TS Special
-
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణను దెబ్బ తీయడానికి, రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కాంగ్రెస్, బీజేపీల ముసుగులో తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారని మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌తో బీజేపీ చేతులు కలిపారు. షర్మిలమ్మ కాంగ్రెస్‌లో కలుస్తుందంటా.. వీరిద్దరూ తెలంగాణ ద్రోహులు కాదా. తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేసిన పవన్‌తో బీజేపీ చేతులు కలిపింది. తెలంగాణ అంటే సిగరేటా.. బీడీనా అన్న షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందట. లోపల నుంచి చంద్రబాబు కూడా సపోర్టు చేస్తారంటా. ఓట్లు చీలవద్దని చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయబోమని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ద్రోహులంతా ఒక్కటవుతున్నారని అర్థమవుతోంది’అని విమర్శించారు. రేవంత్ క్రిమినల్ నం.4170 తెలంగాణ గెలవాలంటే ప్రజలు కేసీఆర్ పక్షాన నిలవాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్‌రెడ్డి క్రిమినల్ గ్యాంగ్‌కు మద్దతు ఇవ్వాలని హరీశ్‌రావు ఘాటుగా వాఖ్యానించారు. ఈ క్రిమినల్ గ్యాంగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా రూ.50 లక్షలతో దొరికిన రేవంత్‌రెడ్డే క్రిమినల్. ఆయన క్రిమినల్ నం.4170 బెయి ల్ మీద బయట ఉన్న ఖైదీ రేవంత్ అని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తిప్పలు తప్పవు.. కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలతో బయలు దేరిందని, తప్పిపోయి ఆ పార్టీకి ఓటేస్తే తిప్ప లు తప్పవని హరీశ్‌రావు అన్నారు. ‘కర్ణాటకలో ఐదుగంటల కరెంటు కూడా ఉండటంలేదని వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. సాఫీగా కేసీఆర్ పాలన జరు గుతున్న ఈ తరుణంలో రిస్క్ ఎందుకో ఆలోచించుకోవాలి’అని ఆయన ప్రజలకు సూచించారు.] ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనా హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చినప్పటికీ కిషన్‌రెడ్డి పదవి పట్టుకుని వేలాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బీఆర్ ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్, టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
కేసీఆర్ ఓటమి ఖాయమైంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి వంటివన్నీ ఒక్క వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతున్నాయని.. ఈసారి కేసీఆర్ కుటుంబాన్ని ఓడించాలన్నదే ప్రజల నిర్ణయమని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం చేశారనే గుడ్‌విల్‌తో 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని.. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తును రాజకీయ ప్రయోజనానికి, సెంటిమెంట్‌కు వాడుకుని 2018లో గట్టెక్కారని చెప్పారు. కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ గుడ్‌విల్ జీరో అయిందన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనంలోకి తెచ్చుకుని, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అపోహలు పటాపంచలు అయ్యాయన్నారు. ఓవైపు కేసీఆర్ కూటమిలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఉంటే.. మరోవైపు తమ కూటమిలో కాంగ్రెస్‌తోపాటు టీజేఎస్, ప్రజా సంఘాలు, కలసివస్తే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయని తెలిపారు. ఏ కూటమి కావాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా 20ఏళ్ల అనుభవంతో చెప్తున్నా. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఈసారి తప్పకుండా ఓడిస్తారు. తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి వంటివన్నీ ఒక్క వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతున్నాయి. తెలంగాణను టీజీ నుంచి టీఎస్‌గా మార్చడంలో, తెలంగాణ అధికారిక చిహ్నంలో కేసీఆర్ రాచరిక పోకడలు కనిపిస్తున్నాయి. త్యాగాల గుర్తుగా ఉండాల్సిన తెలంగాణ చిహ్నం రాచరికానికి దర్పణంగా నిలుస్తోంది. గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస అనేది కేసీఆర్ పోకడ. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడి బతికే రోజులు వచ్చాయి. ఇది తెలంగాణకు మంచిది కాదు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్. ఈ పదేళ్లలో మొత్తం రూ.22.71లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అవన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? తెలంగాణ ప్రజల భవిష్యత్తు, బంగారు తెలంగాణ ఏమయ్యాయి? కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరూ పరోక్షంగా, ప్రత్యక్షంగా బాధితులే. అందుకే మేడిగడ్డ కుంగింది కేసీఆర్ పాపాల పుట్ట పగిలినందుకే మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డ కుంగిందో లేదో, నాణ్యతా లోపం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. మీడియాను, ఇంజనీర్లను కూడా తీసుకెళ్లాలి. కేసీఆర్ అంటే టీఆర్ఎస్ వాళ్లకు కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లలా అనిపిస్తే మాకు మాత్రం కాళేశ్వరం కరప్షన్ రావు అనిపిస్తోంది. మేం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతుబంధు ఇస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి ఉంటే అమలు చేసేవాళ్లం. దాంతో కేసీఆర్ వచ్చి తానే రైతుబంధును సృష్టించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. పాలనపై చర్చిద్దాం వస్తారా? కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో (1994–2004), బీఆర్ఎస్ హయాంలో (2004–14) ఏం జరిగిందో చర్చించేందుకు మేం సిద్ధం. వచ్చే పదేళ్లలో ఏం చేస్తామో కూడా ప్రజలకు చెబుదాం. కేసీఆర్ చర్చకు రావాలి. లేదంటే హరీశ్, కేటీఆర్‌లలో ఎవరొచ్చినా పర్వాలేదు. బీజేపీ, ఎంఐఎం ప్రతినిధులను కూడా పిలవాలి. ఏ పార్టీ విధానమేంటో? ఏ పార్టీ ఏం చేసిందో? ఆరోగ్యకర వాతావరణంలో చర్చించుకుందాం. నాతోపాటు కాంగ్రెస్ పక్షాన సీఎల్పీ నేత భట్టి వస్తారు. హైదరాబాద్‌ను వరల్డ్ డెస్టినీగా మారుస్తాం కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సంపదను సృష్టిస్తే ఆ ఆదాయాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మా వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ నగరాన్ని వరల్డ్ డెస్టినీగా మారుస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా మూసీ చుట్టూ అద్భుత ప్రణాళికను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తాం. రోడ్లు వేస్తాం.అర్బన్, సబర్బన్, రూరల్ తెలంగాణను మూసీతో కనెక్ట్ చేస్తాం. నదిని ప్రక్షాళన చేస్తాం. ఇరువైపులా రేడియల్ రోడ్లు వేసి నల్లగొండ వరకు డిస్నీవరల్డ్ లాగా, సింగపూర్ అమ్యూజ్మెంట్ పార్కుల్లాగా ప్రాజెక్టును అమలు చేస్తాం. హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ గుట్టల్లో 25–30 వేల ఎకరాల్లో ప్రజల భాగస్వామ్యంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రణాళిక మా వద్ద ఉంది. లెఫ్ట్‌తో చర్చలు ముగియలేదు కాంగ్రెస్ పక్షాన వామపక్షాలతో సీఎల్పీ నేత భట్టి, వంశీచంద్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇవి ముగిశాయని నేను అనుకోవడం లేదు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సహజ మిత్రులు. చర్చల సారాన్ని త్వరలోనే వెల్లడిస్తాం. ధరణిని సమూలంగా మారుస్తాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సరికొత్త వెబ్‌సైట్‌ను తీసుకొస్తాం. సోనియా వల్లే తెలంగాణ సాకారం ఏపీలో కాంగ్రెస్‌పై రాజకీయ అణుబాంబు పడుతుందని తెలిసినా ధర్మం వైపు నిలబడేందుకే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోతే 100 మంది కేసీఆర్‌లు వచ్చి వెయ్యేళ్లు ఉద్యమించినా తెలంగాణ వచ్చేది కాదు. ప్రాణత్యాగాల గురించి మాత్రమే మాట్లాడితే.. 1,200 మంది అమరుల తర్వాత కేసీఆర్ ప్రాణం 1,201వది అయ్యేది. అంతకన్నా జరిగే నష్టం ఏమీ ఉండేది కాదు. తెలంగాణ ప్రజల డిమాండ్‌కు శాశ్వత పరిష్కారం కోసమే సోనియా తెలంగాణ ఇచ్చారు..’’అని రేవంత్ పేర్కొన్నారు. కేటీఆర్.. గన్నేరు పప్పు తనను పప్పు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ‘‘అవును నేను పప్పునే. కందిపప్పును. కొడంగల్ ప్రాంతంలో పండే కందిపప్పును. ప్రోటీన్లు ఎక్కువ ఉండి ప్రపంచ ఖ్యాతి ఆర్జించిన కందిపప్పును. కానీ కేటీఆర్ మాత్రం గన్నేరు పప్పు. ఆరోగ్యంగా ఉండాలంటే కందిపప్పు, ముద్దపప్పు తింటారు. కానీ గన్నేరు పప్పు తింటే చస్తారు..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
అఫిడవిట్లతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అఫిడవిట్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే సమర్పించాలని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాల సమర్పణలో పొరపాట్లుంటే నామినేషన్ తిరస్కరిస్తామని, అందుకు అభ్యర్థే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, కానీ ఒకదానికి మాత్రమే డిపాజిట్ చెల్లుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ గంట కుదించడం జరిగిందని సీఈఓ తెలిపారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. రైతుబంధుపై ప్రతిపాదనలు రాలేదు.. ప్రగతిభవన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ వచ్చిందని, ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రైతుబంధు పథకం కింద లబ్దిదారులకు సాయం అందజేతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. కోడ్ ఉల్లంఘనలపై 137 కేసులు ఫైల్ చేశామని, ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13, కాంగ్రెస్ 16, బీజేపీ 5, బీఎస్పీకి సంబంధించి 3 కేసులు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రత జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 4 నెలలుగా దాదాపు 22 శాఖలతో సమావేశాలు నిర్వహిస్తోందని, అందులో ఐటీ శాఖ కూడా ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శాఖ లు బాధ్యతతో పనిచేస్తున్నాయని వివరించారు. తొలిసారిగా పెద్దసంఖ్యలో యువ ఓటర్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరిందని, ఇందులో పురుషులు 1.609 కోట్లు, మహిళలు 1.608 కోట్లు ఉన్నారని సీఈఓ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన నవంబర్ 10వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. 18–19 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు 9.10 లక్షల మంది ఉన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో యువ ఓటర్లుండడం ఇదే తొలిసారి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లున్నాయని, ఇందులో పట్టణ ప్రాంతంలో 14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 ఉన్నాయన్నారు. ఓటర్లకు ముందస్తుగానే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందజేస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.453.93 కోట్లు సీజ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.453.93 కోట్లు సీజ్ చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రూ.165.43 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.43.86 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, సెల్ఫో న్లు తదితర వస్తువులు సీజ్ చేశామన్నారు. నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యే కంగా రూపొందించిన నిబంధనలు పాటించా లని సూచించారు. సీజ్ చేసిన ప్రతి రూపాయికి రసీదు ఇవ్వడం జరుగుతుందని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 362 కేసులు నమోదు చేయగా, 256 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. 2,928 బైండోవర్లు ఉన్నాయని, 7,460 ఆయుధాలు డిపాజిట్ చేశామని తెలిపారు. నాన్‌బెయిలబుల్ వా రెంట్లు 238 జారీ చేశామని, ఇప్పటివరకు సీ విజిల్‌కు 2,487, 1950 నంబర్‌కు 437 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. -
మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది. 7వ నంబర్ బ్లాక్ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్ఏ చైర్మన్ సంజయ్‌కుమార్ సిబల్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పునాది కుంగడం వల్లే.. ర్యాఫ్ట్ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్ పైల్స్ (కటాఫ్ వాల్స్) నిర్మించారు. ర్యాఫ్ట్ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్), ఇతర కారణాలతో ర్యాఫ్ట్కి ముందు భాగంలోని సెకెంట్ పైల్స్ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో నాణ్యత లోపం నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్ పైల్స్ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్ ఉండకూడదు. కానీ గ్యాప్ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయింది. డిజైన్‌కు విరుద్ధంగా నిర్మాణం ఫ్లోటింగ్ స్ట్రక్చర్ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్ చేసి, రిజిడ్ స్ట్రక్చర్(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్ గోడలు (సెకెంట్ పైల్స్) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్లిఫ్ట్ ఫోర్స్) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్ కుంగిపోయింది. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్ అండ్ ప్రోబింగ్ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. అడిగిన సమాచారం ఇవ్వలేదు.. నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు. సమగ్ర దర్యాప్తు జరపాలి.. బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి. అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే! కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్‌ను అత్యవసరంగా పరీక్షించాలి. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీరింగ్లోపాలు, అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని పలువురు మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు డిమాండ్ చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి నిలువెత్తు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేసి, అందులో లేవనెత్తిన లోపాలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు పాల్గొని మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో సర్వేలు లేకుండా గిన్నిస్ రికార్డుల కోసమే కాళేశ్వరం నిర్మించారని టీజేఎస్ అధినేత కోదండరాం ఆరోపించారు. ఇంజనీర్లు, వైస్ చాన్స్లర్లు, ఇతర నిపుణుల పనులు సైతం తానే చేయాలని సీఎం కేసీఆర్ కోరుకోవడంతో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేకుండా పోయిందన్నారు. ఇంజనీర్లు డిజైన్ చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు చెక్కుచెదరలేదని, సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో సరైన సర్వే లేకుండానే ప్రాజెక్టును నిర్మించారని రిటైర్డ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి అన్నారు. డ్యామ్‌సేఫ్టీ యాక్ట్ 2021 కింద బాధ్యులపై కేసులు నమోదు చేయాలని జర్నలిస్టు జయసారథి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ కాలంలో నిర్మించడంతోనే లోపాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణానికి చాలా తేడాలున్నాయన్నారు. ప్రాణహితను ఎందుకు పక్కనపెట్టారు? ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కనపెట్టి కాళేశ్వరాన్ని కట్టారని రిటైర్డ్ ఇంజనీర్ రఘుమారెడ్డి ప్రశ్నించారు. రూ.లక్షాయాభై వేల కోట్లను నాశనం చేసిన పనికి బాధ్యులు ఎవరు? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సీజ్ చేయాలని, బాధ్యులైన ఇంజనీర్లు, అధికారులను జైలులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును మళ్లీ చేపట్టాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు అయినా సరైన తనిఖీలు చేయకపోవడంతో సమస్యలొస్తున్నాయని రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అంటే కేసీఆర్ ఖజానా ఖాళీశ్వరమని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్, కోశాధికారి సురేశ్ పాల్గొన్నారు. -
డ్రీమ్ సిటీలో డ్రీమ్‌హాక్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ ‘డ్రీమ్‌హాక్’కు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ప్రారంభమైన యాక్షన్–ప్యాక్డ్ గేమింగ్ మహోత్సవం మూడ్రోజులపాటు కొనసాగనుంది. గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్ డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేమ్లతోపాటు వర్క్‌షాప్‌లు, అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్‌హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్స్టర్, హ్యుందయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. పీసీ మోడ్, మొబైల్ మోడ్ విధానంలో గేమ్స్ నిర్వహించగా హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ నగరాల డిజిటల్ గేమర్స్ పాల్గొంటున్నారు. డ్రీమ్‌హాక్ రాపిడ్ ఓపెన్ టోర్నమెంట్, డ్రీమ్‌హాక్ బ్లిట్జ్ ఓపెన్ టోర్నమెంట్, కేఓ ఫైట్ నైట్, పబ్జీ ఆధారిత గేమ్‌లు, రెట్రో జోన్ గేమ్స్ మోనోపోలీ, లూడో, క్యారమ్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్వో వంటి ప్రసిద్ధ బోర్డ్ గేమ్‌లతో డ్రీమ్‌హాక్ అలరిస్తుంది. వివిధ విభాగాల విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు డ్రీమ్‌హాక్ ప్రకటించింది. -
‘వాటిని మేనిఫెస్టోలో చేర్చండి.. లేదంటే 200 మంది నామినేషన్ వేస్తాం’
కామారెడ్డి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి సమాయత్తమవుతోంది తెలంగాణ అమరుల ఐక్యవేదిక. దీనిలో భాగంగా రెండొందల మంది అమరుల కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాల కోసం కామారెడ్డికి వచ్చినట్లు తెలంగాణ అమరుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రఘుమారెడ్డి.. తెలంగాణలో 1345 మంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైతే కేవలం 400 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొంతమందికి నాల్గవ తరగతి ఉద్యోగాలు ఇవ్వగా, మరికొంతమందికి ఐదేళ్ల తర్వాత రూ. 10 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. ‘రైల్ రోకో, బస్ రోకో చేసిన సమయంలో 175 మంది వికలాంగులుగా మారారు.. వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. చదువుకున్న వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకోని వారికి ఒక్క కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలి. తమ డిమాండ్లు ఈ నెల 9 మధ్యాహ్నం 12:30 లోపు కేసీఆర్ తమను పిలిచి మేనిఫెస్టోలో చేర్చాలి. లేకపోతే ఆ రోజు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన మరుక్షణమే 200 మంది అమరుల కుటుంబాలు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. కామారెడ్డితో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో కూడా నామినేషన్స్ వేస్తాం’ అని హెచ్చరించారు. నేను కందిపప్పు అయితే నువ్వు గన్నేరు పప్పు: కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్ -
‘కేసీఆర్ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, నాణ్యత లేని నాసిరకం నిర్మాణం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పలేదని పరిస్థితి నెలకొందనన్నారు. కాళేశ్వరంపై పాదదర్శకత లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుకు వచ్చేది రూ.40 వేలు అయితే.. ప్రాజెక్టు నిర్వహణకు ఎకరాకు రూ. 85 వేలు ఖర్చవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం మోపే ప్రాజెక్టు అని విమర్శించారు. డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని దుయ్యబటారు. ప్రాజెక్టుపై 9 అంశాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. చదవండి: పప్పు వ్యాఖ్యలపై కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుంది. డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసుకున్నారు. ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయింది. కాంగ్రెస్ హయాంలో 30 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. ఇంజినీరింగ్ మార్వల్ అని గొప్పలు చెప్పుకున్నారు. జబ్బలు చరుచుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్ళకే పిల్లర్లు కుంగిపోయాయి. ఆ పిల్లర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన జలశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లు ఇవ్వలేని పరిస్థితి. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు.. కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతాం. బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వంద శాతం చర్యలు తీసుకుంటాం. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళతాం’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్ -
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. బైంసా సభలో కేసీఆర్... ‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి.. ‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు. -
పప్పు వ్యాఖ్యలపై కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను కందిపప్పు లాంటివాడినని, ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారని, తింటే చస్తారని విమర్శించారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోవాలని, గన్నేరు పప్పును కాదని చురకలంటించారు.ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో త్యాగాలు గుర్తుచేసేలా కాకుండా, రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలను అడిగితే బాగా చెబుతారన్నారు. తెలంగాణ మాములుగా ఏర్పడలేదని, రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణాలు బలితీసుకున్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారని తెలిపారు. ‘తెలంగాణ గురించి మాట్లాడాలంటే జూన్ 2, 2014 ముందు, వెనుక అంటాం. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేశాం. ఆంధ్రలో పార్టీ సర్వం కోల్పోయినా.. న్యాయం ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియా. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని ఇవ్వలేదు. కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారింది. ప్రజా సంఘాలకు, అఖిలపక్ష నేతలకు ప్రాధాన్యత లేదు. అసెంబ్లీ హాల్లో కూడా ప్రతిపక్ష నేతల సీట్లు మార్చారు. మీడియాపై ఆంక్షలు పెట్టారు. సచివాలయంలో కూడా ప్రవేశానికి నో ఎంట్రీ అంటున్నారు. అపోజిషన్ లీడర్లకు అనుమతి ఉండదా? ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎంను ఎవరైనా నేరుగా కలిసే అవకాశం ఉండేది. నియంత కంటే ఎక్కువగా వుంది కేసీఆర్ పాలన. నియంత కాదు క్రిమినల్ పొలిటిషన్. కోట్లాది సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుంది అర్ధం కావడం లేదు. నిరుద్యోగులు ఇంటికి పోకుండా దాపరించింది. మేడిగడ్డ కుంగింది, అన్నారం పలిగింది. నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టారు. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులను ఆగంచేసింది. కేసీఆర్ ఇచ్చిన చాలా మాటలు అమలు కాలేదు. మోసం చేసిన ద్రోహిణి తన్ని తరమాలి. తెలంగాణ దేశానికే ఆదర్శం అన్నారు. ఇప్పుడేమో కర్ణాకకలో ఇది చేస్తలేదు అది చేస్తలేదని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారు. మరి బీజేపీ గెలవాలా? అంటే బిజెపి బిఆర్ఎస్ ఒక్కటే అని మేము అంటున్నాం. పక్క ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకొస్తుంది. 2050 ప్రణాళికతో ముందుకొస్తున్నాం. కేసీఆర్ గురించి మేము ఏమి చెప్పనవసరం లేదు. కేసీఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. చివరికి జర్నలిస్టులను కూడా ఆగం చేశారు’ అని రేవంత్ ధ్వజమెత్తారు. LIVE: TPCC President Sri Revanth Reddy Meet The Press at TUWJ || Revanth Reddy https://t.co/A5Jhhqf6WF — Revanth Reddy (@revanth_anumula) November 3, 2023 -
ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్ ముదిరాజుల్లో ఎవరిని ఎదగనివ్వలేదని అందుకే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చి పదవులిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం టీటీడీపీ మాజీ చీఫ్ కాసాని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని తెలిపారు. ముదిరాజ్ ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు.బీఆర్ఎస్ హయాంలో వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. -
TS: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతోపాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేయనున్నట్టుగా ఓవైసీ పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసేపనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం రెండు విడదతల్లోనూ 100 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. రెండు పార్టీలో మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చదవండి: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రాసేదెవరు? -
జానారెడ్డి కుమారుడి ఇంట ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు రాజకీయపరమైన చర్చకు దారి తీశాయి. గురువారం ఉదయం మొదలైన ఐటీ సోదాలు అర్ధరాత్రి దాకా జరగ్గా.. శుక్రవారం ఉదయం కూడా అవి కొనసాగుతున్నాయి. పలు బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు నగరంలో, నగర శివారుల్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన 18 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విప్సర్ వ్యాలీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి ఇంట ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న అర్ధరాత్రి దాకా మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఉదయం మరోసారి చేపట్టారు. నార్సింగ్‌లోని ఇంటితో పాటు మదాపూర్‌లోని కేఎల్ఆర్ హెడ్‌క్వార్టర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. బడంగ్ పేట్ మేయర్ పారిజాతం ఇంట అర్ధరాత్రి దాకా ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ క్రమంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలో కూడి నిన్న ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగాయి. -
వేగు చుక్కలే..తోకచుక్కౖలై
బొల్లోజు రవి: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు తెలంగాణలో ఒక వెలుగు వెలిగాయి. ఆ పార్టీల నేతృత్వంలోని సాయుధ పోరాటంతో తెలంగాణలో ఊరూరా ఎర్రజెండా రెపరెపలాడింది. కమ్యూనిస్టుల ఉద్యమాలంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. వాళ్ల పాటలు ప్రజలను ఉర్రూత లూగించేవి. మార్క్సిస్ట్ సాహిత్యం లక్షలాది మంది యువతను వామపక్ష భావజాలం వైపు తీసుకెళ్లింది. ఇక చట్టసభల్లోనూ కమ్యూనిస్టుల గళం బలంగా వినిపించేది. అలాంటి కమ్యూనిస్టు పార్టీల కోటలు ఇప్పుడు బీటలువారాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోగా, తాజాగా ఒంటరిగా బరిలో దిగేందుకు సీపీఎం సిద్ధం కాగా, సీపీఐ కూడా అదే దారిలో పయనిస్తుందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య నుంచి జీరో స్థాయికి దిగజారి.. 1952 ఎన్నికల నాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఎక్కువ సీట్లే వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి 1953లో ప్రకాశం పంతులు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, తెలంగాణ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో కలిపి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. తెలంగాణలో భాగంగా 1952లో కాంగ్రెస్‌కు 38 సీట్లు రాగా, పీడీఎఫ్ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులకు 36 సీట్లు వచ్చాయి. ఇక 1957లోనూ గణనీయమైన సంఖ్యలోనే సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానం పొందింది. ఆ తర్వాత 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 177 సీట్లు సాధిస్తే, సీపీఐ (అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ) 51 సీట్లతో ప్రతిపక్ష స్థానం సంపాదించింది. ఇక ఆ తర్వాత సీపీఐలో చీలిక వచ్చి సీపీఐ, సీపీఎంలుగా విడిపోయాయి. 