జిల్లాకు పర్యటక శోభ
జిల్లాలో ఓ వైపు నాగార్జున సాగర్ అందాలు.. మరో వైపు సూర్యలంకలో కడలి అలల సవ్వడులు.. నిత్యం పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. పంచారామాల్లో ఒకటైన అమరారామం ఆధ్యాత్మిక సుమాలు పూయిస్తోంది. సాగర్, అమరావతిలోని మ్యూజియాలు బౌద్ధల చరిత్రకు దర్పణంగా నిలుస్తున్నాయి. కొండవీడుకోట చారిత్రక విశిష్టతను తెలుపుతోంది. వీటన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది పూర్తయితే జిల్లా పర్యాటక రంగంలో ముందంజలో ఉంటుంది.
పర్యాటక కేంద్రంగా గుంటూరు జిల్లా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఐదు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు అంచనాలు టూరిజం అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
సాక్షి, గుంటూరు
జిల్లాలోనే రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక రంగానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకొన్న ప్రాంతాలను పర్యాటక శాఖ ద్వారా ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇటీవలే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై పలువురి అభిప్రాయాలను తెలుసుకొన్నారు.
జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకొన్న ప్రాంతాలను టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి యాంత్రికులకు బస్సు సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ భోజనం, వసతి ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం గుత్తి కొండ బిలం-పిడుగురాళ్ల-కొండవీటి ఫోర్ట్-కోటప్పకొండ దేవాలయం కలిపి ఓ సర్క్యూట్‌గా రూ.8 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు అంచనాలను సైతం రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. తాత్కాలికంగా నాగార్జున సాగర్ సర్క్యూట్ అభివృద్ధికి రూ.50 లక్షలతో ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు.
కొత్తగా రూపొందిస్తున్న ప్రాజెక్టులు ఇవే
జిల్లాలో ప్యాకేజీ టూర్ కింద ఐదు భాగాలుగా అబివృద్ధి చేయాలని అధికారులు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేశారు. బుద్ధిస్ట్ సర్క్యూట్, పంచారామా టెంపుల్స్ సర్క్యూట్, పల్నాడు సర్క్యూట్, రివర్ సర్క్యూట్, కోస్టల్ లైను సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.