పోలీస్ ‘పవర్’పై తమ్ముళ్ల ఫిర్యాదు
- మనోళ్లనే లోపలేశారు
- వెంటనే బదిలీ చేయించండి
- సీఎంకు టీడీపీ నేతల ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నో రూల్స్.. నో లా అండ్ ఆర్డర్.. మేం చెప్పిందే జరగాలన్నట్టు పేట్రేగిపోతున్న టీడీపీ నాయకులు తమ మాట వినడం లేదంటూ జిల్లాలోని ఓ పోలీసు అధికారిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. టీడీపీ నేత, తణుకు మాజీ ఎమ్మెల్యే ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా నేతలకు, ప్రజాప్రతి నిధులకు విందు ఇచ్చారు. దాదాపు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతి నిధులంతా విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఓ పోలీసు అధికారి పనితీరు చర్చకు వచ్చింది. ముక్కుసూటిగా వెళ్తున్న ఆ అధికారి వ్యవహార శైలితో టీడీపీ వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారని తెగ బాధపడిపోయిన సదరు నేతలు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇదే సందర్భంలో ఏలూరు నగర డెప్యూటీ మేయర్ అరెస్ట్ విషయం ప్రస్తావనకు వచ్చింది.
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి ఒళ్లంతా కత్తితో గాట్లుపెట్టి చిత్రహింసలకు గురిచేసిన కేసులో డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. ఈ కేసునుంచి వెంకటరత్నంను తప్పించాలని ప్రజాప్రతినిధులు పోలీసు అధికారిపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చారు. అందుకు సదరు అధికారి ససేమిరా అనడంతో కనీసం ఆయనపై పెట్టిన సెక్షన్లను తగ్గిం చాలని కోరారు. కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు నిబంధనల ప్రకారమే కేసులు పెట్టి నిందితులను రిమాండ్‌కు పంపారు. దీంతో అహం దెబ్బతిన్న అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జరిగిన విందు సమావేశంలో ఈ ఘటనతోపాటు జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తున్న పోలీసుల వ్యవహారశైలి కూడా చర్చకు వచ్చింది. మొత్తంగా జిల్లాలో పరిస్థితి తమ అదుపులోకి రావాలంటే ఆ పోలీస్ అధికారిని వెంటనే బదిలీ చేయిం చాలని అక్కడికక్కడ నేతలు, ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరుసటి రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడుని కలిసిన సదరు నేతలు ఇదే విషయాన్ని ఆయనకు వివరించినట్టు తెలిసింది. ‘అధికార పార్టీ అని కూడా చూడకుండా మనవాళ్లను లోపల వేశారు. కనీసం మా మాటకు కూడా విలువ ఇవ్వలేదు. ఇలాగైతే పార్టీ క్యాడర్‌కు కష్టాలు తప్పవు’ అని సీఎంకు చెప్పినట్టు సమాచారం.
అన్ని విషయూలు తనకు తెలుసన్న సీఎం ?
మొత్తం విషయూల్ని విన్న చంద్రబాబు జిల్లా నేతలకు, ప్రజాప్రతినిధులకు చిన్నపాటి క్లాస్ ఇచ్చారని అంటున్నారు. ‘అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నాను. అధికారం అండతో ఎలా పడితే అలా వ్యవహరిస్తే ఎట్లా. జాగ్రత్తగా ఉండండి. మీ జిల్లాలోని పరిస్థితులపై అవగాహనతోనే అలాంటి అధికారిని వేశాను. బదిలీ కుదరదు. మీరే జాగ్రత్తగా ఉండండి. పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దు’ అని చంద్రబాబు సున్నితంగా మందలించినట్టు తెలిసింది.
ఇద్దరు ప్రజాప్రతినిధులు మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని ‘అది కాదు సార్..’ అంటూ ఫిర్యాదుల పరంపరను కొనసాగించే ప్రయత్నం చేసినా, సీఎం వారి మాటల్ని వినేం దుకు విముఖత చూపినట్టు సమాచారం. దీంతో చివరకు ‘మీరు ఎలా అంటే అలా సార్. కానీ కనీసం మన వాళ్లను చూసీచూడనట్టు ఉండమని అయినా చెప్పండి’ అని ఒకటికి పదిసార్లు విన్నవించుకోవడంతో ‘సరే.. మీ పని మీరు చేసుకోండి.. నేను మాట్లాడతాను’ అని చంద్రబాబు ముక్తాయింపు ఇవ్వడంతో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.