పిల్లల చదువుల కోసం కొందరు..బిడ్డల పెళ్లిళ్లు చేయాలని మరికొందరు..బంగారు నగలు చేయించుకోవాలని ఇంకొందరు.. ఇలా ఎవరికి వారే పొదుపు చేసుకుంటున్న సొమ్మంతా చీటీల నిర్వాహకుల చేతుల్లో పెట్టి మోసపోతున్నారు. నమ్మకమే పెట్టుబడిగా అక్రమ వ్యాపారం చేపట్టిన చీటీల నిర్వాహకులు లక్షల రూపాయలు వసూలు చేసి నమ్మినోళ్లకు శఠగోపం పెడుతున్నారు. ఈ మోసగాళ్లకు ఐపీ చట్టం వరంగా మారింది. జిల్లాలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో బాధితుల జాబితా చేంతాడులా పెరుగుతోంది.
నెల్లూరు(క్రైమ్): చీటీల పేరుతో జిల్లాలో ఆర్థిక నేరాలు ఎక్కువైపోతున్నాయి. నిరుపేదల కష్టార్జితాన్ని సులభంగా కాజేసేందుకు కొందరు ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. పగలనకా, రేయనక కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బును చీటీల పేరుతో పోగేసుకుని దోచుకుంటున్నారు. భారీ ఎత్తున నగదు సేకరించాక ఐపీ ఆయుధం ఉపయోగించి దర్జాగా తప్పించుకుంటున్నారు. వివిధ అవసరాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ శాతం మంది ప్రజలు చీటీల ద్వారా సంపాదనను పొదుపు చేసుకుంటారు. ప్రధానంగా పిల్లల పెళ్లిళ్లు, చదువులు, గృహ నిర్మాణం తదితర అవసరాలకు చీటీలు వేసుకుంటారు. సంపాదనలో కొంత మొత్తాన్ని వారం, నెలవారీ చీటీల ద్వారా పొదుపు చేసుకుంటారు.
చీటీ పాడగా వచ్చిన మొత్తాన్ని ఏదో ఒక అవసరానికి ఉపయోగించుకుంటారు. కార్పొరేట్ సంస్థల్లో చీటీలు కట్టి పాడుకోవడానికి సవాలక్ష నిబంధనలు అడ్డుగా ఉండడంతో ఎక్కువ శాతం మంది స్థానికంగా చీటీ పాటలు నిర్వహించే వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక్కో వ్యాపారి తన స్థాయిని బట్టి రూ. 10 వేల నుంచి రూ.10 లక్షల వరకు చీటీ నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యాపారులు జిల్లాలో వేలాది మంది ఉన్నారు. కొందరు వ్యాపారులైతే చీటీ పాడిన వారికి డబ్బు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశచూపి తమ వద్దే ఉంచేసుకుంటున్నారు. ఇలా భారీ మొత్తంలో నగదు కూడబెట్టుకున్నాక ఐపీ (ఇన్‌సాల్వెన్సీ పిటీషన్) పెట్టి తప్పించుకుంటున్నారు.
నిబంధనలు గాలికి: చీటీల నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎవరైనా సరే చీటీలు నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత పత్రాలను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ నిబంధనను పాటిస్తున్న వారి సంఖ్య వేళ్ల మీదే లెక్కించుకోవచ్చు.
ఎక్కువ శాతం మంది అనధికారికంగానే వ్యాపారం నిర్వహిస్తుండడంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారు. సంపాదనంతా పోగొట్టుకున్న వారిలో కొందరు ఆత్మహత్యకు కూడా తెగబడుతున్నారు. చీటీల నిర్వాహకులపై ప్రభుత్వ పర్యవేక్షణ, నిఘా కొరవడడంతోనే వేలాది మంది మోసపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ప్రజలు కూడా తమ నగదును బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకోవడం ఉత్తమం.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు
నెల్లూరులోని డైకస్‌రోడ్డు సెంటర్‌లో ఓ వ్యక్తి చీటీల పేరుతో ప్రజల నుంచి సుమారు రూ. కోటి వసూలు చేసి ఉడాయించాడు.
సంజయ్‌గాంధీనగర్‌లో చీటీల కారణంగా నష్టపోయిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
ఎన్టీఆర్ నగర్‌లో ఓ మహిళ చీటీల వ్యాపారంతో లక్షలు కాజేసింది. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దిగొచ్చిన ఆ మహిళ కుటుంబసభ్యులు సొత్తును తిరిగి చెల్లించారు.
గాయత్రినగర్‌కు చెందిన భవాని చుట్టుపక్కల వారితో నమ్మకంగా మెలుగుతూ చీటీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసింది. తర్వాత కుటుంబంతో సహా రాత్రికి రాత్రే ఉడాయించింది.
నిప్పో సెంటర్‌లో ఓ కార్ల కంపెనీ నిర్వాహకుడు ఐపీ పెట్టేందుకు యత్నించగా స్థానికులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏకెనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో సుధా పరమిళ ఆటోగ్యారేజ్ నిర్వాహకుడు చీట్లు, అప్పులు చేసి రూ. 80లక్షలతో ఉడాయించారు. ఈ మేరకు బాధితులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదుచేశారు.
శివాజినగర్‌కు చెందిన విజయమ్మ చీటీల పేరుతో రూ. 60 లక్షలు వరకు వసూలు చేసింది. రాత్రికి రాత్రే కుటుంబసభ్యులతో ఉడాయించే ప్రయత్నం చేయగా బాధితులు ఆమెను పోలీసులకు అప్పగించారు.
చీటింగ్
Published Sun, Jul 27 2014 2:29 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement