గోదావరి విహారం ఎంత ఆనందం కలిగిస్తుందో.. పరిస్థితి విషమిస్తే అంతలోనే విషాదం మిగులుస్తుంది. దీనికి నిస్సందేహంగా ఒక నిర్దిష్ట పర్యాటక విధివిధానాలు లేకపోవడమే కారణం. అందుకే పుట్టగొడుగుల్లా టూరిజం ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ లేని సురంగుల సారథ్యంలో లైసెన్సులు లేని బోట్లు తిప్పుతూ.. పర్యాటకుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల పర్యాటక ప్రాంతాల్లో బోట్ల నిర్వహణను నియంత్రించాలని తలంచింది. దీనికోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందించింది.
జంగారెడ్డిగూడెం: నదీ పర్యాటకానికి సురక్షిత ప్రయాణమే ఆయువు పట్టు. ఇటీవల చోటు చేసుకున్న బోటు ప్రమాదం పర్యాటకాన్ని కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పర్యాటకులు సైతం నదీ పర్యాటకానికి భయపడుతున్నారు. దీంతో బోటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఎక్కడికక్కడ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గోదావరి నదీ తీరాన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్కదానికి రూ.1.62 కోట్లు ఖర్చుచేయనుంది.
ప్రతి పడవకూ మళ్లీ లైసెన్స్..
ఇకపై ప్రతి బోటుకూ కచ్చితంగా లైసెన్సులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకు బోట్లు, పడవల పర్యవేక్షణ ధవళేశ్వరం బోటు సూపరింటెండెంట్ పరిధిలో ఉంది. తాజాగా నిబంధనలు మార్చి బోట్ల పర్యవేక్షణ బాధ్యతను కాకినాడ పోర్టు అధికారికి ప్రభుత్వం అప్పగించింది. పట్టిసీమ, నరసాపురం తదితర ప్రాంతాల్లోనూ బోట్లు, పడవలు నడుస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం బోటు, పడవల లైసెన్సులతో పాటు నడిపే చోదకులకు కూడా లైసెన్సులు ఉండాలి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన లైఫ్ జాకెట్లు ఉండాలి. బోటు సామర్థ్యాన్ని బట్టి ఇంజిన్ సామర్థ్యం ఉండాలి. వచ్చే నెల 10 నుంచి బోట్ల లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోగా సరంగులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 40కిపైగా ప్రయాణ పడవలు, పాపికొండలకు వెళ్లే లాంచీలు 63 ఉన్నాయి. వీటన్నింటికీ తిరిగి లెసెన్సులు పొందాలి. బోటు ఫిట్‌నెస్‌తోపాటు నదులు, జలవనరుల రూట్ సర్వే, సరంగుల డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. సరంగులకు ప్రత్యేకంగా 18 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తరువాతే లైసెన్సులు జారీ చేస్తారు. వచ్చేనెల 10న కాకినాడలో సరంగుల పరీక్షలు నిర్వహించనున్నారు. బోటును ఆపరేట్ చేయడానికి రూటు పర్మిట్ ఇరిగేషన్ శాఖ నుంచి కచ్చితంగా తీసుకోవాలి.
తొలిదశలో 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు
బోటు ప్రమాదాల నివారణ కోసం తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక వద్ద బోటు కంట్రోల్ రూమ్‌కు ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.70 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇదిలా ఉంటే గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్న ఒక్కొక్క కంట్రోల్‌రూమ్‌ను రూ.1.62 కోట్లతో నిర్మించనున్నారు. ప్రతి కంట్రోల్‌రూమ్‌లో 13 మంది సిబ్బంది ఉంటారు. దీనిలో టూరిజం, పోలీసు, జలవనరులు, రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పనిచేస్తారు. తొలిదశలో తొమ్మిదింట్లో పశ్చిమగోదావరి జిల్లాలో సింగన్నపల్లి, పేరంటాళ్ల పల్లి వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పోచవరం, గండిపోచమ్మ గుడి వద్ద, రాజమండ్రి పద్మావతి ఘాట్ వద్ద గోదావరి నది తీరాన కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గోదావరి తీరం వెంబడి మొత్తం ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మిగతావి కృష్ణానది విజయవాడ పున్నమిఘాట్‌లో, విశాఖ రిషీకొండ బీచ్‌లో శ్రీశైలం పాతాళగంగ, నాగార్జున సాగర్ వద్ద ఈ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తారు.
కార్యాచరణ ఇదే..
బోటు ప్రమాదాల నివారణకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. కంట్రోల్ రూమ్‌లకు తహసీల్దార్ ఇన్‌చార్జ్‌గా ఉంటారు. 13 మంది సిబ్బందితో కంట్రోల్ రూమ్ నిర్వహణ ఉంటుంది. వీరిలోముగ్గురు పోలీసులు కచ్చితంగా ఉండాలి. పడవ ప్రయాణ మార్గాలు, వాటి కదలికలు, వరద ప్రవాహంపై సమగ్ర సమాచారం ఈ కంట్రోల్ రూమ్‌లకు ఉండాలి. పడవ ప్రయాణాలను పర్యవేక్షించాల్సిన పూర్తి బాధ్యత కంట్రోల రూమ్ సిబ్బందిదే. మద్యం సేవించి పడవ నడపకుండా శ్వాస పరీక్షలు నిర్వహించాలి. పడవలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్ పరిధిలోని బోట్లు, జెట్టీలు ఉండాలి. పడవ ప్రయాణానికి టికెట్ల జారీ అధికారం కూడా వీటికే అప్పగించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడగలిగితే కంట్రోల్ రూమ్ సిబ్బందికి 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలి.
రెండేళ్ల వ్యవధిలో జరిగిన పడవ దుర్ఘటనలు ఇవీ..
►కృష్ణా నదిలో 2017లో జరిగిన బోటు ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
►2018 మే 11న గోదావరిలో బోటు ప్రమాదం జరిగింది. ప్రాణనష్టం జరగలేదు.
►2018 మే 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో 19మంది మృత్యువాతపడ్డారు.
►2018 సెప్టెంబర్ 15న గోదావరిలో వశిష్ట రాయల్ బోటు ప్రమాదంలో 51 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment