీఐల మధ్య స్పష్టమైన పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని కోరారు. సెక్యులర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేందుకు, పేద, సామాన్యుల సమస్యలు చట్ట సభలలో ప్రస్తావనకు వచ్చేలా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శాసనమండలిలో సీపీఐకి చెందిన ఇద్దరు సభ్యులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మునుగోడు సీటుపైనా చర్చ జరిగిందని, అక్కడ స్నేహ పూర్వక పోటీ వద్దని సీపీఐని కోరామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. సీపీఎంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దగా పడిన ప్రజల విముక్తే లక్ష్యం: నారాయణ బీఆర్ఎస్ చేతిలో దగాపడిన ప్రజానీకానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఇందుకోసమే సీపీఐ, కాంగ్రెస్ ఐక్యంగా నిలబడ్డాయని తెలిపారు. రాజకీయ, భౌతిక, అనివార్య పరిస్థితుల్లో ఒక్క కొత్తగూడెం స్థానం నుంచే పోటీకి అంగీకరించామని కూనంనేని చెప్పారు. తమ స్నేహ బంధంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలావుండగా తాను ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూనంనేని ఖమ్మంలో చెప్పారు. ప్రజలు అన్ని విషయాలను గమనించి ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించాలని, ప్రజలను మరిచి పాలన చేస్తున్న పాలకులను ఓడించాలని పిలుపునిచ్చారు. కూనంనేని కార్యదర్శిగా కొనసాగేనా? కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ చేయనుండటంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కొనసాగుతారా లేదా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఆయన పూర్తి బిజీగా ఉంటే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఎవరెవరికి దక్కవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సీపీఐ ఎన్నికల కన్వీనర్‌గా చాడ వెంకట్‌రెడ్డిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
నేడే మోదీ బీసీ గర్జన సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు.. నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. గంటన్నర పాటు పర్యటన ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
61 సీట్లపైనే గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల కన్నా ఎక్కువ మెజారిటీని బీజేపీ గెలుచుకుంటుందని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో 119 నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్న ‘సెటిల్డ్’పార్టీ బీజేపీ కాదన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో ఈటలతో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. టీయూడబ్లు్యజే రాష్టప్రదాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయూ ప్రధాన కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈటల రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అనుకూలాంశాలను, కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మూలమైన అంశాలు మూలకు.. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియా మకాలు అనే అంశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. అన్ని పనులు ఆపి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనం లేకపోగా ప్రాజెక్టు పునాదులే కదిలాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలతో మొత్తం ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి వరకు ఉన్న రూ. 74 వేల కోట్ల అప్పును రూ. 5.5 లక్షల కోట్లు చేశారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 17 పోటీ పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, వడ్డీలేని రుణాలు, రుణమాఫీలన్నీ అటకెక్కాయి. పేదలకు భూములు ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచి్చన ప్రభుత్వ, దేవాలయ భూములు సేకరిస్తున్నారు. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారంతా కేసీఆర్ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షుడిగా చేసుకున్నారు. హంగ్‌వస్తే కాంగ్రెస్–బీఆర్ఎస్ ఒకటవుతాయి బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టిందని.. ఆ రెండు పార్టీలు ఒకటేనని మాపై ఒక వదంతి పుట్టించారు. రెండు పార్టీలు ఒకటి అయితే నేను గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఎందుకు పోటీ చేస్తా? టీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీతో ఎప్పుడూ పొత్తులేదు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్, బీజేపీ కలుస్తా యా? 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా మూ కుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు. 2018లో 19 మందిని గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కేసీఆర్ పంచన చేరారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను నివారించగలదు. మోదీ పాలనలో స్కాం లేదు. దేశ ఆత్మగౌరవం పెరిగింది. సెటిల్డ్ పార్టీ కాదు బీజేపీ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్‌గా లేదు. జనసేనతో మాకు అవసరం ఉంది కాబట్టే పొత్తు పెట్టుకున్నాం. 8 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తరహాలో ‘సెటిల్డ్’ పార్టీ కాదు. అందుకే నాయకులు వస్తుంటారు... పోతుంటారు. బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్టీలు ఎందుకు నాయకులను చేర్చుకుంటున్నాయి? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జీహెచ్ఎంసీలలో బీజేపీ సంపూర్ణంగా బలంగా ఉంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కొంత మేరకే ప్రభావం చూపుతాం. మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ మొదలైన మిగతా జిల్లాల్లోనూ బలం పెరిగింది. ఈ లెక్కన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబమే ముఖ్యమంత్రి పదవి చేపడుతుంది. 1947 నుంచి ఇప్పటివరకు తెలుగునాట బీసీ సీఎం లేరు. జనాభాలో 52 శాతం ఉన్నా పరిపాలన అందని ద్రాక్షే. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే.. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. దేశంలో బీసీలకు అవకాశాలు కల్పించిందే బీజేపీ. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు. నేడో రేపో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. -
ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్ ఇవ్వండి
కరీంనగర్ టౌన్: అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా నిజాయితీగా పోరు సాగిస్తున్నానని బీజేపీ కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించాలని.. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. సోమవారం మధ్యాహ్నం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్ విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, సోదరుడు బండి సంపత్, కిరణ్‌సింగ్‌తో కలసి కరీంనగర్ కలెక్టరేట్‌లోకి కారు నడుపుకుంటూ వెళ్లిన సంజయ్.. ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అవినీతికి, అక్రమాలకు తావులేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటివరకు ప్రజలు అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. వేల కోట్లు ఇస్తున్నా ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే దారిమళ్లించారని ఆరోపించారు. పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇళ్లు మంజూరు చేసినా పేదలకు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకట్రెండు పథకాలు అమలు చేసి అదేదో గొప్ప పని చేసినట్లు భూతద్దంలో చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్లు ముట్టజెబితే తప్ప పనులు అయ్యే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి శాంతిభద్రతలకు తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, అవినీతికి తావులేని పాలన కావాలన్నా బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు వైపా లేక ధర్మం వైపా ప్రజలు తేల్చుకోవాలి: రాజాసింగ్ కరీంనగర్ ప్రజలు ధర్మం కోసం నిరంతరం పోరాడుతున్న బండి సంజయ్ పక్షాన ఉంటారో లేక అవినీతి, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ. 20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్ధి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్లో సంజయ్ పోటీ చేస్తున్నారని తెలియగానే గంగుల కమలాకర్ దారుస్సలాం వెళ్లి ఎంఐఎం అధినేతకు సలాం చేశారని... అయినా సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ట్రిపుల్ తలాక్ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీయేనని మైనారిటీలు గుర్తించాలన్నారు. బండి సంజయ్‌పై 35 కేసులు.. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ సోమవారం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనపై పలు సందర్భాల్లో 35 కేసులు (గత అసెంబ్లీలో కేవలం 5 కేసులు) ఉన్నాయని పేర్కొన్నారు. అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయన్నారు. సంజయ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి భూములు, గృహాలు లేకపోవడం గమనార్హం. మొత్తంమీద సంజయ్ దంపతుల ఆస్తుల విలువ రూ.79.51 లక్షలు మాత్ర మే. ఇక తనకు రూ.5.44 లక్షల రుణాలు, తన భార్యకు రూ.12.40 లక్షల రుణాలు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు.