TS Special
-
అవినీతి.. వైఫల్యాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదన్నరేళ్ల పాలనలో అవినీతి, అరాచకాలు, లోటుపాట్లు, వైఫల్యాలు ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ సర్కార్‌పై చార్జ్‌షీట్‌ను ప్రకటిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది. దేశంలోనే అవినీతికి, లంచగొండితనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉదాహరణగా మారిందని ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ ప్రభుత్వం–అవినీతి అనేవి రెండూ పర్యాయ పదాలుగా మారిపోయాయని విమర్శించింది. కాళేశ్వరంలో అవి నీతి ఎక్కడుందో చూపాలంటూ సవాళ్లు చేశారని, అయితే నిజం అనేది దాగదు కాబట్టి ఎన్నికలకు ముందు భగవంతుడే పిల్లర్ల కుంగుబాటు ద్వారా దానిని ప్రజల ఎదుట పెట్టాడని తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ సర్కార్‌పై చార్జ్‌షిట్‌ను సోమ వారం బీజేపీ రాష్ట్ర శాఖఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, మేనిఫెస్టోకమిటీ చైర్మన్ పి.మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తేజావత్ రామచంద్రుడు, జయచంద్ర విడుదల చేశారు. దళితులకు దగా, బీసీలకు ద్రోహం, విద్యారంగం ఆగం, వైద్యరంగంలో హామీల బుట్టదాఖలు, నిరుద్యోగులకు మోసం, విశ్వనగరం–విషాదనగరం.. ఇలా 31 అంశాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఈ చార్జ్షిట్లో బీజేపీ ప్రస్తావించింది. చార్జ్‌షీట్‌లో ముఖ్యాంశాలు... బీఆర్ఎస్ అవినీతి: 2014లో కేసీఆర్ సీఎం అయ్యాక అవినీతి విలయతాండవం. సీఎంతో సహా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియా.. వీటన్నింటిలోనూ బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు. మిషన్ భగీరథ అంతా అవినీతికంపే. మిషన్ కాకతీయ పేరుతో రూ. 30 వేల కోట్లలో అధిక సొమ్ము బీఆర్ఎస్ నాయకుల జేబులోకి పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి కంపు. ప్రాజెక్టును రీడిజైన్ చేసి, అంచనాలు పెంచారు. రూ.40వేల కోట్ల రూపాయల అంచనాను రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచి, సీఎంకుటంబసభ్యులే కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. మేడిగడ్డ కూలిపోయే స్థితికి రావడం తెలంగాణ ప్రజల రక్తమాంసాలను తాగినట్టుగానే మేం భావిస్తున్నాం. సీఎం కూతురికే లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయి. ధరణి పోర్టల్ బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఆదాయవనరుగా మారింది. చెరువులు, కుంటలు, పార్కులు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములు, కాందిశీకుల భూములు... ల్యాండ్ మాఫియాలో బీఆర్ఎస్ నిండా మునిగి ఉంది. అవినీతికి ఎవరు పాల్పడినా 040–23452933 నంబర్‌కు కాల్ చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఆ నంబర్ అసలు మనుగడలోనే లేదు. రైతులకు మోసం: అప్పుల బాధతో తొమ్మిదిన్నరేళ్లలో 7,800 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా బస్తా యూరియా కూడా ఇయ్యలే. నీటి పారుదల రంగం: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా, ఇంతవరకు కొత్త ఆయకట్టుకు నీరందింది లేదు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదు. దళితులకు దగా: దళితుడిని ముఖ్యమంత్రి చెయ్యలే, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యలేదు గిరిజనులు : గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదు. పోడు భూములు పూర్తిగా ఇవ్వలేదు. బీసీలకు ద్రోహం: బీసీల సమగ్ర అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు ఏటా వెయ్యికోట్లు కేటాయిస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంబీసీ కుల వర్గీకరణ చేయలేదు. విద్యారంగం ఆగం: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు హామీని నెరవేర్చలేదు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలతో ఈ–లైబ్రరీల నిర్మాణానికి ఇంతవరకు అతీగతి లేకుండా పోయింది. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా బోధనా సిబ్బందిని నియమించలేదు. మహిళలకు అన్యాయం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలిస్తామని ఇంతవరకు ఇచ్చింది లేదు. మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి, కాగితాలకే పరిమితమైంది. మహిళలకు రక్షణ లేదు. నిరుద్యోగులకు మోసం : ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్నడు, కనీసం ఊరికొక ఉద్యోగం కూడా ఇయ్యలే. పోలీసుశాఖలో తప్ప ఇతర శాఖలలో నియామకాలే లేవు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు తొమ్మిది సంవత్సరాల తర్వాత 2022లో ఇచ్చిండు. కానీ అది కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు రద్దు అయ్యింది. సర్కారు వైఖరితో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులకు నెలకు 3016/– భృతి, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. విద్యుత్ రంగం: కొత్తగా 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వేల రూపాయల బిల్లు వేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలపై భారం వేసి ఆర్థికంగా ఇబ్బందులు చేశారు. పారిశ్రామిక రంగం: నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలే. కార్మికులు, రైతులను అన్యాయం చేశారు. కాగజ్‌నగర్ నుంచి మణుగూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గాలిమాటలు చెప్పిండు. విశ్వనగరం కాదు... విషాద నగరం: మూసీనదిని బ్యూటిఫికేషన్ చేసి, టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేసిండు. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మూసీ మురికిపోలే, కంపుపోలే. హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణ జరగలేదు కానీ కబ్జాలు జరుగుతున్నాయి. కార్మికులు: కార్మికులకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు. తెలంగాణ ఉద్యమకారులు: అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వలేదు. రూ. 10 లక్షలు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపేలేదు, అమరవీరులకు విలువ లేదు. రాష్ట్రం కోసం పోరాడిన వారిని కూడా మోసం చేసిండు. జర్నలిస్టులు: జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇవ్వకుండా దగా చేసిండు. జేఎన్జే సొసైటీకి 38 ఎకరాల స్థలాన్ని కోర్టు ఉత్తర్వులు వచి్చన తర్వాత కూడా బదలాయించలేదు. పరిపాలనాలోపాలు: ప్రజలకు అందుబాటులో లేని సీఎంగా కేసీఆర్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిండు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సీఎంని కలవరు. రాష్ట్ర పాలన మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం చేతిలో యావత్ తెలంగాణ బందీ అయ్యింది. అతివాదం, ఉగ్రవాదం ఊతమిచ్చే కుట్ర :బీజేపీ చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ మురళీధర్‌రావు ప్రజల భద్రతకు ఒకప్పుడు నక్సలైట్ల తీవ్రవాదంతో ఎలాంటి ముప్పు ఉన్నదో, నేడు అతివాదం, ఉగ్రవాదంతో అంతే ప్రమాదం ఉందని బీజేపీ నేత, పార్టీ చార్జ్‌షీట్ కమిటీ చైర్మన్ పి. మురళీధర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ కారిడార్‌ను ఉగ్రవాదం, అతివాదం వైపు మళ్లించేందుకు (ర్యాడికలైజేషన్ ఆఫ్ ఇస్లాం) ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అనేక సంఖ్యలో ఉన్నారని, ఈ విషయంలో ఎంఐఎం, బీఆర్ఎస్ అలైన్మెంట్ కారణంగా సవాళ్లు ముందుకొస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనపై బీజేపీ అభియోగపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎఫ్ఐతో లింకులు ఇక్కడ బయటపడ్డాయని, ఎన్ఐఏ ఇక్కడకు వచ్చి కొందరిని అరెస్ట్ కూడా చేసిందని తెలిపారు. తెలంగాణ–మద్యం, హైదరాబాద్–డ్రగ్స్ అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని మండిపడ్డారు. -
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా!
నాగోజు సత్యనారాయణ: రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు టీఎస్ఎస్పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బెటాలియన్స్ అడిషనల్ డీజీ, కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్ అధికారి స్వాతి లక్రా వెల్లడించారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల భద్రత విధుల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల మోహరింపు, ప్రధాన విధులకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా పంచుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రధానంగా అప్పగించే ఎన్నికల విధులు...? ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అన్ని దశల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు..ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తాం. ఎన్నికల విధుల్లో కేంద్ర బలగాల మోహరింపు ఏ ప్రాతిపదికన ఉంటుంది..? స్థానికంగా ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నాయి..అందులో ఎన్ని సమస్యాత్మకమైనవి, సున్నితమైనవి ఉన్నాయన్న నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలను పంపుతున్నాం. ప్రస్తుతానికి వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా పంపించాం. స్థానికంగా వాళ్లకు వసతి సదుపాయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్స్టేషన్లు,, గత ఎన్నికల్లో నమోదైన ఘటనల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అవసరం మేరకు అదనపు బలగాలను కేటాయిస్తున్నాం. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడానికి కారణం..? స్థానికంగా యూనిట్ ఆఫీసర్లు కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లు చేస్తున్నారు. దీని ముఖ్యఉద్దేశం..మీ ప్రాంతంలో భద్రత కోసం పూర్తి సన్నద్ధంగా మేం ఉన్నాం అని పోలీసు నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడమే. దీనివల్ల ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం. అదే సమ యంలో సంఘ విద్రోహశక్తులకు ఒక్కింత హెచ్చరిక మాదిరిగా ఈ కవాతులు చేయడం సర్వసాధారణమే. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు ఇతర రాష్ట్రాల పోలీసు సిబ్బంది బందోబస్తుకు వస్తారా..? ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నందున అందుకు అనుగుణంగా విడతల వారీగా కేంద్ర సాయుధ బలగాల సర్దుబాటు ఉంటుంది. ఒక్కో కంపెనీలో సరాసరిన 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ లెక్కన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నుంచే 30 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరికి అదనంగా ఎలక్షన్ పది రోజుల ముందు నుంచి పోలింగ్ తేదీన విధుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాల సిబ్బందితో పాటు హోంగార్డులు సైతం ఉంటారు. 2018 ఎన్నికల భద్రత విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలే ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగిందా..? గతంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా, ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఎక్కువ కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ఈసారి మొత్తం 375 కంపెనీల బలగాలను మనం అడిగాం. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు వస్తాయి. -
మార్పుతో మేలు జరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి జరిగే జేఈఈ మెయిన్స్‌లో గణనీయమైన మార్పులు తెచ్చారు. ఫిజిక్స్, మేథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కొన్ని టాపిక్స్ ఎత్తేశారు. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్‌కు ఇప్పటికే విద్యార్థులు సన్నద్ధమయ్యారు. ఈ దశలో సిలబస్ మార్పులను ఎన్టీఏ ప్రకటించడంతో ఇది రాష్ట్ర విద్యార్థులపై కొంత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సిలబస్ నుంచి తొలగించిన టాపిక్స్‌కు కూడా విద్యార్థులు ప్రిపేరయ్యారు. ఇప్పుడు వాటిని తప్పించడంతో మిగిలిన టాపిక్స్‌లో పోటీ తీవ్రంగా ఉండే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సిలబస్‌తో ఇంటర్ చేసే వాళ్లు మరికొంత శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని... అలాగే వారంతా ఏప్రిల్‌లో జరిగే రెండో దశ మెయిన్స్‌కు హాజరు కావడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగేనా? సిలబస్ తగ్గించడంతో ఈసారి మెయిన్స్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కటాఫ్ మార్కుల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి జేఈఈ రాసేవారి సంఖ్య కొన్నేళ్లుగా తగ్గుతోంది. 2014లో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుకాగా 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉండగా ప్రస్తుతం 1.30 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలు ఉండగా 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. రాష్ట్ర ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతారు. జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. సిలబస్ కఠినంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించే సిలబస్ చదివితే తప్ప మెయిన్స్ గట్టెక్కలేమనే భావన విద్యార్థుల్లో ఎక్కువవుతోంది. దీంతో చాలా మంది రాష్ట్ర స్థాయిలోని ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. సిలబస్‌లో మార్పులు తేవడంతో ఈసారి జేఈఈ రాసే వారి సంఖ్య కొంతమేర పెరిగే వీలుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మేథ్స్ ఇక కఠినం కానట్టేనా? కొన్నేళ్లుగా జేఈఈ మెయిన్స్ రాస్తున్న వారు ఎక్కువగా గణితం కష్టంగా ఉందని చెబుతున్నారు. కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా స్కోర్ చేస్తున్న అనుభవాలున్నాయి. ఫిజిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది దక్షిణాది విద్యార్థులకన్నా ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులను కలవరపెడుతోంది. మేథ్స్‌లో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు పట్టు ఉంటోంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సరైన శిక్షణ అందుకోలేకపోతున్నారు. జేఈఈలో ఇచ్చే గణితంలో సుదీర్ఘ ప్రశ్నలుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మేథ్స్‌లో ట్రిగ్నామెట్రిక్ ఈకే్వ షన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రిన్సిపుల్ ఆఫ్ మేథమెటికల్ ఇండక్షన్ వంటి టాపిక్స్ వచ్చే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. దీనివల్ల తేలికగానే జేఈఈ మెయిన్స్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
మీరే తెలంగాణ ద్రోహులు
లక్డీకాపూల్(హైదరాబాద్):‘అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు’’అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రో హులంటూ తననుద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందిస్తూ నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన వెన్నుపోటుదారులనీ, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి తమ కుటుంబాన్నే అభివృద్ధి చేసుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి దివాలా తీయించి, కోటి ఎకరాల మాగాణికి సాగునీరందిస్తామని చెప్పి పనికి రాని ప్రాజెక్ట్ కట్టి రూ.లక్ష కోట్లు కాజేశారు’అని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా మని హామీనిచ్చి 10 ఏళ్లలో రాష్ట్రంలో లక్ష ఉ ద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ‘నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫాంహౌస్‌కే.. నియామకాలు మీ ఇంట్లోకే పరిమితం చేశారు’అని షర్మిల ఆరోపించారు. -
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున ఇంప్లీడ్ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
పాలేరు నుంచి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి. సాగర్, ఎండీ అబ్బాస్‌తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మూడు నినాదాలతో సీపీఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ’’మొదటిగా.. సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడేందుకు సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతి నిధ్యం ఇవ్వాలని అడుగుతాం. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తాం. మూడో అంశంగా.. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు గానీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లో కూడా అడ్డుకోవాలని కోరతాం.’’అని ఆయన వివరించారు. పొత్తుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు వామపక్షాలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదని, ఆ పార్టీ తీరు సరిగా లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టు సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న ప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదన్నారు. తమ్మినేనికి భట్టి, జానారెడ్డి ఫోన్ కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలు తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందని చెప్పారు. పొత్తు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పొత్తుల విషయంపై సీపీఐ.. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గంలో కారం పుల్లయ్య, అశ్వారావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్యా వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్‌లో బజ్జ చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నర్సింహ్మ, జనగాంలో మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పగడాల యాదయ్య, పటాన్చెరులో జె.మల్లికార్జున్, ముషీరాబాద్‌లో ఎం.దశరథ్ పోటీ చేస్తారని తమ్మినేని ప్రకటించారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. -
కాంగ్రెస్ వస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్పు అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు కాకూడదని, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి అంతేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని.. అవినీతి, అక్రమాల్లో కవల పిల్లల వంటివని విమర్శించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో దళిత సీఎం నుంచి దళితబంధు దాకా, ఉద్యోగాల భర్తీ మొదలు నిరుద్యోగ భృతి దాకా.. ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా చాలా రంగాల్లో కేసీఆర్ సర్కార్ పాలన తూతూమంత్రంగానే సాగిందని ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తనతో బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేయాలన్న నిర్ణయానికి అనుగుణంగానే తనను అసెంబ్లీకి పోటీచేయొద్దని జాతీయ నాయకత్వం ఆదేశించిందన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సరైన తీర్పు ఇవ్వాలి కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే. ఈ రెండింటికి వేస్తే ఎంఐఎంకు వేసినట్టే. కేసీఆర్ అవినీతి, నయా రాచరిక పాలనతో ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది. దేశంలోని అన్ని సమస్యలకు, దోపిడీ, అవినీతి రాజకీయాలకు కారణమైన కాంగ్రెస్.. తెలంగాణలో గ్యారంటీలు నెరవేర్చుతామంటే ఎలా నమ్ముతారు? ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు. ఓటు ఆయుధంతో సరైన తీర్పు ఇవ్వాలి. నేరం చేసినవారు జైలుకు వెళ్లాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత అరెస్టో, సోనియాగాంధీ అరెస్టో.. ఏదైనా విచారణ సంస్థల బాధ్యత. అది బీజేపీకి సంబంధం లేని అంశం. తప్పు జరిగిన చోట ఆధారాలతో వ్యవస్థ ముందుకెళ్తుంది. నేరం చేసిన వారెవరైనా జైలుకెళ్లాల్సిందే. కాళేశ్వరంగానీ మరే పథకంలోగానీ అవినీతి జరిగిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కోరితేనో లేదా హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆదేశిస్తేనో సీబీఐ విచారణకు అవకాశం ఉంటుంది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇస్తుండటమే దీనికి కారణం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోసం మధ్యాహ్నం 2గంటలకు కేసీఆర్ సంతకం పెడితే.. 4 గంటలకల్లా సీబీఐ టీమ్‌ను సిద్ధం చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేసీఆర్ వద్ద అంత డబ్బు ఎక్కడిది? తానే ఓ సూపర్ ఇంజనీర్ అన్నట్టుగా కేసీఆర్ నిపుణుల సూచనలను కాదని కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. రూ.30వేల కోట్ల ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.1.30 లక్షల కోట్లకు పెంచి.. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన నాయకత్వాన్ని అంగీకరిస్తే అన్ని రాజకీయపార్టీల ఎన్నికల ఖర్చును భరిస్తానని కేసీఆర్ చెప్పినట్టు ఒక సీనియర్ రిపోర్టర్ వెల్లడించారు. అంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల డబ్బు ఒక సీఎం చేతుల్లో ఉందంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఓటమి ఖాయం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి, తన కొడుకును సీఎం చేయాలన్న ఆలోచనే తప్ప ప్రజల బాగోగులను కేసీఆర్ పూర్తిగా విస్మరించారు. తనతోనే తెలంగాణ వచ్చినట్టు కేసీఆర్ గొప్పలు చెప్తుంటారు. బీజేపీ ఎంపీల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రంఏర్పడేదా? ఉద్యమాలతో అధికారంలోకి వచ్చి.. మరెవరూ ఉద్యమాలు చేయకుండా, తమ గోడు చెప్పుకొనే అవకాశం లేకుండా గొంతు నొక్కేస్తున్నారు. ఈ తీరుపై ప్రజలు విసిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్లా కేసీఆర్ ఓటమి ఖాయం. కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుచేసి విఫలమయ్యారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు రిపీట్ కాబోతోంది. బీసీలంతా కలసి గెలిపించుకుంటారు తెలంగాణలో బీసీలకు రాజ్యాధికార సాధన లక్ష్యంతోనే మేం పనిచేస్తున్నాం. దేశంలో మొదటిసారిగా బీసీ నేతను సీఎం చేస్తామని ప్రకటించాం. రాష్ట్ర జనాభాలో 55శాతం ఉన్న బీసీలు తమ వాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. వాళ్లే గెలిపించుకుంటారు. ఈ విషయంలో ఎవరి ప్రభావం పనిచేయదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను అవహేళన చేస్తున్నాయి. జనసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ. పొత్తుధర్మంగా వారిని కలుపుకొని ముందుకెళ్తాం. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. దుబారా తగ్గించి, అవినీతిని పూర్తిగా అరికడుతుంది. కేసీఆర్ కుటుంబభవన్గా మారిన ప్రగతిభవన్‌ను ప్రజా ప్రగతిభవన్గా మారుస్తాం. ప్రజలకు అందుబాటులో ఉండే సీఎంను తీసుకొస్తాం. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చూపిస్తాం. అవినీతి రహిత వ్యవస్థను నిర్మిస్తాం. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. వ్యక్తిగత అవసరాల కోసమే వీడుతున్నారు పార్టీని వీడేవారు వ్యక్తిగత అవసరాలకోసం వెళ్తున్నారు. ఏం ఇబ్బంది లేదు. మాది కేడర్ ఆధారిత పార్టీ. ప్రజలు మాతోనే ఉన్నారు. నామినేషన్ల విత్‌డ్రా తర్వాత మేనిఫెస్టో విడుదల చేయడం మా సంప్రదాయం. ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడి సలహాలు తీసుకున్నాం. ఏం చెబుతామో అది చేసి చూపిస్తాం. -
ఫేస్బుక్ యాడ్స్‌లో ఫేక్ లోన్‌యాప్స్ నమ్మి మోసపోవద్దని
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు తెరతీసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా ఫేక్ లోన్ యాప్‌లను ఫేస్బుక్లో యాడ్స్ రూపంలో పంపుతున్నట్లు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో వచ్చే ఆన్లైన్ లోన్‌యాప్‌లలో నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లో రుణం మొత్తం జమ చేస్తామంటూ నమ్మబలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఫేస్బుక్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి వడ్డీ కూడా అతి స్వల్పం అని ఊదరగొడుతున్నారన్నారు. ఇలా వారి వలకు చిక్కే అమాయకుల నుంచి ప్రాథమిక వివరాల కోసం అంటూ ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల వివరాలు సేకరిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు పనిచేసే సంస్థల నుంచే ఆన్లైన్ రుణాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. -
6 నెలలు... రూ.1.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.18 లక్షల కోట్ల మేర నిధులు సమకూరాయి. వివిధ వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 87,207.22 కోట్లుకాగా బహిరంగ మార్కెట్లో రూ. 31,333.72 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం సేకరించింది. 2023–24 బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడులు రూ. 2.59 లక్షల కోట్లుకాగా అందులో 46 శాతం మేర అర్ధ వార్షిక కాలంలో వచ్చాయి. ఇందులో పన్ను ఆదాయం రూ. 66,691.49 కోట్లు ఉండగా పన్నేతర ఆదాయం రూ. 16,896.29 కోట్లు వచ్చినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ప్రభుత్వం ఇచ్చిన ఆరు నెలల నివేదికలో వెల్లడించింది. ఖర్చు రూ. 1.14 లక్షల కోట్లు తొలి ఆరు నెలల కాలంలో రూ. 1,18,558.96 కోట్ల మేర రాబడులురాగా అందులో రూ. 1,14,151.39 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ. 91,315.21 కోట్లుగా నమోదవగా ప్రణాళికా వ్యయం కింద రూ. 22,836.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం వ్యయ అంచనాల్లో ఆరు నెలల కాలంలో జరిగిన ఖర్చు 61 శాతం కావడం గమనార్హం. ఇక సమకూరిన పన్ను ఆదాయాన్ని శాతాలవారీగా పరిశీలిస్తే ఎక్సైజ్ ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనా రూ. 19,884 కోట్లుకాగా అందులో 62 శాతం అంటే రూ. 12,255.95 కోట్లు మొదటి ఆరునెలల్లోనే వచ్చింది. రానున్న ఆరు నెలల కాలంలో కలిపి అంచనాలను మించి ఎక్సైజ్ ఆదాయం వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. -
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. గ్రేటర్ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. మాకూ ఓ భవన్ కట్టివ్వాలి... గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అఫ్ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్‌వో వన్‌హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్‌పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
నాయకులంతా బిజీబిజీ.. ఒక్క ఎమ్మెల్సీ మాత్రం సైలెంట్ మోడ్‌లో..!
ఎన్నికల వేళ రాజకీయ నాయకులంతా బిజీగా కనిపిస్తారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ మాత్రం ప్రశాంతంగా తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నారు. కొన్నాళ్ళ క్రితం కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ కావాలనుకున్న కోరిక తీర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన గురించి పార్టీ పట్టించుకోలేదు. ఆయన కూడా పార్టీని లైట్ తీసుకుంటున్నారట. ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. అది బీజేపీ ఖాతాలో పడింది. ఇక అంతే ఇరువైపులా నో కమ్యూనికేషన్ ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ? కాషాయ పార్టీ ఇప్పుడు ఆయన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు ? గత మార్చి నెలలో తెలంగాణలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గానికి ఏ. వెంకటనారాయణరెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీ అయ్యే లక్ష్యంతో కాషాయపార్టీలో చేరిన వెంకట నారాయణరెడ్డి ఆ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న ఏవీఎన్ రెడ్డి ఉపాధ్యాయ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యాక తన లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏవీఎన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిన వేళ ఎక్కడా కానరావడంలేదు. ఇదే ఇప్పుడు ఈ జిల్లాల్లోని కాషాయపార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు విడతలుగా తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. కాని తాను ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై ఏవీఎన్ రెడ్డితో బీజేపీ నాయకులు ఎవరూ కనీసం సంప్రదించలేదట. తన పట్ల పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆ ఎమ్మెల్సీ అలక బూనినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, స్వామిగౌడ్, ఎర్ర శేఖర్, యెన్నం, జిట్టాలాంటి వాళ్లు కాషాయపార్టీకి దూరమయ్యారు. ఉన్న నేతలను కాపాడుకోలేకపోతున్న కమలనాథులు.. గెలిచిన ఎమ్మెల్సీని కూడా పట్టించుకోకపోవడంపై చర్చ కొనసాగుతోంది. సైలెంట్‌గా వ్యాపారాలు చేసుకునే చాలా మంది ప్రముఖులు చట్టసభలో సభ్యులు కావాలని కోరుకుంటారు. కాని ప్రజల్లో నిలబడి గెలవడం వారివల్ల కాదు. అందుకే మండలి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తారు. అలా ఏదో ఒక పార్టీ అవకాశం ఇచ్చి...గెలిస్తే వారి కోరిక తీరుతుంది. అలాగే ఏవీఎన్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలనుకున్నారు. కాషాయ పార్టీ ఛాన్స్ ఇచ్చింది..ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పట్టించుకోవడంలేదని కినుక వహించారని సమాచారం. మరి సైలెంట్‌గా ఉంటారా? పార్టీలో యాక్టివ్ మోడ్‌లోకి వస్తారా? వెయిట్ అండ్ సీ. -
హాట్ సీట్.. ఆ అసెంబ్లీ సెగ్మెంట్!
వారిద్దరూ పాత ప్రత్యర్థులే. ఇద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే. ఒకరు ప్రస్తుత మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఇప్పుడిద్దరూ ఖమ్మం అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్నారు. లోకల్‌గా ఓటర్లను ప్రభావితం చేయగల తమ సామాజికవర్గం మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి తను మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లి బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఏకంగా టీడీపీ ఆఫీస్‌కు వెళ్ళి పచ్చ కండువా కప్పుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా..బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మాటలతూటాలు తారాస్థాయికి చేరాయి. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల 18 వేల ఓట్లు ఉండగా...ఇందులో 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా...ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారుతున్నాయి. అటు గులాబీ పార్టీ..ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ కమలం పార్టీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేకపోవడంతో...బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడుతున్నాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఓట్లు చేజారకుండా ఇద్దరు అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంగటున్నారు. ఏ ఒక్క అవకాశం దొరికినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కంటి చికిత్సకోసం లభించిన తాత్కాలిక బెయిల్ విషయంలో అదే జరిగింది. తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసినా...ఖమ్మంలోని కమ్మ నేతలు మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు తన పాత పార్టీ బాస్, తమ కుల నేత చంద్రబాబుకు బెయిల్ వచ్చినందుకు ఆయనకు సంఘీభావం తెలియచేయడానికి టిడిపి జిల్లా కార్యాలయంలో అడుగుపెట్టారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన జిల్లాలోని టిడిపి కార్యాలయానికి ఎప్పుడూ రాలేదు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీకి తుమ్మలను ఆహ్వానించడంతో ఆయన అక్కడకు వెళ్ళారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది టీడీపీ కార్యాలయమే అని చెప్పారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా..టీడీపీ శ్రేణుల సంతోషంలో భాగస్వామిని కావాలని ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇదే కేరింతలతో రానున్న 30 రోజులూ తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అటు బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సైతం చంద్రబాబు బెయిల్‌పై విడుదలైనందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్ బండ్ మీదున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చారని ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తాను ఖండించినట్లు చెప్పుకున్నారు. రెండు సార్లు విజయం సాధించి..మూడోసారి గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్న పువ్వాడ అజయ్ తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పడం మానేసి.. చంద్రబాబు భజన చేయడంతో గులాబీ పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పదేళ్ళ నాడు ఆరు వేల ఓట్ల తేడాతో పువ్వాడ ఆజయ్‌కుమార్ మీద ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎలాగైనా ఆయన మీద గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అదవిధంగా తుమ్మలను మరోసారి ఓడించి..హ్యాట్రిక్ సాధిస్తానని పువ్వాడ చెబుతున్నారు. రెండు బలమైన పార్టీలు..ఇద్దరు పాత ప్రత్యర్థులు ఢీ అంటే ఢీ అంటుండటంతో ఖమ్మం నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది. ఇద్దరూ తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...తమ సామాజికవర్గమైన కమ్మవారి మద్దతు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఖమ్మం ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాలి. -
‘కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’
సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై హోంమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముందు రేవంత్‌రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రం.. నంబర్‌వన్ సీఎం కేసీఆర్.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
‘నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’
సాక్షి, నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గద్దె దించడమే తన ముందున్న లక్ష్యమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. దీనిలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ నేను పార్టీ మారినా కాంగ్రెస్‌లోకే వచ్చా. నా ఏకైక లక్ష్యం కేసిఆర్ నియంత పాలనను గద్దె దించడమే. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం యంత్రాంగం వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా?, మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే మునుగోడుగడ్డ ప్రజలు ఎక్కడ కూడా తలలించుకునేలా చేయలేదు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకోరావడానికి కష్టపడ్డాం.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ చేతిలో పోయింది.ఆ కుటుంబాన్ని గద్దే దించడానికి పోరాడుతున్నా. రాజ్‌గోపాల్‌రెడ్డికి ప్రజాబలం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశా.రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది. చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు గెలుస్తాడా?, ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డ నుంచే జరుగుతుంది.కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది మునుగోడు గడ్డ. అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మళ్లీ కాంగ్రెస్ లోకి ఎలా వస్తా.అమ్ముడుపోయానని నాపై ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్నా నన్నుకొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నేను పదవి త్యాగం చేసినా.. పదవిలో ఉన్నా అది ప్రజల కోసమే.. నా పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెట్టిన. నా చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి.గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారు.చండూరు ను రెవిన్యూ డివిజన్ చేశారు. చౌటుప్పల్‌లో వంద పడకల ఆసుపత్రి ఇచ్చారు. కొత్త రోడ్లు వేశారు.గజ్వేల్ లో పోటీ చేస్తాను అని ఏఐసీసీకి చెప్పా. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతోంది.ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది’ అని విమర్శించారు. -
ఈ రాత్రికే బీజేపీ తుది జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాత్రికి బీజేపీ తన తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. 20 నుంచి 23 స్థానాలతో బీజేపీ తుది జాబితాను విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీ తుది జాబితాను రాష్ట్ర నాయకత్వమే ప్రకటించే చాన్స్ ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు సమాచారం. మరొకవైపు ఈ నెల 12 లేదా 13న మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. -
రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం నడుస్తుండగా.. కేటీఆర్ ప్రచారం కోసం వినూత్నంగా ఆలోచించారు. సోషల్ మీడియాను బేస్ చేసుకుని ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ యాసతో సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘మై విలేజ్ షో’ టీమ్‌తో ఓ ప్రోగ్రామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను గంగవ్వ అండ్ టీమ్‌తో షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరీంనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. అదే వేదిక మీద ఉన్న గంగవ్వతో మాట్లాడారు. ఈ సమయంలోనే.. తన మై విలేజ్ షో ఛానల్‌కు సమయం ఇవ్వాలని కోరగా.. కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తానని ఆ సభా వేదికగా గంగవ్వకు కేటీఆర్ మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట మేరకు.. కేటీఆర్ మై విలేజ్ షోకు వెళ్లారు. అక్కడ గంగవ్వతో పాటు అనిల్ జీలా, అంజి మామతో కలిసి స్వయంగా నాటుకోడి కూర, గుడాలు, బగార అన్నం వండారు కేటీఆర్. ఈ మొత్తం ప్రోగ్రామ్‌ను వీడియో తీశారు. నవ్వులే నవ్వులు.. ఇక, అందులో కేటీఆర్‌తో గంగవ్వ ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అనుకుంటూనే.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగింది గంగవ్వ. కేసీఆర్‌తో తనకు ఎప్పుడైన గొడవలు అయ్యాయా అని అడగ్గా.. గొడవలు జరగని ఇళ్లు ఉండదని.. వాళ్లకు కూడా జరిగాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్‌ను ఏమని పిలుస్తావ్ అని అడగ్గా.. బయట సార్ అని, ఇంట్లో మాత్రం డాడీ అని పిలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. వాళ్ల టీంతో పాటు కేటీఆర్ టమాటలు కట్ చేశారు. ముచ్చట్లు చెప్తూనే అందరి కంటే ముందే కోసేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తానే అన్ని పనులు చేసుకున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏ కూర బాగా వండుతారని అంజిమామ అడిగితే.. తాను అన్ని బాగానే వండుతా కానీ.. అది తినే వాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ నవ్వులు పూయించారు. కవితతో అనుబంధం.. ఇలా.. తన కుటుంబం గురించి, ఎమ్మెల్సీ కవితతో అనుబంధం గురించి కేటీఆర్ చెప్పారు. అటు వంట చేస్తూ.. మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూనే.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొత్తానికి నాటు కోడి కూరతో బగారా అన్నంతో గంగవ్వ టీంతో కలిసి సరదా సరదాగా ముచ్చట్లు చెప్పుకుటూ కేటీఆర్ జబర్ధస్త్ దావత్ చేసుకున్నారు. అటు దావత్ చేసుకుంటే.. మధ్యలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ప్రచారం కానిచ్చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల స్పందిస్తూ.. వినూత్న ప్రచారం చేయడంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వ్యక్తి లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
జనం లేని సేన
రాజకీయ నేతగా అవతారం ఎత్తిన సినీ హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉనికి చాటేందుకు ఉత్సాహ పడుతున్నారు. ఈ నవంబరులో జరగనున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా 32 సీట్లు తమకు కావాలని బీజేపీతో బేర సారాలు మొదలు పెట్టారు. అవి కూడా ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న స్థానాలు కావడం విశేషం. ఏపీలో రాజకీయాలు చేస్తున్న జనసేనకు వాస్తవానికి తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కేసును ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా వీరంగం కట్టిన పవన్ కళ్యాణ్ 2024 ఏపీ శాసన సభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుని తమ భాగస్వామ్యం గురించి ప్రకటన కూడా చేశారు. తెలంగాణ శాసన సభ ఎన్నికలు వేదికగా.. జనసేన పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అయిదు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎన్నికల అరంగేట్రం చేసింది. కానీ, ఒక్క చోటా ఆ పార్టీ గెలవలేకపోయింది. సినిమా హీరోగా ఉన్న అభిమానమే పునాదిగా జనసేన ఇక్కడ రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నా ఇప్పటి దాకా ఆ దిశలో పడిన అడుగులు తక్కువే. కానీ, ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కనీసం 32 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు తాము ఎన్నికల పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరుపుతున్న బీజేపీ నాయకత్వం వద్ద ఈ ప్రతిపాదన కూడా పెట్టింది. ఆంధ్రా సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరం పరిధిలోని పటాన్ చెరు, కూకట్ పల్లి, సనత్ నగర్, కుద్బుల్లా పూర్, శేరిలింగం పల్లి, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్.బి.నగర్ నియోజకవర్గాలలో పోటీ చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఈ ఓటర్లంతా టీడీపీ వెనక నిలబడినట్లు నాటి ఎన్నికల ఫలితాలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత నియోజకవర్గాలే ఏడు కావడం ప్రస్తావనార్హం. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండే.. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా పోటీ కోసం జనసేన ఉవ్విళ్ళూరుతోంది. ఒక్క నల్గొండ జిల్లాలోనే 4 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. తెలంగాణలో ఈసారి పోటీ ఎందుకంటే..? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటికే 2014, 2018 లో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో జనసేప పోటీ చేయలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 5 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఫలితం సాధించలేక పోయింది. ఇక్కడ సత్ఫలితాలు సాధించేంతగా జన బలం లేదని తెలిసినా ఈ సారి ఏకంగా 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన ఎందుకు నిర్ణయించుకుంది..? 2019 లోక్ సభ ఎన్నికల తర్వాతి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో బలపడేలా కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించిందా..? జనంలోకి చొచ్చుకుపోయిందా ..? అన్న ప్రశ్నలకు ఒక్క దానికి కూడా ఆ పార్టీ నేతల దగ్గర సరైన సమాధానం దొరకదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ స్కామ్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముద్దాయిగా కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలను ఎదుర్కోవడమే గగన కుసుమంగా మారిన కారణంగా తెలంగాణలో టీడీపీ చేతులు ఎత్తేసింది. చివరి నిమిషం దాకా తేల్చకుండా తీరా మూడు రోజుల కిందట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు చావుకబురు చల్లగా చెప్పిన చంద్రబాబు తీరుతో టీటీడీపీ నాయకులు, శ్రేణులు షాక్ గురయ్యాయి. దీంతో రెండు రోజుల కిందట టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయదన్న విషయం జనసేన అధినేతకు ముందే తెలుసా..? ఆ కారణంగానే ఆయన బీజేపీలో పొత్తుల రాయబారం నడిపారా..? తెలంగాణలో టీడీపీకి ఉన్నట్లు భావిస్తున్న అంతో ఇంతో ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ఈ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపుతున్నారా అన్న అంశాలు ఇపుడు చర్చకు వస్తున్నాయి. దిగజారిన టీడీపీ స్థానంలో.. జనసేను నిలబెట్టే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. 2014 లో 15 సీటులు గెలుచుకున్నా టీటీడీఎల్పీని నాటి టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చివరకు 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్కకు తప్పుకుని ముందే అస్త్ర సన్యాసం చేసింది. ఇపుడు టీటీడీపీ స్థానంలో జనసేనను నిలబెట్టే ప్రయత్నాలు తెలంగాణలో జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మంచి ఊపు మీదున్న బీజేపీ ఆ తర్వాత చతికిల పడింది. పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. ఏ పార్టీలతో పొత్తు లేదు.. ఈ సమయంలో జనసేన తాము ఉన్నామంటూ పొత్తుల కోసం వస్తోంది. పొత్తుల అంశం ఇంకా ఖరారు కాకున్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోసం తాము పోటీ చేసిన స్థానాల నుంచి వైదొలిగిన జనసేన ఈ సారి 32 సీట్లలో తాము పోటీ చేస్తామని, తమకు మద్దుత ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్.డి.ఎ)లో బీజేపీతో కలిసి జనసేన భాగస్వామ్య పక్షంగా పనిచేస్తోంది. ఈ అంశాన్ని ముందు పెట్టి తెలంగాణలో బీజేపీ అండదండలతో పాగా వేసే ప్రతయ్నాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -మిత్ర. ఎన్ -
డీకే శివకుమార్.. ఇదేనా మీ నీతి: కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక అడ్డాగా మారిందన్నారు. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీలకు లేఖలు రాసి శివకుమార్ వాటిని బెంగళూరు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కాగా, కేటీఆర్ శనివారం జలవిహార్‌లో తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘ఫాక్స్ కాన్ కంపెనీకి గత నెలలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ లేఖ రాశారు. ఎంతో కష్టపడి మనం ఆ కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చాం. ఫాక్స్ కాన్ సీఈవో కూడా ఇక్కడ కంపెనీ పెట్టీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంపెనీ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం ఉంది. కానీ, శివకుమార్ ఫాక్స్ కాన్ సీఈవోకి లేఖ రాసి ఆ కంపెనీ బెంగుళూరుకు మార్చండి అంటూ చెప్పాడు. సరే, కంపెనీ విషయంలో ఆశ పడుతున్నాడు అనుకోవచ్చు. కానీ, ఇంకా కొన్ని కామెంట్స్ చేశారాయన. త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుంది. అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తాం అని లేఖలో రాసుకొచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నం. తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకపోతే జరిగేది ఇదే. ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చాక ఇక్కడ కంపెనీలను అక్కడికి తీసుకువెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలకు బెంగుళూరు అడ్డాగా మారింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ వచ్చే ఉద్యోగాలు కూడా బెంగుళూరుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీ నీతి, నిజాయితీ’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ: మంత్రి మల్లారెడ్డి -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
మేడిగడ్డ ఏడో బ్లాక్ పరిధిలో పనులు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బతినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయపరమైన విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు బ్యారేజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరోవైపు డ్యామేజ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. పిలర్లు కుంగిపోయిన ఏడో బ్లాక్ పరిధిలో పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. నీటిని మళ్లించినా ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి బ్యారేజ్‌కు నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎగువ నుంచి 26,350 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 61 గేట్లు ఎత్తి 22,590 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నదిలో కాఫర్ డ్యాం పనులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్నారం బుంగల కోసం గ్రౌటింగ్ అన్నారం (సరస్వతి) బ్యారేజీ బుంగలు ఏర్పడిన విషషయమూ తెలిసిందే. ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు వేసినా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో రెండు పియర్ల వద్ద సీపేజీ (బుంగలు) ఏర్పడగా వాటి మరమ్మతులకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. 2020లో ఇలాంటి పరిస్థితి ఎదురుకాగా పాలియూరిథిన్ (పీయు) గ్రౌటింగ్ ద్వారా బుంగలను పూడ్చారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మేడిగడ్డ పంచాయతీ.. బారికేడ్లతో బ్యారేజ్ మూసివేత -
బీజేపీ నాలుగో జాబితాపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికి మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ నాయకత్వం మిగిలిన 31 సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ నేతలు ప్రకాష్ జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ భేటీ అయ్యారు. జనసేన పొత్తు ప్రకటన దరిమిలా పార్టీలో వస్తున్న వ్యతిరేకతపై చర్చించినట్టు సమాచారం. జనసేనకు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు సీట్లు, వేములవాడ, హుస్నాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో ఏర్పడిన చిక్కుముడిని విప్పడం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు బండిసంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెబుతున్నారు. జనసేనకు కేటాయించే సీట్లతో పాటు మిగిలిన సీట్లపై అక్కడ పెద్దలతో చర్చించనున్నారని అంటున్నారు. ఏదేమైనా రెండు రోజుల్లో నాలుగో జాబితా వెలువడవచ్చునని తెలుస్తోంది. ఆరేడు సీట్లలో పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు రోజుల తర్వాత వీటిని ప్రకటించవచ్చునని అంటున్నారు. నేడు మేడిగడ్డకు కిషన్‌రెడ్డి, ఈటల బృందం.... కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా.. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు ఏర్పడటం వంటి పరిణామాల నేపథ్యంలో శనివారం పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డా.కె.లక్ష్మణ్, ఎం.రఘునందన్‌రావు అక్కడకు వెళ్లనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు అంబట్పల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి గంట పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడి పరిస్థితులు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 నిముషాలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
జేబులో నోటులాంటి కేసీఆర్‌ను వదులుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి వారిని కడుపులో పెట్టుకుని చూడాలన్నదే సీఎం కేసీఆర్ విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తాం, కూల్చేస్తామని కొందరు అంటున్నారని, జేబులో నోటు లాంటి సీఎంను వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్దన్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ చిల్లర మాటలకు పడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగు పరుస్తూ నగరాన్ని పసిగుడ్డులా చూసుకుంటున్నామన్నారు. ‘వండి పెట్టుడు.. మూతి తుడుసుడు తప్ప అన్నీ ప్రభుత్వమే చేస్తుంది’అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు హైదరాబాద్ మహా నగరంలో పేదల కోసం ఇప్పటికే లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి 70వేలు పంపిణీ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ మెట్రోను 400 కి.మీ మేర విస్తరిస్తామన్నారు. సినీ నటులు రజనీకాంత్, సన్నీ డియోల్, లయ తదితరులు హైదరాబాద్‌ను అమెరికా నగరాలతో పోలి్చన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్కు యునైటెడ్ ముస్లిం ఫోరం మద్దతు మైనారీ్టల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రకటించింది. ప్రగతిభవన్‌లో ఫోరం ప్రతినిధులు శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముస్లింల జీవితాల్లో గణనీయ మార్పు వచి్చందని, బడ్జెట్లో కేటాయింపులు పెంచడంతో పాటు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు వంటివి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అక్బర్ నిజాముద్దిన్, జియాఉద్దిన్ నయ్యర్, సయ్యద్ మసూద్ తదితరులున్నారు. -
ముగిసిన రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం శుక్రవారం ముగిసింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యాగం చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకారంతో దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. మహాపూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ పాదపూజ చేసి పుష్పాభిషేకంతో గురువందనం సమర్పించారు.