వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం | AP Police Officers Association Condemns Varla Ramaiah Comments | Sakshi
Sakshi News home page

వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం

Published Sat, Mar 14 2020 2:21 PM | Last Updated on Sat, Mar 14 2020 2:28 PM

AP Police Officers Association Condemns Varla Ramaiah Comments - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖను కించపరిచే విధంగా అసత్య ఆరోపణలు చేసిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీసులు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా విధులు నిర్వర్తిస్తుంటే వర్ల రామయ్య పోలీసు వ్యవస్థపై అవాస్తవ ఆరోపనలు చేస్తూ, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయే విధంగా, పోలీసుల మనోభావాలు దెబ్బవిధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

‘ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ముందు అందరూ సమానమే. అందులో ప్రత్యేకంగా పోలీసు శాఖకు కోర్టులపై అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. కోర్టులకు సంబంధించిన విషయాల్లో ఒక మాజీ పోలీసు అధికారి అయివుండి, కోర్టులపై మీసాలు తిప్పి, తొడలు కొడుతూ సవాలు విసరడం మీ అజ్ఞానాన్ని అవగహనారాహిత్యాన్ని తెలియజేస్తోంది. సమాజంలో జరిగిన ఏ సంఘటన పై అయినా, సరైనా వివరాలు అవసరమై సందర్భరాల్లో విధినిర్వహణలో భాగంగా అధికారులను కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని కోర్టులు ఆదేశించడం సాధారణం. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కోర్టుల ఆదేశాల మేరకు హాజరై వివరాలు తెలిపారు. అదే విధంగా డీజీపీ కూడా విధినిర్వహణలో భాగంగా, బాధ్యత గల అధికారిగా కోర్టులో హాజరై వారి ఆదేశాలను పాటించడం జరిగింది.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విధినిర్వహణలో సమర్థత, వారి సాహసోపేతమైన నిర్ణయాలు, ప్రత్యేకమైన గుర్తింపు గల అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సుపరిచితమే. వర్ల రామయ్య లాంటి వ్యక్తుల తప్పుడు ప్రకటనలు ఎవరూ నమ్మరు. మాచర్ల ఘటనలో ఐపీసీ 307 ప్రకారం కేసు  నమోదు చేశాము. వెంటనే ముద్దాయిలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచాము. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తే.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కళ్లుండి చూడలేని మీరు ఇకనైనా మీ కళ్లకు పట్టిన పచ్చకామెర్లను వదిలించుకుని వాస్తవాలు తెలుసుకుని అవగహనతో మాట్లాడాలి. పోలీసు వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమాను మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హెచ్చరిస్తోంది’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement