సీపీకి రాష్ట్రపతి పోలీసు మెడల్
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావుకు రాష్ట్రపతి పోలీసు మెడల్ (పీఎం) ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రపతి నుంచి ఈ మెడల్ అందుకుంటారు. గతంలో ఆయన ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం), యాంత్రిక్ సురక్ష అవార్డుసహా అనేక రివార్డులు పొందారు. విధి నిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే వెంకటేశ్వరరావు దిగువ స్థాయి సిబ్బందితోస్నేహపూర్వకంగా ఉంటారు. తరచూ వారి సాధకబాధకాలు వింటూ విధి నిర్వహణలో అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారు.
ఇదీ నేపథ్యం..
నూజివీడు సమీపంలోని ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయ కుటుంబంలో 1960లో జన్మించిన ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రాథమిక, మాధ్యమిక విద్యను నూజివీడులో పూర్తిచేశారు. సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన ఆయన ఆర్థికశాస్త్రంలోనూ పట్టభద్రులు. 1989లో ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో ఎస్పీగాను, 2003-04లో డీఐజీ హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. హైదరాబాదులో పలు కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వెంకటేశ్వరరావు ఇటీవలి కాలం వరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) అదనపు డీజీగా పనిచేశారు. ఈ నెల ఆరో తేదీన జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో అదనపు డీజీ హోదాలో రెండోసారి సీపీగా వచ్చారు. రాష్ట్రపతి పోలీసు మెడల్ ప్రకటించడంతో పలువురు అధికారులు సీపీని కలిసి అభినందనలు తెలిపారు.