రూ.12కోట్ల అగ్రిమెంట్ రద్దు? | 12 crores agreement cancelled | Sakshi
Sakshi News home page

రూ.12కోట్ల అగ్రిమెంట్ రద్దు?

Published Mon, Jan 20 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

12 crores agreement cancelled

 సాక్షి, సిటీబ్యూరో :
 భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేయాల్సిన మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తిరోగమనం బాట పట్టింది. కొత్త ప్రాజెక్టుల సంగతి అటుంచితే...గతంలో చేపట్టిన ప్రాజె క్టును సైతం పూర్తిచేయలేక చేతులెత్తేసింది. జీహెచ్‌ఎంసీ నుంచి సహకారం అందట్లేదన్న సాకుతో పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేలో ఓ డౌన్ ర్యాంపు నిర్మాణాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకొంది. కారణాలేవైనా... 2006లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును మధ్యలో అసంపూర్తిగా నిలిపేయడం హెచ్‌ఎండీఏ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిపెట్టింది.
 
  పీవీ నర్సింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు హెచ్‌ఎండీఏకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏడేళ్లయినా ఆ ప్రాజెక్టు పూర్తవ్వక పోగా తిరిగి కాంట్రాక్టర్‌కే భారీగా సొమ్ము చెల్లించాల్సి రావడం అధికారులకు మింగుడు పడట్లేదు. మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్ వరకు రూ.630కోట్ల వ్యయంతో 11.6 కిలోమీటర్ల మేర భారీ ఫ్లై ఓవర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మొత్తం 6 ర్యాంపులు నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్లాన్ చేసింది. వీటిలో లక్ష్మీనగర్ వద్ద తలపెట్టిన 2 ర్యాంపుల్లో అప్ ర్యాంపు నిర్మాణం పూర్తవ్వగా, డౌన్ ర్యాంపు నిర్మాణం మాత్రం ఇంతవరకు అతీగతీ లేదు. దీని అగ్రిమెంట్ ఇప్పటికే ముగిసి పోవడంతో ‘ఐడిల్ ఛార్జెస్’ రూ.2-3కోట్లు చెల్లించాల్సి రావడం హెచ్‌ఎండీఏను కలవరపరుస్తోంది. ర్యాంపు నిర్మాణానికి గుడి అడ్డురావడం, రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని సేకరించే విషయంలో జీహెచ్‌ఎంసీ సహకరించక పోవడంతో ఏడేళ్లుగా ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దీంతో సంస్థపై ‘ఐడిల్ ఛార్జెస్’ భారం మరింత పెరగకుండా ఆ ర్యాంపు కాంట్రాక్టును రద్దు (ప్రీ క్లోజర్) చేసుకోవాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.
 
 భారం పడకుండా...:
 లక్ష్మీనగర్, హైదర్‌షాకోట్ల, ఆరాంఘర్ వద్ద  మొత్తం 6 ర్యాంపుల్లో ఇప్పటివరకు 5 పూర్తి చేశారు. అయితే... లక్ష్మీనగర్ వద్ద రూ.12కోట్లతో తలపెట్టిన 426 మీటర్ల డౌన్ ర్యాంపు నిర్మాణానికి స్థలసేకరణ నిలిచిపోయింది. అగ్రిమెంట్ మేరకు నిర్ణీత వ్యవధిలో కాంట్రాక్టర్ పని పూర్తిచేయకపోతే షోకాజ్ నోటీసిచ్చి జరిమానా విధిస్తారు. ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు, స్థలాన్ని కేటాయించడం వంటి విషయాల్లో జాప్యం జరిగితే భారీ యంత్రాలను, మెటీరియల్‌ను, వర్కర్స్‌ను ఖాళీగా ఉన్నందుకు కాంట్రాక్టర్‌కు ‘ఐడిల్ చార్జెస్’ చెల్లించాల్సి ఉంటుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే లక్ష్మీనగర్ డౌన్ ర్యాంపు విషయంలో సకాలంలో స్థలాన్ని కేటాయించలేని పరిస్థితి హెచ్‌ఎండీఏకు ఎదురైంది. దీంతో కాంట్రాక్టర్‌కు సుమారు రూ.2 నుంచి 3 కోట్ల వరకు‘ఐడిల్ ఛార్జెస్’ చెల్లించాల్సి రావచ్చని అధికారులు పసిగట్టారు. దీన్నుంచి తప్పించుకొనేందుకు ముందస్తుగానే ఆ కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
 
 తిప్పలు తప్పవు...
 పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా మాదాపూర్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి వెళ్లేవారికి తిప్పలు తప్పవు. లక్ష్మీనగర్ డౌన్ ర్యాంపును నిర్మిస్తే జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు మధ్యలోనే కిందకు దిగి వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. లక్ష్మీనగర్ వద్ద డౌన్‌ర్యాంపు నిర్మాణం జరగక పోవడంతో 2.5కిలోమీటర్లు ఫ్లైఓవర్‌పై ముందుకు ప్రయాణించి సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద కిందగకు దిగి ‘యూ’ టర్న్ తీసుకోవాలి. ఆతర్వాత 1.5కి.మీ. వెనక్కి వెళ్లి టోలీచౌక్ మీదుగా మాదాపూర్- కూకట్‌పల్లి వైపు వెళ్లాల్సి వస్తోంది. వాహనదారుడు అదనంగా 4 కి.మీ. ప్రయాణించడమే గాక ట్రాఫిక్‌లో చిక్కుతున్నారు.
 
 విమానాశ్రయం నుంచి వచ్చే విదేశీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఐటీ సంస్థల వారు కీలకమైన మీటింగ్‌లు, రివ్యూలకు టైంకి చేరుకోలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ఫ్లైఓవర్ ఏడేళ్లు గడచినా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో హెచ్‌ఎండీఏ ఘోరంగా విఫలమైందని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement