సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పట్టణంలో సర్వే నెం. 203/4లో గల 11 ఎకరాల ‘ఆల్విన్’ స్థలాన్ని స్థానిక తహశీల్దార్ గోవర్ధన్ తన సిబ్బందితో కలిసి సర్వే జరిపి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పరిశ్రమల స్థాపన కోసం ఆల్విన్ సంస్థకు 1982లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబర్ 203/4లో 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. మార్కెట్ ధరను చెల్లించి భూములను ఆల్విన్ సంస్థ కొనుగోలు చేసినా పారిశ్రామిక అవసరాల కోసమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. పరిశ్రమ ఏర్పాటైనా కొంత కాలానికి మూతబడింది.
ఆ తర్వాత ఆల్విన్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. దీంతో కొనుగోలు చేసిన వారు ఈ 11 ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లను విక్రయించారు. హెచ్‌ఎండీఏ అనుమతి సైతం లభించడంతో అమాయక జనం కొనుగోలు చేశారు. 187 ప్లాట్లలో 15 మాత్రమే అమ్ముడుబోయాయి. దీంతో శనివారం అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా రియల్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. మహేష్ అనే వ్యాపారి మాట్లాడుతూ ప్రభుత్వానికి రూ. 80 లక్షల ట్యాక్స్‌ను చెల్లించి అనుమతి పొందామన్నారు. అయినా అధికారులు భూ మిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా తహశీలార్ గోవర్ధన్ మాట్లాడుతూ పహాణీ తదితర రెవెన్యూ రికార్డుల్లో సైతం ఆల్విన్ సంస్థ పేరును తొలగించి ప్రభుత్వ భూమిగా మార్పు చేర్పులు చేసినట్లు వివరించారు. సెలవులు ముగిసిన తర్వాత ఈ నెల 16న ఆన్‌లైన్ రికార్డుల్లో సైతం మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు శుక్రవారం జిల్లా రిజిస్ట్రార్‌కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు.
ఆల్విన్‌కు కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని సర్వే చేయగా.. అందులో మరో 5 గుంటలను అదనంగా కలుపుకుని వెంచర్లు వేసినట్లు వెలుగు చూసింది. ఈ స్థలం ప్రైవేటుదా ? ప్రభుత్వానిదా ? అన్నది తేలాల్సి ఉంది.
‘ఆల్విన్‘ భూమి స్వాధీనం
Published Sun, Jan 12 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement
Advertisement