1967లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు మూడు, నాలుగో స్థానానికి చేరుకున్నాయి. అప్పుడు సీపీఐకి 10, సీపీఎంకు 9 స్థానాలు దక్కాయి. 1972 ఎన్నికల్లో సీపీఐకి 7, సీపీఎంకు ఒక స్థానం లభించింది. ఎనీ్టఆర్ అసెంబ్లీ రద్దు చేశాక 1985లో జరిగిన ఎన్నికల్లో చెరి 11 స్థానాలు దక్కించుకొని మళ్లీ తమ సత్తా చాటాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 8, సీపీఎంకు 7 స్థానాలు రావడం గమనార్హం. 1989లో మళ్లీ సీట్లు తగ్గాయి. అయితే 1994లో కమ్యూనిస్టు పార్టీలు మళ్లీ పూర్వవైభవం దిశగా ముందుకొచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ భారీ మెజారిటీ సీట్లు సాధించారు. కాంగ్రెస్ రెండో స్థానంలో 26 సీట్లు సాధించగా, సీపీఐ, సీపీఎంలు కలిపి కాంగ్రెస్ కంటే ఎక్కువగా 34 సీట్లు సాధించడం విశేషం. విడివిడిగా సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు సాధించాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో సీపీఐకి 13, సీపీఎంకు 8 సీట్లు రావడం విశేషం. 1999లో జరిగిన ఎన్నికల్లో సీపీఎంకు రెండు స్థానాలే దక్కగా, సీపీఐకి ఒక్కటీ రాలేదు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాలు సాధించాయి. అందులో తెలంగాణలో సీపీఐకి 6, సీపీఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక సీపీఐ, సీపీఎంల పరిస్థితి దిగజారుతూ పోయింది. అంటే 20 ఏళ్లుగా ఆ రెండు పార్టీలు చతికిలపడి పోయాయి. 2018 ఎన్నికల్లో ఒక్క సీటూ రాని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పుంజుకోని వైనం.. రాష్ట్రం ఏర్పాటయ్యాక తిరిగి కీలకమైన స్థానంలోకి రావాల్సిన సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒక రకంగా తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర ప్రకారం చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సి ఉండేదని ఆ పార్టీల సానుభూతిపరులు చెబుతుంటారు. ఎందుకీ దుస్థితి అంటే.. కమ్యూనిస్టు పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చిన కారణాలు అనేకమనే చెప్పాలి. కొత్త తరం కమ్యూనిస్టు భావజాలం వైపు రావడం లేదని, మారుతున్న కాల పరిస్థితులను బట్టి నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు నాయకుల త్యాగాలు కేడర్‌లో ఉత్సాహం నింపగా, నేటి నాయకుల తీరుపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్న కారణాలు కమ్యూనిస్టు పార్టీలు ఎదగకపోవటానికి ప్రధాన కారణం ఎన్నికల్లో ఇతర పార్టీలు డబ్బు కుమ్మరించడం, కుల, మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం. గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుండటం వల్ల ప్రజాపోరాటాలు లేకుండా పోయాయి. వ్యవసాయ కార్మిక, రైతు పోరాటాలు పెద్దగా నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు, కమ్యూనిస్టులకు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. బూర్జువా పార్టీల నాయకులు వ్యాపారాలు చేస్తూ కార్యకర్తలను తమతో తిప్పుకుంటున్నారు. తమ తమ ప్రాంతాల్లో పెళ్లిళ్లయినా, ఏ ఇతర శుభకార్యాలైనా వెళ్లి వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాయకులు ఎన్ని తప్పు పనులు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రజలను ఇలా పక్కదారి పట్టిస్తున్నారు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేయకపోవడం వల్ల ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. బూర్జువా పార్టీల నాయకులు డబ్బులు ఖర్చు చేస్తూ ప్రజలను తమ వెంట తిప్పుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ కాపాడుకుంటున్నారు. ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కానీ కమ్యూ నిస్టులు ఇవేవీ చేయకుండా త్యాగాలు చేయాలని కోరడం ఎవరికీ నచ్చడం లేదు. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఇప్పుడు లేకుండాపోయాయి. ధనమే అన్నింటికీ మూలంగా మారింది. రాజకీయ విశ్లేషకుల మాట... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించడంలో కమ్యూనిస్టులు విఫలం అవుతున్నారు. తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రజలకు దగ్గర కావడానికి అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. కొందరు నాయకుల తీరు, వారి వ్యవహార శైలి ప్రజలను ఆకట్టుకోవ డం లేదు. కమ్యూనిస్టు ఆదర్శాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు వంటి నేతలు తమ సాధారణ జీవన శైలితో కార్యకర్తలు గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పుడు అలాంటి నేతలు లేరన్న విమర్శలు ఉన్నాయి. -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
శివకామ సుందరీదేవిగా అమ్మవారు
మర్కూక్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల పరిధిలో సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు అత్యంత వైభవంగా కొనసాగింది. యాగంలో భాగంగా గురువారం రాజశ్యామల యంత్రపూజ కార్యక్రమాన్ని రుత్వికులు ఘనంగా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌రావు, ఎమ్మెల్సీ కవిత యాగ క్రతువును పర్యవేక్షించారు. యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ యాగంలో మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేశారు. అలాగే 11సార్లు శాలిని దుర్గ కవచ పారాయణం నిర్వహించారు. సర్వలోక సంరక్షణార్థం ఇంద్రసుక్త హోమం, నవగ్రహ సుక్త హోమం నిర్వహించారు. షాడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు. -
ఏజెన్సీలో ఎలా?
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి తీరంలో.. ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గంట ముందుగానే సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు. అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. కరపత్రాల కలకలం ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి. -
నగరంలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి తుక్కుగూడ సమీపంలో కేఎల్ఆర్ అక్బర్ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్ ఫామ్ హౌసుల్లో, గచ్చిబౌలి ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. కేఎల్ఆర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో కేఎల్ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కోకాపేట హిడెన్ గార్డెన్లో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్ కోకాపేటలోని హిడెన్ గార్డెన్లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది. రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్ఆర్ ♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్ పారిజాత కాంగ్రెస్ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. -
మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది: కేసీఆర్ మండిపాటు
సాక్షి, నిజామాబాద్: మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిందిగా బెదిరించారని చెప్పారు. ఆరునూరైనా మోటార్లుకు మీటర్లు పెట్టనని మోదీకి తెగేసి చెప్పానన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లు ఎగ్గొట్టారని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పదేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణలో ఒక్క రైతులకే కాదు అన్ని వర్గాలకు మేలు చేశామని చెప్పారు. ‘త్వరలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వనున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళారులు లేకుండా రైతు బంధు వస్తోంది.ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది.ఇప్పుడు తెలంగాణలో మంచినీటి సమస్య లేదు.ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్‌కు ఒక్కసారి కాదు దేశంలో 11సార్లు ఛాన్సిచ్చారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు.మనుషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉండాలె. కేసీఆర్ కర్ణాటక ను చూడటానికి రా. బస్సు పెడతానని కర్ణాటక నుంచి వచ్చిన అక్కడి డిప్యూటీసీఎం అంటడు. మన దగ్గరే 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. వాడు ఇచ్చే 5 గంటల కరెంటు చూడటానికి వెళ్లాలంట’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. -
‘జనసేన-బీజేపీ పొత్తు’పై రచ్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా పార్టీల మధ్య పొత్తుల సయోధ్య కుదరడం లేదు. ఒకవైపు కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపిన సీపీఎం దానికి బ్రేకప్ చెప్పింది. కాంగ్రెస్‌తో సయోధ్య కుదరకపోవడంతో 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఇదిలా ఉంచితే, జనసేన-బీజేపీ పొత్తు అంశం తెలంగాణలో మరింత హీట్‌ను పుట్టిస్తోంది. నాగర్ కర్నూల్ టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. తన అనుచరులతో కలిసి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి దిలీపాచారి నిరసనకు దిగారు. ‘ ‘జనసేన వద్దు.. బీజేపీ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన అసలు తెలంగాణలోనే లేదని అలాంటప్పుడు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దిలీపాచారి. -
మజ్లిస్ పార్టీ కంచు కోటను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ స్థానాలపై దృష్టి సారించింది. ఆ పార్టీ కంచు కోట అయిన పాతబస్తీలో దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. అధికార బీఆర్ఎస్తో దోస్తీ కట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మైనారిటీ ఓట్లను గండికొట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హలత్–ఏ–హజరా పేరుతో మజ్లిస్ సభలకు శ్రీకారం చుట్డడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే మజ్లిస్ తీరుపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా పాతబస్తీపై ప్రత్యేక వ్యూహానికి సిద్ధమైంది. మజ్లిస్ సిట్టింగ్ స్థానాల్లో గట్టి పోటీతో ఉక్కిరిబిక్కిరి చేసి అగ్రనేతలు పాతబస్తీ దాటకుండా కట్టడి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా అన్ని స్థానాలపై కాకుండా కొన్నింటిపై మాత్రమే దృష్టి సారించింది. వాస్తవంగా పాతబస్తీలో తలపడేందుకు అధికార పక్షంతో పాటు మిగతా పక్షాలు సైతం మొక్కుబడిగా అభ్యర్థులను బరిలో దింపడం ఆనవాయితీ. అయితే.. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా చార్మినార్ మినహా అభ్యర్థులను ప్రకటించింది. మూడింటిపైనే ఆశలు.. కాంగ్రెస్ పార్టీ పాతబస్తీలో పూర్వ వైభవం కోసం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను దింపుతోంది. ఇప్పటికే నాంపల్లి, మలక్‌పేట స్థానాలకు అభ్యర్ధులకు ప్రకటించగా. చార్మినార్ సెగ్మెంట్‌కు ప్రకటించాల్సి ఉంది. నాంపల్లి స్థానం నుంచి వరుసగా మూడుసార్లు మజ్లిస్ అభ్యర్థులతో నువ్వా నేనా అనే విధంగా తలపడి పరాజయం పాలైన ఫిరోజ్ ఖాన్‌ను ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుతో పాటు సానుభూతి కూడా కలిసి వచ్చి బయటపడే అవకాశం ఉందని భావిస్తోంది. మజ్లిస్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను యాకుత్‌పురా స్థానానికి మార్చి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానం అభ్యర్థిత్వం ప్రకటించలేదు. పాతబస్తీలో ముస్లిం సామాజిక వర్గంలో గట్టి పట్టు ఉన్న అలీ మస్కతి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం చార్మినార్ స్థానం నుంచి అలీ మస్కతిని పోటీ చేయాలని కోరామని వెల్లడించారు. మరోవైపు మజ్లిస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌కు తిరిగి సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో ఆయనతో సంప్రదింపులు ప్రారంభించింది. అవసరమైతే కాంగ్రెస్ పక్షాన ఆయనను బరిలో దింపాలని ఒక ఆప్షన్‌గా పెట్టుకొని వేచి చూస్తోంది. మలక్‌పేట స్థానంపై సైతం గట్టి పోటీకి సిద్ధమైంది. అక్కడి నుంచి స్థిరాస్తి వ్యాపారి షేక్ అక్బర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు అక్కడి నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసి మజ్లిస్‌కు గట్టి పోటి ఇచి్చన మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీ ఖాన్ని పారీ్టలో చేర్చుకుంది. కాంగ్రెస్ పక్షాన ఒకసారి పోటీ చేసి పారీ్టకి దూరమైన మందడి విజయ సింహారెడ్డిని సైతం పార్టీ కండువా కప్పింది. చాప కింద నీరులా పాగా వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి పార్టీ జాతీయ మైనారిటీ నేతలను సైతం రంగంలో దింపాలని యోచిస్తోంది. -
బీజేపీలో జనసేన కుంపటి
హైదరాబాద్: కాషాయ పార్టీలో జనసేనతో పొత్తు చిచ్చు రేపుతోంది. నగరంలో మూడు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కమలం పార్టీ నేతలు మాత్రం అవి వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్‌ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. చివరకు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిని మూడో జాబితాలో అయినా ప్రకటిస్తారా? మరికొన్ని రోజులు పెండింగ్‌లోనే ఉంచుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. కూకట్పల్లి సీటుపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్ కేడర్ ఒత్తిడికి అధినాయకత్వం తలోగ్గుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తదితరులు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా సీట్లపై క్లారిటీ? హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలపై మూడో జాబితాలో క్లారిటీ రానుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ మూడో జాబితాకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సీఈసీ ఆమోదించిన అభ్యర్థులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ముషీరాబాద్‌కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి, అంబర్‌పేటకు గౌతమ్ రావు పేర్లు ఖరారైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కీర్తి రెడ్డి, విక్రమ్ గౌడ్, దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్‌కు బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్‌కు మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత పేర్లను వివేక్ ప్రతిపాదించారు. వివేక్ పార్టీ వీడటంతో కంటోన్మెంట్ స్థానానికి తులసీ విజయ రాం పేరు తెర మీదకు వచి్చంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఎల్బీనగర్ సీటు తనకే ఇవ్వాలని సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు మూడో జాబితాలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం
మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో బుధవారం రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉదయం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్వంలో యాగానికి అంకురార్పణ చేయగా.. సీఎం కేసీఆర్ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వ్రస్తాలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ.. రుద్ర, చండీ, నవదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపారు. రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే మహాశక్తివంతమైన రాజశ్యామల యాగం కఠినమైన బీజాక్షరాలతో కూడినదని.. సీఎం కేసీఆర్ కుటుంబానికే కాకుండా యావత్ రాష్ట్రానికి ఇది ఆశీర్వాదం వంటిదని వివరించారు. శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసి.. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటూ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసినట్టు రుత్విక్కులు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో శాస్త్రోక్తం గా ప్రారంభమైన యాగం రెండు రోజుల పాటు జరగనుంది. తొలి రోజున ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రసనతో అంకురార్పణ చేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి.. గురు ఆజ్ఞ తీసుకొని యాగాన్ని ప్రారంభించారు. రుత్విక్కులు కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చెప్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నవదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రా ర్థిస్తూ అస్త్రరాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. అఖండ స్థాపన అనంతరం యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు. -
చినుకు చుక్క రాలలేదు!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ సెపె్టంబర్‌తో ముగిసినప్పటికీ.. రుతుపవనాల నిష్క్రమణ సమయమైన అక్టోబర్‌లో వర్షాల నమోదుకు బాగానే అవకాశాలుంటాయి. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే అక్టోబర్‌లో సాధారణం నుంచి రెట్టింపు స్థాయిలో వర్షాలు కురవగా.. ప్రస్తుత అక్టోబర్‌లో మాత్రం తీవ్ర వర్షాభావం నెలకొంది. 8.8 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను, నెల పూర్తయ్యే నాటికి కేవలం 0.53 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. హైదరాబాద్‌లో అయితే.. వర్షం పడనేలేదు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు నమోదవుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా, సాధారణానికి కాస్త ఎక్కువగానే సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో రాష్ట్ర సగటు 73.8 సెంటీమీటర్లు ఉండగా ఈసారి 86.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కానీ మండలాలను యూనిట్‌గా తీసుకుంటే మాత్రం చాలాచోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్‌లో నైరుతి నిష్క్రమణతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో నెలకొనే వాతావరణ పరిస్థితులతో సాధారణంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా తీవ్ర వర్షాభావమే నమోదయ్యింది. ‘ఈశాన్య’సీజన్ మొదలైనా.. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్ కొనసాగు తోంది. రాష్ట్రంలో నైరుతి, ఈశాన్య సీజన్లో జూన్ నెల నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 82.92 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 86.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపా తం నమోదైనప్పటికీ పలు జిల్లాల్లో లోటు వర్షపా తం ఉంది. జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా..మరో 21 జిల్లాల్లో సాధారణం, 7 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇక నవంబర్ నెలలోనూ అక్టోబర్ మాదిరి వర్షాభావ పరిస్థితులే ఉంటాయని ఐంఎండీ తాజాగా వెల్లడించింది. ఈ నెలలో కేవలం ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాదిన కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నవంబర్‌లో రాష్ట్రంలో 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పతనమై చలి తీవ్రత పెరగాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.