కమలానికి హస్తానికి మధ్య 'అక్షర యుద్ధం' | bjp congress fight over alphabets in madhya pradesh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 28 2013 4:31 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

మాటల తూటాలు పేల్చే రాజకీయ పార్టీలు ఇప్పుడు అక్షరాలపై పడ్డాయి. ఎన్నికల వేళ 'అక్షర యుద్ధాలు' మొదలపెట్టాయి. పదాలకు కొత్త భాష్యాలు చెప్తున్నాయి. మన రాజకీయ పార్టీలు. ఓ పార్టీ ABCDలను ఆయుధాలుగా వాడితే... మరో పార్టీ అఆఇఈలనూ అస్త్రాలుగా సంధిస్తోంది. A ఫర్‌ యాపిల్‌, B ఫర్‌ బాల్‌ అన్న మాటలకు ప్రస్తుతం అర్థాలు మారిపోయాయి. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో హోరాహోరీన తలపడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలు అక్షరాలకు కొత్త అర్థాలను సృష్టించాయి. వచ్చే నెల ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు A అంటే ఆదర్ష్‌ స్కామ్‌, B ఫర్‌ బోఫోర్స్‌ స్కామ్‌, C ఫర్‌ కామన్వెల్త్‌ స్కామ్‌, D ఫర్‌ దామాద్‌ స్కామ్ (అల్లుడి కుంభకోణం)‌.... ఈ లిస్టు ఇలా Z వరకూ ఉంది. కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోయడానికి బీజేపీ రూపొందించిన అక్షరాలివి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ విషయంలో మరో అడుగు ముందే ఉన్నారు. అయితే ఈ విషయంలో తానేమి తక్కువ తినలేదంటోంది కాంగ్రెస్‌. బీజేపీ వాళ్లు ఇంగ్లిష్‌ అక్షరాలతో యుద్ధం చేస్తుంటే... కాంగ్రెస్‌ హిందీ అక్షరాలతో ప్రయోగం మొదలుపెట్టింది. अ అంటే అపెక్స్‌ బ్యాంక్‌ కుంభకోణం, आ అంటే ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కుంభకోణం, इ అంటే ఇండోర్‌ ప్రాదికరణ్‌ కుంభకోణం, ई అంటే ఈ-టెండర్‌ స్కామ్‌, उ అంటే ఉద్యోగ మోసాలు, ऊ అంటే ఊర్జా స్కామ్, ए అంటే ఎరియర్స్‌ స్కామ్‌, ऐ అంటే ఎస్సార్‌ బొగ్గు స్కామ్‌, ओ అంటే ఓలా పాలా స్కామ్‌, औ అంటే ఔరత్‌పై అత్యాచార్‌... ఇలా భారీ అక్షర క్రమాన్నే రూపొందించారు. ప్రజల్ని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ అక్షర ప్రయోగాలను భాషవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. అక్షరాలను ఇలా ఖూనీ చేయడం పిల్లల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని... చిన్నతనంలోనే వారికి రాజకీయాలపై అసహ్యం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము అక్షరాలతో ఈ ప్రయోగం చేస్తున్నామని కాంగ్రెస్‌ అంటుంటే... బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ చర్యలు పిల్లలపైనే కాదని దేశంలోని ప్రతీ ఒక్కరిపై ప్రభావం చూపుతున్నాయని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement