ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో పలువురు ఎన్‌ఎంఆర్‌లు వయసు మీరినా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నారని అధికారులు ఆలస్యంగా తెలుసుకున్నారు. సుమారు 70 మందికి పైగా ఎన్‌ఎంఆర్‌లకు 60 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిని విధుల నుంచి తొలగించాలని, వారి వేతనాలను నిలిపివేయాలని ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు సాగర్ పరిధిలోని ఐదు జిల్లాల ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 24 లోగా తమకు వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. ఎన్‌ఎంఆర్‌ల వయసు 60 సంవత్సరాలు దాటగానే వారిని విధుల నుంచి తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయసు మీరిన తర్వాత కూడా పనిచేస్తున్నారు. ఎన్‌ఎంఆర్‌లు గతంలో కోర్టుకు సమర్పించిన వయసు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా 60 ఏళ్లు దాటిన వారిని తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
అసలేం జరిగిందంటే...
ఎన్నెస్పీ పరిధిలో కాల్వలు తవ్వే సమయంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట్ల కొందరు పనులు చేశారు. ఆ తర్వాత తమను ఎన్‌ఎంఆర్‌లుగా కొనసాగించాలని కోరుతూ వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రింకోర్టుకు కూడా వెళ్లారు. ఆ సమయంలో వారి వయసును కూడా పొందపరుస్తూ కోర్టుకు జాబితా సమర్పించారు. దీనిపై విచారించిన సుప్రింకోర్టు వారిని ఎన్‌ఎంఆర్‌లను కొనసాగించాలంటూ 1987 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 600 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనులు చేస్తూ నెలకు రూ. 8 వేల నుంచి 10 వేల వరకు వేతనం పొందుతున్నారు. కాగా, వీరిలో కొందరు తమను రెగ్యులర్ చేయాలని మళ్లీ కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరికొందరు ప్రభుత్వ ప్రమేయం లేకుండానే అధికారులను పట్టుకొని రెగ్యులర్ చేయించున్నారు.
సమాచార హక్కు చట్టంతో విషయం వెలుగులోకి...
ఎన్నెస్పీలో వయసు మీరిన వారు ఎన్‌ఎంఆర్‌లుగా పని చేస్తున్నారని, వారిని తక్షణం తొలగించాలని, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని మిర్యాలగూడెంకు చెందిన ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు మేల్కొన్న ఎన్నెస్పీ అధికారులు వయసు పైబడిన వారిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో పొందపరిచిన వయసు వివరాలను మరుగున పెట్టిన పలువురు ఎన్‌ఎంఆర్‌లు.. రేషన్‌కార్డులు, ఓటర్ గుర్తింపు, ఆధార్ కార్డులలో నమోదైన వయస్సును చూపిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టుకు సమర్పించిన జాబితాలో పేర్కొన్న వయస్సుకు, ఈ కార్డులలో ఉన్న వయస్సుకు నాలుగు, ఐదు సంవత్సరాల తేడా ఉంది. దీంతో ఎన్నెస్పీ ఉన్నతాధికారులు ఎన్‌ఎంఆర్‌లు కోర్టుకు సమర్పించిన వయసును పరిగణలోకి తీసుకుని, దాని ఆధారంగా 60 ఏళ్లు పైబడిన వారిని ఇంటికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తప్పుడు పత్రాలతో ఇప్పటి వరకు వేతనాలు తీసుకున్న వారిపై పోలీసు కేసులు పెట్టి అదనంగా పొందిన వేతనాలు రికవరీ చేస్తారా.. లేక శాఖాపరమైన విచారణ చేసి ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కాగా, ఎన్‌ఎంఆర్‌లలో వయసు మీరిన వారితో పాటు పలువురు బినామీలు కూడా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారి పేరున ఇతరులు, ఒకరిపేరున మరొకరు కూడా విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు...
తప్పుడు పత్రాలతో విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎంఆర్‌లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలుంటాయని ఒక అధికారి చెప్పారు. వేతనాలు రికవరీ చేయడమా.. పోలీస్ కేసులు పెట్టడమా అనేది ఉన్నతాధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఖమ్మం మానిటరింగ్ పరిధిలో 30 మంది ఎన్‌ఎంఆర్‌లు ఉండగా, అందులో ముగ్గురు వయసు మీరిన వారు ఉన్నారని, వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు.
వయసు మీరినా విధులు !
Published Wed, Jan 22 2014 2:48 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement