వెంటాడి వేటాడి | chase and firing incident shocks locals in krishna district | Sakshi
Sakshi News home page

వెంటాడి వేటాడి

Published Thu, Sep 25 2014 2:12 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

వెంటాడి వేటాడి - Sakshi

వెంటాడి వేటాడి

కృష్ణా జిల్లాలో కలకలం రేపిన పెదఅవుటపల్లి ఘటన
కారును ఓవర్‌టేక్ చేసి అడ్డగించి అగంతకుల కాల్పులు
ఇద్దరు అక్కడికక్కడే... మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
జంక్షన్‌లో కారు వదిలిపెట్టి నిందితులు పరారీ

గన్నవరం : ఉంగుటూరు మండలం పెదావుటపల్లి సమీపంలో కారులో వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని ఆగంతకులు మరో కారుతో అడ్డగించి పిస్టళ్లతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో పాటు ఇరువురు కుమారులు మృతి చెందారు. ప్రశాంతంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు సినీఫక్కీలో ఓ ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి హత్యలకు పాల్పడడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.


పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పిస్టళ్లతో కాల్పులకు పాల్పడిన నిందితులు మాఫియా సంబంధాలు కలిగిన ముంబైకి చెందిన నిష్ణాతులైన షూటర్‌లై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు(70), ఆయన కుమారులు మారయ్య(40), పగిడి మారయ్య(32)గా పోలీసులు నిర్ధారించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏలూరులో జరిగిన దుర్గారావు హత్య కేసులో వీరు ప్రధాన నిందితులు. ఈ కేసులో కండీషన్ బెయిల్ పొంది మారయ్య, పగిడి మారయ్య  ముంబైలో ఉంటున్నారు.
 
పక్కా ప్లాన్ ప్రకారం...

కోర్టు వాయిదా నిమిత్తం ఇరువురు సోదరులు ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు తండ్రి నాగేశ్వరరావు తీసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కారులో వీరంతా ఏలూరుకు బయలు దేరారు. ఇది గమనించిన అగంతకులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కారులో కొంతదూరం వెంబడించి, పెదావుటపల్లి సమీపంలో వీరి కారును ఓవర్‌టేక్ చేసి అడ్డుపెట్టి... నిమిషాల వ్యవధిలోనే కారు అద్దాలు  పగులకొట్టి వెనుక సీట్లో కూర్చున్న నాగేశ్వరరావుతో పాటు ఇరువురు కుమారులపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

పాయింట్ బ్లాంక్‌లో తలపై కాల్చడంతో నాగేశ్వరరావుతో పాటు మారయ్య అక్కడికక్కడే మృతిచెందగా, పగిడి మారయ్య మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితులు ముంబైకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. గతంలో నెలకొన్న పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు వీరిని కాల్చేందుకు నిష్ణాతులైన షూటర్లను తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

నగర పోలీసు కమిషనరేట్‌లో కిరాయి హంతకుల కాల్పుల్లో ముగ్గురు హత్యకు గురికావడంపై పోలీసు యంత్రాంగం కదిలింది. చినఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ కళాశాలలో జరగనున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీ ఏబీ వెంకటేశ్వరరావు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెప్యూటీ పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ క్రైం ఎం.నాగేశ్వరరావు, ఎసీపీలు గుణ్ణం రామకృష్ణ, ఉమామహేశ్వరరాజు, కమిషనరేట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకొని కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా  విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement