Caste discrimination
-
300 ఏళ్ల కులవివక్షకు ముగింపు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మూడు దశాబ్దాల కులవివక్షకు దళితులు ముగింపు పలికారు. 300 ఏళ్ల తరువాత 130 దళిత కుటుంబాలు తమ ఇష్టదైవం ఆలయంలోకి ప్రవేశించాయి. పూర్బా బర్ధమాన్ జిల్లాలోని గిద్దేశ్వర్ శివాలయం ఈ చారిత్రాత్మక సన్నివేశానికి వేదికైంది. కత్వా సబ్ డివిజన్లోని గిద్‌గ్రామ్ గ్రామంలోని దస్పార ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల బృందం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయం మెట్లు శివలింగంపై పాలు, నీరు పోసి మహదేవునికి అభిషేకం చేశారు. దాస్ ఇంటి పేర్లు కలిగిన దళిత కుటుంబాలు చెప్పులు కుట్టడం, నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న గిద్దేశ్వర్ శివాలయం 300 ఏళ్ల కిందట స్థాపించారు. అప్పటి నుంచి వీరికి ఆలయంలోకి ప్రవేశం లేదు. శివుడిని పూజించేందుకు అనుమతించాలని మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా కూడా వారు పూజలు చేయడానికి ప్రయత్నించగా వారిని ఆలయ ప్రాంగణం నుంచి తరిమివేశారు. అంతేకాదు దాదాపు గ్రామ బహిష్కరణ చేశారు. వారికి నిత్యావసర వస్తువులు అమ్మడంతో పాటు వారి నుంచి పాలవంటివి కొనడం మానేశారు. దీంతో దళితులు స్థానిక యంత్రాంగం, పోలీసుల సహాయం కోరారు. దస్పారా గ్రామస్తులతో పలుమార్లు చర్చలు జరిపిన పోలీసులు.. సమస్యను పరిష్కరించారు. అంతేకాదు దళితుల నుంచి పాలను కూడా సేకరించాలని పాలకేంద్రాలను పోలీసులు ఆదేశించారు. అలా యంత్రాంగం, పోలీసుల జోక్యంతో వందల ఏళ్ల అణచివేతను ఎదిరించిన దళితులు బుధవారం ఆలయంలో పూజలు చేశారు. పూజలు చేసే హక్కు లభించినందుకు సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని దేవుడిని కోరుకున్నానని సంతోష్ దాస్ అనే వ్యక్తి తెలిపారు. అయితే ఈ సంతోషం తాత్కాలికమా? దీర్ఘకాలికమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు, యంత్రాంగం ఉండగా కిమ్మనకుండా ఉన్న గ్రామస్తులు.. వాళ్లు వెళ్లిపోయాక కూడా తమను అనుమతిస్తారా? అని దళితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలకు ఊతమిస్తూ ఆలయ సేవకుడు సనత్ మండల్ మాత్రం ఈ నిర్ణయాన్ని విముఖతతోనే అంగీకరించారు. ఆలయంలోకి దళితులు ప్రవేశిస్తే ఆలయ పురాతన సంప్రదాయాలు, స్వచ్ఛత, పవిత్రత పెద్ద ప్రశ్నలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆలయంలోకి దళితుల ప్రవేశంతో పెద్ద ప్రతిష్టంభన తొలగిందని ఇది స్వాగతించాల్సిన విషయమని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అపూర్వ ఛటర్జీ అన్నారు. -
దేశ పునర్నిర్మాణానికి మార్గం
భారతదేశం ఈనాడు సామాజిక, ఆర్థిక సంక్షోభంలో ఉంది. రూపాయి విలువ అంతకంతకూ పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థ దుఃస్థితిని తెలియజేస్తుంది. యువత నైరాశ్యంలో, మత్తులో కునారిల్లుతోంది. స్త్రీలైతే నిరక్షరాస్యతలో, మత కర్మకాండల్లో, పనిలేని తనంతో ఉత్ప్రేరక రహిత జీవితం జీవిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థల్లో కులవివక్ష, అస్పృశ్యత ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాల వారే సంపదలను స్వాధీనం చేసుకోవడం పెరుగుతోంది. కొన్ని కులాల వారే వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపార వ్యవస్థల మీద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. కులం పేరుతో సాంఘిక, ఆర్థిక సంస్థలు, విద్యా వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. కుల ఆర్థిక వ్యవస్థ బలీయమైనదిగా రూపొందుతున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హర్షద్ మెహతా లాంటి ఒక సామాన్య వ్యక్తి ప్రభుత్వ ఆర్థిక సంస్థలను వినియోగించుకొని వేల కోట్ల సొమ్మును ఏమార్చాడు. అదే చిన్న పొరపాట్లకే ఎస్సీ, ఎస్టీ సివిల్ సర్వీసు ఉద్యోగులు శిక్షలను అనుభవిస్తున్నారు. నూతన ఆర్థిక విధానం, ఉన్నత కులాలకు తమ ఆర్థిక, సామాజిక అధికారాన్ని పటిష్ఠపరుచుకోడానికి కొత్త అవకాశాల్ని ఏర్పరచింది. ఇటీవల ఒక ఏజెన్సీ భారతదేశంలోని వంద మంది ధనవంతుల పేర్లని వెల్లడించింది. వారిలో ఒక్కడు కూడా దళితుడు లేడు. భారతదేశంలోని అస్పృశ్యతా భావం వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. కారణం భూమి పంప కాన్ని ప్రభుత్వాలు నిరాకరించడం! భూములను కార్పొరేట్లకే ధారా దత్తం చేస్తున్నారు కానీ, పేద ప్రజలకు పంచడం లేదు. ఇటీవల సీపీఎం మహాసభలు జరిగినా వారు అస్పృశ్యతా నివారణ మీద, దళితులకు సాగు భూమి పంచాలనే అంశం మీద, కులనిర్మూలనా అంశం మీద తీర్మానం చేయకపోవడం గమనించదగ్గ విషయం.పెరగని శాస్త్రీయ భావనలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 45 మంది ప్రాణాలు కోల్పోవటం విషాదకరం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారు. అంత మందికి అవసరమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.అదే రాష్ట్రంలో అంతకుముందు హత్రాస్‌లో జరిగిన ఒక అధ్యాత్మిక కార్యక్రమంలో బోలే బాబా పాద ధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి, 121 మంది చని పోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పో యిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ శాస్త్రీయ భావనలు దేశంలో వెల్లివిరియడం లేదు. సాంకేతిక, వైజ్ఞానిక భావచైతన్యం పెరగడం లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.అంబేడ్కర్ బాట అందరూ తమ రాజకీయ మేనిఫెస్టోల్లో దళిత వర్గాల స్త్రీల గురించే హమీలిస్తున్నారు. కానీ చివరకు శూన్య హస్తాలే చూపిస్తు న్నారు. ఈ విషయంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1951 అక్టోబర్ 28న తన ముంబయి ఎన్నికల ప్రచారంలో ఇలా విశ్లేషించారు: ‘ప్రతి రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తుంది. భారత్‌లో అసలు సమస్య పేదరికం. ప్రతి ఏటా కోట్లాది రూపాయిల విలువ గల ఆహార ధాన్యాలు దిగుమతి చేసు కోవాల్సి వస్తే ప్రజలు ఎలా నెట్టుకు రాగలుగుతారు? ఈ విషయా లన్నింటికీ ప్రభుత్వ ఆలోచనల్లో తావులేదు’ అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు పాలక వర్గాల మనస్తత్వంలో ఏ విధమైన మార్పూ లేదు. దీన్ని ఎదిరించి నిలబడే దళిత బహు జనులకు స్వీయ రాజకీయ చైతన్యం కావాలని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. రాజ్యాధికారమే ప్రధానమైన ‘కీ’ అని, దళిత బహుజన రాజ్యాన్ని నిర్మించినప్పుడే సంపద పంపిణీ అవుతుందని అన్నారు. లేదంటే పరిస్థితుల్లో మార్పులు రాకపోగా, మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ‘ఇవాళ దళితుల పరిస్థితి ఏమిటి? నాకు తెలిసినంత వరకూ ముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. అదే నిరంకుశత్వం, అదే అణచివేత. పరిపాలనలో అంతకుముందున్న వివక్షే కొనసాగుతోంది’ అన్నారు. అయినా వారికి ఉపశమనం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉద్దేశించి ఈ విశ్లేషణ చేశారు. అవి ఇప్పటికీ స్పష్టంగా అన్వయం అవుతున్నాయి. భారతీయుల బాధ్యతనిజానికి దేశంలో నిరుద్యోగం, పేదరికం, స్త్రీ అణచివేత ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. కానీ తయారీ రంగానికి అవస రమైన సమస్త యంత్రాలనూ దిగుమతి చేసుకుంటున్నాం. పరి శోధన, అభివృద్ధి రంగంలో మనం చేస్తున్న వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో 1 శాతం కంటే తక్కువ! పరిశోధన అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం, నవకల్పనలను ఇతోధికంగా ప్రోత్సహించడం, కార్మిక శ్రేణుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలూ ఏవీ అమలు జరగడం లేదు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలు విధ్వంసానికి గురి అవుతున్నాయి. సమాఖ్య భావన తగ్గడంతో రాష్ట్రాల అస్తిత్వాలు సంఘర్షణలో ఉన్నాయి. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమం సాగుతోంది. మేలిమి చదువులు, తీరైన వసతులు, ఉపాధి అవకాశాల కల్పన, అసమా నతల నివారణ ద్వారా జనం బతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా మారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమయింది. దేశంలో ఉత్పత్తిని పెంచు కొని, దేశ గౌరవాన్ని పెంచుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీ యుని మీద ఉంది. ఈ క్రమంలో అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించి అభివృద్ధి భారతానికి బాటలు వేయాలి.డా"కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ఆదేశించింది. కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన రోహిత్ వేముల, ముంబైకు చెందిన పాయల్ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, ఎంఎం. సంద్రేశ్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్‌కు చెప్పింది. రోహిత్ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కులవివక్షను నిషేధించిన సియాటిల్
వాషింగ్టన్: కులవివక్షను నిషేధిస్తూ అమెరికాలోని సియాటిల్ నగరం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం సావంత్ మీడియాతో మాట్లాడారు. కులవివక్ష వ్యతిరేక తీర్మానం భారీ మద్దతుతో ఆమోదం పొందిందని హర్షాతిరేకాల నడుమ వెల్లడించారు. ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది. ‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. పలు సంస్థల వ్యతిరేకత! సియాటిల్ కౌన్సిల్ నిర్ణయాన్ని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి! ‘‘ఈ విషయంలో కేవలం దక్షిణాసియావాసులను మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. ఇలా వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని జోడించడం అసంబద్ధం’’ అని హెచ్ఏఎఫ్ సహ వ్యవవస్థాపకుడు సుహాగ్ శుక్లా ఆరోపించారు. ‘‘ఈ ముసుగులో దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికావాసులతో మిగతా వారి కంటే భిన్నంగా వ్యవహరించనున్నారు. ఈ కుటిల యత్నాలకు ఈ ఓటింగ్ ద్వారా ఆమోదముద్ర పడింది’’ అంటూ దుయ్యబట్టారు. ఇదో ప్రమాదకరమైన తప్పుడు చర్య అని సంస్థ ఎండీ సమీర్ కల్రా అభిప్రాయపడ్డారు. ఈ చర్య సియాటిల్‌లోని దళిత బహుజనులకు కచ్చితంగా హాని చేసేదేనని అంబేడ్కర్–పూలే నెట్వర్క్ ఆఫ్ అమెరికన్ దళిత్స్ అండ్ బహుజన్స్కు చెందిన టి.మధు ఆరోపించారు. ఇలా కులాన్ని విధాన నిర్ణయంలో భాగం చేయడం స్థానికుల్లో హిందువుల పట్ల ఉన్న భయాన్ని (హిందూఫోబియా)ను మరింత పెంచుతుందని అమెరికాలోని భారత సంతతివారు ఆందోళన చెందుతున్నారు. హిందువులను భయభ్రాంతులను చేసే యత్నాల్లో భాగంగా అమెరికాలో గత మూడేళ్లలో పది హిందూ ఆలయాలు, గాంధీ, శివాజీ వంటి ఐదు విగ్రహాల విధ్వంస చర్యలు చోటుచేసుకున్నాయి. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి. -
వివక్ష ఉందంటే ఉలుకెందుకు?
వివక్ష సృష్టికర్తలు, వివక్ష లేదని చెప్పడమో లేక దాన్ని తక్కువ చేసి చూపడమో చేస్తూ వుంటారు. అందులో భాగంగానే బాధితుల ఆక్రందనల్ని ప్రమాదకరమైన అలవాట్లుగా చూపిస్తుంటారు. ఈ మధ్య ఒక వైపు దళితుల మీద వివక్ష వుందని చెబుతూనే మరోవైపు వివక్ష తీవ్రతనూ, పరిమాణాన్నీ పలుచన చేసి చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. నవంబర్ 17న ‘సాక్షి’లో పి. కృష్ణమోహన్ రెడ్డి రాసిన ‘ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?’ వ్యాసంలో ఈ ధోరణి కనిపిస్తుంది. ఆధారాల కంటే సొంత అవసరాలనే నిజాలుగా ప్రచారంచేసే పోస్ట్– ట్రూత్ మేధావులు పెరిగిపోయారు. ఇక్కడి వివక్షని తెలుసు కోవడానికి విదేశాల రిపోర్టులు అవసరం లేదనీ... నిజాన్ని గుర్తించే జ్ఞానం వుంటే సరిపోతుందనీ తెలుసుకోలేకపోతున్నారు. కులం కొనసాగింపు కోసం కొత్తకొత్త వాదనలు కనిపెడుతున్నారు. దళితులు ప్రతి విషయాన్నీ కుల కోణం నుంచి చూస్తున్నారని ఆందోళన చెందటం అందులో మొదటిది. తమ తప్పును కప్పిపుచ్చు కోవడానికి అన్ని కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి అంటారు. దళితులు ఎదుర్కొనే అంటరానితనం భిన్నమైందని ఒప్పుకోరు. ‘కొన్ని సంఘటన లను చూపించి’ దేశమంతా వివక్ష ఉందనడం సరి కాదంటారు. 2021లోనే దేశంలో 50,900 దాడులు నమోదు అయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది. ఇన్ని దాడులు చెదురు మదురు ఘటనలుగా కనిపించడం ఆశ్చర్యమే. దళితులు ఇక్కడి వివక్షనే ఎదిరించడం ‘అధర్మ’మట. ఆఫ్రికాలో అపార్తీడ్కూ, అమెరికాలో జాతి వివక్షకూ వ్యతిరేకంగా దళితులు సంఘీభావం ప్రకటించడం వీళ్ళకి కనబడదు. ఎక్కడో వివక్ష ఉంది కాబట్టి ఇక్కడ దళితులు దాన్ని అనుభవించాలంటారు! ఆస్ట్రేలియాలో ఆదివాసీలకు జరిగిన అన్యాయానికి ఆ దేశ అధినేత క్షమాపణ చెప్పాడు. అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ క్షమాపణలు చెప్పారు. అలాంటి ఊరట కలిగించే మాట ఇక్కడ ఎవరైనా చెప్పగలరా? రిజర్వేషన్లు సమానత్వానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. కానీ వీళ్ళకు కులం, అంటరానితనం అసమానత్వంగా కనబడవు. అమెరికాలో ‘పౌర హక్కుల చట్టం 1964’ ప్రకారం జాతి, మతం, లింగం వంటి అంశాల వల్ల ఒక వ్యక్తిని వివక్షకు గురి చేయకూడదు. ఈ చట్టం లోని ‘టైటిల్ సెవెన్’ ప్రకారం ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులు, సంస్థలు... కాంట్రాక్టులు, వ్యాపారాల్లో అఫర్మే టివ్ యాక్షన్ ప్లాన్ అమలు చేసి తీరాలి. అంటే నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్స్, మహిళలు, మైనారిటీలు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి తప్పకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలి. నియామకాలలో డైవర్సిటీ ఇండెక్స్ పాటించి తీరాలి. ఇది రిజర్వేషన్ లాంటిదే. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డైవర్సిటీ ఇండెక్స్, హాలీవుడ్ సినిమాల్లో నల్ల జాతీయులు కనిపించడం వంటివి అఫర్మేటివ్ యాక్షన్‌లో భాగమే. దౌర్భాగ్యం ఏంటంటే... బతుకుదెరువు కోసం వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళు అక్కడ కూడా కుల వివక్షను పెంచి పోషిస్తున్నారు. అందుకే అక్కడి దళితులు నల్లజాతీయుల లాగే తమకూ రక్షణ చట్టాలు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. అకడమిక్స్‌లోనూ వివక్ష రాజ్యమేలుతోంది. దానికి వ్యతిరేకంగా పోరాడే విద్యార్థులనూ, ఉద్యోగులనూ కులవాదులుగా చిత్రించడం ‘అలవాటైన దుర్మార్గం’ కాదా? దళితులు ఇప్పుడిప్పుడే చదువుకు దగ్గర అవుతున్నారు. వాళ్లకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు విష వలయాలుగా మారటం అన్యాయం కాదా? అంబేడ్కర్ మీద అక్కసు వెళ్లగక్కడం మరో పోకడ. గతంలో అమెరికాకి చెందిన నల్లజాతి నాయకులు ఇండియా వచ్చి గాంధీని కలిసి ఆహ్వానించారు గాని అంబేడ్కర్‌ని కలవలేదని పెద్ద రహా స్యాన్ని కనిపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. గాంధీని పిలిచారు కాబట్టి అంబేడ్కర్ వివక్ష మీద పోరాటం చెయ్యలేదని చెప్పగలరా? గాంధీ ఒక దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న నేతగా ప్రపంచాన్ని ఆకర్షించాడనే సంగతిని మరువరాదు. అంబేడ్కర్‌ను తక్కువ చేసి చూపాలనే దుగ్ధతో అనవసరమైన పోలికలు తీసుకొస్తే ఎలా? ‘అంబే డ్కర్ ఎంతో సహనంతో ఇప్పటిదాక నామీద దాడి చెయ్యకపోవడం అతని గొప్పతనమే’ అని గాంధీ స్వయంగా ‘హరిజన’ పత్రికలో ఎందుకు రాసుకున్నాడో తెలిస్తే లోతు అర్థమౌతుంది. దేశంలో చాక్లెట్ కొన్నా పన్ను కట్టాల్సిందే. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ... మిగిలిన పౌరుల్లాగానే పన్ను కడుతున్నారు. అందులోంచే సంక్షేమ కార్యక్రమాలకూ, పారిశ్రామిక వసతుల కోసం, కార్పొరేట్ లకూ, భూమి ఉన్న రైతులకూ రాయితీలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. రాయితీల్లో తొంబై శాతం పైగా లబ్ధి దారులు పైకులాలవారే. ఈ రాయితీలతో పోల్చుకుంటే రిజర్వేషన్ల విలువ అతి స్వల్పం. దేశాన్నే ప్రైవేట్ చేతుల్లో పెడుతుంటే పట్టించు కోకుండా తరతరాలుగా అణచివేతకు గురైనవారికి ఇస్తున్న రిజర్వేషన్ల మీద దాడిచేయడం ఏమిటి? కులం పేరుతో ఎవరి పట్లయినా వివక్ష చూపడం జరిగినా, దాడి జరిగినా నైతికంగా అందరూ బాధ్యత వహించాలి. దాన్ని అందరూ గర్హించాలి. (క్లిక్ చేయండి: మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?) - ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ఆచార్యులు, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీ, హెచ్‌సీయూ -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
నిమ్న కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టమ్ చేశారని..
బరఘా: కుల వివక్ష వెర్రి తలలు ఎలా వేస్తోందో చెప్పే ఉదంతమిది. ఒడిశాలోని బరఘా జిల్లాలో ముచును సంధా అనే వ్యక్తి ఆస్పత్రిలో మరణించారు. పోస్టుమార్టం చేసిన వైద్యడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తులు ఏకంగా అంత్యక్రియలను బహిష్కరించారు. కనీసం బంధువులెవరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహరా ఇలా బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి ఒకరిద్దరి సహకారంతో అంతిమ సంస్కారం నిర్వహించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి
భారతదేశంలో శాస్త్రీయ భావ జాలాలపై హిందూ పౌరాణిక వ్యవస్థ దాడి చేస్తోంది. మొత్తం సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ధ్వంసం చేసి భూ కేంద్ర సిద్ధాంతాలతో కూడిన జ్యోతిష్యం, మూఢవిశ్వాసాలతో కూడిన భావజాలాన్ని వ్యాప్తి చేస్తు న్నారు. దానివల్ల భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ సంక్షోభంలో పడు తున్నాయి. మానవుని పుట్టుక, నిర్మాణం మీదే ఇంకా సందిగ్ధ భావనలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి భారతదేశంలో చార్వాకం, బౌద్ధం, జైనం, సాంఖ్యం విస్తరిల్లి భారతీయ భౌతిక శాస్త్రం అత్యున్నతంగా ప్రజ్వలించింది. ఇతర దేశాల వారు సాంఖ్య దర్శనం లోని అనేక అంశాలను తీసుకుని వారి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. సాంఖ్యం బుద్ధుణ్ణి తర్కబద్ధమైన ఆలోచనలకు పురిగొల్పింది. జ్ఞానం ధ్యానం నుండి వచ్చేది కాదనీ, అది తర్క బద్ధమైనదనీ ఆయన గ్రహించాడు. సాంఖ్య దర్శనం భారతీయ తత్వ శాస్త్రాలలో హేతు బద్ధమైనది, భౌతిక వాదంతో కూడినది. ఈ దర్శనాన్ని రచించిన ‘కపిలుడు’ నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించాడు. దీనిపై పరిశోధన చేసిన ‘కీత్’ ‘ప్రపంచం మొత్తంలో భౌతిక వాదానికి సాంఖ్య దర్శనం ప్రేరణ శక్తి’ అన్నాడు. శాస్త్ర జ్ఞానానికి జ్ఞాన సంపద, హేతు దృష్టి, కార్యాచరణ శీలత, గ్రహణశక్తి, విశ్లేషణా శక్తి, అవసరం. అయితే ఇప్పుడు శాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా మూఢ నమ్మకాలు కలిగి ఉండటం ఆశ్చర్యం. భౌతిక వాదాన్ని, భౌతికశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని బోధించే ఆచార్యులు కూడా వర్ణధర్మాన్ని యజ్ఞ, యాగ, కర్మకాండలపై నమ్మకాన్ని, కులాచరణను కలిగి ఉండటంవల్ల శాస్త్ర జ్ఞాన బోధ పెదవుల నుండే జరుగుతోంది కానీ అది మేధస్సుకు పదును పెట్టలేక పోతోంది. అందుకే ఇప్పుడు దేవాల యాల యాత్రలకు శాస్త్రవేత్తలు క్యూ కడుతున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే పదార్థవాదం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన భావజాలం నుండి బయటపడలేక పదార్థం వెనుక కూడా ఏదో అదృశ్య శక్తి ఉన్నదని బోధించే దశలో ఉండటం వల్ల విశ్వవిద్యాలయాల్లో ద్వైదీ భావజాలం పరిఢవిల్లుతోంది. అందువల్లే అక్కడ రూపొందే విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణల్లో వెనుక బడిపోతున్నారు. ఫలితంగా మన విశ్వ విద్యాలయాల కోసం చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల ఖర్చు వ్యర్థమైపోతోంది. శాస్త్ర జ్ఞాన లోపం వల్ల ఉత్పత్తి క్రమం కూడా భారతదేశంలో తగ్గిపోతోంది. శాస్త్ర సాంకేతిక జ్ఞానం వల్ల చైనా, జపాన్, జర్మనీల్లో ఉత్పత్తి పెరిగింది. మనదగ్గర అది కనిపించకపోవడానికి శాస్త్ర జ్ఞాన లోపమే కారణం. నైతిక శక్తిని బోధించే బౌద్ధాన్ని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో, రాజకీయ పాఠశాలల్లో విస్తృ తంగా బోధించకపోవడం వల్ల నైతిక శక్తి సైతం తగ్గిపోతూ వస్తోంది. అవినీతిపరులు పెరగడం, దేశాన్ని దోచుకుని ఇతర దేశాల్లో దాచుకునేవారు పెరగడం, దేశీయ ఉత్పత్తులకు పునాదైన సాంకేతిక జ్ఞాన శూన్యత వల్ల మూఢాచారాలు పెరగడం సహజమైపోయింది. రాళ్ళూ, రప్పలకు బుర్రలు తాకట్టు పెట్టడం వల్ల పేరుకు 140 కోట్లు మంది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు 20 కోట్ల మంది కంటే తక్కువే ఉన్నారని అర్థ మవుతుంది. శ్రామికుడిని హీనంగా చూస్తూ విగ్రహా లను ఆధారం చేసుకుని బతికే వారిని పండితులుగా, భూదేవతలుగా కొనియాడటం జరుగుతోంది. రాగ ద్వేషాలను, కుల మత వైరుధ్యాలను పెంచే సంఘర్షణోన్మాద, యుద్ధోన్మాదాన్ని పెంచే కల్పిత యుద్ధ గాథల ప్రవచనాల వల్ల, దృశ్యాల వల్ల భారతదేశం నిరంతరం ఘర్షణలతో అట్టుడుకుతోంది. బౌద్ధ భారత నిర్మాణం వల్ల నైతిక శక్తి పెరుగుతుంది. పగతో పగ చల్లారదు. ప్రేమ వల్లే పగ చల్లారుతుంది అనే ధమ్మ పథం సూత్రాలు నేడు అవసరం. స్థిరత్వంతో, సంయమనంతో, కోప రహితుడిగా ఉండి... నిబ్బరంగా, నిజాయితీగా ఉండే విజ్ఞానవంతుడు వరదల ధాటికి మునగని దీవి లాంటివాడని, అటువంటి స్థిరత్వాన్ని శాస్త్రజ్ఞులు సాధించాలని బౌద్ధ బోధనలు చెబుతున్నాయి. శాస్త్ర జ్ఞానం ప్రకారం పుట్టుకలో గానీ, మరణంలోగానీ మానవులందరూ ఒకే రకంగా ఉన్నారు. ఒకే కులంలోని వ్యక్తులు కూడా అనేక వృత్తులు చేపడుతున్నారు. కానీ మనసుల్లో వర్ణభేదాలు, కుల భేదాలు, మూఢనమ్మకాలు ఉండడం వల్ల తమను తాము మనుషులుగా గుర్తించుకోలేక పోతున్నారు. గొప్ప జీవశాస్త్ర జ్ఞానమున్న వాళ్ళు కూడా మంత్ర గాళ్లకు, జ్యోతిష్యులకు లొంగిపోతున్నారు. వ్యవసాయ దారులు, వర్తకులు, విద్యావంతులు కూడా వీరికి బానిసలవుతున్నారు. అందువల్ల శాస్త్ర జ్ఞానం జీవితంలో ఫలించడం లేదు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి దేవుని హుండీల్లో వేస్తున్నారు. మనిషి పవిత్రత, అపవిత్రత అనేది ప్రవర్తన వల్ల రుజువు కావాలి కానీ దేవుడికి ఇచ్చే కానుకల వల్ల కాదు. దొంగలు, అవినీతి పరులు, అప్పు చేసి ఇతర దేశాలకు పారిపోయే వారంతా గొప్ప భక్తులుగా చలామణి అవుతున్నారు. నిజమైన శాస్త్రజ్ఞులకు సరైన గుర్తింపు, ఆదరణ లేదు. కనీసం ఇప్పటికైనా మన శాస్త్రీయ విజ్ఞానాభివృద్ధి తెచ్చిన ఫలితాలతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ప్రజా జీవన సమృద్ధికి ప్రేరణ కలుగుతుంది. ఉత్పత్తి, జ్ఞానం, విద్య, సాంకేతికతల సమన్వయంతో భారతదేశం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అప్పుడే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. (క్లిక్: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కత్తి పద్మారావు కవి, దళితోద్యమ నాయకుడు -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్‌లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్‌ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
‘భోజనమాత’పై వివక్ష.. దళిత మహిళ వండిన ఆహారం మాకొద్దు
డెహ్రడూన్: కుల వివక్ష ఇప్పటికీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా సుఖిందాంగ్‌లో చోటుచేసుకుంది. దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి అగ్రవర్ణ పిల్లలు నిరాకరించారు. దాంతో పాఠశాల బాధ్యులు ఆమెను తొలగించి మరో వివక్షాపూరిత చర్యకు పాల్పడ్డారు. పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండి, వడ్డించే మహిళలను ఉత్తరాఖండ్‌లో ‘భోజనమాత’గా సంబోధిస్తారు. కొద్దిరోజుల కిందట ఈ బడిలో భోజనమాత పోస్టు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. అగ్రవర్ణ మహిళ కూడా ఇంటర్వ్యూకు వచ్చినా ఆమెను కాదని దళిత మహిళను ఎంపిక చేయడంపై పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత సదరు మహిళ వండిన ఆహారాన్ని తినడానికి పిల్లలు నిరాకరించారు. మొత్తం 66 మంది పిల్లల్లో 40 మంది పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానివేసి ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. దీంతో దళిత మహిళను తొలగించి ఆమె స్థానంలో మరొకరికి తాత్కాలికంగా నియమించారు పాఠశాల బాధ్యులు. అయితే చంపావత్ జిల్లా విద్యాధికారి పి.సి.పురోహిత్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. దళిత మహిళ నియామకంలో నిబంధనలను పాటించలేదని, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయకుండానే సదరు మహిళను భోజనమాతగా నియమించారని పురోహిత్ చెప్పుకొచ్చారు. అందుకే ఆమె నియామకాన్ని రద్దు చేశామని చెప్పారు. (చదవండి: మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం) -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
టీడీపీకి ఓటు వేయను అన్నందుకు దళితుడిని కొట్టుకుంటూ..
మాకవరపాలెం: విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో టీడీపీకి ఓటు వేయనన్న దళితుడిపై ఆ పార్టీవారు దాడిచేసి కొట్టారు. కులం పేరుతో దూషించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గంట్యాడ రాజు తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. మండలంలోని భీమబోయినపాలెం గ్రామానికి చెందిన గంట్యాడ రాజు శనివారం రాత్రి ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ భవనం వద్ద ఉన్నారు. అదే సమయంలో ఈ నెల 16న జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు తమ పార్టీకి ఓటు వేయాలని రాజును కోరారు. తాను టీడీపీకి ఓటు వేయనని, వైఎస్సార్సీపీకే వేస్తానని రాజు చెప్పారు. దీంతో వారంతా ఆయనపై దాడిచేసి కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు. కులం పేరుతో నానా దుర్భాషలాడారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడిచేశారని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని రాజు పోలీసుల్ని కోరారు. గాయపడిన రాజును బంధువులు వెంటనే 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిందని, విచారిస్తున్నామని ఎస్ఐ రామకృష్ణారావు చెప్పారు. (చదవండి: కుప్పంలో మరోసారి టీడీపీ నేతల దౌర్జన్యం) -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
రెండేళ్ల దళిత బాలుడు... ఆలయంలోకి ప్రవేశించాడని జరిమానా
కొప్పాల్: ఆధునిక యుగంలోనూ కుల వివక్ష యథాతథంగా కొనసాగుతోందనడానికి ఇది మరో నిదర్శనం. రెండేళ్ల దళిత బాలుడు ప్రవేశించడం వల్ల గ్రామంలోని హనుమాన్ ఆలయం మైలపడిందని, దాన్ని శుద్ధి చేయడం కోసమంటూ బాలుని కుటుంబానికి రూ.25వేల జరిమానా విధించారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో మియాపూర్ గ్రామంలో ఈ నెల 4వ తేదీన ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌చేశారు. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన చంద్రశేఖర్‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ నెల 4న అతడి పుట్టినరోజు కావడంతో హనుమంతుడి ఆశీస్సుల కోసం గుడికి తీసుకెళ్లాడు. చంద్రశేఖర్‌తోపాటు కుటుంబ సభ్యులంతా గుడి బయటే ఉండిపోయారు. బాలుడు లోపలికి వెళ్లొచ్చాడు. ఇది గమనించిన ఆలయ పూజారులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. 11న పంచాయితీ పెట్టారు. హనుమంతుడి› ఆలయాన్ని శుద్ధి చేయడానికి జరిమానా కింద రూ.25,000 చెల్లించాలని బాలుని తండ్రిని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్ర సంగనాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చెన్నదాసరితో సహా అన్ని కులాల ప్రజలు పాల్గొన్నారు. -
కులవివక్ష లేదు.. అవి అసత్య రాతలు: చెన్నకేశవరెడ్డి
కర్నూలు: గురజాలలో కులవివక్షపై ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్పందించారు. గురజాలలో కులవివక్ష చూపుతున్నారనడం సరికాదని ఆయన అన్నారు. కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు రాస్తున్నారని చెన్నకేశరెడ్డి విమర్షించారు. కేవలం చర్చి గోడ విషయంలోనే రెండువర్గాల మధ్య వివాదం జరిగినట్లు పేర్కొన్నారు. గతంలో ఆడమ్‌స్మిత్ పరువుహత్యకు, ఈ విషయం ముడిపెట్టడం సరికాదని, గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కోరారు. -
దారుణం: న్యాయం చేయాలని అడిగితే ఎంత పనిచేశారు..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నా ఇంటి సొంత స్థలంలోకి వెళ్లనీయకుండా నా స్థలంలో గోడ ఎందుకు కడుతున్నారని అడిగినందుకు కులపెద్దలు కుల బహిష్కరణకు గురిచేశారని బాధిత కుటుంబం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు రవి అనే వ్యక్తి ఇంటి స్థలంలో గోడ ఎందుకు నిర్మిస్తున్నారని అడిగినందుకు ఈనెల18న కులపెద్దలు సమావేశమై తన కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారని రవి పేర్కొన్నాడు. కులం చిట్టిలోకి రానియ్యకుండా తొలగించారని, ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని తీర్మానించినట్లు తెలిపాడు. కులపెద్దలు మారుపాక శ్రీనివాస్, మారుపాక సత్యం, మారుపాక బాలఎల్లయ్య, మారుపాక నారాయణ, మస్కూరి శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రవి ఫిర్యాదును పరిశీలించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
గిరిజన విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి
-
అమానుషం: విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి
చెన్నై: ఓ వైపు సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్ శ్రీనివాసన్ గురువారం తెప్పక్కాడుకులోని ముదుమలై టైగర్ రిజర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శిబిరానికి వెళుతుండగా మంత్రి శ్రీనివాసన్ ఓ గిరిజన విద్యార్థిని పిలిచి.. తన కాళ్లకు ఉన్న చెప్పులు తీయాలని ఆదేశించాడు. ఏం చేయలేని స్థితిలో ఆ పిల్లవాడు అందరూ చూస్తుండగానే మంత్రి కాళ్లకు ఉన్న చెప్పలను తొలగించాడు. తర్వాత మంత్రి అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దళిత సంఘాలు మంత్రి ప్రవర్తనపై మండిపడుతున్నాయి. గిరిజన విద్యార్థితో మంత్రి చెప్పులు మోయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు చూస్తూ నిలుచున్నారే తప్ప ఏ ఒక్కరు ఈ పనికి అడ్డు చెప్పలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అతన్ని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
దళిత మహిళకు సీటు.. ఎన్నికల బహిష్కరణ
చెన్నై: కుల వివక్ష నేటికీ కొనసాగుతోందనడానికి ఉదాహరణగా నిలిచారు తమిళనాడుకు చెందిన తూత్తుకుడి గ్రామస్తులు. అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ కోసం శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో దళిత మహిళకు సీటు కేటాయించడంతో నాడార్ కులానికి చెందిన వారు ఏకంగా ఆ ఎన్నికలనే బహిష్కరించారు. పిచ్చావిళై గ్రామంలో 785 ఓటర్లలో ఆరుగురు దళితులు పంచాయతీ ప్రెసిడెంట్ కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశారు. నాడార్ కులానికి చెందిన మిగతా 779 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయకుండా వారి ఇళ్ల ముందు నల్లటి జెండాలను ఉంచి నిరసనలను తెలిపారు. తాలూకా అధికారి వారిని ఓటు వేయాలని కోరినప్పటికీ వారు దాన్ని పెడచెవిన పెట్టి బహిష్కరించారు. ‘సీట్ల కేటాయింపు న్యాయంగా లేదు. మేం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మాకు నచ్చిన అభ్యర్థిని ఉంచడానికి అనుమతించలేదు. అందుకే మేం ఎన్నికలను బహిష్కరించాం’అని మడిసుదు అనే స్థానికుడు తెలిపారు. -
వర్సిటీల్లో కులవివక్ష నిర్మూలించండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష ఆరోపణలపై స్పందించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న రోహిత్ వేముల, పాయల్ తాడ్విల మాతృమూర్తులు రాధిక, అబేదా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు శుక్రవారం జస్టిస్ ఎన్.వి.రమణ, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. కుల వివక్ష నివారణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వర్సిటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, జీవించే హక్కు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2004 నుంచి దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఈ కోవలోనివే అని న్యాయవాది వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల (2016), ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని పాయల్ తాడ్వి(2019, మే) ఆత్మహత్యలకు కులవివక్షే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయోధ్యపై వాదనలకు మరో గంట బాబ్రీ మసీదు భూవివాద కేసుకు సంబంధించి ఈనెల 23న వాదనలు వినడానికి అదనంగా గంట సమయం కేటాయిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, కేసుల భారాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఇకపై అప్పీళ్లు, బెయిళ్లు, యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన 7ఏళ్ల వరకు జైలు శిక్ష విధించగలిగే కేసులను ఒకే న్యాయమూర్తి విచారించేలా నిబంధనలను సవరించింది. -
పసిబిడ్డల మరణాల్లోనూ కులవివక్ష
ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లోనూ భాగం లేదు. ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనం. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతం బిహార్‌లో పసిబిడ్డలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? దళితులు, ఆదివాసులు దేశ చిత్రపటం నుంచి కనుమరుగవుతారేమోననే భయం వెంటాడుతోంది. హర్వంశ్పూర్ బిహార్, ముజఫర్ పూర్ ప్రాంతంలోని వైశాలి జిల్లాలోని ఒక కుగ్రామం. చాతురి సాహిని తనకు అత్యంత ప్రియమైన ఇద్దరు కొడు కులను పోగొట్టుకున్నాడు. పెద్ద కొడుకు ప్రిన్స్‌కు 7 ఏళ్ళు కాగా, చిన్న కొడుకు చోటూకి 2 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ ఇద్దరు చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మరణించారు. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతంపసిబిడ్డల ప్రాణాలు పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అయితే ఇది ఒక్క హర్వంశ్పూర్కు పరిమితమైన విషయం కాదు, సాహినికి మాత్రమే సంబంధించింది కూడా కాదు. గత రెండు నెలల్లో ముజఫర్ పూర్ ప్రాంతంలో 161 మంది పిల్లలు చనిపోయారు. 842 మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిపాలయ్యారు. చనిపోయిన వారిలో అత్యధిక మంది అట్టడుగు వర్గాలైన దళిత కుటుంబాల నుంచి వచ్చిన వారు. చనిపోయిన వారిలో దళితులు 101 మంది, 47 మంది వెనుకబడిన కులాల వాళ్ళు, 20 మంది ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలను ముజఫర్‌పూర్‌లోని దళిత సంఘాల కార్యకర్తలు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సహకారంతో ఇంటింటికీ తిరిగి సేకరించారు. ప్రభుత్వాలు కేవలం పిల్లల వివరాలు తెలిపాయే కానీ, వారి సామాజిక వర్గం వివరాలు తెలియజేయలేదు. బిహార్‌లో పిల్లలుచనిపోతున్న సమయంలోనే అక్కడి కార్యకర్తలతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమ న్వయం చేసుకొని ఈ అధ్యయనం చేసింది. అందులో భాగంగానే ఒక గ్రామానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించింది. బిహార్‌లో పిల్లల మరణాలకూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం ఉంటుందనే అంచనాయే ఈ అధ్యయనానికి నాంది పలి కింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న బడ్జెట్లలో చేస్తున్న కేటాయింపులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల పట్ల, ముఖ్యంగా సామాజిక అసమానతలను తొలగించే ప్రయత్నాల పట్ల వాళ్ళ వైఖరిని స్పష్టం చేస్తాయి. ప్రభుత్వాల కుల వివక్ష ధోరణికి ఈ బడ్జెట్లు అద్దంపడు తున్నాయి. అందుకే ఈ నెల మొదటి వారంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణలను ఈ ఘటన వెలుగులోనే పరిశీలించాల్సి ఉంటుంది. హరివంశ్‌పూర్ గ్రామ పిల్లలు మరణించడానికీ, ఆ గ్రామ సామా జిక, ఆర్థిక పరిస్థితులకూ సంబంధం ఉన్నది. మొదట పిల్లల మరణానికి లిచీ పండ్లు తినడమే కారణమని ప్రచారం చేశారు. కానీ అనేక మంది వైద్య నిపుణులు, వైద్యుల బృందాలు ఈ వాదనను కొట్టి వేశాయి. చివరకు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పిల్లల మరణాలకు లిచీ పండ్లు తినడం కారణం కాదని తేల్చేసింది. మెదడువాపు వ్యాధితో ఆసు పత్రిలో చేరిన వాళ్ళలో 90 శాతం మంది ఏడేళ్లలోపు వయస్సు వాళ్ళేనని తేలింది. ఇందులో 135 మంది 3 ఏళ్ల లోపు పిల్లలేనని నిర్ధారించారు. వాళ్ళు కూడా ఈ మరణాలకు పౌష్టికాహార లోపం, కడు దారిద్య్రం కార ణమని తేల్చారు. హరివంశ్‌పూర్ గ్రామంలో 2 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 15 మంది భూమిహార్లకు తప్ప మరెవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. ఈ గ్రామంలోని వారందరూ ఈ పదిహేను మంది భూస్వాముల భూములలో పనిచేసి బతకాల్సిందే. ఈ గ్రామం లోని కూలీలందరికీ నెలకు 10 నుంచి 12 రోజులు పని తప్ప వేరే ఉపాధి లేదు. ఈ గ్రామంలోని దాదాపు 30 శాతం మంది యువకులు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ముంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి, బతుకులీడుస్తుంటారు. భారత ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గర్వపడుతున్నది. సంతోషమే. కానీ భారత ప్రజలు కోట్లా దిమంది ఆకలితో నకనకలాడుతున్నారన్న విషయాన్ని మరుగుపరుస్తు న్నారు. 2018 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం, 119 దేశాల వివరాలు సేకరిస్తే, అందులో 103 వ స్థానంలో భారత్ ఉంది. అయితే ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే ఏడాది మొత్తానికి వర్తించేలా ప్రభుత్వాలు చేసే ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లో భాగం లేదు. సరిగ్గా ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనమని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్ళలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అగాధాల అంచులకు నెట్టి వేశాయి. మొత్తం బడ్జెట్లో ఎస్సీల విషయానికొస్తే, 2014 –2015 నుంచి 2019–20లలో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చూస్తే, 2014– 15లో 2.82 శాతం ఉండగా దాన్ని 2015–16లో 1.72 శాతానికి తగ్గించి, మళ్ళీ 2019–2020లో 2.92కు పెంచారు. ఇది పూర్తిగా ఎస్సీల పట్ల ఒక వివక్షాధోరణికి అద్దం పడుతున్నది. ఎస్టీలకు కూడా 2014–15 లో 1.80 శాతం ఉంటే, 2015–16లో 1.12 శాతానికి తగ్గించి మళ్ళీ 2019–20లో 1.89 శాతానికి పెంచారు. ఇది కూడా అదే వివక్ష, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కూడా ఇదే ధోరణిలో సాగుతున్నది. ఎస్సీ వెల్ఫేర్ కేటాయింపులు 2017–18లో 5.54, 2018–19లో 5.58, 2019–20లో 6.76గా ఉన్నాయి. నిజానికి 16 శాతం నిధులను ఎస్సీ వెల్ఫేర్‌కు కేటా యించాలి. ఏ సంవత్సరం కూడా వాళ్ళు సగానికి కూడా చేరుకోలేదు. ఎస్సీ వెల్ఫేర్‌కు 8 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 3.38 శాతం, 2018–19లో 3.85 శాతం, 2019–20లో 4.4 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ప్రధానమైన అంశం విద్యకు ప్రోత్సాహం. ఇందులో స్కాలర్షిప్స్ అత్యంత ముఖ్య మైన విషయం. ఎస్సీలకు సంబంధించి ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్స్ 2014–15లో 499 కోట్లుగా ఉంటే, 2019–20 వచ్చేసరికి 355 కోట్లకు తగ్గించారు. 2016–17, 2017–18, 2018–19లలో కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2016–17లో 50 కోట్లు, 2017– 18లో 50 కోట్లు, 2018–19లో 125 కోట్లు, 2019–20లో ఇది మరింత దిగజారి 109 కోట్లకు తగ్గించడం ఏ సంక్షేమానికి సంకేతమో అర్థం కావడం లేదు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయింపులు కూడా పెంచింది నామమాత్రమే. ఏకలవ్య మోడల్ పాఠశాలలకు గత కొన్ని సంవత్సరాలుగా నిధు లను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితీ, ఆశ్రమ పాఠశాలలకు సైతం గత మూడేళ్ళుగా నిధుల కేటాయింపులే లేకపోవడం గమనిస్తే ఈ వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యం స్పష్టమౌతోంది. స్వచ్ఛభారత్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న మనం ఆచరణలో అమానవీయ విధానాలను రూపు మాపడంలేదు. కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్ దాస్ అతల్వాలే ఇచ్చిన సమాధానం ప్రకారం, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, 1993 నుంచి ఇప్పటి వరకు 445 మంది మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక చనిపోయారు. గత మూడేళ్ళలో 88 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో తమిళనాడు144, గుజరాత్ 131, కర్ణాటక 75, యూపీలో 71 మంది చనిపోయారు. అయితే వారి సంక్షేమం కోసం గానీ, వారిని ఈ అమానవీయ వృత్తి నుంచి ఇతర వృత్తుల్లోకి తీసుకెళ్ళే పరిస్థితి కానీ, వారి చదువుల పట్ల ప్రభుత్వం చూపుతోన్న శ్రద్ధను కానీ చూస్తే మనం తలదించుకోక తప్పని పరిస్థితి. మాన్యువల్ స్కావెంజర్స్గా పనిచేస్తున్న వాళ్ళ స్వయం ఉపాధి కోసం 2013–14లో 557 కోట్లు కేటాయిస్తే, 2015–16లో 10 కోట్లు, 2018– 19లో 20 కోట్లు, మళ్ళీ 2019–20లో 110 కోట్లు కేటాయించారు. వారి పిల్లల చదువుకోసం 2015–16లో 10 కోట్లు, 2016–17లో 2 కోట్లు, దానిని మళ్ళీ 1 కోటికే పరిమితం చేశారు. మళ్లీ 2019–20లో దాన్ని 5 కోట్లుగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతోన్న నిర్లక్ష్యానికి ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటితో పాటు, భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అంటే ఒకవైపుఆర్థికంగా, సామాజికంగా వివక్షకు, అంటరానితనానికీ, వెలివేతకూ గురవుతూనే, రెండోవైపు జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు. వీటన్నింటి ప్రతిరూపమే బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోవడం. ఈ దేశంలో క్రమంగా అంటరాని కులాలైన దళితులు, ఆది వాసులు భారతదేశ చిత్రపటం నుంచి కను మరుగవుతారేమోననే భయం వెంటాడుతున్నది. భారత లోక్‌సభలో 112 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక హక్కుల కారణంగానే వీరికి ఆ పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీల పక్షాన ప్రభు త్వంలో, ప్రభుత్వంతో పోరాడి, సంప్రదించి, ఏదోరకంగా ఎస్సీ, ఎస్టీల సామాన్య ప్రజల హక్కులను, జీవన భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత వారిది. కానీ అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. ఇది శోచనీయం. వాళ్ళే కాదు. సమాజంలోని ప్రగతిని కాంక్షించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు కూడా ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న వివక్ష, వెలివేతలపై స్పందించాల్సిన తక్షణావశ్యత ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
ప్రమోషన్ల విషయంలో వివక్ష చూపుతున్నారు-ఐఏఎస్‌లు
-
మోదీ ఇలాకాలో ఇంత అంటరానితనమా!?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ‘గుజరాత్ తరహా అభివద్ధి’ దేశానికి అవసరమని అన్నారు. అందుకు కషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుజరాత్ తరహా అభివద్ధి ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియదుగానీ సామాజిక అంతరాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు తీసుకరాలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆదివారం నాడు దొంగతనం చేశాడనే అనుమానంపై 40 ఏళ్ల దళిత వ్యక్తిని ఓ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేయడం. రాజ్‌కోట్ జిల్లాలో ముకేశ్ వానియా అనే వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఓ స్థానిక ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముకేశ్ భార్యను కూడా చితక్కొట్టారు. ముకేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కథనం ప్రకారం ఫ్యాక్టరీ సమీపంలో పాత ఇనుప సామాను ఏరుకుంటున్న ఆ దళిత దంపతులను ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన కొందరు వ్యక్తులు పిలిచారు. కులం గురించి వాకబు చేశారు. దళితులమని చెప్పడంతో ఫ్యాక్టరీ సమీపంలోని చెత్తా చెదారాన్ని పూర్తిగా ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. అందుకు ఆ దంపతులు తిరస్కరించడంతో చితకబాదారు. ఈ సంఘటన నాడు 2016, గుజరాత్‌లోని ఉనాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తోంది. ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న అనుమానంపై గోసంర క్షకులు నలుగురు దళితులను చితక బాదిన విషయం తెల్సిందే. దేశంలోకెల్లా గుజురాత్లోనే దళితులు ఎక్కువగా అణచివేతకు, అంటరానితనానికి గురవుతున్నారని 2010లో ‘నవ్‌సర్జన్’ అనే స్వచ్ఛంద సంస్థ విస్తతంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఆ సంస్థ రాష్ట్రంలోని 98.4 శాతం గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించింది. 97.6 గ్రామాల్లో దళితులు హిందువుల వంటపాత్రలు, మంచినీటి బిందెలు ముట్టుకోరాదు. అలా ముట్టుకుంటే అవన్నీ కలుషితం అయినట్లు హిందువులు భావిస్తారు. 98 శాతం గ్రామాల్లో హిందువులు దళితులకు టీ పోయరు. కొందరు వారికి కేటాయించిన ప్రత్యేక కప్పుల్లో పోస్తారు. ఇక మతపరమైన కార్యక్రమాలకు దళితులను మరింత దూరంగా పెడతారు. 98 శాతం గ్రామాల్లో మతానికి సంబంధించిన వస్తువులను దళితులు అసలు తాకరాదు, ఈ అంటరానితరం కారణంగా బడులు, గుడుల వద్ద, గ్రామంలోని బావుల వద్ద తరచుగా దళితులపై దాడులు జరుగుతుంటాయి. దేశంలోని అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగంలోని 17వ అధికరణం గురించి హిందువులుగానీ, పాలకులుగానీ పట్టించుకోరు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయగా, గుజరాత్లో మాత్రం ఇంతవరకు భూసంస్కరణలు అమలుకాలేదు. ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇటీవల భానూభాయ్ వాంకర్ అనే ఓ దళిత కార్యకర్త సజీవంగా దహనం చేసుకున్నారు. రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేయకపోవడం అటుంచి స్థానిక బీజేపీ ప్రభుత్వం ధనిక రైతులు, పారిశ్రామికవేత్తలు చిన్న రైతుల భూములను సులభంగా కొనుక్కోవడం లేదా కాజేసే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోయి చిన్న రైతులు తమ పొలాలను అమ్ముకోవడం లేదా అప్పగించడం జరగకుండా ఎప్పటి నుంచో అమల్లో ఉన్న రక్షణ నిబంధనలను ఎత్తివేసింది. దళితుల తరఫున మాట్లాడుతున్న వారిని కూడా గుజరాత్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ‘నవ్‌సర్జన్’ ఎన్జీవో సంస్థ రాష్ట్రంలోని దాదాపు మూడువేల గ్రామాల్లో దళితుల సంక్షేమం కోసం కషి చేస్తోంది. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్జీవోలకు విదేశీ విరాళాలను నిలిపివేయడంతో నవ్‌సర్జన్ సంస్థ ఉనికికే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఓట్ల కోసమైనా దళితులను ఆకర్షించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. గుజరాత్లో ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల కోసం కషి చేయడం లేదు. దళితుల పక్షమంటే హిందువుల ఓట్లు కోల్పోవడంగానే ఆ పార్టీలు భావిస్తాయి. -
‘ముద్రల’ రాజ్యం!
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఛాతీపై కులం ముద్రలు వేయాలని నిర్ణయించిన ఘనులెవరోగానీ దేశంలో వర్తమాన స్థితిగతులకు చక్కగా అద్దంపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం తప్పేనని ఆ జిల్లా ఎస్పీ వీరేంద్ర సింగ్ అంగీకరించారు. మంచిదే. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. కానీ అది జరగడానికి ముందే ఇందులో ‘చెడు ఉద్దేశం’ ఏమీ లేదని ఆయన సమర్థిస్తున్నారు. మరింక విచారణ దేనికి? ఇది వెలుగులోకొచ్చి 72 గంటలు గడుస్తున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీన్ని గురించి మాట్లాడలేదు. జరిగింది తప్పేనని అంగీకరించడానికి ఆయనకు తీరిక చిక్కలేదు. పాలకుల తీరు ఇలా ఉన్నది గనుకే దేశంలో ఏదో ఒక మూల దళితులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఈ పోలీసు నియామకాల ఉదంతానికి ముందూ వెనకా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్‌లోని గోర్ధన్పురా గ్రామంలో తన పెళ్లి వేడుకలకు గుర్రంపై ఊరేగుతూ వెళ్తున్న దళిత యువకుణ్ణి అక్కడి ఆధిపత్య కులాలవారు కిందకు పడదోసి అతన్ని తీవ్రంగా కొట్టడంతోపాటు ఊరేగింపులోని ఇతరులపై కూడా దాడి చేశారు. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఇప్పుడు ఆసుపత్రిలో గాయాలకు చికిత్స చేయించుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం వెల్లడైన ఘటన మరింత దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలోని బదాయీలో తమ పొలంలో కోతలకు రానన్నాడని ఆగ్రహించి ఒక దళిత యువకుడిని ఆధిపత్య కులాలవారు ఊరంతా తిప్పి కొట్టుకుంటూ తీసుకెళ్లి చెట్టుకు కట్టి కొట్టారు. అతనితో మూత్రం తాగించారు. ఈ దేశం శాంతి సామరస్యాలకు పుట్టినిల్లని, ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడే ఇక్కడ నాగరికత వెల్లివిరిసిందని కొందరు గర్వంగా చెప్పుకుంటారు. కానీ దళితుల పట్ల అమలవుతున్న దౌర్జన్యాలు గమనిస్తే కనీసం ఇప్పటికైనా మనం నాగరికతను అలవర్చుకోగలిగామా అన్న సందేహం కలుగుతుంది. జీవితంలో ప్రతి దశలోనూ తననూ, తనలాంటి కోట్లాదిమందిని అణగదొక్కడానికి ప్రయత్నించిన కులం మహమ్మారి బారిన దళిత వర్గాల్లో మరెవరూ పడకూడదని కాంక్షించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వలసపాలనలోనే ఎన్నో పోరాటాలు చేశారు. సంఘ సంస్కరణ మార్గం మన దేశంలో కంటకావృతమైనదని, దానికి మిత్రులు కొద్దిమంది అయితే, శత్రువులు అనేకమందని ఆయన 1936లో వెలువరించిన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి డబ్భై ఏళ్లు దాటుతున్నా ఏమాత్రం మారని దళితుల పరిస్థితిని గమనిస్తే ఆయన మాటల్లో ఎంత నిజమున్నదో అర్ధమవుతుంది. దళిత సంక్షేమం గురించి, సమానత్వం గురించి, అణగారిన వర్గాల ఉద్ధరణ గురించి సమయం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలివ్వడమే తప్ప అందుగురించిన చర్యలు తీసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని మధ్యప్రదేశ్ ఘటన రుజువు చేసింది. దీని గురించి మీడియాలో వచ్చిన మర్నాడే గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది డాక్టర్ అంబేడ్కర్, ప్రధాని నరేంద్ర మోదీ బ్రాహ్మణులంటూ వ్యాఖ్యానించారు. పైగా ‘బాగా చదువుకున్నవారిని బ్రాహ్మణులుగా సంబోధించవచ్చున’ని తన వ్యాఖ్యను సమర్ధించుకున్నారు. ఈ వ్యాఖ్యల లోలోతుల్లోకెళ్తే వాటి అంతరార్ధం సులభంగానే బోధపడుతుంది. మన నేతల్లో నరనరానా జీర్ణించుకుపోయిన కులతత్వం... కుల నిర్మూలన కోసం జీవితాంతం పాటుబడిన మేధావిని సైతం చివరకు కుల చట్రంలో ఇరికించింది! అవి పల్లెటూర్లా, పట్టణాలా లేక నగరాలా అన్న తేడా లేకుండా దేశంలో అడుగడుగునా దళితులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. అవి ఎప్పటికప్పుడు మీడియాలో వెల్లడవుతూనే ఉన్నాయి. వాటిని నివారించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటో, దోషుల దండనపై ఏమేరకు అవి దృష్టి పెడుతున్నాయో ఎవరికీ తెలియదు. మధ్యప్రదేశ్ సంగతినే చూస్తే ఎస్సీ, ఎస్టీలపై ఆగడాలు శ్రుతిమించుతున్న రాష్ట్రాల్లో అది అగ్రస్థానంలో ఉంది. అక్కడ దళితులపై దాడుల పెరుగుదల 49.4 శాతం ఉంది. ఎస్టీల విషయంలో ఆ పెరుగుదల 15.6 శాతం. ఇవి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో చెబుతున్న గణాంకాలు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల) నిరోధక చట్టంపై జారీ అయిన మార్గదర్శకాలను నిరసిస్తూ గత నెల 4న దేశవ్యాప్త బంద్ జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది చనిపోయారు. నిరుడు గుజరాత్‌లోని ఉనాలో గోహత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ నడిరోడ్డుపై తమను కొరడాలతో హింసించిన దుర్మార్గులపై చర్యలు లేకపోవడంతో విసుగెత్తిన దళిత కుటుంబం ఆదివారం బౌద్ధమతంలోకి మారింది. వారితోపాటు మరో 300 మంది సైతం బౌద్ధాన్ని స్వీకరించారు. కనీసం ఇలాంటి పరిణామాలైనా ఆధిపత్యకులాల్లోనూ, పాలకుల్లోనూ పరివర్తన తీసుకురావాలి. ‘ముద్రల’ ఉదంతంపై రకరకాల తర్కాలు పుట్టుకొస్తున్నాయి. పోలీసు నియామకాలకు హాజరైనవారెవరూ దీనిపై ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదన్నది అందులో ఒకటి. నానా అగచాట్లూ పడి ఈ స్థాయి వరకూ వచ్చిన అభ్యర్థులు తమను అవమానించారని ఫిర్యాదు చేయడానికి సాహసిస్తారా? ఈ తర్కం లేవదీసిన అధికారులు కేసును మూసేయడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని అనుకోవాలి. ఎవరూ ఫిర్యాదు చేయలేదు గనుక దీన్ని ఇంతటితో ముగిస్తున్నామని ఏణ్ణర్థం తర్వాత ప్రకటించినా ప్రకటించవచ్చు. కులం, మతం, జాతి, ప్రాంతం వగైరాలతో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమానత్వాన్ని, సమాన హక్కుల్ని, న్యాయాన్ని అందించాలని నిర్దేశిస్తున్న రాజ్యాంగాన్ని మధ్యప్రదేశ్‌లోని ‘ముద్రలు’ ఉల్లంఘించాయి. శతాబ్దాలనుంచీ ఇక్కడ అమలవుతున్న కులజాడ్యాన్నే తలకెత్తుకున్నాయి. కనుక ఆ ముద్రలకు నైతికబాధ్యత వహించకపోతే, అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాలి. -
కుల వివక్ష చేశారని మెడికల్ ఉద్యోగి ఆత్మహత్య
-
కొనసాగుతున్న కుల వివక్ష
మంకమ్మతోట (కరీంనగర్): స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా.. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని సోషల్ జస్టిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ ఆరోపించారు. కరీంనగర్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు బడుగు, బలహీనవర్గాల అభి వృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. డబ్బులున్న వారే ఎన్నికల్లో గెలుస్తారనే వాతావరణం నెలకొందన్నారు. అవినీతి, నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయి బడుగు బలహీనవర్గాల వారు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కాలని ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేకూరడం లేదని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి.. వారి హక్కులు కాపాడేందుకు సోషల్ జస్టిస్ జేఏసీని ఏర్పాటు చేశామని తెలిపారు. దళితుల సంక్షేమ కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎంతమంది దళితులు, ఆదివాసీలకు మూడెకరాల భూమి పంపిణీ చేసిందో వివరించాలని డిమాండ్ చేశారు. గుత్తికోయలో ఆదివాసీలను చెట్లకు కట్టేసి దాడిచేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రచయిత కంచ ఐలయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే ఆయనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారన్నారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, ఐలయ్యను బెదిరించడం సరైంది కాదన్నారు. -
70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సిద్దిపేట అర్బన్: ‘70 ఏళ్లుగా మనిషిని అవమానపరుస్తున్న కుల వివక్షపై మా త్రం మార్పు రావడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట లో బుధవారం ప్రారంభమైన టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రథమ విద్యా మహాసభల్లో ఆయన పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ విద్య సమాజంలో భాగమని, అది అన్ని సమస్యలకు పరిష్కామని అన్నారు. నేడది వ్యక్తిగత అవసరాలను మాత్రమే తీర్చే దిశగా సాగుతుందన్నారు. విద్య, విజ్ఞానం వ్యక్తి అవసరాల కోసం కాకుండా సమాజ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపె డుతున్నామన్నారు. ప్రభుత్వమంటే ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపనీ కాదని.. నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులకు అడగకుం డానే 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వా నిదేన్నారు. బాధ్యతల నుంచి తప్పుకోబో మని, ఉన్నంతలో మీరు మెచ్చు కోలుగానే పనులు చేస్తం తప్ప మచ్చతెచ్చే ఏ పనీ చేయమన్నారు. రాష్ట్రం రాగానే రాత్రికి రాత్రే పేదరికం పోతుంది, సమానత్వం వస్తుంది అనుకో వడం సరికాదన్నారు. వచ్చే ఏడాదికన్నా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వవిద్యపై నమ్మ కం కలిగించేలా పనిచేయాలని ఈటల చెప్పా రు. అంతకు ముందు మహాసభల సావనీర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
పోరాటంతోనే సామాజిక న్యాయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: పోరాటాలతోనే సామాజిక న్యాయం సాధ్యమని కేరళ మాజీ మంత్రి ఎం.ఎ. బేబి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హెచ్‌సియూలో గెలిచిన విద్యార్థి నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాలు అస్థవ్యస్తంగా మారాయని, కుల వివక్ష పెరిగిపోతుందన్నారు.హెచ్‌సియూలో మతచాందస వాదం కారణంగానే రోహిత్ వేముల మరణించారన్నారు.హెచ్‌సియూలో గెలుపు అందరికీ ఆదర్శం కావాలని, విద్యార్ధుల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని ఆయన పిలునిచ్చారు. అనంతరం హెచ్‌సియూ అధ్యక్షులుగా గెలుపొందిన కులదీప్‌సింగ్, ఉపాధ్యక్షులు సుందర్, ప్రధాన కార్యదర్శి సుమన్ దామెర, జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, తుషారలను సన్మానించారు. కార్యక్రమంలో కోట శ్రీనివాస్, సాంబశివ, నాగేశ్వర్రావు, జావేద్ తదితరులు పాల్గొన్నారు. -
‘అనంత’లో అమానుషం
-
‘అనంత’లో అమానుషం
♦ పంచాయతీ కార్యదర్శి భవానీపట్ల కులవివక్ష ♦ నల్లలమ్మ ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ వర్గీయుల తాళం బ్రహ్మసముద్రం : రాష్ట్రంలో దళితుల పట్ల కొనసాగుతున్న కుల వివక్షకు మరో నిదర్శనమిది. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ దళితురాలు కావడంతో తమ గ్రామంలోని ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ టీడీపీ సానుభూతిపరుడొకరు అవమానించడమేగాక.. తనవారితో కలసి ఆమె లోపలకి వెళ్లకుండా ఆలయానికి తాళం వేసిన అమానుష ఘటన ఇది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి... భైరసముద్రం గ్రామపంచాయతీ రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తున్న భవానీకి ముప్పులకుంట కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో భాగంగా ఆమె జూలై ఆరు నుంచి ముప్పులకుంటలో స్మార్ట్ పల్స్‌సర్వే నిర్వహిస్తున్నారు. మూడురోజులుగా అదే గ్రామంలోని నల్లలమ్మ ఆలయంలో కూర్చుని సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. నెట్వర్క్ సిగ్నల్ అక్కడ బాగా ఉండడంతో ఆలయంలో కూర్చుంటున్నారు. రెండురోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు చంద్ర.. పంచాయతీ కార్యదర్శి భవానీని ‘మీదే కులం? ఎస్సీలైతే గుడిలోకి వెళ్లకూడదంటూ’ అవమానించడం మొదలుపెట్టాడు. మనోవేదనకు గురైన ఆమె ‘ఎందుకిలా మాట్లాడుతున్నారు. ప్రతిరోజూ కులం గురించి అడుగుతున్నారు. ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు?’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో అతను గ్రామంలోని తన వర్గీయులకు సమాచారమివ్వగా.. వారంతా కలసి పంచాయతీ కార్యదర్శిని ఆలయంలోకి అడుగుపెట్టకుండా తాళం వేయాలని, ఆలయాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సర్వేకోసం శుక్రవారం గ్రామానికెళ్లిన పంచాయతీ కార్యదర్శి భవానీ ఆలయానికి తాళం వేసుండడాన్ని గమనించి ఆరాతీశారు. విషయం తెలియడంతో కంటితడి పెడుతూ పైఅధికారులకు ఫోన్లో సమాచారమిచ్చారు. అలాగే కళ్యాణదుర్గం సీఐ మన్సూరుద్దీన్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన హెడ్ కానిస్టేబుల్ రఘురాములును గ్రామానికి పంపి బాధితురాలినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ తెలిపారు. -
కులం తక్కువని గెంటేశారు..
అనంతపురంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. నిమ్న కులానికి చెందిన యువతి ఆలయం ముందు కూర్చుందని గ్రామస్థులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసి ఘోరంగా అవమానించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగురాలని కూడా చూడకుండా.. ఆలయ ప్రాంగణంలో ఎందుకు కూర్చున్నావని అవమానించి అక్కడ నుంచి గెంటేశారు. దీంతో ప్రభుత్వోద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దేశానికి స్వతంత్య్రం వచ్చి డైబ్భై ఏళ్లు దాటిన ఇంకా అంటరానితనం పోలేదని.. కుల వివక్ష రూపుమాపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంటకు చెందిన పంచాయతి సెక్రటరీ గత కొన్ని రోజులుగా సెలవు మీద ఉండటంతో.. సమీప గ్రామమైన బైరసముద్రం సెక్రెటరీ భవానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె రెండు గ్రామాల బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ప్రజాసాధికారిక సర్వేలో పాల్గొనడానికి ముప్పాలకుంటకు వచ్చిన భవానికి గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో.. నల్లాలమ్మ దేవాలయం ఎదుటకు వచ్చింది. అక్కడ సిగ్నల్స్ అందుబాటులో ఉండటంతో.. ఆలయ ప్రాంగణంలోని రచ్చబండపై కూర్చొని ట్యాబ్ ద్వారా వివరాలు తీసుకుంటుండగా.. గ్రామానికి చెందిన కొందరు అక్కడికి చేరుకొని నీది ఏ కులమని ప్రశ్నించారు. అనంతరం నువ్వు అంటరానిదానివి, దళిత జాతికి చెందిన దానివి ఇక్కడ కూర్చోవద్దు అని ఘోరంగా అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. -
కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి
కేవీపీఎస్ నేత నర్సింహ పిలుపు యాచారం: కుల వివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఈ. నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటికీ కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల చేతుల్లో దళితులు అణుగుతునే ఉన్నారని అన్నారు. ఎక్కడో ఓ చోట దాడులకు గురివుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు దళితుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వారికి చేరకుండా పోతున్నాయని అన్నారు. బ్యాంకులు కూడ మోసం చేసే బడా వ్యాపారులనే నమ్ముతున్నాయని, అదే కాయకష్టం చేసుకునే వారిని మాత్రం పైస రుణాలు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సమ న్యాయం వస్తే వివక్షత పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ క్రిష్ణ, నాగని బుగ్గరాములు, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి
► నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ► ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు పాలమూరు : ఎక్కడలేని కులాలు, మతాలు మన దేశంలోనే ఉన్నాయని, వాటిని అంతం చేసి కులరహిత సమాజం నిర్మించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని విశ్రాంత ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగి న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర తొలిమహాసభ ప్రతినిధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్క్సిజంలో కులానికి స్థానం లేదని, వర్గానికే ప్రాముఖ్యత ఇస్తారనే ఆరోపణలున్నాయని, వాటిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. కులా న్ని, వర్గాన్ని కలిపితేనే కుల నిర్మూలన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తిం చాలన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు లెసైన్స్‌లు, రామెటీరియల్, షేర్లు, రుణాలు తదితర వాటిని ప్రభుత్వం నుంచే పొందుతుండటంతో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఇంగ్లీష్ తెలిసిన వారికే వస్తున్నాయని, ప్రభుత్వం కెజీ టు పీజీని ఇప్పట్లో అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి పోరాటం చేయాలన్నారు. కులవివక్ష నిర్మూలనకే దళిత్ శోషణ్ ముక్తి పంచ్ దేశంలో పాతుకపోయిన కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి అంతం చేయడానికే తొమ్మిది సంఘాలతో దళిత్ శోషణ్ ముక్తిమంచ్ ఏర్పాటు చేశామని పంచ్ జా తీయ నాయకులు వి.శ్రీనివాసరావు అ న్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉ న్నా దళితుల చట్టాలను కాగితాలకే పరిమితం చేశాయని విమర్శించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఉపాధి అ వకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నా రు. మోదీ దళితోద్ధరణ పేరుతో అంబేద్కర్ పేరును ప్రచారంలో వాడుకుంటున్నారని, అంతర్గతంగా హిందుత్వ, మ నుధర్మ భావజాలం పెట్టుకొని నటిస్తున్నారని విమర్శించారు. మత విద్వేశాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు కొన్ని మతతత్త్వ పార్టీలు కుట్ర పన్నుతున్నాయ ని తెలిపారు. అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభధ్రం, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, ఆహ్వాన సం ఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డా క్టర్ మధుసూధన్‌రెడ్డి, అడ్వకేట్ వినోద్‌కుమార్ తదితరులు మాట్లాడారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండమడుగు నర్సింహ, స్కైలా బ్, కేవీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, ఎం.కురుమయ్య, సీఐటీ యూ నాయకులు జబ్బార్, గోపాల్, బాల్‌రెడ్డి, కురుమూర్తి పాల్గొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
స్పెషల్ స్టోరీ ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి న్యాయాన్ని పొందే హక్కును ఎవరి నుంచీ తీసేయకూడదు అన్నారు. వర్ణధర్మాన్నీ మనుస్మృతినీ బహిరంగంగా వ్యతిరేకించారు. కింది కులాల వారి హక్కుల కోసం గొంతెత్తి అరిచారు. సమ సమాజ స్థాపన అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. బాల్యం నుండీ కుల వివక్షకు గురైన ఆయన... ఒకనాడు దేశం యావత్తూ నడవాల్సిన దారిని నిర్దేశించే రాజ్యాంగాన్ని రాస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అంతటి ఖ్యాతిని, విజయాన్ని సాధించి వ్యక్తి... బాబా సాహెబ్ అంబేడ్కర్! ఈనాడు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా జరపటానికి పోటీపడు తున్నాయి. ఇది నిశ్చయంగా భిన్నత్వంలోని ఏకత్వ నిరూపణే. వర్ణ ధర్మ వ్యవస్థను తమ సంస్కృతిగా చెప్పుకుంటూ గర్వపడే దేశంలో ఒక మహర్ కులానికి చెందిన వ్యక్తి, బాల్యం నుండీ కుల వివక్షకు గురైన వ్యక్తి ఆ దేశపు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరించి సౌభ్రాతృత్వమూ, సమానత్వమూ, మానవతావాదమూ స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని మలచగలిగాడంటే అది అనితర సాధ్యమైన విషయం అని అంగీకరించవలసిందే. అతిరథ మహారథులుగా పేరుపొందిన రాజకీయ నాయకులు సంప్రదాయవాదులు ఉన్న రాజ్యాంగ పరిషత్తును ఒప్పించి, ‘‘చట్టం ముందు అందరూ సమానులే. న్యాయాన్ని పొందే హక్కు ఏ ఒక్కరి నుంచీ ఏ కారణంగానూ తీసివేయకూడదు. రంగు, కులం, లింగం, ప్రాంతం, పుట్టిన చోటు, జాతి పేరిట వివక్ష చూపకూడదు. అంటరానితనం పాటించడం నేరం!!’’ వంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచగలిగాడంటే అంబేడ్కర్ శేముషీ వైభవాన్ని క్షమాగుణాన్నీ అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి గౌరవంతో పాటు దేశ ప్రతిష్ఠకు ఐక్యతకు భరోసా ఇచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేడ్కర్ 14-4-1891న మధ్యప్రదేశ్‌లోని మౌ (కంటోన్మెంటు ప్రాంతం)లో రాంజీ, భీమాబాయి దంపతులకు జన్మించాడు. అది మిలిటరీ కేంద్రం. యుద్ధంలో పాల్గొనవలసిన సైనికుల శిక్షణా కేంద్రం. ‘ఆతడనౌకయుద్ధముల నారియు తేరిన ధీర మూర్తి’గా ఎదగడానికి ఆ నేపథ్యమూ దోహదపడిందేమో. అంబేడ్కర్ జన్మించిన కులం మహర్ కులం. భారతదేశం సగర్వంగా చెప్పుకునే వర్ణాశ్రమ ధర్మ సంస్కృతిలో మహర్లు అంటరాని, చూడరాని, చెప్పరాని కులాల కోవలోకి వస్తారు. దుర్భరమైన పరిస్థితులలో పెరిగినప్పటికీ సహృదయులైన గురువుల ప్రోత్సాహంతో సంస్కరణాభిలాషులైన బరోడా, కొల్హాపూర్ - సంస్థానాధిపతులు అందించిన ఆర్థిక సహాయంతో ఆయన విదేశాలకు ఉన్నత విద్యలను అభ్యసించగలిగారు. 1913-1916ల మధ్య అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రం, అర్ధశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, మానవ శాస్త్రం వంటి ఎన్నెన్నో శాస్త్రాలు చదివారు. 1915లో అర్ధశాస్త్రంలో ఎం.ఎ., డిగ్రీ, డాక్టరేట్ అందుకున్నారు. 1917లో స్వదేశానికి తిరిగివచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. కులం కారణంగా అవమానాల పాలై అక్కడి సత్రం యజమాని రోడ్డుమీదకు గెంటివేస్తే రైల్వేస్టేషనులో చెట్టు కింద కూర్చుని నిస్సహాయంగా విలపించిన అనుభవం ఆయనను జీవితాంతం వెన్నాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితులను తనవారికి తప్పించటానికే ఆయన కృషి చేశారు. 1920 - 23 సంవత్సరాలలో లండన్‌లో ఎం.ఎస్.సి (1921) డి.ఎస్.సి. (1922) న్యాయశాస్త్రంలో బార్-ఎల్-లా. డిగ్రీలు సాధించి, 1923లో బొంబాయిలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను చైతన్యపరచటం కోసం ఆయన అనుక్షణమూ శ్రమించారు. పత్రికలు నడిపారు, పుస్తకాలు రాశారు. మారుమూల పల్లెలకూ వెళ్లి సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజలు తమ జీవనశైలిని ఎలా రూపొందించు కోవాలో చెప్పారు. ప్రతి సమావేశంలోనూ స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరచి వారికి మార్గదర్శనం చేశారు. దుర్మార్గులైన భర్తలను సన్మార్గంలోకి నడిపించాలనీ అది సాధ్యం కాకపోతే వారిని వదిలిపెట్టవచ్చుననీ వారికి ధైర్యం చెప్పారు. మంచి సమాజం ఆవిర్భవించాలంటే అది స్త్రీల వల్లనే సాధ్యం అని చెప్పారు. వర్ణ ధర్మాన్నీ మనుస్మృతినీ విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ సమ సమాజం కోసం ఆలోచనలు రేకెత్తిస్తూ ప్రజలను ఉద్భోదిస్తూ, ఆయన గడపిన జీవితం అసాధారణమైనది. కింది కులాలకు అందరితో పాటు ఊరి చెరువులు వాడుకునే హక్కు, ఆలయాలలోకి వెళ్లే హక్కు ఉన్నాయని చెప్పటానికి ఆయన జరిపిన మహజీ (1927), నాసిక్ (1930) పోరాటాలు దేశం మొత్తాన్ని ప్రభావితం చేశాయి. అలాంటి ఉద్యమాలు చాలా నడిపాక, ‘‘చెరువులు, ఆలయాలు మనకు వద్దు. తిండి, బట్ట, చదువు, ఆత్మగౌరవం మనకు కావాలి’’ అంటూ కింది వర్గాలను జాగృత పరిచారు. భూమినీ భారీ పరిశ్రమలనూ జాతీయం చేయాలన్నారు. దేశంలోని ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యలవైపు వారి దృష్టి మళ్లించారు. 1927లో అంబేడ్కర్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1935-38 వరకూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937లో బొంబాయి ప్రొవిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1942-46లలో వైస్రాయి కౌన్సిలులో లేబర్ మెంబర్‌గా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ దేశ నాయకులతో చర్చలు జరిపిన ప్రతిసారీ అంబేడ్కర్‌ను కూడా ఆహ్వానించి ఆయన వాదన వింటూ ఉండేది. ఆయన జ్ఞాన సంపదను గౌరవించింది. అయినా స్వతంత్ర భారతదేశంలోనే దేశ ప్రగతి సాధ్యమంటూ అంబేడ్కర్ ప్రకటనలు చేస్తుండేవాడు. స్వరాజ్యం వస్తే కింది వర్గాల/ కులాల సంగతి ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో వారి స్థానం ఎక్కడ అంటూ ప్రశ్నించిన ధైర్యశాలి అంబేడ్కర్ ఒక్కడే. ‘‘నేను హిందువుగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు. కాని నేను హిందువుగా మాత్రం మరణించను’’ అని 1935లో ప్రకటించాడు అంబేడ్కర్. హిందూ మతం చాలా గొప్పదనీ తన ధోరణి మార్చుకుంటుందనీ అప్పటి నాయకులు అంబేడ్కర్‌కు వాగ్దానాలు చేశారు. ఆ మార్పు ఎంతకూ రానందున ఆయన విసిగి 1956లో బౌద్ధం స్వీకరించారు. బౌద్ధం ఇండియాకు పురాతన ధర్మమే విదేశీయం కాదు గనక జాతి సమైకత్యతకు, దేశ సమైక్యతకు భంగం కలగదనీ సంతృప్తిపడ్డారు. 1956లో అంబేడ్కర్‌ను నిరాశపరచిన పరిస్థితులు ఈనాడు 2016లో కూడా దేశంలో కనిపిస్తుండటం ఆలోచించదగ్గది. తరచుగా మతపరమైన విమర్శలు చేస్తుండటం వల్ల అప్పటి రాజకీయ నాయకులు అంబేడ్కర్‌ను తమ ప్రత్యర్ధిగా భావించేవారు. 1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినప్పుడు ఆయన బొంబాయి నుండి ఎన్నిక కాకుండా ఉండేందుకు వారు సర్వ ప్రయత్నాలూ చేశారు. ఆయన ఓడిపోయారు. అయితే బెంగాల్‌లోని ముస్లిం లీగు నామ శూద్ర వర్గాల తోడ్పాటుతో జైసూల్ కోల్కాల జిల్లాల నుంచి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించాడు. రాజ్యాంగ పరిషత్తులో ఆయన ప్రసంగం విని సభ నివ్వెరపోయింది. బెంగాల్ విభజనలో అంబేడ్కర్ సభ్యత్వం పోయినప్పుడు కాంగ్రెస్ మహారాష్ట్రలోని తన సభ్యులలో ఒకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేడ్కర్‌ను రాజ్యాంగ పరిషత్తుకు తెచ్చుకున్నది (14-7-1947). స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను న్యాయ శాఖామంత్రిగా ఆహ్వానించింది. రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా చేసి ఆయన ప్రజ్ఞాపాటవాలను వినియోగించుకున్నది. అయితే న్యాయ శాఖామంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకు అడుగడుగునా పరోక్షంగా ప్రతి బంధకాలు ఏర్పరచి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకూ తెచ్చింది. స్త్రీల ప్రాతినిధ్యానికీ హక్కులకూ సంబంధించి దేశంలో అంబేడ్కర్ ఆశించిన మార్పు ఇంతవరకూ రానేలేదు. వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఈనాడు దేశంలోని విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని కులతత్త్వ ధోరణులు చూస్తే అంబేడ్కర్ స్థాపించిన విద్యాసంస్థలు గుర్తువస్తాయి. పని చేస్తూనే చదువుకునే (షిఫ్టు పద్ధతిలో) విద్యాలయాలు మొదటగా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు ఆయన. సమానతా ప్రాతిపదికపై యువత పురోగమించాలని ఆశించాడు. ప్రభుత్వాధికారాలు ప్రైవేటు పరం కాకుండా చూడాలన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాలను రక్షించుకోవటానికి సన్నద్ధులం కావటానికి 125 ఏళ్ల అంబేడ్కర్ స్ఫూర్తిని అందుకోవలసిందే. మరో 125 ఏళ్లకైనా ఆయన కలలు సాకారమవుతాయా అనేది కాలమే నిర్ణయించటం కాదు, మనమే పూనుకోవాలి. దేశంలో బలపడుతున్న కార్పొరేట్ శక్తులు, ప్రబలుతున్న అనైతికత, అసహనం, కులతత్వం అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ఎంత అనుగుణంగా ఉన్నాయో ఆలోచించాలి. విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని పక్షపాత ధోరణులు - సమర్ధతకు చోటు లేకపోవటం వంటి సమస్యలపై దృష్టి సారించటమే ఆయనకు ప్రభుత్వమూ ప్రజలూ ఇవ్వగలిగిన గౌరవం. - బి.విజయభారతి జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్‌లతో బాబబా సాహెబ్ అంబేడ్కర్ వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. -
మధ్యప్రదేశ్‌లో గురువుల దారుణం..
భోపాల్: ప్రపంచమంతా అభివృద్ధి, ఆధునికత అంటూ పరుగులు పెడుతున్నా కొందరి మనస్తత్వాలు మారడం లేదు. వారిని పట్టుకున్న కులజాడ్యం వీడటం లేదు. ఏళ్లుగా పాతుకుపోయిన కులాల పిచ్చి మనిషిని గుర్తించకుండా చేస్తోంది. ఇలా నిరక్షరాస్యులు చేశారంటే లోకజ్ఞానం ఎక్కువగా లేదనుకోవచ్చు.. కానీ సాక్షాత్తు పాఠాలు చెప్పే గురువులే చేస్తే.. మధ్యప్రదేశ్‌లో ఇదే జరిగింది. దామోహ్‌లో దారుణం చోటుచేసుకుంది. మంచినీటికోసం స్కూళ్లో చేతిపంపు వద్దకు వెళ్లిన ఓ దళిత బాలుడిని అందుకు అనుమతించకపోవడంతో అతడు బావిలో పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల బాలుడు దాహార్తితో స్కూళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడిని మంచినీళ్లు తాగేందుకు టీచర్లు అనుమతించకపోవడంతో పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపట్ల సీరియస్ గా స్పందించిన ఉన్నతాధికారులు ఆ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి విచారణ ఆదేశించారు. -
కులవివక్ష బాధాకరం
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాములు కేవీపీఎస్ జిల్లా శిక్షణ తరగతులు ప్రారంభం జడ్చర్ల టౌన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా, నేటికీ దేశంలో కులం, వర్గం అనే అంశాలు గ్రామీణ స్థాయి లో కొనసాగుతూనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. కులవివక్ష పోరాట సమితి ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులు ఆదివారం కావేరమ్మపేట పంచాయతీ ఫంక్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ దళితులకు ప్రయోజనం కలిగించే చట్టాలు సరిగా అమలు కావడం లేదన్నారు. ఫలితంగా సమాజంలో ఇంకా కులవివక్ష కొనసాగుతోందన్నారు. అణగారినవర్గాలపై నేటికీ పెత్తందారులు, అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. దీనిని దళితులందరూ కులవివక్షను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. కులవివక్షను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషిచే యాలన్నారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా కొనసాగనున్నాయి. శిక్షణ తరగతులను సమితి జిల్లా కార్యదర్శి కుర్మయ్య జెండా ఆవిష్కరించి ప్రారంభించాగా, రైతు సంఘం కార్యదర్శి వెంకట్రాంరెడ్డి సభలను ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వ తాలు, ఉపాధ్యక్షుడు దీప్లానాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మత్య్సకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్తయ్య, కేవీపీ ఎస్ డివిజన్ అధ్యక్షుడు జగన్, పట్టణ అధ్యక్షుడు లదితరులు పాల్గొన్నారు. -
వివక్ష బాధితులకు ‘బీసీ’ల్లో చోటు!
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య కుల వివక్షకు గురవుతున్నవారిని జాబితాలో చేర్చే అంశం పరిశీలన తెలంగాణ బీసీ జాబితాపై {పజాభిప్రాయ సేకరణ ప్రారంభం హైదరాబాద్: జాతి, కుల వివక్షకు గురవుతున్న వారిని బీసీ జాబితాలో చేర్చే విషయా న్ని పరిగణనలోకి తీసుకుంటామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. బీసీ కులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని, వాటిని సరిదిద్దడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీసీ కులాలకు సం బంధించిన వివరాలపై మూడు రోజుల ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్)ను కమిషన్ బుధవారం హైదరాబాద్‌లోని ఇం దిరా ప్రియదర్శిని హాల్లో ప్రారంభిం చింది. తొలిరోజున బీసీ జాబితాలో ఉన్న కులాలు, ఉపకులాల పేర్లు, వాటిల్లో అచ్చుతప్పులు, ఏయే ప్రాంతాల పరిధిలోకి ఆయా కులాలు వస్తాయి, రాష్ట్ర జాబితా నుంచి తొలగించిన బీసీ కులాలపై ఆయా సంఘాల అభ్యంతరాలు తదితర అంశాలపై పరిశీలన జరిపింది. ఈ సేకరణలో కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, సభ్యులు ఎ.కె.సైనీ, ఎస్.కె.కర్వేంతన్, షకీల్ ఉల్‌జమాన్ అన్సారీ, సభ్య కార్యదర్శి ఎ.కె.మంగోత్ర, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి ఎ.కె.కృష్ణమోహన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, ఇన్చార్జి డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 35 బీసీ కులాలకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు, నేతలు తమ వినతిపత్రాలను కమిషన్‌కు అందజేశారు. జాబితాలోని తమ కులాల పేర్లను సవరణ, ఇతర పొరపాట్లను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ బీసీ జాబితాలోంచి తొలగించిన 26 కులాల (ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా నివసిస్తున్న కులాల) వారు తమ అభ్యంతరాలను తెలి పారు. స్పందించిన కమిషన్.. ప్రాంతీయత ఆధారంగా తెలంగాణ జాబితా నుంచి తొల గించినా, కేంద్ర జాబితాలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ కులాలు బీసీ జాబితాలో కొనసాగుతాయని పేర్కొంది. అణగారిన వర్గాలను గుర్తిస్తున్నాం.. బీసీలను గుర్తించడానికి నిర్దిష్టమైన ప్రమాణాల్లేవని, అణగారిన వర్గాలను బీసీలుగా గుర్తిస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య చెప్పారు. బీసీకులాలకు సంబంధించి కేంద్ర జాబితాకు, రాష్ట్ర జాబితాకు తేడాలున్నాయని.. వాటిని సరిదిద్దడానికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో జాతి, కులవివక్షకు గురైన వారిని బీసీ జాబితాలో చేర్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ‘‘ఈ సర్వే మంచి ఫలితాలను ఇస్తుంది. బీసీల జనాభా 52శాతం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ వివరాలు వెల్లడి కాలేదు. వెల్లడిస్తే దేశవ్యాప్తంగా ఇది ఆదర్శం గా నిలుస్తుంది. దీనిపై సీఎంకేసీఆర్‌తో మాట్లాడుతాం..’’ అని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కులం ఏదైనా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: ఆర్. కృష్ణయ్య చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జాతీయ బీసీ కమిషన్ చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కోరారు. బుధవారం ఆయన జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరై బీసీల సమస్యలపై తన వాదనను వినిపించారు. బీసీల జనాభా 56 శాతంగా ఉన్నట్లు చెబుతుండగా, 2010 లెక్కల ప్రకారం బీసీలకు 12 శాతం మాత్రమే రాజకీయ ప్రాతినిధ్యం లభించిందని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ పరిశీలనలో వినతులు: టి.రాధ తమ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో కొనసాగించాలంటూ పలు సంఘాలు సమర్పించిన వినతిపత్రాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ తెలిపారు. కాళిం గ, శెట్టి బలిజ, తూర్పుకాపు, గవర, గొడబ, నాగవంశం, వీరముష్టి, కొప్పుల వెలమ, ఖురేష్ తదితర కులాలకు సం బంధించిన అభ్యంతరాలు కమిషన్ దృష్టికి వచ్చాయని.. వీటిలో కాళింగను చేర్చే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉం దన్నారు. కాగా.. గౌడ కమ్యూనిటీకి ఉప కులంగా ఉన్న శెట్టిబలిజ కులాన్ని తెలంగాణలో బీసీ(బీ)లో కొనసాగించాలని గ్రేటర్ హైదరాబాద్ శెట్టిబలిజ సంక్షేమ సంఘం నేతలు దొమ్మేటి సత్యనారాయణ తదితరులు విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర సగర (ఉప్పర)సంఘం నేతలు బి.నరసింహ సగర, ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ కాళింగ సంఘం నేతలు పూజారి గణపతిరావు, ఎస్.వెంకటరమణ, నవ తెలంగాణ రజక అభివృద్ధి సంఘం నేత అంజయ్య, వి.శంకర్ తదితరులు తమ వినతిపత్రాలు సమర్పించారు. -
అనంత జిల్లాలో బయటపడ్డ కుల వివక్ష!
-
'అనంత'లో బయటపడ్డ కుల వివక్ష
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరులో కుల వివక్ష బయటపడింది. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి సమక్షంలో ఈ ఘటన జరిగింది. నల్లూరులో సోమవారం సీతారామాంజనేయ ఆలయం ప్రారంభోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా దళితులు ఆలయంలోకి ప్రవేశించానుకున్నారు. కానీ అక్కడి గ్రామస్తులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి కుల వివక్షను ఎందుకు అడ్డుకోలేకపోయారని దళితులు మండిపడ్డారు. ఓటు వేసినపుడు దళితులు కనిపించరా ? అని ప్రశ్నించారు. దీనిపై పార్థసారథి మౌనం వహించారు తప్ప సమస్యను పరిష్కరించలేకపోయారు. -
ఎస్సీ, ఎస్టీరుణాలు ఎక్కడ?
ఒంగోలు టౌన్ : ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 2013-2014 ఏడాదికి సబ్సిడీ రుణాలు అందించాలని.. జీఓ నం 101ని సవరించి అర్హులైన వారందరికీ బ్యాంకు అనుమతి లేని రుణాలు ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేసింది. జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రకాశం భవనం వద్ద నిర్వహించిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు అట్లూరి రాఘవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 13 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ 27వేల 28 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సి ఉందని వివరించారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 786 మందికి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 486మందికి రుణాలు ఇవ్వాలని చెప్పారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థారుు అధికారులు పంపించిన అర్జీలను ఉన్నతాధికారులు తిరిగి వెనక్కు పంపించడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టంలో భాగంగా 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చినా బిల్లులు కట్టాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు వెంగళరావు, మాలమహానాడు నాయకుడు దాసరి శివాజీ తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
అవుటాఫ్ కవరేజ్ ఏరియా
‘‘గ్రామం అన్నీ అమరిన వారికి తీపి జ్ఞాపకం కావచ్చు. బయటికొచ్చి బతికితే నోస్టాల్జియా కావచ్చు. కాని గ్రామీణ సమాజాన్ని ఏలేది మనువాదమే. అందుకే అంబేద్కర్ దళితులను గ్రామాలు వదిలి పట్టణాలకు తరలి వెళ్లమని చెప్పాడు. అయితే పట్టణాల్లో కూడా ఇప్పుడు కులవివక్ష భూతం మోడరన్ మేకప్ వేసుకుని దర్జాగా మురికివాడల నుంచి పెద్ద పెద్ద కాలనీల దాకా అనేక రూపాలలో తిరుగుతూనే ఉంది. పట్టణాల్లో నయా అగ్రహారాల నిర్మాణం జరుగుతోంది. కుల సమస్య రూపుమాసిపోయిందని చెప్పే పెద్దమనుషులు, సినీ ప్రముఖులు ఆయా అగ్రహారాలకు ప్రచారం చేస్తూ నగరీకరించిన కొత్తరకం వివక్షకు తలుపులు తెరుస్తున్నారు. నాగరిక సమాజంలో మాటు వేసి దళితుల మీద దాడి చేస్తున్న అగ్రకుల ‘ట్రోజన్ హార్స్’ల ఎత్తుగడలను పసిగట్టి పసునూరి రవీందర్ తన కథల ద్వారా బాధిత దళిత సమాజాన్ని అలర్ట్ చేస్తున్నాడు. తెలంగాణ విజయోత్సవ సంతోష సందర్భంలో పసునూరి రవీందర్ తన తెలంగాణ దళిత కథల సంపుటి ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ప్రచురించడం ఆనందకరమైన విషయం’’ - వినోదిని (పుస్తకంలోని ముందుమాట నుంచి) అక్టోబర్ 16 ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో పసునూరి రవీందర్ ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ ఆవిష్కరణ. కొలకలూరి ఇనాక్, కె.శ్రీనివాస్, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, సీతారామ్, కోయి కోటేశ్వరరావు, సంగిశెట్టి శ్రీనివాస్, కనీజ్ ఫాతిమా పాల్గొంటారు.