వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు | CC Cameras To Be Installed At Village Secretary Examination Centers | Sakshi
Sakshi News home page

వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

Published Fri, Aug 16 2019 9:47 AM | Last Updated on Fri, Aug 16 2019 9:47 AM

CC Cameras To Be Installed At Village Secretary Examination Centers - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎలాంటి ప్రభుత్వ సేవలైనా గ్రామం నుంచే పొందేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ సచివాలయాలు ప్రారంభమైతే రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, వైద్యం, మత్స్యశాఖ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలకు చెందిన సేవలు ఒకేచోట అందనున్నాయి. జిల్లాలో గ్రామ సచివాలయాలు 933, వార్డు సచివాలయాలు 511 కలిసి 11,025 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటికి 1.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాయనుండడంతో ఆరు రోజుల పాటు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1, 3, 4, 6, 7, 8 వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు నిర్వహించనుంది. 

మండలానికి దగ్గరలోనే పరీక్ష కేంద్రం
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కేంద్రాల చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ, జూనియర్‌ కళాశాలతో పాటు వివిధ పాఠశాలలను కేంద్రాలుగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 380 కేంద్రాలను అధికారులు గుర్తించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా సొంత మండలాల్లో పరీక్ష రాసే అవకాశం లేదు. ప్రతి అభ్యర్థికి తనకు దగ్గరలో ఉన్న మండలాన్ని గుర్తించి అక్కడే పరీక్ష రాసేలా హాల్‌ టికెట్‌ కేటాయించనున్నారు.

గూగుల్‌లో లింక్‌..
సొంత మండలాల్లో పరీక్ష రాసేందుకు అవకాశం లేకపోవడంతో పరీక్ష కేంద్రం చిరునామా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతీ పరీక్ష కేంద్రాన్ని ఆన్‌లైన్‌ చేస్తున్నారు. అభ్యర్థి తాను పరీక్ష రాయనున్న కేంద్రం పేరు గూగుల్‌లో నమోదు చేస్తే చిరునామాతో పాటు కేంద్రానికి ఎలా చేరుకోవాలో గూగుల్‌ మ్యాప్‌లో చూపించేలా లింక్‌ దొరుకుతుంది. దీంతో పరీక్షకు నిర్ణీత సమయంలో చేరుకోవడంతో పాటు, సమయం కలిసొస్తుంది.

ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు
భారీ ఎత్తున నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. కెమెరాలు అందుబాటులో లేని పక్షంలో వీడియోగ్రాఫర్ల సహాయంతో పరీక్షలను వీడియో తీయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమించే అవకాశం ఉంది.

ప్రలోభాలకు తావులేదు..!
గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన ఖాళీలన్నీ భర్తీ చేస్తుండడాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక్కో జాబుకు ఒక్కో మొత్తాన్ని ముట్టజెప్పితే ఉద్యోగం ఇప్తిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్‌ సీట్లు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల వద్ద పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. డబ్బులిస్తే ఉద్యోగం ఇస్తామని చెబితే నమ్మొద్దని, అలాంటి వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా పరిగణించి రూ.15 వేలు అందజేయనున్నారు. ఆ తర్వాత శాశ్వత వేతన స్కేలును ప్రభుత్వం వర్తింపజేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement