‘ప్యాకేజీ’ నిధులు కేంద్రం ఇవ్వడం లేదు: సీఎం
సాక్షి, అమరావతి: ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల (సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్)కు 90 శాతం వాటా నిధుల రూపంలోనూ, విదేశీ రుణంతో చేపట్టే పథకాల (ఈఏపీ)కు రాయితీ రూపంలోనూ గత మూడేళ్ల నుంచి కేంద్రం రూ.13 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లను రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉందన్నారు. నిధులు రాబట్టుకునేందుకు కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. ఎలాగోలా నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టుల పనులు చేస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సీఎం గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు 300 మిలియన్ డాలర్లను రుణంగా ఇచ్చేందుకు అంగీకరించిందని.. వివిధ సంస్థల ద్వారా తక్కువ వడ్డీకి రుణం సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు, ప్రభుత్వ భవనాలు, కాలేజీలు, స్టార్ హోటళ్లకు కేటాయించగా కొంత భూమి మిగులుతుందని.. ఆ భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం కోసం చేసిన అప్పులను తీర్చుతామని వివరించారు.
హోదా కన్నా ప్యాకేజీయే మిన్న అన్న సీఎం...
ప్రత్యేక హోదా వల్ల రాష్రానికి ఎటువంటి ఆర్థిక ప్రయోజనం కలగదని, ప్రత్యేక ప్యాకేజీతో రూ.లక్షల కోట్లు ఇన్ని రోజులు చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించిన ఏడాది పూర్తయిన తరువాత ప్యాకేజీ కింద ఇప్పటివరకు పైసా రాలేదంటూ నిట్టూర్పులు చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సాయం చేస్తానన్నారని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఏడాది దాటినా దాని కింద కేంద్రం నుంచి రూపాయి రాలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విలేకరులతో చెప్పడం గమనార్హం.