పాములుంటాయ్.. జాగ్రత్త!
- ప్రభుత్వాస్పత్రుల్లో ‘యాంటీ స్నేక్ వీనం’ కొరత
- 20 రోజుల్లో 9 మంది మృత్యువాత
- తాజాగా ఉరవకొండలో అక్కాతమ్ముడి మృతి
అనంతపురం మెడికల్ : ఉరవకొండ మండలం వెలిగొండకు చెందిన చిన్నారులు హేమవతి, గిరీష్, హర్షిత ఆదివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందారు. పాము కాటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హర్షిత ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. కేవలం ఈ ఇద్దరు చిన్నారుల పరిస్థితితే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లాలో రోజు రోజుకూ పాముకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప నివారణ మార్గాలు వెతకడం లేదు. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుతున్నాయా? లేదా? ఎంత వరకూ వినియోగిస్తున్నారు? అనే వాటిపై పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా పాముకాటుతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రి, హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు గుంతకల్లు, హిందూపురం, గుత్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర ఏరియా ఆస్పత్రులు, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి.
పాముకాటుకు సంబంధించి ‘యాంటీ స్నేక్ వీనం’ మందు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేదు. కొన్ని చోట్ల ఉన్నా పాముకాటు బాధితులు ఆస్పత్రులకు వచ్చీరాగానే ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అక్కడికి చేరుకునేలోగా ప్రాణాలు కోల్పోతున్నారు. 20 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆస్పత్రుల్లో మందులు ఉంటాయన్న విషయం కూడా చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. దీంతో బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
సర్వజనాస్పత్రే దిక్కు : రెండేళ్లలో 741 మంది పాముకాటుకు గురై అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే వారి సంఖ్య రెండింతలు ఉంటోంది. 2013-14లో 361 మంది.. 2014-15లో 380 మంది అనంతపురం ప్రభుత్వాస్పతికి వచ్చారు. ఈ ఏడాది ఇప్పటికే 220 మంది పాముకాటుకు గురై వచ్చారు. కాగా వర్షాకాలం ప్రారంభమైనప్పుడు (జూన్, జూలై, ఆగస్టు నెలల్లో) 2013-14లో 86 మంది, 2014-15లో 105 మంది పాము కాటుకు గురయ్యారు.
20 రోజుల్లో 9 మంది మృత్యువాత
20 రోజుల్లో 9 మంది పాముకాటుతో మృతి చెందారు. మృతుల వివరాలు:
ఇద్దరు పాము కాటుకు గురి
అనంతపురం క్రైం: శింగనమల మండలం చీలేపల్లికి చెందిన సూర్యప్రకాశ్(70), ఆయన మనవడు ఏవేశ్వర్ (13) సోమవారం తెల్లవారు జామున పాము కాటుకు గురయ్యారు. తాతా మనవడు రాత్రి కలిసి పడుకున్నారు. తెల్లవారుజామున ఇరువురు పాము కాటుకు గురయ్యారు. బంధువులు వారిని వైద్య చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సూర్యప్రకాశ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.