ఎన్నికల వేళ రాజకీయ నాయకులంతా బిజీగా కనిపిస్తారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ మాత్రం ప్రశాంతంగా తన వ్యాపారాలు తాను చేసుకుంటున్నారు. కొన్నాళ్ళ క్రితం కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ కావాలనుకున్న కోరిక తీర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన గురించి పార్టీ పట్టించుకోలేదు. ఆయన కూడా పార్టీని లైట్ తీసుకుంటున్నారట. ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. అది బీజేపీ ఖాతాలో పడింది. ఇక అంతే ఇరువైపులా నో కమ్యూనికేషన్ ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ? కాషాయ పార్టీ ఇప్పుడు ఆయన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు ?
గత మార్చి నెలలో తెలంగాణలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గానికి ఏ. వెంకటనారాయణరెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్సీ అయ్యే లక్ష్యంతో కాషాయపార్టీలో చేరిన వెంకట నారాయణరెడ్డి ఆ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. విద్యాసంస్థల అధినేతగా ఉన్న ఏవీఎన్ రెడ్డి ఉపాధ్యాయ కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యాక తన లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏవీఎన్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిన వేళ ఎక్కడా కానరావడంలేదు. ఇదే ఇప్పుడు ఈ జిల్లాల్లోని కాషాయపార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
నాలుగు విడతలుగా తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. కాని తాను ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై ఏవీఎన్ రెడ్డితో బీజేపీ నాయకులు ఎవరూ కనీసం సంప్రదించలేదట. తన పట్ల పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆ ఎమ్మెల్సీ అలక బూనినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, స్వామిగౌడ్, ఎర్ర శేఖర్, యెన్నం, జిట్టాలాంటి వాళ్లు కాషాయపార్టీకి దూరమయ్యారు. ఉన్న నేతలను కాపాడుకోలేకపోతున్న కమలనాథులు.. గెలిచిన ఎమ్మెల్సీని కూడా పట్టించుకోకపోవడంపై చర్చ కొనసాగుతోంది.
సైలెంట్‌గా వ్యాపారాలు చేసుకునే చాలా మంది ప్రముఖులు చట్టసభలో సభ్యులు కావాలని కోరుకుంటారు. కాని ప్రజల్లో నిలబడి గెలవడం వారివల్ల కాదు. అందుకే మండలి సభ్యత్వం కోసం ప్రయత్నిస్తారు. అలా ఏదో ఒక పార్టీ అవకాశం ఇచ్చి...గెలిస్తే వారి కోరిక తీరుతుంది. అలాగే ఏవీఎన్ రెడ్డి ఎమ్మెల్సీ కావాలనుకున్నారు. కాషాయ పార్టీ ఛాన్స్ ఇచ్చింది..ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పట్టించుకోవడంలేదని కినుక వహించారని సమాచారం. మరి సైలెంట్‌గా ఉంటారా? పార్టీలో యాక్టివ్ మోడ్‌లోకి వస్తారా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment