సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, ఆర్టీసీ కార్మికులు, అన్ని వర్గాల ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
వీరికి విద్యుత్ ఉద్యోగులు తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. సమైక్య రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలనైనా భరిస్తామని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పలుచోట్ల బ్యాంకులను దిగ్బంధనంచేసి ఉద్యోగులను బయటికి పంపి మూసి వేయించారు.
కడప నగరంలో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వందలాది మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రైవేటు వృత్తి కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది రిలే దీక్షలు చేస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు.
శనివారం రింగ్‌రోడ్డులో చేపట్టాల్సిన మానవహారాన్ని వర్షాల నేపధ్యంలో ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, విద్యుత్, ప్రొఫెషనల్ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కడపలో ఆకాశవాణి. పీఎఫ్, టెలికాం ఎక్స్ఛేంజ్, పోస్టాఫీసును సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు దిగ్బంధనం చేసి మూసి వేయించారు.
జమ్మలమడుగులో సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్య సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే ఆది ఎమ్మెల్సీ దేవగుడి సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగు మండలంలోని గడికోట, బొమ్మేపల్లెలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆర్టీపీపీ ఉద్యోగులు గేటు బయట బైఠాయించి నిరసన తెలియజేశారు. వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. సీఈతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
పులివెందులలో విద్యుత్ సిబ్బంది, ఉపాధ్యాయులు భారీర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయలో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.
బద్వేలులో గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. గోపవరం మండలంలోని 20 గ్రామాల్లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది.
పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు చిత్తా ప్రతాప్‌రెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి నేతృత్వంలో చల్లగిరిగెల గ్రామానికి చెందిన కొండా వెంకట రమణారెడ్డి, రమణారెడ్డిలతోపాటు 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేతలు మలిశెట్టి శ్రీనివాసులుగౌడ్, శవనం వెంకటేశ్వరనాయుడు ఆధ్వర్యంలో శవనగారిపల్లె, కొల్లావారిపల్లెకు చెందిన 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి సంఘీభావం తెలిపారు. శనివారం లక్ష మందితో రాజంపేట ప్రభుత్వ క్రీడా మైదానంలో సమైక్య రణభేరి సభను నిర్వహిస్తున్నారు.
రాయచోటి పట్టణంలో ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు వెనక్కి నడుస్తూ తమ నిరసనను తెలిపారు. పెడమడ గ్రామస్తులు, న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరు పట్టణంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలియజేశారు. ర్యాలీ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు.
మైదుకూరులో వస్త్ర దుకాణాల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. వంద మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. వీరికి ఉపాధ్యాయులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి.
ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో 29వ వార్డుకు చెందిన మహిళలు బోగా లక్ష్మినారాయణమ్మ ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షలు చేపట్టారు.
అదే హోరు
Published Sat, Sep 14 2013 3:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement