చిత్తూరు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమయ్యారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం పోలీసులు, టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు మొదట రాళ్లతో దాడి చేసి అనంతరం కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా 20మంది స్మగ్లర్లు మృతి చెందారు.
చంద్రగిరి మండలం శ్రీవారిమెట్లు, శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఈతగుంట, ఈత పాకుల కోన పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం శ్రీవారి మెట్టులో 11మంది, మంగాపురంలో 9మంది స్మగ్లరు హతమైనట్లు తెలుస్తోంది. అలాగే ఎదురు కాల్పుల్లో 8మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. మరోవైపు పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కాగా మృతులు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు.
ఫోటోలు; సాక్షి టీవీ రిపోర్టర్