వెలిగొండ వెలిగేదెప్పుడు...! | 2500 crore for veligonda project budget | Sakshi
Sakshi News home page

వెలిగొండ వెలిగేదెప్పుడు...!

Published Wed, Sep 10 2014 1:40 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

2500 crore for veligonda project budget

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కనీసం రూ.2,500 కోట్లు కేటాయిస్తేగాని వెలిగుండ ప్రాజెక్టు పూర్తి కాదు. ఈ ఏడాది రూ. 505 కోట్లు కేటాయించాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. 2014-15 బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన కేటాయించిన మొత్తం కేవలం రూ.76.58 కోట్లు మాత్రమే. ప్రకాశం, నెల్లూరు, కడపలోని 30 మండలాల్లో కరువును శాశ్వతంగా నివారించేందుకు డిజైన్ చేసిన ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి.

ఇప్పటికి సగం పని మాత్రమే పూర్తయింది. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పకుండా ఏ సంవత్సరానికా సంవత్సరం గడువు పెంచుకుంటూ పోతున్నారు. ప్రాజెక్టు వ్యయం 4,672 కోట్ల రూపాయలు కాగా రివైజ్డ్ బడ్జెట్‌లో దీని అంచనాలు రూ.5,998 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే సుమారు 3,437 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేశారు. గత ఏడాది రూ.402 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది దాన్ని పూర్తిగా తగ్గించివేశారు.  వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం, ఆవశ్యకతపై గత పాతికేళ్లుగా ఈ ప్రాంత ప్రజల పోరాటం కొనసాగుతూనే ఉంది.

 కృష్ణానది మిగులు జలాలు ఆధారంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని 45 రోజులపాటు వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయిస్తే 43.50 టీఎంసీల నీటితో నిండుతుంది. టన్నెల్స్ ద్వారా సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపుల్లో నీటిని నింపనున్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాల్లో సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ఫ్లోరైడ్ పీడిత ప్రజలకుతాగునీరు లభిస్తుంది.

 నత్తనడకన టన్నెల్ పనులు
 ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2009 జూన్ 25న అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య టన్నెల్ పనులను ప్రారంభించారు. టన్నెల్ 1ను 18 కిలోమీటర్లు,  టన్నెల్ 2ను 18.8 కి.మీ పొడవున  నిర్మిస్తున్నారు. టన్నెల్ 1 నిర్మాణానికి రూ.624 కోట్లు కేటాయించగా,  ఇప్పటి వరకు సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. టన్నెల్ 2 నిర్మాణానికి రూ. 735 కోట్లు కేటాయించగా,  సుమారు రూ. 400 కోట్లు ఇప్పటికే ఖర్చయ్యాయి.

 పూర్తయితే...
 ప్రాజెక్టు పూర్తయితే అర్ధవీడులో 3 వేలు, కంభంలో 17,300, బేస్తవారిపేటలో 11,200, మార్కాపురంలో 27,700ఎకరాలు, కొనకనమిట్లలో 30 వేలు, తర్లుపాడులో 20 వేలు, హెచ్‌ఎంపాడులో 39,400, కనిగిరిలో 9,900, పొదిలిలో 5,200, కురిచేడులో 6 వేలు, దొనకొండలో 17 వేలు, పుల్లలచెరువులో 11,500, మర్రిపూడిలో 4,400, పెద్దారవీడులో 21,900, యర్రగొండపాలెంలో 19,800, దోర్నాలలో 6,100, త్రిపురాంతకంలో 32,300, గిద్దలూరులో 10,600, రాచర్లలో 11,500, కొమరోలులో 5,500, పామూరులో 2,300, సీఎస్ పురంలో 24,500, వెలిగండ్లలో 17,600ఎకరాల్లో వెలిగొండ జలాలు పారనున్నాయి.

కడప జిల్లాలో పోరుమామిళ్లలో 9,600, కలసపాడులో 15,400 ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 15,250, వరికుంటపాడులో 20,250, దుత్తలూరులో 20 వేలు, శీతారామపురంలో 7,500, మర్రిపూడిలో 21 వేల ఎకరాలకు వెలిగొండ జలాలు అందనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ ద్వారా 1.70 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ బ్రాంచి కెనాల్ ద్వారా 58,500 ఎకరాలు, రాయవరం కాలువ ద్వారా 48 వేల ఎకరాలు, ఉదయగిరి బ్రాంచి కెనాల్ ద్వారా 52 వేల ఎకరాలు, తీగలేరు కాలువ ద్వారా 62 వేల ఎకరాలు, కాకర్ల కాలువ ద్వారా 9,500 ఎకరాలు, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500, కంభం, గండిపాలెం కింద స్థిరీకరణ ద్వారా 26 వేలు, ఉప రిజర్వాయర్ల ద్వారా 12 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి.

 ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ప్రకటనలకే పరిమితం చేయకుండా నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును జాతీయహోదా కల్పిస్తేనే త్వరితగతిన పూర్తి చేయడానికి వీలు ఉంటుందని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement