వాగు ఉధృతికి కూలిపోయిన బైనేరు వంతెన
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం : ఓపిక ఉన్నంత వరకు నిలబడ్డాను. మీ సేవలో తరించాను. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లేందుకు మీకు అడ్డుగా ఉన్న బైనేరు వాగుపై నేను వారధినై నిలిచా. వయసు మీద పడుతున్నా మీ సేవే నా భాగ్యం అనుకుంటూ ఇన్నేళ్ళు తరించా. వయసుడిగి పోయింది. ఆటుపోట్లకు తట్టుకోలేక మొన్ననే నేలకొరిగిపోయాను. ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా. మీ అందరికీ తెలిసిన దానినే. అదే మీ బైనేరు బ్రిడ్జినండీ.. ఆత్మఘోష చెప్పుకుంటే నా మనసు కుదుటపడుతుంది. అందుకే చెబుతున్నా.
1913లో నా జీవన ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి బ్రిటీష్ కాలంలో నన్ను (బ్రిడ్జి) నిర్మించారు. బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇంజినీర్లు ఈబీ ఎల్విన్ ఇష్క్, వీటీ జాన్‌లు కొవ్వూరు నుంచి పోలవరం వరకు గోదావరి గట్టు నిర్మించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం గ్రామాలను కలిపేందుకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ సర్వే నెంబర్ 250లో నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. గ్రేట్ బ్రిటన్ (స్కాట్‌లాండ్)లోని ఐనార్క్ స్టీల్ కంపెనీ తయారుచేసిన స్టీల్ గడ్డర్లను ఇక్కడకు తీసుకువచ్చి బైనేరు వాగుపై ఎటువంటి స్తంభాలు లేకుండా స్టీల్ గడ్డర్ బ్రిడ్జిగానే నన్ను నిర్మించారు. నా పొడవు 39 మీటర్లు, వెడల్పు 12 అడుగులండి. 105 ఏళ్ల పాటు కోట్లాది వాహనాలకు, ప్రయాణికులకు ఎన్నో సేవలందించాను.
మొదట్లో నేను చాలా పటిష్టంగా ఉండేదానిని. రాను రాను వయసు మీద పడటంతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాను. అనారోగ్యానికి (మరమ్మతులు) గురైనప్పటి నుంచి వైద్యం చేయించాలని ఎన్నోసార్లు అధికారులను కోరాను. అధికారులు కూడా నాకు వైద్యం (రిపేర్లు) చేయించడం కోసం ప్రతిపాదనలు పంపారు. పనులు చేపడుతామని చెప్పడమే తప్పండి, కనీసం నన్ను పట్టించుకోలేదు. భారీ వాహనాలు, ఎత్తయిన వాహనాలు తగిలి నా తల(స్టీల్ గడ్డర్లు) పై భాగంలో గాయాలు(విరిగినా) తగిలినా చూసీచూడనట్లు వదిలేశారు. నా కాళ్ల కింది నేల బైనేరు వాగు వరద తాకిడికి కోతకు గురైనా.. నా ఉనికికి ప్రమాదం వస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయను ఎంతకాలం నిలబడి సేవలందించగలను. మొన్నొచ్చిన బైనేరు వరదను నా శక్తి మేరకు తట్టుకున్నా. కొద్ది కొద్దిగా నా బలాన్ని పిండేస్తుంటే ఓపిక లేక ఓడిపోయి ఒరిగిపోయాను. ఇక సెలవు..
Comments
Please login to add a commentAdd a comment