Guest Columns
-
నారాయణ మూర్తి (ఇన్ఫోసిస్) రాయని డైరీ
కంపెనీలు వర్కర్ల మీద ఆధారపడి పనిచేయవు. ఇంఛార్జిల మీద వర్కర్లు ఆధారపడేలా చేసి చక్కటి ఫలితాలను సాధిస్తుంటాయి. ఎక్కడైనా చూడండి... ఇంఛార్జిలే, వర్కర్ల కన్నా ఎక్కువ కష్టపడి పని చేస్తుంటారు. వర్కర్లలో పని చేయనిదెవరో కనిపెట్టడానికి సెలవులు కూడా వాడుకోకుండా శ్రమిస్తూ ఉంటారు. అయితే అంత శ్రమ అవసరం లేదంటాన్నేను!దేనికైనా టెక్నిక్ ఉండాలి. పని చేయని వారెవరో వెతకటం మాని, పని చేస్తున్న వారెవరో నిఘా పెట్టి చూస్తే ఇంచార్జిల పనికి ప్రయోజనం చేకూరుతుంది, మరింత మెరుగైన ఫలితాలను తొలి త్రైమాసికంలోనే సాధించి యాజమాన్యానికి చూపించగలుగుతారు!సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు పని ఎలా చేయించుకోవాలో బోధిస్తుంటాడు. నేర్పరులనే సేవకులుగా పెట్టుకున్నావా? వారిలో పని చేస్తున్న వారిని గమనిస్తున్నావా? వారి పట్ల ఉదారంగా ఉంటున్నావా? అని అడుగుతాడు.పని చేయని వారిని కనిపెట్టటం వల్ల ఒరిగే ప్రయోజనం కన్నా, పని చేసే వారిని కనిపెట్టుకుని ఉండకపోవటం వల్ల జరిగే నష్టమే ఎక్కువని నారద ప్రబోధం.పని చేయని వారి వల్ల సంస్థలకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాళ్ల పని కూడా మీద వేసుకుని చేయగల పనివాళ్లు పక్కనే అందు బాటులో ఉంటారు. వారానికి 70 గంటలైనా సరే, వాళ్లు అలా పని చేసుకుంటూ పోగలరు... ఇంఛార్జిలు కనుక వాళ్లకు అందరిముందూ చిన్న కాంప్లిమెంట్ ఇవ్వగలిగితే.పని చేసే వాళ్లకు అందరిముందూ కాంప్లిమెంట్ ఇస్తే, పని చేయని వాళ్లు హర్ట్ అవుతారని చెప్పి, చాటుగా పిలిచి భుజం తట్టడం వల్ల ముందు తరాల సంస్థలకు మంచి ఇంఛార్జిలు తయారు అయితే అవొచ్చు. మంచి వర్కర్లు తయారుగా ఉండరు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు మాత్రమే ఫైళ్లు పట్టుకుని ఇంటర్వ్యూలకొస్తారు.అనుపమ్ మిట్టల్ ట్వీట్ ఒకటి చూశాను. షాదీ డాట్ కామ్ ఫౌండర్ అతడు. ‘‘70 గంటల పనికి భయపడుతున్న వారంతా 2025లో రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఏఐ మన ఉద్యోగాలన్నిటినీ ఊడబెరుక్కోబోతోంది. హ్యాపీ న్యూ ఇయర్’’ అని విష్ చేశాడు. శాడిస్ట్. మిట్టల్ ఫౌండర్ అయిపోయాడు కానీ... గొప్ప ఇంచార్జి కావలసినవాడు.ఇంఛార్జి... ఫౌండర్లా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గౌతమ్ అదానీలా ఉండాలి. ‘‘చేసే శక్తి, ఆసక్తి ఉన్న వాళ్లు... వద్దన్నా 70 గంటలు పని చేస్తారు. చేయనివ్వండి. ఒకటైతే నిజం. ఫ్యామిలీతో 8 గంటలు గడిపితే ఆ ఉక్కపోత భరించలేక జీవిత భాగస్వామి ఇంట్లోంచి పారిపోతుంది’’ అని పెద్దగా నవ్వుతారాయన.భార్యాభర్తలిద్దరూ వాళ్ల వాళ్ల ఆఫీస్‌లలో 70 గంటలు పని చేసి వస్తే ఇద్దరిలో ఎవరూ ఇల్లొదిలి పారిపోయే సమస్యే ఉండదు. అయితే వాళ్లు ఆఫీస్ వదిలి పారిపోకుండా ఇంచార్జిలు చూసుకోవాలి.మహా భారతంలో కర్ణుడు నాకు ఇష్టమైన క్యారెక్టర్. గొప్ప దాతృత్వం అతడిది. ఇంచార్జిలు కూడా ఎప్పుడైనా ఒకరోజు సెలవు ఇవ్వటానికి, హాఫ్ డే లీవు శాంక్షన్ చెయ్యటానికి కర్ణుడిలా గొప్ప దాతృత్వం ప్రదర్శిస్తే ఆఫీసంటే పడి చచ్చిపోని వర్కర్లు ఉంటారా?వర్కర్లు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ‘వర్క్’ అంటే ఆఫీసు మరియు ఇంచార్జి. ‘లైఫ్’ అంటే భార్య మరియు పిల్లలు. (ఉద్యోగినులకైతే భర్త మరియు పిల్లలు). వర్క్‌ను లైఫ్, లైఫ్‌ను వర్క్ వాటికవే బ్యాలెన్స్ చేసుకుంటాయి కనుక వర్కర్లు పని కట్టుకుని లైఫ్‌ని, వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోనక్కర్లేదు. పనిలో మునిగి వుంటే చాలు.ఎండ్ ఆఫ్ ది డే... ఇంచార్జిలు కంపెనీకి మంచి ఫలితాలను సాధించి చూపేలా పని చేయటం వర్కర్ల కనీస బాధ్యత. -
పాతాళాన్ని తాకిన పార్లమెంట్ ప్రతిష్ఠ
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ పార్లమెంట్లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి -
వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి అదేంటో తెలుసా?
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ – ఇతరుల కళ్ళకు కనిపించకుండా, వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి వంటిది విద్య అని భర్తృహరి సుభాషితం చెప్పింది. విద్య వలన ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదనీ, మనిషి విద్యావంతుడు కావడం వలన సమకూరే ఉత్తమమైన ప్రయోజనాలు మరి కొన్ని వున్నాయనీ తెలుగు కవులు చెప్పారు. వారిలో, విక్రమార్కుడి సింహాసనపు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలను తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంగా రచించిన కొఱవి గోపరాజు ఒకరు. ‘పరులకు, సోదరులకు, భూమిని పాలించే భూవరులకు నిలువెత్తు ధనం వెచ్చించైనా ఒకవ్యక్తి నుండి కొనలేనిది అతడి విద్య అని, ఏ వ్యక్తిలో ఉంటేఆ వ్యక్తికి మాత్రమే నూటికి నూరుపాళ్ళు వశ్యమై ఉండేది విద్య ఒక్కటే అని, ఒకరు తనలోని విద్యను మరొకరికి బోధించినపుడు, ఆ బోధనను గ్రహించిన వ్యక్తిలో తిరిగి అదే రకమైన వృద్ధికి ఆ విద్య దారితీస్తుందని ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయాలు. పరాయి ఊరికి వెళ్ళినప్పుడు వ్యక్తి లోపల ఉన్న విద్యా ధనం ఒక్కటే దొంగలకు కనపడకుండా ఉంటుందని, విద్య ఒక్కటి మాత్రమే ఒక్కొకసారి వ్యతిరేక పరి స్థితులలో సైతం స్నేహితులను పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని, కాబట్టి విద్యను పోలిన ధనం మరొకటి ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుందని కూడా చెప్పాడు కొఱవి గోపరాజు. విద్యను గురించి కావ్యాంతర్గతమైన వివరణ అలా ఉండగా, భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘శ్రీవిష్ణుపురాణం’ పంచమ అంశం, పదవ అధ్యాయం, 30వ శ్లోకంలో విద్యను గురించిన అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక భావన కనపడుతుంది. విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్,సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా. ఏ విద్య ఆసరాతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్యయే ఆ వ్యక్తికి పూజనీయమైనది. ఆ విద్యయే ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా కూడా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
అంధుల అక్షర శిల్పి
అంధులు సైతం సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందేనన్న ఆశయంతో వారి విద్యార్జన కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన అక్షర శిల్పి లూయీ బ్రెయిలీ. ఫ్రాన్స్‌లో ఒక మారుమూల గ్రామమైన కూప్వ్రేలో సైమన్, మోనిక్ దంపతులకు 1809 జనవరి 4న ఆయన జన్మించాడు. నలుగురు సంతానంలో చివరివాడు బ్రెయిలీ. ఆయన తల్లిదండ్రులు వృత్తి రీత్యా చర్మకారులు. లూయీ తన తండ్రితో కలిసి ఒక రోజు గుర్రపు జీన్లు తయారు చేసే దుకాణానికి వెళ్లాడు. అక్కడున్న పదునైన చువ్వ, కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ఉండగా చువ్వ ఎగిరి వచ్చి లూయీ కంటిలో గుచ్చుకుంది. పేదరికం కారణంగా మంచి వైద్యం అందించలేక పోవటంతో కంటిచూపు మొత్తం పోయింది. తర్వాత కొంతకాలానికే ఇన్ఫెక్షన్ ఎక్కువై రెండవ కంటిచూపు కూడా పోయింది. అప్పుడు పిల్లాడి వయసు ఐదేళ్లు. అయితే అందరిలాగానే తన కొడుకు చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు తమ పెద్ద పిల్లలతో పాటుగా లూయీని గ్రామంలో ఉన్న పాఠశాలకు పంపించారు. అక్కడ కొడుకు కనబరిచిన అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి... చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా అక్షర జ్ఞానం కలిగించాడు. అతడిలోని చదువుకోవాలనే పట్టుదలను, తెలివితేటల్ని చూసి ఉపాధ్యాయులే ఆశ్చర్యానికి లోనయ్యేవారు.1821లో చార్లెస్ బార్బియర్ అనే సైన్యాధికారి తన సైనికులకు 12 చుక్కలతో నిగూఢ లిపిలో శిక్షణ ఇచ్చేవాడు. దాన్ని లూయీ అభ్యసించాడు. దానితో సంతృప్తి చెందకుండా ఆ లిపిపై పరిశోధనలు ప్రారంభించాడు. దాదాపు 11 సంవత్సరాల కృషి అనంతరం 1832లో సరళమైన విధానంలో చుక్కల లిపిని కనుగొన్నాడు. దానికి ఆయన పేరుమీదనే తర్వాత బ్రెయిలీ లిపి అని పేరొచ్చింది. ఇది ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా ఆనాడే రూపొందిందంటే ఆయన ముందుచూపు ఎంతో అర్థమవుతుంది. బ్రెయిలీని క్షయ మహమ్మారి పట్టి పీడించటంతో నాలుగు పదుల వయసులోనే 1852 జనవరి 6న కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎంతోమంది అంధ వికలాంగులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, పత్రికాధిపతులుగా, సంగీత కళాకారులుగా, చిత్ర కారులుగా అనేక రంగాల్లో బ్రెయిలీ లిపితో అగ్రభాగాన నిలిచేట్లు చేసిన లూయీ బ్రెయిలీ అంధుల అక్షర ప్రదాతగా ఎప్పటికీ వెలుగొందుతూనే ఉంటారు.– పి. రాజశేఖర్ ‘ ఆలిండియా జనరల్ సెక్రెటరీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (నేడు లూయీ బ్రెయిలీ జయంతి; జనవరి 6న వర్ధంతి) -
ఇంగ్లిష్‌పై ‘తీర్పు’ వివక్షాపూరితం!
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్‌రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈదర గోపీచంద్ వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్తమొబైల్: 94403 45494 -
ఎక్కువ ఉద్యోగాలు... తక్కువ పన్ను
భారత ఆర్థిక సవాళ్లను అధిగమించే మూడు ఐడియాలు⇒ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ‘ఎక్కువమందిని నియ మించండి... తక్కువ పన్ను చెల్లించండి’ అన్నది విధానం కావాలి.⇒ ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. నాణ్యమైన విద్యమీద పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు.⇒ నైపుణ్య శిక్షణ ద్వారా కోట్లమంది జీవితాలను మార్చవచ్చు. పాఠశాలల్లో మరీ ముఖ్యంగా పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేయాలి.భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడింది. మహ మ్మారి అనంతరం మనం చూసిన ఎకనామిక్ రికవరీ ఇక ముగిసినట్లే అనడానికి ఇది స్పష్టమైన సంకేతం. కోవిడ్ అనంతరం పరిస్థితి మెరుగుపడింది; వృద్ధి రేటు గణాంకాలు ఉత్తేజకరంగా నమోదు అయ్యాయని చాలా మంది సంబరపడ్డారు. నిజానికి ఇదో ‘కె – షేప్డ్’ రికవరీ అన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని తిరిగి కోలుకునే సమయంలో ఆ కోలుకోవటం ఒక్కో ప్రాంతంలో, ఒక్కో వర్గంలో ఒక్కో రకంగా ఉంటుంది. ధనికులు మరింత ధనవంతులవుతారు. కానీ పేద ప్రజలు అలాగే ఉంటారు లేదంటే ఇంకా కుంగిపోతారు. ఆంగ్ల అక్షరం ‘కె’లో గీతల మాదిరిగానే ఈ రికవరీ ఉంటుంది.కొత్త కేంద్ర బడ్జెట్ రాబోతోంది. తన రాబడి పెంచుకోడానికి వీలుగా గత బడ్జెట్లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్ మీద పన్నులు పెంచింది. స్టాక్ మార్కెట్ జోరు మీద ఉండటంతో ఇన్వెస్టర్లు దీన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ప్రాపర్టీ విక్రయాల మీద క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధింపు విధానంలో చేసిన మార్పులపై వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఉద్యోగాలు లేవని, వేతనాలు తక్కువగా ఉన్నాయని పేద ప్రజలు విలవిల్లాడుతున్నారు. ధనికులు కూడా అధిక పన్నుల పట్ల గుర్రుగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక సంకట స్థితి. వృద్ధిరేటు పెరగాలంటే పట్టణాల్లో వినియోగాన్ని పెంచాలి. అలాచేస్తే ఆహార ధరలు రెక్కలు విప్పుకుంటాయి. ద్రవ్యోల్బణం పేదలకు అశనిపాతం అవుతుంది. ప్రభుత్వానికి ఇది కత్తిమీద సాము. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఆనవాయితీకి భిన్నంగా ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. ఒకటి మాత్రం వాస్తవం. ‘ఇంక్రిమెంటల్ కంటిన్యూటీ’కి అవకాశం లేదు. అంటే అదనపు వ్యయాలు, అదనపు రాబడులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఇంక్రిమెంటల్ ప్రిన్సిపుల్ అంటే వ్యయం పెంచే ఏ నిర్ణయం అయినా అంత కంటే ఎక్కువ ఆదాయం సమకూర్చాలి. ఈ దఫా నిర్ణయాలకు దీన్ని వర్తింప చేయడం కష్టం. కాబట్టి బడ్జెట్ నిర్ణయాలు జన జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేవిగా ఉండాలి. ఈ దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మూడు ఐడియాలను ఇస్తాను. ఉద్యోగాలు కల్పిస్తే ప్రోత్సాహకాలుపారిశ్రామిక రంగం చేస్తున్న దీర్ఘకాలిక డిమాండుకు తలొగ్గి, 2019 బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ సంస్థలు ఈ ప్రోత్సాహకంతో మిగిలే నిధులతో కొత్త పెట్టుబడులను పెంచుతాయన్నది దీని ఉద్దేశం. అయితే జరిగిందేమిటి? పరిశ్రమలు తమ పన్ను తగ్గింపు లాభాలను బయటకు తీయలేదు. కొత్త పెట్టుబడులు పెట్టలేదు. సిబ్బంది వేతనాలు పెంచలేదు. పెట్టుబడులు పెట్టకపోవడానికి డిమాండ్ లేదన్న సాకు చూపించాయి. రెండోదానికి అవి చెప్పకపోయినా కారణం మనకు తెలుసు. చవకగా మానవ వనరులు దొరుకుతున్నప్పుడు కంపెనీల వారు వేతనాలు ఎందుకు పెంచుతారు? ఎగువ మధ్యతరగతి ప్రజలు అప్పటికే 30 శాతం పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ సంస్థల పన్నురేటు 25 శాతానికి తగ్గించటం అన్యాయం. ఈ సారి బడ్డెట్లో కంపెనీల గరిష్ట పన్నురేటు ఇంకా తగ్గించే సాహసం ఆర్థిక మంత్రి చేయలేరు. పేద ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుందనే భయం ఉంటుంది. కార్పొరేట్ పన్ను రేట్లను అన్నిటికీ ఒకేమాదిరిగా కాకుండా వాటిలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ పోయే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలి. ఎక్కువ మందిని నియమించండి... తక్కువ పన్ను చెల్లించండి అన్నది విధానం కావాలి. వస్తూత్పత్తిని పెంచే విధంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కల్పిస్తున్నప్పుడు, అదే తరహాలో జాబ్ క్రియేషన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ మాత్రం ఎందుకు ఉండకూడదు? విద్యానాణ్యతతోనే దేశ పురోభివృద్ధి నాణ్యమైన విద్యమీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా ప్రాథమిక విద్య నాణ్యత పెంచాలి. ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం రెట్టింపు చేయదగిన రంగం ఇది తప్ప మరొకటి ఉండదు. దీన్ని ఓ డబ్బు సమస్యగా చూడకూడదు. విధానపరమైన సమస్య గానూ పరిగణించకూడదు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటిలోను విద్యానాణ్యత లోపించడం దేశ పురో భివృద్ధికి ఒక ప్రధాన అవరోధం. భారత్ సామర్థ్యం దిగువ స్థాయి ఉత్పత్తిలో కాకుండా సేవల రంగంలోనే ఉందని రఘురామ్ రాజన్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ముఖ్య అంశంగా భావించినట్లయితే, సేవల రంగాన్ని ప్రోత్సహించడానికి తానేం చేయగలదో ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం నాణ్యమైన విద్య అందించడమే. అయితే ఎలా? పేద పిల్లల కోసం బళ్లు పెట్టే ప్రైవేట్ విద్యా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందించటం ఇందుకు ఒక సులభ మార్గం. ప్రాథమిక పాఠశాల విద్యార్థి వాస్తవంగా ఎంత నేర్చుకుంటు న్నాడో తెలుసుకునేందుకు అఖిల భారత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద పరీక్షను ప్రవేశపెట్టాలి. ఈ ఫలితాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇవ్వాలి. దీనివల్ల తల్లిదండ్రులకు ఏ స్కూలు ఎంత మంచిదో తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే నాణ్యమైన బోధన మీద పెట్టుబడి పెట్టే పాఠశాలలకు ప్రోత్సా హకాలు ఇవ్వడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. నైపుణ్యాలపై పెట్టుబడి నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ద్వారా కోట్లమంది జీవితాలను సమూలంగా మార్చేసే వీలుంది. ఈ దిశగా భారత్ ప్రయత్నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చెప్పాలి. పేదపిల్లలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణను ఒక ప్రధానాంశం చేసినపుడు మాత్రమే ప్రభుత్వం ఈ దిశగా ముందడుగు వేయగలదు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాన్ని కేవలం 10 శాతం తగ్గిండం ద్వారా అపారమైన నిధులు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉద్యోగాలకు ఉపయోగపడే విద్య మీద పెట్టుబడి పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగా లను సృష్టించవచ్చు. వైద్య కళాశాలలతో పాటు కొత్త నర్సింగ్ కళా శాలలను విరివిగా పెట్టాలి. ఫార్మసిస్టులు, మెడికల్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలో తయారయ్యే విధంగా విద్యాసంస్థలు ప్రారంభం కావాలి. తద్వారా దేశీయంగాను, అంతర్జాతీయంగాను వైద్యసిబ్బంది కొరతను భారత్ పూడ్చగలదు. మానవ వనరులపై పెట్టుబడితో – ప్లంబర్ల నుంచి డాక్టర్ల వరకు – ప్రపంచానికి పనికొచ్చే భారతీయ ఉద్యోగుల సంఖ్య విశేషంగా పెరుగుతుంది. వారి నుంచి దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా నిధులు ప్రవహిస్తాయి. దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గడానికి వీలవుతుంది. ఈ ఐడియాలతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయా? కావు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక ‘న్యూ డీల్’ కావాలి. (1929 నాటి మహా మాంద్యం నుంచి దేశాన్ని కాపాడేందుకు 1933–38 కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ న్యూడీల్ పేరిట శరపరంపరగా అనేక కార్యక్రమాలు, సంస్కరణలు చర్యలు చేపట్టారు.)శివమ్ విజ్ వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత(‘గల్ఫ్ న్యూస్’ సౌజన్యంతో) -
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
దిస్సనాయకేకు ‘తమిళ’ పరీక్ష
శ్రీలంక ఎన్నికలలో ఘన విజయం సాధించిన అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ముందు రెండు ముఖ్యమైన సమస్యలున్నాయి. ఒకటి, ఆర్థికం కాగా, రెండవది తమిళ, ముస్లిం అల్పసంఖ్యాక వర్గాల సమస్య. మొదటి దాని విషయమై చర్యలు ప్రారంభించారు. రెండవ దానిపై ఇంకా దృష్టి పెట్టవలసి ఉంది. కానీ ఆర్థికం కన్నా ఇది మరింత తీవ్రమైనదై దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు సంక్షోభంలోకి నెట్టివేసింది.అనూర కుమార దిస్సనాయకేకు చెందిన జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీకి ఇతర జాతీయవాద బౌద్ధ పార్టీల వలెనే అల్ప సంఖ్యాక వర్గాలపట్ల మొదటి నుంచీ వ్యతి రేకత ఉంది. జేవీపీ మార్క్సిస్టు పార్టీ అయినప్పటికీ, ఇతర సింహళ పార్టీలు ఏ విధంగానైతే తమిళులు, ముస్లిములను వ్యతిరేకించాయో తను కూడా అదే వైఖరి తీసుకుంది. సెప్టెంబర్ అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకే ఎంత గొప్ప విజయం సాధించినా ఈ వర్గాలు ఆయ నకు ఓటు వేయలేదు. కానీ రెండు నెలలు గడిచి నవంబర్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు భారీ ఎత్తున బలపరిచాయి.అందుకు కారణం ఆయన వారిని కూడా వెంట కలుపుకొని పోగలనని పదేపదే భరోసా ఇవ్వటమే. దీని ప్రభావం తమిళులు పెద్ద సంఖ్యలో గల కొలంబో నగరంతోపాటు, ఆధిక్యతలో ఉన్న జాఫ్నా, బట్టిక లోవా, ట్రింకోమలీ ప్రాంతాలలో కనిపించింది. కొలంబో, బట్టిక లోవా కేంద్రాలుగా గల ముస్లిములు కూడా అదే పని చేశారు.‘సామరస్యత’ సాధ్యమేనా?కానీ, తర్వాత ఈ మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి ఇంతవరకైతే ఎటువంటి కదలికలు కనిపించటం లేదు. దిస్సనాయకే ఈ డిసెంబర్లో ఇండియాను సందర్శించి ప్రధాని మోదీతో సమావేశ మైనప్పుడు, ఈ అంశంపై ఏదైనా ప్రకటన రావచ్చునని అను కున్నారు. కానీ ఇరు నాయకుల సంయుక్త ప్రకటనలోగానీ, ఇతరత్రా గానీ అటువంటిదేమీ ప్రత్యక్షమైన రీతిలో కనిపించటం లేదు. పరోక్ష సూచనలు మాత్రం కొన్నున్నాయి. మోదీ తన వైపు నుంచి ‘సామ రస్యత’, ‘రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరచటం’, ‘ప్రాంతాల కౌన్సిళ్లకు (ఇండియాలో అసెంబ్లీల వంటివి) ఎన్నికలు’ అనే సూచ నలు చేయగా, దిస్సనాయకే ‘మా ప్రజాస్వామ్యానికి వైవిధ్యత ఒక మూలస్తంభం’ అని మాత్రం అన్నారు.ఇందులో మోదీ మాటలు మూడు కూడా అర్థవంతమైనవే. మైనారిటీలు అనే మాట ఉపయోగించకపోయినా, ‘సామరస్యత’ అనటం వారి గురించే. రాజ్యాంగం పూర్తిగా అమలు, ప్రాంతీయ కౌన్సిళ్లకు ఎన్నికలు అన్నది రాజీవ్–జయవర్ధనే ఒప్పందం (1987) ప్రకారం శ్రీలంక రాజ్యాంగానికి జరిగిన 13వ సవరణలోని అంశా లకు సంబంధించినది. జయవర్ధనే కాలంలో ఆ ప్రకారం, తమిళులు ఆధిక్యతలోగల జాఫ్నా, బట్టికలోవా ప్రాంతాలను కలిపి ఒక ప్రావి న్స్‌గా మార్చి ఎన్నికలు నిర్వహించారు కూడా. ఆ ఎన్నికలలో వరదరాజ పెరుమాళ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తర్వాత కొలంబోలోని తన నివాసంలో నాకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనపై ఎల్టీటీఈ బెదిరింపులు, జయవర్ధనే ప్రభుత్వ సహాయ నిరాకరణతో విధి లేక రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆ వెనుక ఇక ఎన్నికలే జరగలేదు. అదట్లుంచితే, వరదరాజ పెరుమాళ్ది తెలుగు కుటుంబం కావటం విశేషం. ఆ మాట శ్రీలంకలో రహస్యమని, ఎక్కడా రాయ వద్దని కోరారు. అప్పటి పరిస్థితులన్నీ ఈ సరికి సమసి పోయినందున ఇప్పుడు రాస్తున్నాను. విషయానికి వస్తే, ఫెడరలిజం తరహాలో రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలకు ఎన్నికలు, ఫెడరల్ అధికారాలనే ఆలోచ నకే ఇతర సింహళ పార్టీల వలెనే బద్ధ వ్యతిరేకి అయిన జేవీపీ, 13వ రాజ్యాంగ సవరణను మోదీ పరోక్షంగా సూచించినట్లు అమలు పరచ గలదా అన్నది సందేహమే.వికేంద్రీకరణ జరిగేనా?ఫెడరలిజం రూపంలో అధికార వికేంద్రీకరణ, 13వ సవరణల సంగతి అట్లుంచినా, ఎల్టీటీఈ అధ్యాయం 2009లో ముగిసినా, అక్కడి ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలుగా వాటి పరిష్కారానికి ప్రయత్నించలేదు. ఆ సమస్యలు తమిళులకు సంబంధించి జాఫ్నా ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక శిబిరాల ఎత్తివేత, పౌర హక్కుల పునరుద్ధరణ, రకరకాల వివక్షల నిలిపివేత, సైన్యంతోపాటు సింహ ళీయులు ఆక్రమించిన తమ భూభాగాలను తిరిగి తమకు అప్పగించటం, తమిళ భాషకు తగిన గుర్తింపు వంటివి. అదే విధంగా ముస్లింలకు సంబంధించి, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ (ఎస్‌ఎల్‌ఎంసి) అధ్యక్షుడు రవూఫ్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాము సింహళీయుల ఆధి క్యతా వాదానికి, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకమనీ, వారు తమ ప్రాంతాలను కాలనైజ్ చేస్తున్నారనీ, ఇటువంటిది ఆగిపోవాలనీ అన్నారు. తమకు యూనియన్ టెరిటరీ వంటిది ఏర్పాటు చేసి అధి కార వికేంద్రీకరణ జరగాలన్నారు. శ్రీలంక జనాభాలో సింహళీయులు సుమారు 75 శాతం కాగా, తమిళులు 12 శాతం, ఇండియన్ తమిళులు లేదా తేయాకు తోటల కార్మికులు 4 శాతం, ముస్లిములు 10 శాతం ఉంటారు. సంఖ్యల రీత్యా వీరు తక్కువ అయినా, వారి జన సంఖ్యల కేంద్రీకరణ దృష్ట్యా శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలు కీలకం అవుతున్నాయి. 13వ సవరణను పక్కన ఉంచినా ఈ ప్రశ్నలకు దిస్సనాయకే పరిష్కారాలు ఏమిటన్నది ముఖ్యమవుతున్నది.సింహళీయులకు ఉన్న దేశం ఇదొక్కటే!ఇంతకూ ఈ విషయాలపై దిస్సనాయకే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఆయనను నేను కొలంబో సమీపాన బట్టరముల్లలో గల జేవీపీ ప్రధాన కార్యాలయంలో 2000లో ఇంటర్వ్యూ చేశాను. అపుడాయన వయసు 30 ఏళ్లే అయినా జేవీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ కూడా. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఆ ఇంటర్వ్యూలో ముస్లిముల ప్రస్తావన రాలేదుగానీ తమిళుల ప్రశ్నపై చాలా చెప్పారు. అప్పటినుంచి చాలాకాలం గడిచిన మాట నిజం. తమిళుల ప్రశ్నపై ఇప్పటికీ ఆయన అర్థోక్తులు, అస్పష్టతలను బట్టి చూసినపుడు, ఇంటర్వ్యూ నాటి వివరణలకు ఇంకా విలువ ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. దిస్సనాయకే అన్నదేమిటో ఎటువంటి వ్యాఖ్యానాలు లేకుండా యథాతథంగా అవసరమైన మేర చూద్దాము: ‘గ్రేటర్ ఈలం అనే మాట మొదట ఉపయోగించింది ద్రవిడ కజగం పార్టీ. ఈలం ఏర్పడి దానికి ట్రింకోమలి రాజధాని కావాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గల తమిళులు అంతా తిరిగి వచ్చి ఉత్తర శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడాలని పిలుపునిచ్చారు. హిందీ వ్యతిరేక ఉద్యమకాలంలో ఇందుకు బీజాలు పడ్డాయి. ఇక్కడ కూడా సింహళ భాషా వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. మా జనాభా 13 మిలియన్లు కాగా, తమి ళులు ఇక్కడి రెండు మిలియన్లు, తమిళనాడులోని 60 మిలియన్లు కలిపి మొత్తం 62 మిలియన్లు. మేమిక్కడ మెజారిటీ అయిన మైనారి టీలమనే భావన కలుగుతుంటుంది.తమిళులు శ్రీలంకను తమ మాతృదేశంగా పరిగణించరు. అపుడ పుడు భారతీయ జెండాను ఎగరవేయటం, అక్కడి నాయకుల ఫొటోలు పెట్టుకోవటం వంటివి చేస్తారు. ఇక్కడి సంస్కృతిని పాటించరు. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడి యువకులను రప్పించి సాయుధ శిక్షణలు ఇచ్చింది. తనను తాను పెద్దన్నగా భావించి మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. సింహళీయులమైన మాకు ఉన్న దేశం ఇదొక్కటే. దానిని మేము కాపాడుకోవాలి.అధికార వికేంద్రీకరణకు మేము వ్యతిరేకం. అది జరిగితే దేశం సింహళ, తమిళ, ముస్లిముల మధ్య మూడు ముక్కలవుతుంది. ఇక్కడి నాగరికతకు, సంస్కృతికి సింహళ బౌద్ధుల మెజారిటీ సంస్కృతే ఆధారం. ఇంగ్లిష్ విద్య వల్ల మాకన్నా చాలా ముందుకు పోయిన తమిళులు తమకు ఇంకా కావాలంటున్నారు. బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని భౌగోళిక విభజనలు చేయగా, అవి తమ హోంల్యాండ్స్ అని వాదిస్తున్నారు. మేము ఎవరికీ వ్యతి రేకం కాదు. శ్రీలంక అందరికీ మాతృ దేశమని చెప్తున్నాం.’ ఇవీ దిస్స నాయకే చెప్పిన మాటలు. ఇవి వారి ఆలోచనలకు, విధానాలకు పునాదిగా ఉంటూ వచ్చాయి. మారిన పరిస్థితులలో ఇందులో మార్పులేమైనా ఉండవచ్చునా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కూటమి కథ పునరావృతం అవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం, జనసేన, (Janasena) బీజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా పట్టుమని పది నెలలు అయినా కాలేదు. కానీ, ఇంతలోనే కూటమిలో లుకలుకలు బెకబెక మంటూ బయ టకు వస్తున్నాయి. 2014లో ఇవే మూడు పార్టీల కూటమి, 2018 నాటికి ఎంత వికృత రూపం దాల్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పడు పాత చేదు గుళికలు గొంతు దిగక ముందే అంతవరకు ఛీ... ఛా... అనుకున్న ఆ మూడు పార్టీల నాయకుల మధ్య ఏ చీకటి ఒప్పందం కుదిరిందో ఏమో కానీ, మళ్ళీ చేతులు కలిపారు. కానీ ప్రస్తుతం కూటమిలో విభేదాలు చాపకింద నీరులా పరుచుకుంటున్నాయి. అయిష్టంగా, అవసరార్థం ఆలింగనం చేసుకున్న మూడు పార్టీల మధ్య, సయోధ్య ‘నానాటికి తీసికట్టు నాగం భొట్లు’ అన్నట్లు పలచన అవుతోందని, ఎన్నికల సమయంలో కనిపించిన సయోధ్య ఇప్పడు కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీల గడప దాటి ప్రజల్లో బలపడుతోంది. అందుకే, రాజకీయ పరిశీలకులు కూటమిలో పరిస్థితి పైకి కనిపించినంత చక్కగా ఏమీ లేదనీ, ఒక విధంగా తుఫాను ముందు ప్రశాంతత వంటి పరిస్థితి రూపు దిద్దుకుంటోందనీ అంటున్నారు. గత ఆగస్టులో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలలకే... కర్నూల్ జిల్లాలో (Kurnool District) బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మొదలైన కుమ్ములాటల కథ ఇప్పటికీ చల్లారలేదు సరికదా, కొత్తకుంపట్లు వెలిగిస్తోంది. ‘టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీతో సయోధ్య ఎలా సాధ్యం’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేల్చిన తూటా టీడీపీ నాయకత్వానికి గుచ్చుకుంది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో చేతులు కలిపి ధర్మపోరాటం పేరిట చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సాగించిన రాజకీయాలను, ఆ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ఆయన వ్యాఖ్యలు, ఇతర నేతలు స్థాయి మరిచి చేసిన దాడిని, చేసిన అవమానాలను బీజేపీ నాయకులు మరిచిపోలేక పోతున్నారనీ; ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి కదలికనూ అనుమానంతో చూస్తున్నా రనీ అంటున్నారు. కమల దళం అనివార్యంగా మరోమారు చంద్రబాబుతో చేతులు కలిపినా, గతంలో లాగా బాబును విశ్వసించడం లేదనీ... అందుకే, మహారాష్ట్రలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)తో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ఇతర పార్టీలను ఎన్డీఏ పలుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు అవసరం కారణంగా ఆయ నతో సయోధ్యత ఉన్నట్లు నటిస్తూనే, చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ఇలా జాగ్రత్తలు తీసుకుంటోందని అంటున్నారు. అయితే, బీజేపీ రహస్య వ్యూహం చంద్రబాబుకు తెలియదా అంటే... తెలుసు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు ముసుగు తొడిగి ప్రజలను మాయ చేసేందుకు కేంద్ర సహకారం అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేద్ర మోదీపై కపట ప్రేమను ఒలక పోస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే, ఇద్దరికి ఇద్దరూ ‘నువ్వొకందుకు పోస్తే, నేనొ కందుకు తాగుతున్నాను’ అన్నట్లు ‘ఆస్కార్’ స్థాయిలో ప్రేమ కథను రక్తి కట్టిస్తున్నారు. ఇలా బీజేపీ – టీడీపీ సంబంధాలు పరస్పర అవిశ్వాసంతో అడుగులు వేస్తుంటే... ఇక టీడీపీ – జనసేన సంబంధాలు ముదిరి పాకాన పడే స్థాయికి చేరుకున్నాయి. నిజానికి కూటమి నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్, ఆయన వీరాభిమానులు ఏమి చెప్పినా, ఒకరిపై ఒకరు లేని ప్రేమను ఎంతగా ఒలక పోసుకున్నా, 2018 నాటి చరిత్ర పునరావృతం అవుతున్న సంకే తాలు స్పష్టమవుతున్నాయని, అస్మదీ యులే అంటున్నారు.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ఇరు పార్టీల మధ్య రాజుకున్న విభేదాల కుంపటి మెల్లమెల్లగా కుల కుంపట్లు రాజేసింది. పవన్ కల్యాణ్ కులం లేదు మతం లేదంటూనే కులాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, కులం ప్రాతిపదికన కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా టీడీపీని భుజాన మోసిన తమకు చంద్రబాబు పాలనలో ‘న్యాయం’ జరగడం లేదని అస్మదీయులు అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఇలా ఎలా చూసినా, ప్రస్తుతం చిన్న చిన్న పగుళ్ళుగా కనిపిస్తున్న కూటమి విభేదాలు మొదటి వార్షికోత్సవం నాటికే బీటలు బారినా ఆశ్చర్య పోనవసరం లేదు.– రాజనాల బాలకృష్ణఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 99852 29722 -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్‌ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్‌లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్‌ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్‌ఫేక్‌లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్‌షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్‌ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్‌షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్‌యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్‌తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్‌సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భీమా కోరేగావ్ చరితను మరుగు పరిచే కుట్రలు!
చరిత్రను మట్టితో కప్పేస్తే అది పుడమిని చీల్చుకుంటూ ఏదో ఒక రోజు బహిర్గతమవుతుంది. అందుకు మంచి ఉదాహరణ భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర. మహారాష్ట్రలోని ప్రస్తుత పుణే జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం భీమా కోరేగావ్ (Bhima Koregaon). 1818 జనవరి1న అక్కడ ఓ యుద్ధం జరిగింది. మరాఠా (Maratha) సమాఖ్యలోని పీష్వా వర్గానికీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకీ మధ్య జరిగిన యుద్ధాన్ని స్వాతంత్ర పోరాటంగా చిత్రీకరిస్తూ అసలైన చరితను మరుగున పరిచే కుట్రలు జరిగాయి.అసలేం జరిగిందంటే...బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాయకత్వంలో 500 మంది మహర్ సైనికులు, 250 మంది అశ్వికదళం, 24 గన్నర్లతో బెటాలియన్ తరలి వెళ్తున్న సమయంలో ‘కోరేగావ్’ గ్రామంలో (పుణేకు 30 కిమీ) 20,000 పదాతి దళం, 8,000 మంది అశ్విక దళంతో కూడిన పీష్వాల సైన్యం అనుకోకుండా ఎదురైంది. దాదాపు 50 రెట్లు అథికంగా ఉన్న శత్రు సైన్యాన్ని చూసినా భయపడకుండా, ముందుకు దూకింది మహర్ సైన్యం. మధ్యాహ్నానికి తమ వెంట వచ్చిన అశ్విక దళం, గన్నర్లతో పాటు ఆహారం మోసుకొచ్చేవారూ పారిపోయినా మహర్లు (Mahars) వెనకడుగు వేయకుండా పోరాడసాగారు. ఒకానొక దశలో ఇక ఓటమి తప్పదని భయపడిపోయిన కెప్టెన్ స్టాటన్ యుద్ధం ముగిసిందని ప్రకటించి తన సేనను లొంగి పొమ్మని ఆజ్ఞాపించాడు.అప్పుడు మహర్ సైన్యం నాయకుడు శికనాగ్ యుద్ధాన్ని విరమించడానికి నిరాకరించాడు. వందల సంవత్సరాలుగా తమని బానిసలుగా మార్చి పశువులకన్నా హీనంగా చూస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యంపై బదులు తీర్చుకోవడానికి ఇదే అవకాశం అని వాదించాడని అంటారు. మొత్తానికి కెప్టెన్ స్టాటన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఆహారం, నీరు కూడా లేకుండా ఒక పగలు, ఒక రాత్రి జరిగిన భీకర యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఊపిరి సలపనీయకుండా ఎదుర్కొన్నారు. మహర్ల ప్రతాపానికి, భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రగా మారిపోయింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకు గోవింద్ బాబా తలను మొండెం నుండి వేరు చేసి బాపు గోఖలేకు పంపాడు శికనాగ్. దీంతో పీష్వా సైన్యం, ఫూల్గావ్ లోని బాజీరావు శిబిరం వైపు పరుగులు తీయసాగారు. వారిని భీమా నది దాటేదాకా తరిమింది మహర్ సైన్యం.చరిత్రలో ఈ ఘటనకు బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని సంపూర్ణం చేసిన ఆంగ్లో–మరాఠా యుద్ధంగా, అందులో పోరాడిన పీష్వాను స్వాతంత్య్ర సమరయోధునిగా చెబుతారు సంప్రదాయ చరిత్రకారులు. కానీ నిజానికి సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం మహర్ సైనికులు చేసిన ఒక వీరోచిత యుద్ధం ఇది. ఈ చరిత్రకు సాక్ష్యంగా 1821లో కోరేగావ్ గ్రామంలో యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో ‘విజయస్తూపం’ ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 22 మంది మహర్ సైనికుల పేర్లను ఆ విజయ స్తూపంపై చెక్కించి ప్రతి సంవత్సరం వారికి నివాళి అర్పించేది.చదవండి: ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...‘ఇది మహర్ పోరాట యోధుల చరిత్ర. యావత్ సమాజానికి స్ఫూర్తినిచ్చే పోరాట’మని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1927 నుండీ చనిపోయేదాకా కూడా ప్రతి సంవత్సరం జనవరి 1న తప్పకుండా ఈ విజయ స్తూపాన్ని సందర్శించి నివాళులు అర్పించేవారు. బాబాసాహెబ్ తదనంతరం ఆయన ఆలోచనా విధానాన్ని కొనసాగించే బాధ్యత తీసుకున్న ‘సమతా సైనిక్ దళ్’వారు ఇప్పటికీ ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన వేల సంఖ్యలో హాజరై నివాళులు అర్పిస్తూ చరిత్రను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ అసలైన చరిత్రను భావితరాలకు అందజేద్దాం. అసమానతలు లేని సమ సమాజం వైపు పయనిద్దాం.– ములక సురేష్, ఉపాధ్యాయుడు -
కాలాన్ని మంచి చేసుకోవాలి!
కాలం మనల్ని వెక్కిరిస్తూ ముందుకు పరిగెత్తుతూంటుంది. మనం దానితోపాటు నడవలేం. దాన్ని ఆపలేం. దాని వెంట పరిగెత్తనూలేం. చేయగలిగిందల్లా దాన్ని వీలైనంత ‘మంచి’ చేసుకోవడమే. అంటే దాన్ని సరిగ్గా వాడుకోవడమే. దాని వేగాన్ని తగ్గించలేక పోయినా దాని విలువను గుర్తించడం మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి.‘నాకు సమయం లేదు’ అనీ, ‘రోజులు గడిచిపోతున్నాయి. చాలా చెయ్యాలనుకున్నా. ఏమీ చెయ్యలేకపోయా’ అనీ, ‘ఉన్న సమయమంతా ఇంకొకళ్ల కోసమే అయిపోతోంది. ఇక నా కోసం ఏం చేసుకోడానికైనా టైం ఏదీ’ అనీ, ‘ఇల్లు, ఆఫీసు... ఈ రెండిటితోనే సరిపోతుంది. ఇంకేమీ చెయ్యలేను బాబూ’... ఇలాంటి మాటలు ఎంత తరచుగా వింటామో! ఈ మాటలు చాలా మంచి ‘సాకులు’. అవి కఠోర వాస్తవాలని మనల్ని మనం మభ్యపెట్టుకోవచ్చుగానీ నిజానికి అవి మనం ‘మనకు నచ్చిన పని చెయ్యకుండా, మనం చెయ్యాల్సిన పని చెయ్యకుండా’ తప్పించుకోడానికి కల్పించుకునే సాకులే. కాలం అందరికీ ఒకటే. ఎవరికైనా రోజులో ఉన్నవి ఇరవై నాలుగ్గంటలే. కొందరు రోజుకు పది పనులు అవలీలగా చేసేస్తారు; మరికొందరు ఒకటిన్నర పనితో సరిపెట్టుకుంటారు. ఈ తేడాకు కారణం మరొకరిపై తోసేయడం సుళువు. దానికి మనం ఎంతవరకు కారణమో ఆలోచించడం నేర్పు. ఇప్పటి ఆడవాళ్లకు అవసరమైంది ఈ నేర్పే. ‘సుళువు’లు చాలా ఏళ్లగానే వాడుకుంటున్నాం. ఇక మన నేర్పును చూపించే వేళ ఆసన్నమైంది. కొంత వెనక్కి వెళ్లి చూస్తే– మనలో మంచి చిత్రకారిణి ఉంది; పాటగత్తె ఉంది; సమాజ సేవకురాలు ఉంది; రచయిత్రి ఉంది; నృత్యకారిణి వుంది; నాయకురాలు ఉంది; వ్యాపారవేత్త ఉంది; దానికి పదును పెట్టాలన్న కోరికా ఉంది. కానీ లేనిదల్లా ఆ పదును పెట్టడానికి సమయమే. ఎందుకంటే వీటితో పాటే ‘నువ్వు ఏదైనా చెయ్యి కానీ నీ ఇంటి బాధ్యతలు పూర్తి చేశాకే’ అని తర్జని చూపించే కుటుంబమూ ఉంది. ‘ఆవిడ అంత పేరు తెచ్చుకుందంటే ఇల్లొదిలి తిరిగింది కాబట్టేగా’ అని మూతి విరిచే సమాజమూ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబాన్నీ, సమాజాన్నీ నోటితో కాకపోయినా నొసలుతో వెక్కిరించే చైతన్యం ఎంతో కొంత మనకు అబ్బింది. అయినా అనుకున్నంతగా, మన సామర్థ్యానికి తగినంతగా సాధించలేకపోతున్నాం. ప్రతి పనినీ ‘వాయిదాలు’ వేస్తాం. వాయిదా వేయడానికి కనిపించినన్ని కారణాలు, ఉపయోగించేంత తెలివి తేటలు, పని చెయ్యడానికే వెచ్చిస్తే ఎంత బాగుంటుంది! అలా కూర్చునీ, కూర్చునీ ‘వయసైపోతోంది. ఏం సాధించాను ఈ జీవితంలో?’ అని నిస్పృహగా ప్రశ్నించుకుంటున్నాం. ‘నాలో ఎంతో ప్రతిభ ఉంది. ఏమీ ప్రతిభ లేని వాళ్లు ముందుకు వెళ్లిపోతున్నారు. నేనింకా వెనకబడే ఉన్నాను’ అని వాపోతున్నాం. గుర్తింపు కోసం, అవార్డుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, బిరుదుల కోసం తహతహలాడటం మానుకోలేకపోతున్నాం. మన మానసిక సంతృప్తి వల్ల లభించే ‘విజయం’ మరే వేదికల వల్లా రాదని గుర్తించలేక పోతున్నాం. ఆ సంతృప్తిని సాధించే సమయం కూడా మన వద్ద ఉండటం లేదు. ఎందువల్ల? కాలాన్ని వాడుకోవడం చేతకాకపోవడం వల్ల; కాలం పట్ల భయమే తప్ప గౌరవం, ఇష్టం లేకపోవడం వల్ల. ఏం జరుగుతోందో అర్థమయ్యాక దాన్ని తట్టుకునేందుకూ లేదా అధిగమించేందుకూ ఏం చెయ్యాలో కూడా ఆలోచించాలి. మనం రోజులో ఎంత సమయం ఎలా వృథా చేస్తున్నామో తెలుసుకోవాలి. వంట చెయ్యడం, ఇంటి పనులు, పిల్లల పనులు చెయ్యడం కాదు వృథా చెయ్యడమంటే. సమయం వృథా చెయ్యడమంటే కాలాన్ని అగౌరవ పరచడం. అది ఎలా చేస్తున్నాం? ఇతరుల గురించి ఆలోచించడం; ఇతరుల పట్ల ఈర‡్ష్యను పెంచి పోషించడం; ఇతరుల జీవితాల్లో ఎన్ని లొసుగులున్నాయో వాకబు చెయ్యడం; మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో సామాజిక మాధ్యమాల్లో వెతుక్కోవడం; మనల్ని ఎంతమంది మెచ్చుకుంటున్నారో తెలుసుకుని గంటల తరబడి ఆనందించడం; ఎంతమంది తిడుతున్నారో తెలుసుకుని కుంగిపోవడం; లేదా శాపనార్థాలు పెట్టుకోవడం; మనకిష్టం లేని వాళ్లను ఎలా భ్రష్టు పట్టించాలో పన్నాగాలు వేయడం; అస్మదీయులతో బృందాలను ఏర్పరచుకుని వారితో పేరంటాలు, పండగలు చేసు కోవడం; మనకు ఉత్తరోత్తరా పనికి వచ్చే వాళ్లతో స్నేహాల కోసం ప్రయత్నించడం; మనల్ని బాధపెట్టిన వాళ్ల గురించి, మనకు నచ్చని వాళ్ల గురించి గంటల తరబడి ఫోన్లలో సంభాషణలు చేయడం; మన బాధ ప్రపంచపు బాధ అనుకుని అందరికీ మన గోడు, మనకు జరిగిన అన్యాయాలనూ వినిపించుకోవడం; ఈ ప్రపంచానికి మనల్ని అవమానించడం మినహా మరో పని లేదనే భ్రమలో జీవించడం. ఇదంతా ఇప్పటి మధ్య వయస్కుల తరం కాలాన్ని గడిపే వైనం. మరి ‘కాలం’ బాధపడదూ? మనకు మేలు చెయ్యాలని ఉన్నా ఎందుకులే ఈ మొహాలకు అని మొహం చాటేయదూ? తాము పుట్టడమే ఈ లోకానికి మహోపకారమనుకునే అహంభావుల కోసం తనెందుకు ఆగాలని అనుకోదూ? కనక, మన జీవితాలను బాగుపరచుకోడానికి గొప్ప అవకాశం ఇచ్చే అనంతమైన కాలాన్ని కొత్త సంవత్సరం నుంచి అయినా ఒక్క చిటికెడు, దోసెడు గౌరవిద్దాం.డా‘‘ మృణాళిని వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, ఆచార్యులు -
ఈ నేరప్రవృత్తికి కారణాలేమిటి?
క్రమశిక్షణే విద్యార్థికి సంస్కారవంతమైన విద్యను అంది స్తుంది. క్రమశిక్షణే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. అది లోపించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యా యులపై దారుణంగా భౌతిక దాడులకు దిగడం అందులో ఒకటి. రాయచోటి (Rayachoty) పట్టణంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ‘ఏజాష్ అహ్మద్’ అనే ఉపాధ్యాయునిపై ఇద్దరు విద్యార్థులు పిడిగుద్దులతో భౌతికదాడి చేయడంతో టీచర్ ప్రాణాలు విడిచారు. తన తరగతిలో బోధన చేస్తుండగా, పక్క క్లాసులో అల్లరి చేస్తున్న వారిని టీచర్ మందలించారు. అంతే... కోపోద్రిక్తులై టీచర్‌పై దాడిచేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలు మరవక ముందే మరో రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) చత్తర్‌పూర్ జిల్లాలోని ధామోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ‘సురేంద్రకుమార్ సక్సేనా’పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది కూడా పాఠశాలకు విద్యార్థి ఆలస్యంగా వచ్చాడని మందలించడం వలనే జరిగింది.దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు గతంలో కూడా రకరకాల కారణాలతో జరిగాయి. కానీ మూడు – నాలుగు రోజుల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే కారణంతో పై సంఘటనలు సంభవించడం బాధా కరం. విద్యారంగంలో జరుగుతున్న ఈ దారుణ పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలు స్వతహాగా సున్నిత హృదయులు. వారి లేలేత మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇంటిలో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు మెలగాలి. పిల్లలు ఎక్కువ సమయం మిత్రులతో గడుపుతారు. ఈ క్రమంలో సహవాస దోషం వల్ల కొన్ని చెడ్డ అలవాట్లు సంక్రమిస్తాయి. దీన్ని ఎవరైనా వ్యతిరేకించి మందలిస్తే, వారిని శత్రువులుగా పరిగణిస్తారు. అందుకే వారిని అనునయిస్తూ పరిష్కారాలను కనుగొనాలి.చిన్నతనంలో కుల, లింగ వివక్ష, లైంగిక వేధింపులకు గురి కావొచ్చు. ఇవన్నీ పిల్లల విపరీత ధోరణికి కారణమౌతాయి. టీనేజ్ పిల్లలు రాత్రనక పగలనక స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు చూస్తూ కాలం గడుపుతుంటారు. బెట్టింగ్, రమ్మీ, రేసింగ్ లాంటి ఆటల్లో పాల్గొని డబ్బు పోగొట్టుకుంటారు. దీంతో ప్రతీ విషయానికీ కోపం, అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. వీటన్నింటి వల్లనే నేడు విద్యార్థులలో వింత ప్రవర్తన చూస్తున్నాం. ఈ కారణాలతోనే పిల్లలు మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, రీల్స్ చూసి నాయికా నాయకులను అనుకరిస్తున్నారు. ఈ రోజుల్లో హైస్కూల్ స్థాయి విద్యార్థులు సైతం ధూమపానం, మద్యం సేవించడం చూస్తున్నాం. ఇవన్నీ పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచేవే.ఒక విద్యార్థిని ‘నీకేమీ రాదు, నీవు దేనికీ పనికి రావు’ అని పది మందిలో తక్కువ చేసి టీచర్ మాట్లాడకూడదు. శారీరకంగా శిక్షించకూడదు. దాన్ని అవమానంగా భావించి కృంగిపోతాడు. గ్రామీణ విద్యార్థులను చులకనగా చూడకూడదు. వీరికి పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించకూడదు. వీరికి అవసరమైన పక్షంలో ప్రాథమిక నైపుణ్యాలు నేర్పాలి. స్కూల్లో అందరు టీచర్లూ ఐక్యంగా ఉండాలి. పాఠశాలల్లో సహ పాఠ్యేతర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వాటిలో విద్యార్థులను భాగస్వామ్యలుగా చేయాలి. అవసరమైతే పాఠశాలలో సైకియాట్రిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించాలి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంబడి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను, పత్రికలను పిల్లలు చదివేలా చూడాలి. సైన్స్, సోషల్, మోరల్ క్లబ్బులను నిర్వహించాలి. ప్రపంచీకరణ వల్ల సంక్రమించిన వస్తువుల వల్ల కలిగే నష్టాలను ఎరుక పరచాలి. ప్రభుత్వమైతే విద్యా ప్రణాళికలో మార్పులు చేయవచ్చు. ఆ మార్పులు సామాజిక అంతరాలను నిలువరిస్తూ, మానవత్వాన్ని చాటేలా ఉండాలి. స్ఫూర్తిదాయక, నీతి ప్రబోధక పాఠ్యాంశాలను తప్పనిసరిగా చేర్చాలి. అప్పుడే విద్యార్థికి విలువలతో కూడిన విద్య అందుతుంది. లేనిచో విద్యార్థుల్లో హింసాప్రవృత్తి పెచ్చు మీరిపోయి, రాబోవు యువతరం నిర్వీర్యయ్యే ప్రమాదం లేకపోలేదు.- పిల్లా తిరుపతిరావుతెలుగు ఉపాధ్యాయుడు -
ఆ పేరును ఎందుకు స్మరించాలంటే...
డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భారతీయ (BR Ambedkar) చరిత్రలో మహోన్నత వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా, దళిత హక్కుల పరిరక్షకుడిగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అంబేడ్కర్ అందించిన సేవలు కుల, ప్రాంతీయ పరిమితులను దాటి ఉన్నాయి. ఆయన కేవలం సామాజిక సంస్కర్తగానే కాకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం పారిశ్రామీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ, నాగరికత (Civilisation) గురించి దశాబ్దాల ముందే చర్చించిన దూరదృష్టి కలిగిన తత్వవేత్త. ఆయన కేవలం దళితులకు మాత్రమే చెందినవారు కాదు. ఆయన విశ్వ మానవతా సిద్ధాంతాలు, సేవలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోవాలి. పారిశ్రామికీకరణ ప్రజల సాంఘిక–ఆర్థిక స్థితులను మెరుగుపరచడానికి మార్గమని ఆయన విశ్వసించారు. గ్రామాధారిత ఆర్థిక వ్యవస్థ (Economy) ఒక్కటే భారతదేశ అవసరాలను తీర్చలేదని ఆయన స్పష్టంగా గ్రహించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, పేదరికాన్ని తగ్గించి, ఆర్థిక పురోగతిని సాధించవచ్చనేది ఆయన నమ్మకం.అలాగే, పట్టణీకరణ ద్వారా సామాజిక సమానత్వానికి మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు విద్య, సాంకేతికత, సామాజిక మార్పు కేంద్రాలుగా; కులవాదం నుండి విముక్తి కలిగించే చోట్లుగా ఉండాలి అని ఆయన బలంగా విశ్వసించారు. ఆధునికీకరణ గురించి ఆయన అభిప్రాయాలు శాస్త్రీయ ద్రుఃక్కోణం, సామాజిక సమానత్వం, బుద్ధివాదం ఆధారంగా ఉన్నాయి. ముఖ్యంగా మరుగునపడిన వర్గాల అభివృద్ధిలో విద్య ప్రాముఖ్యాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భారతీయుల మనోభావాలను ఆధునికీకరించే క్రమంలో పెద్ద ముందడుగు. ఆయన ప్రధానంగా భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రఖ్యాతి పొందారు. కానీ ఇది కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాక ఒక తాత్విక విజయంగా నిలిచింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆవశ్యక విలువలను రాజ్యాంగంలో ప్రతిష్ఠించారు.అలాగే కార్మిక సంక్షేమం, మహిళా హక్కులు, అంటరానితనం నివారణ వంటి రంగాల్లో ఆయన రూపకల్పన చేసిన విధానాలు ఈ రోజు కూడా అద్భుతంగా పని చేస్తున్నాయి. ‘హిందూ కోడ్ బిల్లు’ ద్వారా మహిళలకు వారసత్వ ఆస్తిహక్కును కల్పించడం ద్వారా లింగ సమానత్వానికి ఆయన బలమైన పునాది వేశారు. ఆయన రాసిన ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే గ్రంథం ఆర్థిక స్థిరత్వం, కేంద్ర బ్యాంకింగ్ సంస్కరణల ప్రాముఖ్యాన్ని చూపిస్తుంది. అలాగే ఆయన సైన్సు ఆధారంగా ఆధునిక సమాజాన్ని నిర్మించడమే కాకుండా, సర్వలోక మానవ హక్కులకూ అంకితమయ్యారు. ఆయన తత్త్వం ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్జీఈఎస్) ముందుగానే ఊహించింది. లింగ సమానత్వం, అసమానతల తగ్గింపు, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలకు ఆయన జీవితమే మార్గదర్శి.చదవండి: బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నంఅంబేడ్కర్ పేరును స్మరించడం అనేది కేవలం ఆరాధన కాదు, ఆయన విలువలను మన జీవితాల్లో అమలు చేయడం. ఆయన పేరు మనం న్యాయ సమానత్వం, ఆర్థిక పురోగతి వంటి గౌరవప్రద విలువల వైపు అడుగులు వేస్తున్నామని గుర్తు చేస్తుంది.– ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, చైర్ ప్రొఫెసర్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చైర్, ఆంధ్రా యూనివర్సిటీ -
బీద పిల్లల నోట్లో మట్టి కొట్టే యత్నం
విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కళ్లు తెరుస్తున్న ప్రజల మీద వ్యతిరేకత మంచిదా? తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు; మరి తెలుగులో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మొదలైన విద్యా విప్లవాన్ని వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంగ్లిష్ విద్యను కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం (English Medium) బతకదు.విజయవాడలో డిసెంబర్ 28, 29 తేదీల్లో రెండ్రోజులు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ జరిగాయి. ఆ సభల్లో దేశానికి చీఫ్ జస్టిస్‌గా పనిచేసి రిటైరైన జస్టిస్ ఎన్.వి. రమణ గారు (NV Ramana) వైకాపా ప్రభుత్వం ఇంగ్లిష్ విద్యను రాష్ట్రమంతటా ప్రవేశపెడుతూ తెచ్చిన జీవో నంబర్ 85 రద్దు చేయాలనీ, మొత్తం ఏపీ ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థను మళ్ళీ పాత తెలుగు మీడియంలోకి మార్చాలనీ సూచించారు. ఆయన సూచనను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఒక కోర్టు ఆర్డరుగా పరిగణించి ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్లీ తెలుగు మీడియంలోకి మార్చే పెను ప్రమాదం లేకపోలేదు.జస్టిస్ రమణగారు కోర్టుల్లో కేవలం ఇంగ్లిష్‌లో వాదించినవారు. జడ్జిగా తీర్పులన్నీ ఇంగ్లిష్ భాషలో రాసినవారు. ఆయనది ధనవంతమైన రైతు కుటుంబం కనుక తెలుగు మీడియం స్కూల్ విద్య నుండి వచ్చి కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించి జ్యుడీషియల్ సిస్టమ్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. కానీ గ్రామీణ కూలినాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు అలా ఎదగడం సాధ్యమా? జడ్జిగారు తెలుగు భాషతో ఉద్యోగం, ఉపాధి దొరక్కపోవడం భ్రమ అంటున్నారు.జస్టిస్ రమణగారు వకీలు నుండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎదిగిన జ్యుడీషియల్ సిస్టమ్‌లోనే చూద్దాం. తెలంగాణ హైకోర్టు నుండి కింది కోర్టుల వరకు నేను కోర్టు రూముల్లో నిలబడి చూశాను. గ్రామాల నుండి తెలుగు మీడియంలో చదువుకొని, కష్టపడి లా డిగ్రీ సంపాదించిన యువ లాయర్లు ఇప్పుడు కోర్టుల్లో చాలామంది ఉన్నారు. వారికి చట్టాలపై ఎంత పట్టు ఉన్నా ఇంగ్లిష్‌లో వాదించే భాష లేక ఎంత డిప్రెషన్‌కు గురౌతున్నారో నేను చూశాను. వారితో మాట్లాడాను. వారికి వకీలు నుండి జడ్జిగా పై కోర్టుల్లో ఎదగడానికి రాజకీయ సపోర్టు, కమ్యూనిటీ బలం లేదు. ఇంగ్లిష్ రాని, వాదించ లేని బాధతో ఆత్మగౌరవం దెబ్బ తింటుంది. ఇదే కోర్టులో ఇప్పుడు నేషనల్ లా స్కూల్స్ నుండి వస్తున్న యువ లాయర్లు చట్టంలో పట్టున్నా, లేకున్నా ఇంగ్లిష్ బలంతో కేసులు గెలుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో లా గ్రాడ్యుయేట్స్‌ను రిక్రూట్స్ చేసుకునేటప్పుడు ఏ కంపెనీల్లో తెలుగులో ఇంటర్వ్యూ జరుగుతుందో సిస్టమ్ గురించి తెలిసిన జస్టిస్ రమణగారిని చెప్పమనండి! దేశ సంపద ఇప్పుడు ఈ కంపెనీల్లో పోగుపడి లేదా? అందులో తెలుగు భాషతో ఉద్యోగా లొస్తాయా?నేషనల్ సివిల్ సర్వీస్‌లో ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలోనే ఇస్తున్నారు కదా! ‘ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్’ అంటున్న ఈ తెలుగు భాషకు, సివిల్ సర్వీస్‌లో ప్రశ్నపత్రం లేని గతి ఎందుకున్నది? తెలుగు భాషలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పరీక్ష రాసిన బీద విద్యార్థులు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తెలుగుపై ఇంత ప్రేమ ఉన్న జస్టిస్ రమణగారు సుప్రీం కోర్టులో ఒక ‘పిల్’ వేయించి యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు అన్ని రాష్ట్ర భాషల్లో ఉండాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ప్రాంతీయ భాషల్లో చదువుకునే మొదటితరం అమ్మాయిలు, అబ్బాయిలు కొంతైనా మేలు పొందేవారు. అదే సుప్రీం కోర్టు ప్రైవేట్ రంగంలో స్కూల్ విద్య, ప్రభుత్వ రంగంలో స్కూలు విద్య దేశం మొత్తంగా ఆ యా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో ఉండాలని ఎందుకు చెప్పలేదు? ప్రైవేట్ స్కూళ్లను కన్నడలో బోధించాలని కర్ణాటక జీవో ఇచ్చినప్పుడు సుప్రీం కోర్టే తమ పిల్లల్ని ఏ భాషలో చదివించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని చెప్పింది కదా! మరి గ్రామీణ కూలీల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ భాషల్లో చదివించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉండదా? జస్టిస్ రమణగారు తల్లిదండ్రుల అభిప్రాయం మళ్ళీ సేకరించండి అంటే న్యాయం ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేసి ఉండవచ్చు. అలా కాకుండా తెలుగులోకి మార్చాలని నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారు?ఒకవైపు కేంద్ర ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం, మరోవైపు కార్పొరేట్ సంస్థలు నడిపే ఎయిర్ కండిషన్డ్ స్కూళ్ళల్లో ఇంగ్లిష్ మీడియం. ఆ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళ నుండి ఒక బ్యాచ్ కూడా బయటికి రాకముందే జస్టిస్ రమణ గారు వారి భవిష్యత్ గురించిన ఈ జడ్జిమెంట్ ఎలా ఇచ్చారు?చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటున్నారు. ఆయన మనుమడు ఏ భాష స్కూలులో చదివి ఇప్పుడు అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కాబోతున్నాడు? 9 ఏండ్ల మనుమని కోచ్ ఆయనకు ఏ భాషలో మాట్లాడి కోచింగ్ ఇస్తున్నాడు? బీద కుటుంబాల్లోని పిల్లలు అంత ర్జాతీయ ఆటగాళ్లు కావద్దు అనే కదా ఈ ఆలోచన.మూడు వేల ఏండ్లు నిరక్షరాస్యులుగా ఉండి ఇప్పుడిప్పుడే విద్యపట్ల కండ్లు తెరుస్తున్న ప్రజల మీద ఇంత వ్యతిరేకత మంచిదా? ఈ దేశ విద్యావంతులు, అధికారాన్ని, ధనబలాన్ని అనుభవించిన మేధావులు సైతం బీద ప్రజల సమాన విద్యా హక్కు పట్ల న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఈ బీద, అణచి వేయబడ్డ జీవితాలు ఎలా మారుతాయి? మేధావులకు తెలుగుపట్ల ప్రేమ ఉంటే ప్రపంచ భాషల్లోకి అనువాదం చెయ్యబడి నోబెల్ ప్రైజ్ పొందే పుస్తకాలు రాయాలి కాని దిక్కులేని ప్రజల జీవితాల్లో మట్టి పొయ్యడానికి సిద్ధాంతాలు అల్లకూడదు కదా!తెలుగు నిజంగానే ‘ఈస్టర్న్ ఇటాలియన్’ భాష అయితే... నన్నయ్య, తిక్కన కాలం నుండి జస్టిస్ రమణ కాలం వరకు ఇటాలియన్ భాషనే ‘తెలుగు ఆఫ్ వెస్టర్న్ వరల్డ్’ అనేంతగా ఎదిగించడానికి బీద పిల్లల తల్లిదండ్రులు అడ్డువచ్చారా? ప్రపంచ రచయితల మహాసభల్లో తెలుగులో ప్రపంచ గుర్తింపు పొందగల పుస్తకాలను ఎలా రాయాలో చర్చించాలి గానీ ప్రభుత్వ స్కూళ్లను తెలుగు మీడియంలోకి మార్చే అంశాన్ని కాదు గదా! రవీంద్రనాథ్ టాగూర్‌లా బెంగాలీలో గీతాంజలి రాసి నోబెల్ బహుమతి తెచ్చినట్లు... తెలుగులో ఎటువంటి పుస్తకాలు రాయాలి, నోబెల్ బహుమతిని ఎలా తేవాలి వంటి అంశాలను చర్చిస్తే బీద ప్రజల పిల్లలు కూడా అటువంటి పుస్తకాన్ని చదివి నేర్చు కుంటారు.ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూల్ విద్యపై చర్చ పూర్తిగా నిలిచిపోయింది. కనీసం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఫోకస్ కూడా చంద్రబాబు ప్రభుత్వం పెట్టడం లేదు. స్కూళ్ల అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లన్నీ నిలిపివేశారు. క్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని మళ్ళీ పాతబాటలోకి విద్యామంత్రిగా లోకేష్ నెడుతున్నారు.చదవండి: ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే.. 'పేద బిడ్డలకు తెలుగే'ఇప్పుడు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల పేరుతో పిల్లల భవిష్యత్తుకు ముగుతాడు వెయ్యాలనే ప్రచారం మొదలైంది. ఒక్క జస్టిస్ రమణగారే కాదు.. మండలి బుద్ధప్రసాద్ ఇటువంటి ఆలోచన కలవారే. ఇప్పుడు ఇంగ్లిష్ విద్యను ప్రభుత్వ స్కూళ్లలో కాపాడుకునే ఉద్యమాలు గ్రామీణ స్థాయిలో మొదలైతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బతకదు. ఈ విద్యా విధానాన్ని కాపాడవలసిన బాధ్యత ఒక్క వైసీపీదే కాదు... వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఇంగ్లిష్ విద్య పరిరక్షణ పోరాటం చేస్తే తప్ప ఈ తిరోగమన రథచక్రం ఆగదు.- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
ఉత్తర తెలంగాణకు మంచిరోజులెన్నడు?
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కల వనరులు ఉన్నా... పేదరికమూ, దారిద్య్రమూ తాండవిస్తూనే ఉన్నాయి. రైతన్నల ఆత్మ హత్యలు, నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. యువత ఎడారి బాట పడుతుంటే... బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్నాయి. సామాజిక అణిచివేతలు సరేసరి! ఇలా ఎన్నో సమస్యలు. గతం గతః. నేడు కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఈ ప్రాంతవాసులు ఉన్నారు.రాష్ట్రంలోనే ఓ మూలకు విసిరేయబడ్డ ట్లున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నింటా వివక్షకు గురవుతోంది. ఆదర్శ జిల్లాగా చెప్పు కుంటున్న ఆదిలాబాద్ కేవలం అక్షర క్రమంలోనే ముందుండి, అభివృద్ధిలో మాత్రం ఏళ్లుగా వెనుక బాటుకు గురవుతోంది. ఉన్నంతలో కొంత మేరకు పైపై అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలది మరో ప్రత్యేక స్థితి. కార్పొరేటీకరణ దుష్ఫలితంగా విద్య, వైద్యం పేదలకు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని అసంఘటిత, బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భర మవుతున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 7–8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఆకాశాన్నంటు తున్న ధరలు, అందని కనీస వేతనాలు, వెరసి వీరి బతుకులు మరింత దుర్భర స్థితిలోకి నెట్ట బడుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) మొత్తం జనా భాలో 18 శాతం మంది గిరిపుత్రులున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలోనూ వీరివి చీకటి బతుకులే. జ్వరమొచ్చినా. జలుబు చేసినా వందల్లో జనం రాలిపోవాల్సిందే. ఈ మూడు జిల్లాల్లోనూ పుష్కల వనరులున్నా వాటి సద్వినియోగం లేక లక్షల మంది యువత ఉపాధి కోసం ఎడారి బాట పడుతున్నారు. ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుంటే పక్క రాష్ట్రాలకు అప్పిచ్చేంత నీటి వనరులున్నాయి. అయినా ఖరీఫ్ ప్రారంభంలో రైతులు కారుమబ్బుల నుండి జాలువారే చినుకు కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిందే. గోదావరి వంటి జీవ నదులు, సిరులు పండించే సారవంతమైన నల్లరేగడి నేలలు, విస్తారమైన అటవీ సంపద. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు, (Sigareni Coal Mines) విస్తారమైన ఖనిజ సంపద ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా వనరులను ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక పోతోంది.నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ... అభివృద్ధికి నోచుకోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడి దుర్భిక్ష పరిస్థి తుల్ని పారదోలేందుకు ‘జలయజ్ఞం’ ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసిన మహానేత ఆయన. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలనేకం ఉత్తర తెలంగాణలో మూసి వేతకు గురయ్యాయి. ఆదిలాబాద్‌లో సీసీఐ మూసివేతతో 2,500 మంది, స్పిన్నింగు మిల్లు ప్రైవేటీకరణతో 750 మంది, నిర్మల్ ప్రాంతంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్లుల మూతతో 2,000 మంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ (Bodhan Sugar Factory) మూసివేతతో 2,500 మంది, కరీంనగర్లో ఎరువుల కర్మాగారం మూతతో 2,500 మంది ఉపాధికి దూరమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ పరి స్థితుల్లో యువతకు గల్ఫ్ బాట తప్పడం లేదు. ఫలితంగా వేలాది కుటుంబాల్లో గల్ఫ్ గాయం మిగులుతోంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్సార్ ‘సమ వికేంద్రీకరణ’ సిద్ధాంతం బదులు ‘అపసవ్య కేంద్రీకరణ’పై దృష్టి పెట్టడంతో ప్రాంతాల మధ్య అసమాన తలు మళ్లీ మొదలవుతున్నాయి.చదవండి: చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గుగనులతో పాటు విస్తారంగా మాంగనీసు, ఇనుప ధాతువూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసు పుతో పాటు ప్రత్యేక పంటగా ఎర్రజొన్న సాగ వుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలి. ఆదిలాబాద్‌లో అటవీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కరీంనగర్, నిజామాబాద్‌లలో గ్రానైట్ గనులున్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దులో భీమదేవరపల్లి మండలంలో ఇనుపరాతి గుట్టలున్నాయి. కావున ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి పూను కోవాలి. మంథని కేంద్రంగా మైనింగ్ యూని వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. స్థానికులకే ఇక్కడ పనులు కల్పించాలి. ఈ ప్రాంతం నుండి ఎన్నుకోబడిన ప్రతి నేతా న్యాయంగా మనకు రావాల్సిన నిధుల కోసం చట్టసభల్లో గొంతు విప్పాలి.- డాక్టర్ బి. కేశవులు నార్త్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫౌండర్ – చైర్మన్ -
చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ మారిపోయారనీ, అధికారంలోకి వచ్చాక ప్రజల క్షేమం గురించి బాగా ఆలోచిస్తున్నారనీ కొంత కాలంగా అక్కడక్కడా వినిపిస్తోంది. పవన్‌లో చాలా ముఖాలున్న నేపథ్యంలో ఆయన మారి పోయాడన్నది ప్రచారం మాత్రమే. అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపీడీఓపై దాడి జరిగిందని పవన్ హంగామా చేశారు. శనివారం కడప రిమ్స్‌కు వెళ్లి పరామర్శ పేరుతో వైఎస్సార్సీపీ నేతల్ని అనరాని మాటలన్నారు. ఈ వివాదం గురించి ఆయన పూర్తిగా తెలుసుకోకుండా రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించార నేది జనాభిప్రాయం. వైఎస్సార్సీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని అంటూ... ‘అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తా’నంటూ పరుష పద జాలం వాడారు.కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ, భాగస్వామ్య పార్టీల నాయకులు అధి కారులపై దూషణలకు దిగడం, బెదిరించడం, దాడులు చేయడం రివాజుగా మారింది. ఈ నెల లోనే వైఎస్సార్ కడప జిల్లాలో వీఆర్వోపై టీడీపీ నాయకుడు బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఇప్పుడు సదరు నేత తోలు తీసే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పంచాయతీ రాజ్య వ్యవస్థలో ఉద్యోగులపై అధికార పార్టీ వేధింపులు చాలా ఉన్నాయి. సాక్షాత్తూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ సందర్భంలో దళిత డాక్టర్‌ను దూషించిన విషయాన్ని డిప్యూటీ సీఎం మరిచి పోయినట్టు ఉన్నారు.కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయనేది దేశం మొత్తానికి తెలిసిన నిజం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 229కి పైగా హత్యలు, 750కి పైగా హత్యాయత్నాలు, నాలుగు వేలకు పైగా దాడులు, ఏడువేలకు పైగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది.‘నేను తప్పు చేసినా శిక్ష పడాలి’ అని అసెంబ్లీలో చెప్పిన వ్యక్తినంటూ పవన్ గొప్పలు చెప్పు కొన్నారు. కానీ నేడు టీడీపీ నేతలు చేస్తున్న దారు ణాలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తు న్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. పవన్ ప్రత్యామ్నాయంగా మారుతాడనీ, మార్పు తెస్తాడనీ అభిమానులూ, జనసేన కార్యకర్తలూ ఆశించారు. కానీ నేడు అలా జరగడం లేదు. పైగా రాక్షసపాలన చేస్తున్న చంద్రబాబును వీలు చిక్కి నప్పుడల్లా ఆయన ఆకాశానికి ఎత్తడం వారిని బాధిస్తోంది. ‘ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైరవ్వను’– అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ చెప్పిన మాట ఇది. కానీ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిన విషయం ఆయనకు తెలి యదా? కానీ దానిపై మాట్లాడితే చంద్రబాబు ఇబ్బంది పడతారు. ఆరు నెలల్లోనే 126కు పైగా అత్యాచారాలు, లైంగికదాడులు జరిగాయి. 12 మందిపై హత్యాచారం జరిగింది. వీటిపై పవన్ మాట్లాడకపోగా డైవర్షన్ కోసం ప్రయత్నించి జనాగ్రహాన్ని మూట గట్టుకున్నారు. ‘నేనే హోం మంత్రినైతే...’ అంటూ సినిమా టైటిల్ తరహా స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం వ్యవహారాన్ని బాబు వైపు నుంచి తెలివిగా మళ్లించారు. గతంలో పవన్ ఆడపిల్లలపై దాడుల విషయంలో అనేక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కొన్ని అంశాలు అంట గట్టే ప్రయత్నం చేసి పెద్ద గొంతుతో సినిమాటిక్‌గా అరిచారు. ఇప్పుడు ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో అరాచకం రాజ్య మేలుతున్నా మౌనం వహించడంతో జనసేన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారన్నది అక్ష రాలా నిజం.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఎంపీడీ ఓను పరామర్శించారు. దానిని ఎవరూ కాద నరు. రాష్ట్రంలో రోజూ బాలికలు, మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి వీటిపై స్పందించరేం? నిజంగా ఆ పని చేస్తే ఆయనపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటిపై పాలకులు మౌనంగా ఉంటే పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు. ప్రశ్నిస్తూనే ఉంటానని పార్టీ పెట్టిన వ్యక్తి... ముందు తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పాలి. ఇది సినిమా హీరోలను దేవుళ్లుగా కొలుస్తున్న సమాజం కాబట్టి ఏం చెప్పినా... చేసినా చెల్లుబాటవుతుందనే భ్రమల్లో పవన్ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది సోషల్ మీడియా యుగం. వివిధ యాప్స్ వేదికగా యువత ప్రశ్నలు సంధిస్తోంది. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంపై ఉంది.– వెంకట్ -
కేజ్రీవాల్ నాయకత్వానికి అగ్ని పరీక్ష
2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కు సవాలుగా నిలుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఢిల్లీని ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈసారైనా గద్దె దింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దానికితోడు ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ ఇద్దరు నేతలు నిష్క్రమించడం, దాని మద్దతుదారుల్లో చీలికను సృష్టించింది. అలాగే, పొత్తుకు ఆప్ నిరాకరించడంతో ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా ఉండే ముస్లింల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే, పడినా నిలబడ గలిగే కేజ్రీవాల్ సామర్థ్యం, సంక్షేమంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో పార్టీ ట్రాక్ రికార్డ్ ఆయనకు బలమైన పునాది కాగలవు.2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కూ, ఆమ్ ఆద్మీ పార్టీకీ కీలకమైన ఘట్టంగా మారబోతున్నాయి. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆధిపత్యం చలాయించిన కేజ్రీవాల్‌కు ఇప్పుడు సవాళ్లు పెరుగు తున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య దేశ రాజధానిపై తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ, చావో రేవో అనే పరిస్థితులను ఆయన ఎదుర్కొంటున్నారు.అవినీతి వ్యతిరేక పోరాట యోధుడి స్థానం నుండి ఢిల్లీ ముఖ్యమంత్రి వరకు కేజ్రీవాల్ సాగించిన ప్రయాణం సాధారణ మైనదేమీ కాదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘనవిజయం సాధించింది. ఆయన నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మొత్తం 70 సీట్లలో వరుసగా 67, 62 స్థానాలను గెలుచుకుని బలీయమైన రాజకీయ శక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే, అప్పటి నుండి రాజకీయ చిత్రం గణనీయంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు 2025 శాసనసభ ఎన్నికలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.దూకుడు పెంచిన బీజేపీఢిల్లీపై బీజేపీ రెట్టించిన బలంతో వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరించడం దీనికి అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి. ఇప్పటివరకూ ఆప్ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేక పోయిన బీజేపీ, కేజ్రీవాల్‌ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను ఆ పార్టీ పోటీకి దింపింది. దీనితో పోటీ ఇక్కడ తీవ్రంగా మారింది. అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపడంతో ఈ పోటీ మరింత రసవత్తరం కానుంది.కేజ్రీవాల్ పదవీకాలం ఏమీ వివాదాలు లేకుండా సాగలేదు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆయన ప్రచారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అవినీతి ఆరో పణలు, తదుపరి న్యాయ పోరాటాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అంతేకాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మందు గుండు సామగ్రిని ఇవి అందించగలవు.పైగా, ఆప్‌లోని అంతర్గత చోదక శక్తులు కూడా సవాళ్లను విసిరాయి. ఆప్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన రాజేంద్ర పాల్ గౌతమ్, రాజ్‌కుమార్ ఆనంద్ వంటి కీలక నేతలు రాజీనామా చేయడం పార్టీ మద్దతుదారుల్లో చీలికకు కారణమైంది. వీళ్ల ఫిరాయింపులు... ఒకప్పుడు ప్రధాన బలాలుగా ఉన్న సామాజిక న్యాయం,అందరినీ కలుపుకొనిపోవడం లాంటి విషయాల్లో ఆప్ నిబద్ధతపైనే ప్రశ్నలను లేవనెత్తాయి.సంక్షేమం కొనసాగింపుఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ ఓటర్లను గెలుచుకోవడానికి తన పాలనా రికార్డును, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జనాభాలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆప్ అనేక కార్యక్రమాలను ప్రకటించింది. ఇళ్లకు ఉచిత విద్యుత్తు కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే ‘సంజీవని యోజన’, ఆటో రిక్షా డ్రైవర్లకు ప్రయోజనాలు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ పథకాలు సంక్షేమం, అభివృద్ధిపై కొనసాగుతున్న ఆప్ దృష్టిని ప్రతిబింబిస్తాయి. ఇది దాని ఎన్నికల వ్యూహానికి మూలస్తంభం.విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి ముఖ్యమైన అంశమైంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడం, మొహల్లా క్లినిక్‌ల స్థాపన విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆప్ తన వాగ్దానాలను నెరవేర్చే పార్టీగా కీర్తిని పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. 2025 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ప్రతికూల కథనాలను ఎదుర్కో వడానికీ, ఢిల్లీ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న నాయ కుడిగా తన ఇమేజ్ను బలోపేతం చేసుకోవడానికీ కేజ్రీవాల్ ఈ విజయాలను హైలైట్ చేసే అవకాశం ఉంది.ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ‘ఇండియా’ బ్లాక్‌లోని గమనాత్మక శక్తులు కూడా రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఆప్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ, అవి ఢిల్లీలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఆప్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలకు ముందు పొత్తు లేక పోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన సంకీర్ణ రాజకీ యాల సంక్లిష్టతలనూ, ఇండియా కూటమిలో ఐక్యతను కొనసాగించడంలో ఉన్న సవాళ్లనూ నొక్కి చెబుతోంది.బలమైన వర్గాలు కీలకంసాంప్రదాయికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన మద్దతు పునాదిగా ఉన్న దళితుల ఓట్లు 2025 ఎన్నిక లలో కూడా కీలకమైన అంశం కానున్నాయి. కానీ కీలక దళిత నేతల ఫిరాయింపులు, దళిత వ్యతిరేక పార్టీ అనే ఆరోపణలు ఆప్‌కు అవగాహనా సమస్యను సృష్టించాయి. దళిత ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ అసంతృప్తిని పెట్టుబడిగా వాడుకునే అవకాశం ఉంది. కేజ్రీవాల్ ఈ ఆందోళనలను శీఘ్రంగా పరిష్కరించాలి. దళిత సంఘాలు ఆప్‌కు తమ మద్దతును కొనసాగించడానికి, చాలా ముఖ్యమైన సమస్యల పట్ల ఆప్ నిజమైన నిబద్ధతను ప్రదర్శించాలి.అదేవిధంగా ఢిల్లీ జనాభాలో దాదాపు 15–18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా అంతే కీలకం కానున్నాయి. చారిత్రకంగా,ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ముస్లిం సమాజం ముఖ్య పాత్ర పోషించింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో, ఆప్ ఈ విష యంలో గణనీయమైన పురోగతిని చవిచూసింది. 77 శాతం ముస్లిం ఓటర్లు అప్పుడు ఆ పార్టీకి మద్దతునిచ్చారని అంచనా.అయితే, 2020 నాటికి, ఈ మద్దతు కొద్దిగా తగ్గింది. 69 శాతం మంది ముస్లింలు ఆప్‌కు మద్దతు ఇచ్చారు. అయితే, 2025 ఎన్ని కలలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించింది. కాబట్టి, ముస్లిం ఓటర్లలో పెరుగుతున్న పరాయీకరణ భావాన్ని కాంగ్రెస్ త్వరితగతిన ఉపయోగించుకునే వీలుంది. దీనివల్ల ఈ క్లిష్టమైన వర్గంపై ఆప్ ప్రభావం మరింతగా తగ్గుతుంది.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేజ్రీవాల్ నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారు. ఆ యా పార్టీలు గతంలో కంటే ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, వివాదాల నీడ, అంతర్గత పార్టీ వ్యవహారాలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత వంటివి కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచు తున్నాయి.అయినప్పటికీ, పడినా నిలబడగలిగే సామర్థ్యం, ఓటర్లతో అనుసంధానం కాగలిగే నైపుణ్యం కేజ్రీవాల్ బలాలు. పాలనపై, సంక్షే మంపై ఆయన దృష్టికోణం, వాగ్దానాలను అమలు చేయడంలో తన ట్రాక్ రికార్డ్ వంటివి ఆయన ప్రచారానికి బలమైన పునాదిని అంది స్తాయి. రాబోయే ఎన్నికలు కేజ్రీవాల్ నాయకత్వ పటిమనూ, కల్లోల రాజకీయాల్లో ఎదురీదే ఆయన సామర్థ్యాన్నీ పరీక్షించనున్నాయి.సాయంతన్ ఘోష్ వ్యాసకర్త కాలమిస్ట్, రీసెర్చ్ స్కాలర్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
14వ దలై లామా (బౌద్ధ గురువు) రాయని డైరీ
‘‘ఎలా ఉన్నారు?’’ అనే ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్న వేయటం వెనుక ఉన్నది పలకరింపా, పరామర్శా, ఆందోళనా లేక ఆరా తీయటమా అనే దానిని బట్టి మారుతూ ఉండవచ్చు. అయితే ఒక బౌద్ధ గురువు ఇలాంటి ఒక దైహికమైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ఆ గురువు ఇచ్చే సమాధానం... ప్రశ్న వేయటానికి వెనుక ఉన్న ఉద్దేశంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండాలి. అంటే... ఆయన ధర్మశాల పట్టణంలోని తన హిమాలయ నివాసంలో ఉన్నా, న్యూయార్క్‌లోని మోకాళ్ల శస్త్ర చికిత్సా కేంద్రంలో ఉన్నా సమాధానం మారకూడదు. అది కూడా, ‘‘నాకేం! నిక్షేపంగా ఉన్నాను’’ అని కాకుండా, ‘‘నీకేం! నిశ్చింతగా ఉండు’’ అని... భరోసా ఇచ్చేలా ఆ సమాధానం ఉండాలి. బౌద్ధాచార్యులైన ఒక దలై లామా ఎంతటి వృద్ధాప్యంలోనైనా ‘గుంభనం’గా ఉన్నప్పుడే ఆయన భక్తులు, అనుచరులు, పాలకులు ఆయన అంతిమ శ్వాసను గురించిన ఆలోచనలు చేయకుండా ఉంటారు.జూన్‌లో శస్త్ర చికిత్స జరిగాక నా మోకాలి కదలికలు కాస్త మెరుగుపడ్డాయి. నలుగురు కలిసి నడిపిస్తే నడవ గలుగుతున్నాను. ఇద్దరు కలిసి కూర్చోబెడితే కూర్చోగలుగుతున్నాను.ప్రపంచానికైతే నాకసలు చికిత్స జరిగింది కుడి కాలికా, ఎడమ కాలికా అన్న సంగతే తెలియదు. అదే ‘గుంభనత్వం’ అంటే! ఎవరికీ, ఏదీ తెలియనివ్వకపోవటం! ముఖ్యంగా మన ఆరోగ్యం గురించి! దర్శనాలకు సమయమౌతుండగా మిస్ డోల్మా త్సెరింగ్ తేఖాంగ్ వచ్చి, ‘‘ఎలా ఉన్నారు ఆచార్యా?’’ అని నన్ను పరామర్శించారు! ఆమె అలా మంద్రస్థాయిలో ఇటీవల కొంతకాలంగా నన్ను పరామర్శిస్తూ వస్తున్నారు!‘‘ఎందుకు మీరలా పదే పదే సందేహిస్తున్నారు మిస్ తేఖాంగ్?’’ అన్నాను. ధర్మశాలలోని ప్రవాస టిబెటన్ ప్రభుత్వ పార్లమెంటు డిప్యూటీ స్పీకర్ ఆమె.వచ్చే ఏడాది జూలై 6కు నాకు 90 ఏళ్లు నిండుతాయన్న ఆలోచన... ఆరామంలోని అందరితో పాటుగా మిస్ తేఖాంగ్నూ హృదయ శూన్యతకు గురిచేస్తోందా?! లేక, మునుపటి దలైలామా 57 ఏళ్లకే పరమపదించటం వల్ల, అది ఊహించుకుని ఆమె కలత చెందుతున్నారా?!‘‘ఇప్పటిలా వారానికి మూడుసార్లు కాకుండా, వారానికి ఒకసారి మాత్రమే సందర్శకులను అనుమతించటం వల్ల మీకు మరికాస్త విశ్రాంతి దొరుకుతుందని సిక్యోంగ్ పెన్పా త్సెరిన్ తలపోస్తున్నారు ఆచార్యా’’ అన్నారు తేఖాంగ్. సిక్యోంగ్ పెన్పా త్సెరిన్... ప్రవాస టిబెటన్ ప్రభుత్వ ప్రధాని. ‘‘వృద్ధాప్యంలో విశ్రాంతి అవసరమే మిస్ తేఖాంగ్. కానీ కలలకు వృద్ధాప్యం ఉంటుందా?! నా కల ప్రకారం నేను 110 సంవత్సరాలు జీవించబోతానని మునుపు నేను చెప్పిన మాటనే ఇప్పుడూ చెబుతున్నాను. మీరూ, మీ ప్రధానే నా కలపై విశ్వాసం లేక చింతాక్రాంతులై ఉన్నట్లున్నారు. నేనెలా ఉన్నాను అనే దానికన్నా, నా తర్వాత ఎవరున్నారు అన్నదే మీఆందోళనగా నాకు కనిపిస్తోంది’’ అన్నాను చిరునవ్వుతో. తేఖాంగ్ కలవరంగా చూశారు. ‘‘ఆచార్యా... మేము కేవలం సామాన్యులం.మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. అందువల్లనే మీరేమైనా చెబుతారేమోనని ఎదురుచూస్తున్నాం...’’ అన్నారు మిస్ తేఖాంగ్! నాకర్థమైంది. వారు నా పునర్జన్మ కోసం చూస్తున్నారు! 15వ దలైలామా ఆగమనం కోసం నిరీక్షిస్తున్నారు. కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే – మరణించాక మాత్రమే పునర్జన్మ ఉండదనీ, కర్తవ్య నిర్వహణ కాంక్ష అన్నది ఒకే జన్మలో అనేక పునర్జన్మల్ని ప్రసాదిస్తుందనీ!‘‘నా దగ్గరింకా 20 హ్యాపీ న్యూ ఇయర్లుమీ అందరి కోసం మిగిలే ఉన్నాయి మిస్ తేఖాంగ్. ధీమాగా ఉండండి...’’ అని ఆమెతో నవ్వుతూ చెప్పాను. -
స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. సమైక్యత మన సంపద వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్‌కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.వేర్పాటు రాజకీయాలు కూడదు! ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్ సైన్స్ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.స్పష్టమైన విదేశీ విధానాలురెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్‌కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. యువత శ్రేయస్సు ముఖ్యం యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. పౌరుల బాధ్యతఅప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!డాక్టర్ మన్మోహన్ సింగ్ (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్ 15న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.) -
విలక్షణ జ్ఞాని... విధేయ ప్రధాని!
ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం సోనియా విధేయుడిగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం. ‘వైఎస్ అక్కడ ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. ‘మౌన ముని’ కాదు... మొండిమనిషిఅసహన రాజకీయాలూ, దూషణలూ– దుర్భాషలూ తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా... దశాబ్దకాలపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దేశం మొత్తం ఏకోన్ము ఖంగా గౌరవించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలు ఆయనను అందరికీ ప్రీతిపాత్రుణ్ణి చేశాయి. సరళీకరణ విధానా లతో పూర్తిగా, కచ్చితంగా విభేదించే వామపక్షాల వంటివి కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. రాజకీయంగా బద్ధ శత్రువైన బీజేపీ నేతలు కూడా ఆర్థిక రంగంలో మన్మోహన్ ముద్రలను కీర్తిస్తున్నారు.బొత్తిగా పొసగని ఈ భిన్న శిబిరాల మన్ననకు పాత్రుడవడం ఆయనకే చెల్లింది. ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం, సోనియా విధేయుడుగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం.‘వైఎస్ అక్కడ (ఉమ్మడి ఏపీలో) ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో ఎప్పుడూ చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. యాదృచ్ఛిక లేదా అనూహ్య ప్రధాని ఆని ఆయనపై పుస్తకమే రాసిన సంజయ్ బారు స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలు మన్మోహన్ మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ చెబుతాయి. వైఎస్ హయాంలో ఎన్నో పథకాలకూ, కార్యక్రమాలకూ మన్మోహన్ ఇష్టపూర్వకంగా వచ్చేవారు. వామపక్షాల చొరవతో మొదలైన ‘గ్రామీణ ఉపాధి పథకా’న్ని అనంతపురంలోనే ప్రారంభించారు. విభజన ఉద్యమంతో తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ఒకటయితే... ఆలస్యంగానైనా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం రెండు రాష్ట్రాలతో ఆయన బంధాన్ని బలోపేతం చేసింది.1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న మవ్వడం, పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటూ ఇటూగా జరిగాయి. అప్పటి వరకూ అనుసరించిన అలీన, స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకుని... కార్పొరేట్, ప్రైవేటీకరణ విధానాల వైపు మరలే ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి మన్మోహన్ సరైన వ్యక్తి అని పీవీతో పాటు ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం. మళ్లీ 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టరాదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషయజ్ఞత ఉన్న నేతగా మన్మోహన్‌నే ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైనా ఆ విధంగా ఆమె ఆధారపడగల పరిస్థితి ఉండదు. వామపక్షాల మద్దతుపై ఆధారపడి ఏర్పడిన యూపీఏ–1కు సారథ్యం వహించడమంటే భిన్న కోణాలను సమన్వయం చేయవలసి ఉంటుందనీ తెలుసు. చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవడంతో మొదలై అమెరికాతో అణు ఒప్పందంతో పరాకాష్ఠకు చేరిన విభేదాలు వామపక్షాలను దూరం చేయడం ఊహించిన పరిణామమే. తర్వాత కాలంలో పదవులు, ప్రయోజనాల బేరాలు తప్ప మరే విధాన సమస్యలు లేని ప్రాంతీయ మిత్రులను నిలబెట్టుకోవడానికీ, ఇష్టం లేని వారిని మంత్రులను చేయడంతో సహా ఆయన చాలా విన్యాసాలే చేయవలసి వచ్చింది. రక రకాల ఆరోపణలు, కుంభకోణాల కేసులతో పెనుగులాడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మిశ్రమ ప్రభుత్వం గనక రాజీ పడాల్సి వచ్చిందని ఆయన బాహాటంగా ఒప్పేసుకున్నారు. చివరకు మీడియా ఛానళ్ల అధినేతలతో సమావేశమై... యూపీఏ అంటేనే అవినీతి అన్నట్టు చిత్రించవద్దని అభ్యర్థించాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... ఇన్ని ఆరోపణల మధ్యనా ఎవరూ ఆయన నిజాయితీని శంకించడం గానీ, తనకు వ్యక్తిగత బాధ్యత ఆపాదించడం గానీ జరక్కపోవడం!2014 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే వెలువడిన సంజయ్ బారు పుస్తకంలో... ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియాగాంధీకి పంపించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించడంతో బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు. ఇది మోదీ బృందం ప్రచారానికి అస్త్రంగా వేసిన అభాండమని నాటి ప్రధాని కార్యాలయం ఖండించింది. అణు ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్ఠానానికి సంకేతాలు ఇవ్వడం కూడా ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది. ఆర్థిక మంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే... ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని ఆయన ఇచ్చిన జవాబులో చాలా ఆర్థముంది. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధాని అవడం, తనను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడం వెనక ఉన్న బలీయమైన పాలక వర్గాలేవో ఆయనకు తెలుసు.మోదీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చిన కొత్తలో మన్మోహన్‌ను తీవ్రంగానే ఢీకొన్నారు. మోదీ వచ్చాక దర్యాప్తు సంస్థలు ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్లరద్దును చారిత్రక ఘోరతప్పిదం అని నిప్పులు కక్కారు. చక్రాల కుర్చీలో వచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను ‘మౌన ముని’గా బీజేపీ అపహాస్యం చేసింది కానీ కీలక విషయాల్లో మౌనంగా లేరు. వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకూ చాలా విషయాల్లో మోదీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మన్మోహన్‌ను, గాంధీ కుటుంబాన్నీ ప్రత్యర్థులుగా చూపడానికి ఎన్నిసార్లు ఎంత రెచ్చగొట్టినా మాజీ ప్రధాని సంయమనం వీడలేదు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తన ప్రభుత్వ ఉత్తర్వును చించి వేసి ఆధిక్యత చూపించినా భరించారే గాని భగ్గుమనలేదు. దీన్ని అతి విధేయత అనాలా సంయమనం అనాలా అన్నది వారి కోణాలను బట్టి ఉంటుంది. అయితే వాజ్‌పేయి వంటి దిగ్గజానికి మోదీ వంటి పరివార్ అగ్గి బరాటాకు మధ్యలో తొలి ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. మన్మోహన్ స్వయంగా ఒకసారి కోరినట్టు... దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా కాక వాస్తవికంగా గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి. మూడో దీర్ఘకాల ప్రధానిగా ఇక ముందు కూడా మన్మోహన్ సింగ్‌కు ఓ ప్రత్యేక స్థానముండనే ఉంటుంది! వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు- తెలకపల్లి రవిసంస్కరణల సారథిభారతదేశం గర్వించదగిన వ్యక్తులలో భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి భారత దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సంక్షోభంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైనవి. 1990లో చంద్రశేఖర్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న కాలంలో రెండు అంకె లతో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, రుణ భారంతో పెరిగిన కోశలోటు, మూడు వారాలకి కూడా సరిపోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు, పడిపోతున్న ఆర్థిక వృద్ధిరేటు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను... దేశ ఆర్థిక మంత్రి అయిన తర్వాత గాడిలో పెట్టడం, 2008లో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని తట్టుకొని భారత్ నిలబడేలా చేయడం వంటివాటిలో మన్మోహన్ కృషి అజరామరం. నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మూడవ స్థానం వైపుకి అడుగులు వేయటానికి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలే పునాది వేశాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, యూజీసీ చైర్మన్‌గా, అంతర్జాతీయ వ్యాపార అర్థశాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్‌గా, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా... భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన గోడలు నిర్మించారనే చెప్పాలి. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను పెంచే క్రమంలో తాను రూపొందించిన ఎగుమతులు– దిగుమతుల (ఎగ్జిమ్ పాలసీ) విధానం, విదేశాంగ విధానం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. 1991 బడ్జెట్లో 1992 నూతన సరళీకరణ ఆర్థిక విధాన ప్రకటనతో భారత ఆర్థిక వ్యవస్థసంకెళ్లను తెంచి ప్రపంచంతో పోటీపడే విధంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. బంగారాన్ని తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకునే స్థాయి నుండి నేడు ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌ని 8వ స్థానంలో నిలబెట్టే స్థాయికి పునాదులు వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. పది సంవత్సరాలు వరుసగా ప్రధానమంత్రిగా తాను తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రజల మనః ఫలకంపై చెరగని ముద్రవేశాయి. 2005లో సమాచార హక్కు చట్టం, అమెరికాతో పౌర అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేని వారి ఉపాధి కోసం చేసిన ‘ఉపాధి హామీ చట్టం’ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం, ఆహార భద్రతా చట్టాలు, ఆధార్ కార్డ్, రైతు రుణమాఫీ దేశ పాలన వ్యవస్థలో మైలు రాళ్లుగా నిలబడిపోయాయి. ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికీ, స్థిరమైన వృద్ధిని సాధించడానికీ ఆర్థిక సంస్క రణలను ప్రారంభిస్తున్నాము. ఎవరి మెప్పు కోసమో ఆర్థికసంస్కరణలను ప్రారంభించడం లేద’ని నాడు తాను చెప్పిన మాటలు నేడు నిజమైనాయి. మాటల కంటే నిశ్శబ్దంగా పనిచేయటా నికి ప్రాధాన్యత ఇచ్చే మన్మోహన్ సింగ్ నిరాడంబర వ్యక్తిత్వం గల వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులైన పి.వి. నరసింహారావుని భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిన విధంగానే మన్మోహన్ సింగ్‌కి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆ పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులు. -వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘ 98854 65877-డా‘‘ తిరునహరి శేషు -
మన అడుగులు ఎటువైపు?!
భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే! కానీ ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సహజీవనంతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికే ప్రయత్నాలు జరుగుతున్నట్లనిపిస్తోంది. గతాన్ని మార్చలేము. గతం నుంచి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచారాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పిన పాఠం.భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడిన పిటిషన్ లను తిరిగి విచారించినప్పుడు, మీడియా మరోసారి పిటిషన ర్లను ‘హిందూ’ లేదా ‘ముస్లిం’ అనే రెండు పక్షాలుగా పేర్కొంటుంది. సీజేఐ, ఆయన తోటి న్యాయమూర్తులు తమ తీర్పును ఇచ్చిన తర్వాత, మీడియా ‘విజయం సాధించిన పక్షం’ అనే శీర్షికను పెడు తుంది. నిజానికి, ఆ తీర్పు విజయాన్ని మించి మరింత ప్రాముఖ్యం కలిగినది. ఇది రెండు సంఘర్షణాత్మక దృక్పథాల మధ్య ప్రభావం చూపుతుంది, ఒకటి భారతదేశంలో సమానత్వంతో కూడిన ప్రజాస్వా మ్యాన్ని కోరుకుంటుంది, మరొకటి మెజారిటీ ఆధిపత్యాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ తీర్పు హిందూ మతంపై ప్రపంచ అవగాహనను కూడా ప్రభావితం చేస్తుంది.చికాగోలో 1893లో జరిగిన ప్రపంచ సర్వ మత మహాసభముందు స్వామి వివేకానంద పేర్కొన్న ప్రఖ్యాతిగాంచిన మాటలు హిందూ మతానికి ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠ తేవడంలో సాయపడ్డాయి: ‘‘సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ ప్రపంచానికి బోధించిన మతానికి చెందినందుకు నేను గర్విస్తున్నాను. మేము విశ్వవ్యాప్తసహనాన్ని మాత్రమే నమ్ముతాము, మేము అన్ని మతాలూ నిజమని అంగీకరిస్తాం’’ అన్నారు. తిరిగి 1896లో లండన్‌లో... ‘‘భారతీయులు ప్రజాస్వామ్యాన్ని హత్తుకుంటారు. ఐక్యతను, సమానత్వాన్ని ప్రతిష్ఠి స్తారు’’ అని పునరుద్ఘాటించారు. భారతదేశం ఆలింగనం చేసుకోవాలని వివేకానంద ఆశించిన ప్రజాస్వామ్యం, భారత గడ్డపై ప్రతిష్ఠించాలని ఆయన కోరుకున్న ఐక్యత, నాటాలనుకున్న సమానత్వపు మొక్కలు.. భారత రాజ్యాంగం అమోదం పొందిన 1949 నాటి నుండి కనిపించాయి. దాని పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ,నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ; హోదా, అవకాశాల సమా నత్వం; అలాగే... సోదరత్వం, వ్యక్తి గౌరవం, దేశ ఐక్యత, సమగ్ర తలకు హామీ ఇస్తోంది. తదుపరి 75 సంవత్సరాలలో, కొన్ని తీవ్రమైన మినహాయింపులను పక్కన పెడితే, భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను ఉల్లంఘించకుండా చాలా వరకు దూరంగా ఉన్నాయి. అయితే, ఆగ్రహం పెద్ద సంఖ్యలో ప్రజలను ఉత్తేజపరిచినప్పుడు, హింసను నియంత్రించడానికి అధికారులు నిరాకరించినప్పుడు రాజ్యాంగ వాగ్దానాలు మృతప్రాయంగా మారటం తెలిసిందే. సుప్రీంకోర్టు తన 2019 నాటి అయోధ్య తీర్పులో పేర్కొన్నట్లుగా, 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఇదే జరిగింది. 2019 నాటి ఆ తీర్పులో, మసీదు ఉన్న మైదానంలో రామమందిరాన్ని నిర్మించడానికి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. ఆ మసీదును ప్రార్థనా స్థలాల చట్టం–1991 నుండి జాగ్రత్తగా మినహాయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర మసీదుల పునాదులపైన కూడా మును పటి హిందూ పుణ్యక్షేత్రాల చిహ్నాల కోసం శోధించడాన్ని అనుమతిస్తే, ఆ చట్టానికి అర్థమే లేకుండా పోతుంది. పైగా, అటువంటి తీర్పు... హిందూ మతం అసహనంతో, ఆగ్రహంతో కూడుకున్నదనీ; వివేకా నంద, ఆయనతో ఏకీభవించిన నాలుగు తరాల హిందూ ఆలోచనా పరులు ఆనాడు వాస్తవాన్ని గ్రహించలేకపోయారనీ ప్రపంచానికి చాటి చెబుతుంది.అతని లేదా ఆమె పూర్వీకుడు నా పూర్వీకుడికి హాని కలిగించినందున నేను ఎవరినైనా గాయపరచడం చట్టబద్ధం కాదని ఆధునిక ప్రపంచం అంగీకరిస్తుంది. మూలవాస ఆఫ్రికన్లు, అమెరికన్లు, కెనడి యన్లు, ఇంకా ఆస్ట్రేలియన్లు స్వదేశీ అనుమతి లేకుండా తమ భూమిలో స్థిరపడిన బయటివారి (భారతదేశం నుండి వచ్చిన వ్యక్తులు సహా) వారసులను బహిష్కరించాలని డిమాండ్ చేయరు. ఈ ‘అంగీకారాన్ని’ మనం మానవత్వం, ఇంగితజ్ఞానం, వ్యావహారిక సత్తా వాదం లేదా మరొకదాని ఘనతగా పేర్కొన్నప్పటికీ, అది మనప్రపంచ పురోగతి గాథను గుర్తించింది.భారత రాజ్యాంగానికి శతాబ్దాల ముందు.. ముస్లింలు, క్రైస్త వులు, పార్సీలు, యూదులను భారతదేశపు మట్టిలో చట్టబద్ధమైన భాగస్వాములుగా మన దేశ మూలవాసులు అంగీకరించారు. మన పూర్వీకులు మానవత్వాన్ని ఒకే కుటుంబంగా అర్థం చేసుకున్నారు. ప్రాచీన సంస్కృత పదబంధమైన ‘వసుధైక కుటుంబం’, ప్రాచీన తమిళ పద్యమైన ‘యాదుం ఊరే యావరం కేళిర్’ అర్థం కూడా ఇదే.నేను 1999లో రాసిన పుస్తకం, ‘రివెంజ్ అండ్ రీకన్సిలియేషన్: అండర్స్టాండింగ్ సౌత్ ఏషియన్ హిస్టరీ’లో పేర్కొన్నట్లుగా, బుద్ధుడు ప్రబోధించిన సోదరభావానికీ, మహా భారత కథలో ఆధిపత్యం వహించిన ప్రతీకారానికీ మధ్య ఏదో ఒక దానిని మన ఉపఖండంలోని ప్రజలు ఎంచుకోవాల్సి వచ్చింది.ప్రతీకారం సూత్రంగా, సర్వత్రా సంహారమే పరాకాష్ఠగా కనిపించే మహాభారతంలో కూడా, సయోధ్య స్ఫూర్తి, పాఠకుల హృద యాన్ని సాంత్వనపరిచే శక్తిమంతమైన మినహాయింపులు ఉండటం కనిపిస్తుంది. భారత ఇతిహాసంలోని అత్యంత నాటకీయ సన్నివేశా లలో, యుద్ధం ముగిసిన తర్వాత, దాదాపు ప్రతి కథానాయకుడు మరణానికి గురైన తరువాత, దుఃఖంలో ఉన్న స్త్రీలను, జీవించి ఉన్న కొంతమంది యువరాజులను పురాణకర్త వ్యాసుడు ఓదార్చాడు. వ్యాసుడు అప్పుడప్పుడు కథా సన్నివేశాలలోకి ప్రవేశిస్తాడు. ‘నేను మీ దుఃఖాన్ని పోగొడతాను’ అని దుఃఖిస్తున్న వారితో చెబుతూ, వ్యాసుడు చనిపోయిన వారిని భాగీరథీ నదీ జలాల నుండి బయటకు వచ్చేలా చేశాడు: ద్వేషం అసూయ నుండి ప్రక్షాళన కాబడినది / తండ్రిని తల్లిని కొడుకు కలిసాడు / భార్య భర్తను కలుసుకున్నది / స్నేహితుడు స్నేహితుడిని పలకరించాడు/ పాండవులు కర్ణుడిని కలి శారు/ అతడిని కౌగిలించుకున్నారు/ అని రాశాడు. అది సయోధ్యకు సంబంధించిన దృశ్యం. అక్కడ దుఃఖం లేదు, భయం లేదు, అను మానం లేదు, నిందలు లేవు. అది ప్రేమించే మనసుల కలయిక తప్ప మరేమీ కాదు. (పి లాల్ వ్యాఖ్యానం). అయితే తెల్లవారుజాము నాటికి, ఆ కలయిక కల ముగిసింది. జీవం పోసుకున్న వారు భాగీరథీ నదీ జలాల లోతుల్లోకి తిరిగి వెళ్లి పోయారు. పాండవుల ఆధిపత్యాన్ని ప్రకటించడానికి అర్జునుడు సాగించిన యుద్ధానంతర ఉపఖండ దండయాత్ర సమయంలో మరొక సయోధ్య దృశ్యం మనకు కనిపిస్తుంది. సైంధవ భూభాగంలో (సింధ్‌లో) ఓడిపోయిన కౌరవుల సోదరి దుశ్శల, ఒక బిడ్డతో కలిసి అర్జునుడిని కలుస్తుంది. అర్జునుడు అన్యాయంగా చంపిన కౌరవ పక్ష యోధుడైన జయద్రథుడిని దుశ్శల వివాహం చేసుకుంది. అర్జునుడు ఆమె కొడుకు సురథుడి గురించి దుశ్శలను అడుగుతాడు. ‘అతను చనిపోయాడు,’ అని ఆమె చెబుతుంది, ‘అతను విరిగిన హృదయంతో మరణించాడు, ఎందుకంటే నీవు అతని తండ్రిని చంపావని సురధు నికి తెలుసు. నేను ఇప్పుడు సురథుడి కొడుకును నీ వద్దకు తీసుకు వస్తాను. నేను నీ రక్షణను కోరుతున్నాను’’ అంటుంది. అర్జునుడు దుశ్శలని అక్కున చేర్చుకుని తన రాజభవనానికి రావాలని ఆమెను కోరాడు. తర్వాత అర్జునుడు సైంధవులతో సంధి చేసుకున్నాడు.మనం ఇప్పుడు ఒకటే ప్రశ్నించాలి. ఈరోజు భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం కంటే నిన్నటి రోజుని పునర్నిర్మించడానికి ప్రయత్నించడం ముఖ్యమా? అని. గతం ముగిసిపోయింది. మనం దానిని మార్చలేం. జరిగిపోయిన దాన్ని పునరుద్ధరించలేము. అవును, మనం చరిత్ర నుండి కేవలం నేర్చుకోగలం. గతాన్ని పునర్వ్యవస్థీకరించే ప్రచా రాలు వర్తమానాన్ని గాయపరుస్తాయనేది చరిత్ర నేర్పే పాఠాలలో ఒకటి.- వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత- రాజ్‌మోహన్ గాంధీ -
కాంగ్రెస్ మాయ చేస్తోంది...
ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దానితోపాటు మరికొందరూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జమిలి ఎన్నికలే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్నే ఓ కేస్ స్టడీగా తీసుకుందాం: ఇక్కడ జాతీయ పార్టీలు ఈ కారణంగా బలం పుంజుకున్నాయా? ప్రాంతీయ పార్టీలు ఏమైనా బలహీన పడ్డాయా? ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలు ఎంచుకునే అంశాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. అంతే కాని జమిలి ఎన్నికల వల్ల కాదని ఈ ఉదాహరణతో అర్థమవుతోంది.‘వన్ నేషన్ – వన్ ఎల క్షన్’ను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో డీఎంకే, టీఎమ్సీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. జమిలీ ఎన్నిక లను ఆ పార్టీలు వ్యతిరేకించడా నికి ప్రధాన కారణం బీజేపీ వ్యతి రేక ధోరణి మాత్రమే. బీజేపీ ఏ పని చేసినా వ్యతిరేకిస్తుంది టీఎమ్సీ. సమాజ్ వాదీ పార్టీదీ అదే ధోరణి. దేశంలో మొదటి మూడు ఎన్నికలు జమిలీనే. అప్పుడు ఎందుకు అవి దేశానికి నష్టమనీ, ప్రజాస్వామ్యానికి హానికరమనీ కాంగ్రెస్ ప్రచారం చేయలేదు? చాలా ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి బిల్లును సమర్థిస్తూండటం ఇతర పార్టీల వాదనల్లో పస లేదనడానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, బీజేడీ సహా అత్యధిక పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. గతంలో లా కమి షన్కే తమ అనుకూలత తెలిపాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు లేని భయం... కాంగ్రెస్ మాయలో ఉన్న పార్టీలకు ఉండటానికి కారణం ఏమిటి? ఆ బిల్లును తీసుకొస్తోంది బీజేపీ, ప్రధాని మోదీ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కానీ వారు దేశ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో ఐదేళ్ల పాటు... ప్రతి ఏడాదీ జరుగుతున్న ఎన్నికలకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిపోతోంది. అదే పదే పదే ఎన్నికలు లేకపోతే రాజకీయ అవినీతి కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చి, దేశమంతటా ఎన్నికలు ఒకేసారి పూర్తి అయితే... అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్ట డానికి వీలవుతుంది. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ కేతువులా పట్టి పీడిస్తోంది. దేశం అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని చెప్పి అన్ని రకాల వ్యవస్థ లనూ చెరబట్టింది. ఎమర్జెన్సీ విధించడమే కాదు సుప్రీంకోర్టు అధికా రాలనూ తగ్గించడానికి ప్రయత్నించింది. దేశ ప్రజ లను... మతాలు, కులాల వారీగా విభజించి తమ పబ్బం గడుపుకునేందుకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ మాయలో ప్రాంతీయ పార్టీలు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది.ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రా యమే బలమైన పునాది అని ప్రధాని మోదీ నమ్మతారు. అది బీజేపీ మూల సిద్ధాంతం కూడా. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించారు. ఇప్పుడు అన్ని పార్టీలూ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. జమిలి ఎన్నికల విధానం మరింత మెరుగ్గా తీర్చిదిద్దేలా సలహాలు ఇవ్వొచ్చు. అలా చేయడం దేశభక్తి అవుతుంది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాయ నుంచి బయటకు రావాలి. నిజం తెలుసుకోవాలి. దేశం కోసం జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతివ్వాలి.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు -
అమెరికా–చైనాలు దగ్గరయ్యేనా?
ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలూ, సైనిక శక్తులూ అయిన అమెరికా– చైనాల మధ్య సత్సంబంధాలు చోటు చేసుకోనున్నాయనే సూచనలు అభినందనీయం. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. తాను మంచివనుకున్న, తనకు పేరు తెచ్చే పనులను చేస్తారు. అనుకోని పనులు చేయడం తన బలమని ట్రంప్ ప్రకటించు కున్నారు. అమెరికా– చైనాల పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి సౌభాగ్యాలను సాధించవచ్చు.‘చైనా అపాయం’ బూచితో అమెరికా... చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆంక్షలు విధి స్తోంది. చైనా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తోంది. చైనా వాణిజ్య కట్టడికి కూటములు కడుతోంది. చైనా పొరుగు దేశా లకు ఆయుధాలను అమ్ముతోంది. విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తోందనీ, స్వదేశంలో అణచివేతకు పాల్పడుతోందనీ, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో రష్యాకు మద్దతు ఇస్తోందనీ చైనాపై అమెరికా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ విదేశీ విధాన అమలుకు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి ఆయన చైనా వ్యతిరేకత తెలుస్తుంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ దీనికి ఉదాహరణ. మరోవైపు ప్రపంచ ఘటనలు అంచనాలను తారు మారు చేస్తున్నాయి. సిరియాలో 5 దశాబ్దాల అల్ అసద్ కుటుంబ పాలన స్వల్ప ప్రతిఘటనతో కూలి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అతి బలీయమైన రష్యా, ఎదుగు తున్న ఇరాన్ అసద్‌ను దశాబ్ద కాలంగా గట్టిగా సమర్థించాయి. అయినా పేర్లే తెలియని తిరుగుబాటుదార్ల వేటలో కేవలం 2 వారాల్లో అసద్ దేశం వదిలి పారిపోయాడు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి; తర్వాత పాలస్తీనా, హమాస్, గాజా, వెస్ట్ బ్యాంక్‌లపై, లెబనాన్‌లో హెజ్ బొల్లాపై, వీరిని సమర్థించిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమానవీయ దాడులు; ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, అమెరికా ఆధీన ఐక్య రాజ్యసమితి అశక్తత వాటిలో కొన్ని.సిరియా ప్రభుత్వ పతనం తర్వాత 2 రోజుల్లో ఇజ్రా యెల్, సిరియా ఉన్నత స్థాయి సైనిక సంపదను, వాయు సేనను 80 శాతం ధ్వంసం చేసింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆయుధ కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు, రసాయనిక ఆయుధాలు నాశనమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో ఉత్తర కొరియా రష్యా వైపు జోక్యం, రష్యాకు చైనా మద్దతు (చైనా దీన్ని తిరస్కరించింది) ఐరోపాలో ఆందోళన కలిగించాయి. చైనా చౌక విద్యుత్ వాహనాలు తమ వాహన పరిశ్రమకు హానికరమని ఐరోపా భయం. తమ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధించబోయే అధిక పన్నులపై అమెరికా మిత్రులైన ఐరోపా, ఆసియా దేశాలు బాధ పడుతున్నాయి. ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మెచ్చుకున్నారు. తాను యుద్ధాలను ప్రారంభించననీ, కొత్త ఒప్పందాలను ప్రేమి స్తాననీ గర్వంగా ప్రకటించారు. ట్రంప్ అధికారంలో అమె రికా, చైనా సంబంధాల మెరుగుకు ఇది శుభసూచకం. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థలో స్వీయ ఉద్దీపన తగ్గింది. ప్రజల వినియోగాన్ని పెంచాలనీ, విదేశీ పెట్టుబడులకు అనుకూలత కల్పించాలనీ, గిరాకీని పెంచాలనీ చైనా గుర్తించింది. మార్కెట్ అనుకూల ఆర్థిక విధానాలను స్వీకరించింది. ప్రజలకు డబ్బు అందే విధంగా వడ్డీ తగ్గించింది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ల స్థిరీకరణ పద్ధతులను పాటించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా పని చేస్తానంటోంది. ఇవి అమెరికా–చైనా సంబంధాల మెరుగు దలకు ప్రేరణ. సంగిరెడ్డి హనుమంత రెడ్డివ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545 -
వ్యవసాయ ప్రమాదాలపై విధానమేది?
వ్యవసాయ కార్మికులు అనేక రకాల ప్రమాదాలకు లోనవుతున్నారు. కరెంటు షాకులు, రసాయనాల (పురుగు మందుల) విష ప్రభావం, పాము కాట్లు, యంత్రాలు, పిడుగులు, వడదెబ్బ, ఇంకా అనేక ఇతర సహజ, అసహజ, మానవ తప్పిదాలు వ్యవసాయ కార్మికుల భౌతిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. వాటి బారిన పడి కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. కానీ దేశంలో సంఖ్యాపరంగా అతి పెద్ద శ్రామిక శక్తిగా ఉన్న వ్యవసాయ రంగం పట్ల సర్కారుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనబడుతుంది. వ్యవసాయ కూలీలకు ప్రమాదాలు ఎదురైతే రాజకీయ, సామాజిక స్పందన శూన్యం. చట్టాలు కూడా వీళ్ళ విషయంలో ఏమీ నిర్దేశించడం లేదు. వ్యవసాయ కార్మికులందరికీ వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి.పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, డ్రోన్లు, మోటార్లు, ‘రసాయన’ పూత విత్త నాలు వగైరాలను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దానికి తగిన శ్రేయో మార్గదర్శకాలు రూపొందించడం లేదు. ప్రమాదాల బారిన పడిన వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతుల సత్వర చికిత్సకు ఏర్పాట్లు లేవు. నష్టపరిహారం, ఆర్థిక మద్దతు వగైరా అంశాలు గురించి ఆలోచననే లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు రసాయన పిచికారీ చేస్తూ స్పృహ తప్పితే పొలంలో నుంచి గ్రామంలోకి తేవడానికి 3 గంటలు పట్టింది. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ప్రాణం పోయింది. వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న ‘ఆధునిక’ పరికరాలు, రసాయనాలతో జరిగే ప్రమదాలకు సంబంధించి ప్రాథమిక వైద్య కేంద్రాలలో కనీస చికిత్స, మందులు లేవు. జిల్లా ఆసుపత్రిలోనే ఉండవు. విద్యుదాఘాతం కారణంగా ప్రతిరోజూ కనీసం ముప్పై మంది భారతీయులు చనిపోతున్నారని అంచనా.ఇందులో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలోనే జరుగుతున్నాయి. వీళ్లలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ప్రమాదకరమైన వృత్తి న్యూఢిల్లీలోని ‘ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి’ ఆధ్వర్యంలో 2004–07 నుంచి 2012–13 మధ్య కాలానికి వ్యవసాయ ప్రమాద సర్వే జరిగింది. ఒక సంవత్సరంలో మొత్తం సంఘటనల రేటు లక్ష మంది కార్మికులకు 334 ప్రమాదాలు కాగా, మరణాల రేటు లక్ష మంది కార్మికులకు 18.3గా ఉంది. ఇది చాలా తక్కువ అంచనా. వాస్తవంగా వ్యవసాయంలో వివిధ ప్రమాదాల మీద, తదుపరి పర్యవసానాల మీద ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ సమాచారం సేకరించడం లేదు. యాంత్రీకరణ, రసాయనీకరణ, డిజిటలీ కరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి ఉపయోగం వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాల పట్ల దృష్టి పెట్టడం లేదు.ఆధునికత పొంగిపొర్లే అమెరికాలోనే వ్యవసాయం ప్రమాదకర వృత్తిగా పరిణమిస్తున్న వైనాన్ని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా వ్యవసాయ శాఖకు సంబంధించిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’ మద్దతుతో చేసిన ఒక అధ్యయనం,ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తూ వ్యవసాయ పరిశ్రమ గతంలో అనుకున్న దానికంటే మరింత ప్రమాదకరమైనదని సూచించింది. 2015–19 వరకు 60,000 మందికి పైగా వ్యవసాయ సంబంధిత గాయాలతో అత్యవసర చికిత్స పొందారని వెల్లడించింది. గాయపడిన వారిలో దాదాపు మూడోవంతు మంది యువకులు.ట్రాక్టర్లు, డ్రోన్ల ప్రమాదాలుభారతదేశంలో మధ్యప్రదేశ్‌లో 1995–99 వరకు, సంవత్సరానికి ప్రతి 1000 మంది వ్యవసాయ కూలీలలో 1.25 మందికి పనిచేసే సమయంలో గాయాలు, దాదాపు 9.2% మరణాలు అయినట్లు ఒక అధ్యయనం కనుగొంది. అత్యధిక మరణాలు ట్రాక్టర్లు, పాము కాటు వల్ల జరిగాయి. మరణాలు, గాయాలతో ఆర్థిక నష్టం కూడా ఎక్కువే. ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లాలో వ్యవసాయంలో ప్రమాదాల కారణంగా ఏటా సుమారు రూ.6.19 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఒక అధ్యయనం అంచనా వేసింది. దేశంలో సగటున వ్యవసాయ క్షేత్ర ప్రమాదాలలో ట్రాక్టర్ ప్రమాదాలు అత్యధికం (పల్టీలు కొట్టడం, ట్రాక్టర్ నుండి పడిపోవడం మొదలైనవి) (27.7%). తర్వాత నూర్పిడి యంత్రాల వల్ల (థ్రెషర్) (14.6%), పిచికారీ (స్ప్రేయర్ /డస్టర్) వల్ల (12.2%), చెరకు క్రషర్ (8.1%), గడ్డి కట్టర్ (7.8%) వల్ల జరిగాయి. ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వస్తున్నాయి. 2010–17 మధ్య కాలంలో అమెరికాలో 12,842 మందికి డ్రోన్ల వల్ల గాయాలైనాయి. భారతదేశంలో దాదాపు ఆరు లక్షలకు పైగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి వీటి వినియోగాన్ని ప్రోత్స హిస్తున్నది. వీటి వల్ల కలిగే ప్రమాదాల మీద మాత్రం ఏ సంస్థ సమాచారం సేకరించడం లేదు. పెరుగుతున్న డ్రోన్ల సంఖ్య చూస్తే, సంబంధిత ప్రమాదాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది.పని కోసం వెళ్తున్నప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రభుత్వం, యాజమాన్యాల స్పందన మీద చట్టం నిశ్శబ్దంగా ఉన్నది. పని ప్రదేశంలో భద్రత కల్పించే బాధ్యత ఆ యా వ్యక్తులు, లేదా సంస్థల మీదనే ఉంటుంది. కానీ పని ప్రదేశం చేరకముందు జరిగే ప్రమాదాల బాధ్యత ఎవరి మీదా ఉండటం లేదు.అదే ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ ప్రకారం, కార్మికుల ప్రయాణ సమయాన్ని కూడా పని సమయంగా పరిగణించాలి. అప్పుడు వారి భద్రత కూడా పని ఇచ్చేవారి మీద ఉంటుంది. ప్రయాణ సమయంలో కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరాన్ని ప్రపంచ కార్మిక సంస్థ ‘గ్లోబల్ స్ట్రాటజీ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్’ 2024–2030 నొక్కి చెబుతోంది.బాధితులకు ఉపశమనం కలిగేలా...2024 నవంబర్‌లో అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఆర్టీసీ బస్సు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. 2019 ఆగస్ట్‌లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో రిక్షాను లారీ ఢీకొనడంతో 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని కుటుంబాలు వైద్య చికిత్స కోసం ఉన్న అరకొర ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. సరైన సమయంలో చికిత్స లభించనందున దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాద బాధితుల వైద్యానికి బీమా నుంచి కూడా మద్దతు లేదు. రవాణా వాహన ప్రమాదాలలో వ్యవసాయ కార్మికులకు థర్డ్ పార్టీ బీమా ప్రయోజనం ఉండదు.వారి ప్రయాణం తరచుగా నాన్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు సాధారణంగా బీమా ఉండదు. డ్రైవర్‌కు లైసెన్స్ కూడా ఉండదు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఒక కారణం. ప్రమాదాల కారణంగా రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. అవయవాలను కోల్పోయి వికలాంగులైతే, ఆ కుటుంబం పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. ప్రమాదాలలో మరణమే మేలు అనే విధంగా పరిణామాలు ఉంటున్నాయి.వ్యవసాయ కార్మికులందరికీ, ప్రత్యేకించి క్షేత్రస్థాయి కూలీలు, మహిళలపై దృష్టి సారించి, వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి. ప్రతి గ్రామీణ ప్రమాదాన్ని నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. ఇది జరగాలంటే, మోటారు వాహనాల రవాణా చట్టంతో సహా సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయవలసి రావచ్చు. తమ తప్పులేకుండా బలి పశువులయ్యే వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మెరుగు పరచాలి.వ్యవసాయ మార్కెట్ సెస్, ఇతర పద్ధతుల ద్వారా ఒక ప్రమాద సహాయ నిధి ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలకు కనీస బీమా కవరేజీ రూ.5 లక్షలతో ప్రారంభించి మున్ముందు పెంచాలి. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు