నిండా అప్పు.. వడ్డీల ముప్పు
సాక్షి, ఏలూరు : రైతులు గత సీజన్‌లో తీసుకున్న పంట రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. కొత్త రుణాలు వచ్చేంత వరకూ ఖరీఫ్ పనులు ఆగవు. కనీసం విత్తనాలు, కూలీలు, ట్రాక్టర్లకు చెల్లించడానికైనా సొమ్ములు కావాలి. దీంతో రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. ఇందుకోసం ఇంట్లో మిగిలివున్న కొద్దిపాటి బంగారాన్ని సైతం తాకట్టు పెడుతున్నారు. కౌలు రైతులైతే భూ యజమానులు, ధాన్యం వ్యాపారుల నుంచి అడ్వాన్సులు తీసుకుని వ్యవసాయ ఖర్చులకు వినియోగిస్తున్నారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట రుణాలు, బంగారం తాకట్టుపై రుణాలు తీసుకున్నవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. క్రాప్‌లోన్లు సగానికి పడిపోయాయి. శుభకార్యాల సందర్భంలో ధరించడానికి ఇంట్లో ఉంచిన కాస్త బంగారాన్ని కూడా రైతులు తాకట్టు పెట్టేయాల్సిన దుస్థితి వచ్చింది. పాత బకాయిలు లేని రైతులు మాత్రమే బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకుంటున్నారు.
భారీ వడ్డీలు
ప్రైవేటు వ్యక్తుల నుంచి నెలకు నూటికి రూ.2నుంచి రూ.3 చొప్పున వడ్డీ చెల్లించే విధంగా ప్రామిసరీ నోటు రాసి అప్పు తీసుకుంటున్నారు. ఒక్కో రైతు కనీసం రూ.50 వేలు తక్కువ కాకుండా అప్పులు తెస్తున్నారు. కొందరు బంగారం తాకట్టు పెట్టి ప్రైవేటు అప్పులు తీసుకుంటున్నారు. కొందరైతే వ్యాపారుల నుంచి ఎరువులు, పురుగు మందుల్ని వడ్డీ చెల్లించే పద్ధతిపై అరువు తీసుకుంటున్నారు. పంట చేతికందిన తర్వాత ఆ అప్పును వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. కొందరు మిల్లర్లు, ధాన్యం కమిషన్ వ్యాపారులతో పంట వారికే ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ తీసుకుంటున్నారు. కౌలు రైతులకు పొలం యజమాని కొంత సొమ్ము అప్పుగా ఇస్తున్నారు. పంట అమ్మాక కౌలుతోపాటు ఈ అప్పును జమ చేసుకుంటారు.
మిగిలేది సున్నా
ప్రైవేటు వ్యక్తులు, భూ యజమానులు, మిల్లర్లు, ధాన్యం కమిషన్ వ్యాపారులు, ఎరువుల వ్యాపారుల నుంచి వడ్డీలకు అప్పు తెస్తున్న రైతులు పంటపై వచ్చే మొత్తం సొమ్మును వారికి సమర్పిస్తే తప్ప అప్పు తీరే పరిస్థితి లేదు. ఇదైనా పంట బాగా పండితేనే. పంట నష్టపోతే అప్పులు కాదు కదా కనీసం వడ్డీ కట్టే పరిస్థితి కూడా రైతులకు ఉండదు. ఇప్పటికే నిండా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వ్యవసాయం చేయడం మానేస్తే ఊళ్లో పైసా కూడా అప్పు పుట్టదనే ఉద్దేశంతో ఖరీఫ్ సాగు చేపడుతున్నారు. ఒకవేళ పంట బాగా పండినా మరోసారి అప్పుల ఊబిలో చిక్కుకుపోక తప్పదని ఆందోళ చెందుతున్నారు.
బంగారం తాకట్టు పెట్టా
ఏడున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. గతంలో ఎల్‌ఈసీ కార్డుపై రూ.50 వేల రుణం వచ్చింది. రుణమాఫీ ఇంకా అమలుకాకపోవటంతో కొత్త అప్పు రాలేదు. కొత్త అప్పు వచ్చే వరకూ కూర్చుంటే ఊడ్పులు అయ్యేలా లేవు. దీంతో నా భార్య, పిల్లల బంగారం కలిసి 4కాసులు ఉంటే తాకట్టు పెట్టాను. నూటికి నెలకు రూ.3 వడ్డీ చెల్లించేలా రూ.50 వేలు తెచ్చి వరినాట్లు వేస్తున్నా. రుణమాఫీ చేసి కొత్త రుణం తొందరగా ఇవ్వకపోతే రెండో కోటా ఎరువులు కూడా వేయలేని పరిస్థితి వస్తుంది.
-సానబోయిన రామకృష్ణ, కౌలురైతు, త ణుకు
రూ.50 వేలు అప్పు తెచ్చా
బ్యాంకు అధికారులు బాకీ చెల్లించకపోతే రుణం ఇవ్వనన్నారు. దీంతో నాట్లు వేయడానికి అదునుదాటిపోతోందని భయపడి గత్యంతరం లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారి నుంచి రూ.50 వేల అప్పు తెచ్చాను. నూటికి రెండున్నర రూపాయల చొప్పున ప్రతినెలా వడ్డీ కట్టాలి. నాకు బ్యాంకులో రూ.30 వేల బకాయి ఉంది. రుణమాఫీ అయ్యి, బ్యాంకు కొత్తరుణం ఇస్తేగాని బయటినుంచి తెచ్చిన అప్పు తీరే పరిస్థితి లేదు. రుణమాఫీ సకాలంలో కాకుంటే అంతే సంగతులు. ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నాం.
-గోల్కొండ ముత్యాలరావు, రైతు, చింతలపూడి