మావాళ్లే దొరికారా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
కుర్రాడు బర్త్ డే అని తన స్నేహితులతో సరదాగా అలా షికారు చేస్తే పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారే. రెండు కార్లు, ఐదారు బైకులతో బయటికి వస్తే ర్యాలీ అని పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. రూల్స్ అడ్డంగా ఉల్లంఘించాడని గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను పుట్టినరోజు చేసుకోవడం పాపమా, బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం నేరమా. ఎమ్మేల్యే కొడుకు జన్మదిన వేడుకలు 'గ్రాండ్'గా చేసుకుంటే ఇంత రచ్చ చేస్తారా?
మా చిన్నోడు పుట్టినరోజు నాడు ఫ్రెండ్స్ తో రెండు కార్లు, బైకులతో అరకిలోమీటర్ రోడ్డుపై అలా వెళ్లాడో, లేదో ర్యాలీ అంటూ రాద్ధాంతం చేసేస్తున్నారు. మావాడి స్నేహితులు కార్లు పట్టుకుని వేలాడుతూ, చేతులు బయటకు పెట్టి కేకలు, ఈలలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారే కానీ ఎవరనీ ఇబ్బంది పెట్టలేదే. చిన్నపిల్లలు బైకుల సెలైన్సర్లు తొలగించి సరదా చేస్తే అల్లరి అంటారా. వాడు నా బిడ్డ. పొరపాటు చేస్తాడేమో గానీ నేరం మాత్రం చేయడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినంత మాత్రానా ఏదో పెద్ద నేరం చేసినట్టు యాగీ చేయడం కరెక్టు కాదు. రోజూ రోడ్డుపై రాంగ్ రైడింగ్ చేస్తున్న వేలాది మందిని వారిని వదిలేసి నా సుపుత్రుడి వెంట పడడం సమంజసం కాదని సభా ముఖంగా తెలియజేసుకుంటున్నా.
ఆ మధ్యన ఇలాగే హంగామా చేశారు. సరదాకి మా పెద్దోడు బైకు రేసింగ్ ఆడితే సునామీ వచ్చినంత హడావుడి చేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారని ఇష్టమొచ్చినట్టు రాసిపారేశారు. రేసును షూట్ చేయొద్దని మీడియా ప్రతినిధులకు సర్దిచెబితే దౌర్జన్యం చేశాడని ఇంతలంతలుగా వర్ణించారు. ఆమాట కొస్తే రుబాబు చేయని 'అధికార సుపుత్రులు' ఏపీలో ఒక్కరైనా ఉన్నారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అలాంటోళ్లందరినీ పెద్దగా పట్టించుకోకుండా మా పుత్రరత్నాల వెంట పడడం భావ్యమా?
మొన్నామధ్య రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి చనిపోతే మా సిద్ధు కారణమంటూ అకారణంగా కేసు పెట్టారు. సొంత కారులో కోర్టుకు తీసుకెళ్లి బెయిల్ ఇప్పించగలిగాను కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మావాడు ఎంతో ఇబ్బంది పడేవాడో. నేను సెంట్రల్ ఎమ్మెల్యే కావడం వల్లే మావాళ్లను 'సెంటర్' చేసినట్టు కనబడుతోంది. ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి నిభాయించుకుంటున్నాం కానీ లేకపోతే నా బిడ్డలను ఎప్పుడో జైలు పాల్జేసెవారు. మళ్లీ చెప్తున్నా మావాళ్లు పొరపాటులే చేస్తారు. నిజంగా నేరాలు చేయరు.