కర్నూలు(అర్బన్): భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన జిల్లాలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద గృహ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా కర్నూలులో అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్ కింద జగన్నాథగట్టుపై 10 వేల గృహాలను నిర్మించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరై భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే జగన్నాథగట్టుపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే అవకాశాలను కూడా సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను ప్రస్తుతం పరిశీలించనున్నారు. ఈ పథకం కింద జిల్లాలోని కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల మున్సిపాలిటీల్లో మొత్తం18,618 గృహాలు మంజూరు అయ్యాయి.
కర్నూలులో జీ+3 నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గృహాన్ని 5.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, బ్యాంకు రుణం రూ.2.40 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.10 వేలు ఉంటుంది. ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో జీ+2 గృహ నిర్మాణాలను చేపడుతుండగా, నంద్యాలలో బెనిఫీషరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ కింద వ్యక్తిగత గృహాలను నిర్మించనున్నారు. ఇందుకు ఒక్కో గృహానికి 3.50 లక్షలను వెచ్చించనున్నారు.
అదే రోజు ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టనున్న పనులను కూడా ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈ పథకం కింద భూమి పూజ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలోని వివిధ ప్రాంతాల్లో ఈ పథకం కింద 11,850 గృహ నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆత్మకూరు అర్బన్‌లో నిర్మించిన 300 గృహ నిర్మాణాల కాలనీని కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
14న ‘హౌస్ ఫర్ ఆల్’కు భూమిపూజ
Published Thu, Apr 7 2016 3:42 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement